ఒక లీటరు.. వంద బస్సులు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఒక లీటరు.. వంద బస్సులు!

ఒక లీటరు.. వంద బస్సులు!

Written By news on Sunday, May 27, 2012 | 5/27/2012

* వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు లక్ష్యంగా లాఠీ పాలిటిక్స్
* వంద బస్సుల దగ్ధానికి కుట్ర అంటూ ముగ్గురి అరెస్ట్ 
* ఒక లీటరు పెట్రోల్‌తో చిక్కారని ప్రకటించిన కమిషనర్ 
* ఆర్భాటంగా ప్రెస్ మీట్ పెట్టి హడావుడి చేసిన పోలీసులు 
* వైఎస్సార్‌సీపీ నేత రామ్మోహన్‌ను ఇంటి నుంచి పట్టుకెళ్లిన వైనం
* తన ముందే కొట్టి తీసుకెళ్లారని వెల్లడించిన నిందితుడి భార్య 
* కొట్టి, బెదిరించి, స్క్రిప్టు చదివించి, వీడియో రికార్డు చేసిన ఖాకీలు 
* ఆ వీడియోను యూ ట్యూబ్‌లో పెట్టి, మీడియాకు సందేశాలు 
* మరో నేత సెల్ ఫోన్ నుంచి ‘జైల్‌భరోకు సిద్ధం కావాలంటూ అభ్యంతరకర ఎస్‌ఎంఎస్‌లు వెళ్లాయని ఆరోపణ 
* అరెస్టుపై విలేకరుల ప్రశ్నలకు తడబడిన పోలీసు అధికారులు 
* తాము కుట్ర విషయం మాత్రమే చెప్తామంటూ వెళ్లిపోయిన వైనం 
* క్రియాశీలకంగా ఉన్నవారిని లోపల వేయాలంటూ సీఎం ఆదేశం! 
* వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులను సంఘ వ్యతిరేక శక్తులుగా చూపే కుట్ర 
* రాష్ట్రమంతటా ముమ్మరంగా కార్యకర్తల అరెస్టులు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఆస్తుల కేసు పేరుతో సీబీఐను అడ్డుపెట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని అనేక రకాలుగా వేధిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈ ప్రక్రియలో పోలీసు యంత్రాంగాన్ని కూడా భాగస్వామిగా మార్చింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ పన్నిన రాజకీయ కుట్రలో పోలీసులూ భాగస్వాములవుతున్నారు. జగన్ అరెస్టయితే విధ్వంసం సృష్టిస్తారని సాకులు చెప్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తూ వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. రాజధాని హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో అమాయకులను అదుపులోకి తీసుకుని వారి పౌర, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారు. తప్పుడు కేసులు బనాయిస్తూ, థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ హింసిస్తున్న ఉదంతాలూ బయటపడుతున్నాయి. 

తనను అరెస్ట్ చేసి ఆ పేరుతో రాష్ట్రంలో గొడవలు సృష్టించి ఆ నెపాన్ని తనపై నెట్టేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయని జగన్ బయటపెట్టిన కుట్ర కోణాన్ని.. పోలీసులు వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల మీదే బనాయించి సర్కారు వారి చేత భేష్ అనిపించుకుంటున్నారు. ప్రభుత్వ పెద్దల మెప్పుకోసం పాకులాడుతున్న పోలీసు అధికారుల అత్యుత్సాహం ఏ స్థాయిలో ఉందంటే.. ‘వంద బస్సులను దగ్ధం చేసేందుకు కుట్ర పన్నిన ముగ్గురు నిందితులు ఒక లీటరు పెట్రోల్‌తో చిక్కార’ని.. సాక్షాత్తు సైబరాబాద్ ఇన్‌చార్జ్ పోలీసు కమిషనర్ రాజీవ్ రతన్ స్వయంగా ఆర్భాటంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించేశారు. అంతటితో ఆగితేనా..! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ అధికారులు ఏకంగా ఓ లఘు చిత్రాన్ని రూపొందించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా.. కార్యకర్తలను ఇళ్ల నుంచి పట్టుకెళ్లి, వారిపై తప్పుడు కేసులు పెట్టి, విచక్షణా రహితంగా కొట్టి, తమకు కావలసిన విధంగా చెప్పించుకుని, దానిని వీడియోగా చిత్రీకరించి, ఆ వీడియోను కూడా క్షణాల్లో మీడియాకు విడుదల చేసి, ఏకంగా యూ ట్యూబ్‌లోనూ అప్‌లోడ్ చేశారు. యూ ట్యూబ్‌లో ఆ వీడియో లింకునూ మీడియా ప్రతినిధులకు ఎస్‌ఎంఎస్ రూపంలో రెండేసి సార్లు పంపారు. 

అంతేకాదు.. ‘మన నాయకుడు అరెస్టయ్యే అవకాశం ఉంది.. జైల్ భరోకు సిద్ధం కండి’ అంటూ వైఎస్‌ఆర్ సీపీ నేత కోటింరెడ్డి వినయ్‌రెడ్డి సెల్ ఫోన్ నుంచి అభ్యంతరకర మైన సందేశాలు వెళ్లాయని కూడా ఆరోపించారు. గాంధేయ పద్ధతిలో తెలిపే జైల్‌భరో నిరసనలో అభ్యంతరం ఏమిటంటే మాత్రం వారివద్ద సమాధానం లేదు. దీనినిబట్టే.. వైఎస్సార్ కాంగ్రెస్, జగన్‌ల ప్రతిష్టను దెబ్బతీయటం లక్ష్యంగా ఏ స్థాయిలో కుట్ర జరుగుతోందో తేటతెల్లమవుతోంది. జగన్‌ను సీబీఐ అధికారులు విచారిస్తున్న సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటలు జరగకుండా చూస్తున్నామంటూ.. పథకం ప్రకారం పోలీసులు చేస్తున్న ఓవరాక్షన్‌లోని డొల్లతనం ఈ కుట్రను స్పష్టం చేస్తున్నాయి. 

రామ్మోహన్‌ను వదిలింది గోల్కొండలో... 
జగన్ సీబీఐ విచారణ కోసం దిల్‌కుశ గెస్ట్‌హౌస్‌లో హాజరవుతున్న విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగర సేవాదళ్ అధ్యక్షుడు వెల్లాల రామ్మోహన్ శుక్రవారం ఉదయం ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఓ మీడియా ప్రతినిధి ఇచ్చిన సమాచారంతో ఆయన్ను గుర్తించిన పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. నేరుగా పంజగుట్ట పోలీసుస్టేషన్‌కు, అట్నుంచి గోల్కొండ ఠాణాకు తరలించారు. రాత్రి 11 వరకు ఆయన్ను అక్కడే ఉంచిన పోలీసులు ఆపై వదిలిపెట్టటంతో ఆయన తన ఇంటికి వెళ్లారు. అయితే.. శనివారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో సైబరాబాద్ పోలీసులు ఆయన ఇంటిపై విరుచుకుపడి రామ్మోహన్‌ను అదుపులోకి తీసుకుని కూకట్‌పల్లి పోలీసుస్టేషన్‌కు తరలించారు. 

కానీ.. శనివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో మియాపూర్ కానిస్టేబుల్ ఉస్మాన్, హోంగార్డు నర్సింగ్ బొల్లారం చౌరస్తాలో బ్లూకోల్ట్స్ పెట్రోలింగ్ చేస్తున్నారని, ఆ సమయంలో సనత్‌నగర్‌కు చెందిన సగ్గు శ్రీకాంత్‌రెడ్డి (27), నల్లగొండ జిల్లా భూదాన్ పోచంపల్లికి చెందిన కె.జె.ఇలియాజర్ (45) పల్సర్ బైక్‌పై వచ్చి, పార్క్ చేసి లీటర్ పెట్రోల్ బాటిల్‌తో తిరుగుతుండగా అదుపులోకి తీసుకుని మియాపూర్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లారని సైబరాబాద్ పోలీసులు పేర్కొన్నారు. వారిని విచారించగా రామ్మోహన్(38) ఆదేశాల మేరకే అక్కడికి వచ్చామని వారు చెప్పారన్నారు. కొద్ది సేపటి తరువాత ఐడీఏ బొల్లారం చౌరస్తాలో ఫార్చ్యూనర్ కారుతో ఉన్న రామ్మోహన్‌ను అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. శుక్రవారం నాడు రామ్మోహన్‌ను అదుపులోకి తీసుకున్న పంజగుట్ట పోలీసులు శుక్రవారం సాయంత్రమే పంజగుట్ట పోలీసుస్టేషన్ నుంచి విడిచిపెట్టేశారని రాశారు. వాస్తవానికి ఆయన్ను అర్థరాత్రి గోల్కొండ పోలీసుస్టేషన్ నుంచి వదిలారు. 

ఆ సందేశాలతో సంబంధం లేకుండా...
ఈ అరెస్టుల గురించి చెప్తున్న నేపథ్యంలోనే.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేత కోటింరెడ్డి వినయ్‌రెడ్డి సెల్‌ఫోన్ నుంచి క్యాడర్‌కు ఎస్సెమ్మెస్‌లు వెళ్లాయని పోలీసులు ఆరోపించారు. ఆ సందేశాల్లో ఉన్న సమాచారం సైతం వారే రాశారు. ‘రేపు (శనివారం) బాస్ అరెస్టు అయ్యే అవకాశం ఉంది. జైల్ భరోకు సిద్ధం కండి’, ‘రేపు (శనివారం) సాయంత్రం 4 గంటలకు సిద్ధంగా ఉండండి. స్థలం రేపు చెప్తాను’ అంటూ వాటిలో ఉన్నట్లు పోలీసులే పేర్కొంటున్నారు. వీటిలో ఎక్కడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు, పిలుపులు లేవు. గాంధేయ మార్గంలో నిరసనలు తెలపటంలో జైల్ భరో కూడా ఒకటి. దీనిని కూడా విధ్వంసానికి కుట్రగా పోలీసులు చూపుతున్నారు. 

వీటన్నింటికీ మించి పోలీసులు ఆరోపిస్తున్న ‘కుట్ర’ ప్రకారం చూసినా.. సాయంత్రం 4 గంటలకు సిద్ధంగా ఉండాలని, స్థలం కూడా అప్పుడే చెప్తానని సందేశాలు వస్తే.. తెల్లవారుజామున 5.45కే రామ్మోహన్, శ్రీకాంత్‌రెడ్డి, ఇలియాజర్ ఎందుకు బయటకు వస్తారన్న ప్రశ్నకు పోలీసుల నుంచి సమాధానం లేదు. ఎస్సెమ్మెస్‌ల ప్రకారం చూసినా జగన్ అరెస్టు అయితే కదా జైల్ భరోకు పిలుపునిచ్చింది? జగన్ సీబీఐ ముందు హాజరయ్యేది ఉదయం 10.30 గంటలకు. ఆ తరవాతే అరెస్టా? కాదా? అనేది తెలుస్తుంది. మరి ఈ లోపు విధ్వంసం కోసం క్యాడర్ బయటకు ఎందుకు వస్తారు? అని ప్రశ్నించినా పోలీసుల నుంచి మౌనమే సమాధానం. హైదరాబాద్ నగరంలోని జంట కమిషనరేట్ల పరిధిలో ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లడం, ఆర్‌టీసీ బస్సుల్ని దగ్ధం/ధ్వంసం చేయడం అనేవి అనేక సందర్భాల్లో జరిగాయి. వీటికి సంబంధించి నిందితుల్నీ అరెస్టు చేశారు. అయితే ఏ సందర్భంలోనూ పోలీసులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయలేదు. చివరకు నెల కిందట నగరంలో చోటు చేసుకున్న ఘర్షణలకు సూత్రధారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పట్టుకున్నప్పుడూ ప్రెస్ నోట్‌తోనే సరిపెట్టారు. అలాంటిది.. ‘లీటరు పెట్రోల్‌తో 100 బస్సుల దగ్థానికి కుట్రలో ముగ్గురిని అరెస్టు చేశామ’ంటూ పోలీసులు ఆర్భాటంగా ప్రెస్ మీట్ పెట్టి హంగామా సృష్టించారు. ఇన్‌చార్జ్ కమిషనర్‌తో పాటు సంయుక్త పోలీసు కమిషనర్, డిప్యూటీ పోలీసు కమిషనర్, అదనపు పోలీసు కమిషనర్‌ల సమక్షంలో నిందితులను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. సాధారణంగా ఇన్‌చార్జ్ పోలీ సు కమిషనర్లు విలేకరుల సమావేశాలకు దూరంగా ఉంటారు. ఈ కేసులో మాత్రం అత్యుత్సాహం చూపడం.. విపరీతమైన ప్రచారం కల్పించడానికే అన్నది తేటతెల్లమవుతోంది. 

రామ్మోహన్‌పై థర్డ్ డిగ్రీ ప్రయోగం... 
శనివారం తెల్లవారుజామున సనత్‌నగర్‌లో తన ఇంట్లో ఉన్న రామ్మోహన్‌ను కూకట్‌పల్లి ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు బలవంతంగా తీసుకువెళ్లారని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు. తమ ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, ఇంట్లో మహిళలున్నారని కూడా చూడకుండా అసభ్యకరంగా వ్యవహరించారని, తన ముందే తన భర్తపై చేయి చేసుకున్నారని రామ్మోహన్ భార్య జ్యోతి తెలిపారు. ఆ తర్వాత రామ్మోహన్‌ను వివిధ పోలీస్‌స్టేషన్లను తిప్పుతూ ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని తెలిసింది. పోలీసుల దెబ్బలకు ఆయన చెవిలో నుంచి రక్తం రావడంతో.. కొంత ఆందోళనకు గురైన పోలీసులు స్థానికంగా ఉండే ఓ వైద్యుడిని తీసుకు వచ్చి చికిత్స చేయించారని సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. పోలీసులు రామ్మోహన్‌ను చిత్ర హింసలకు గురిచేసి ఎల్‌బీ నగర్, వనస్థలిపురంలో బస్సుల దగ్ధం కేసును కూడా ఆయనపై రుద్దే ప్రయత్నం చేశారు. ఓ తెల్ల కాగితంపై స్క్రిప్టు రాసి దానిని చదవాల్సిందిగా ఆయనను బెదిరించారు. అనంతరం దాన్ని వీడియోలో రికార్డు చేసి, అన్నీ తానే చేయించినట్లు ఒప్పించారు.

నిబంధనలకూ తూట్లు... 
పోలీసులు ఓ నిందితుడిని అరెస్టు చేసిన సందర్భంలో అతడి నుంచి నేరాంగీకార వాంగ్మూలాన్ని సేకరించి నమోదు చేస్తారు. అత్యంత సంచలనాత్మక కేసుల్లో ఈ తంతును వీడియోలో రికార్డు చేస్తారు. ఈ కేసులోనూ ‘రామ్మోహన్ చెప్తున్నట్లు’ పోలీసులు ఓ వీడియో చిత్రీకరించారు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌లోని సెక్షన్ 27 ప్రకారం నమోదు చేసిన ఈ నేరాంగీకార వాంగ్మూలాన్ని నేరుగా న్యాయస్థానానికే అందించాలి. ఆ తరవాత నిందితుడికీ ఓ కాపీ ఇస్తారు. ఈ కేసులో పోలీసులు నిబంధనలను తుంగలో తొక్కారు. రామ్మోహన్ చేత చెప్పించి రికార్డు చేసిన వీడియోలను ఉద్దేశపూర్వకంగా బయటపెట్టడంతో పాటు ఏకంగా యూట్యూబ్‌లోకే అప్‌లోడ్ చేసేశారు. ఇలా తాము చేసిన ఘనకార్యాన్ని మీడియాకు ఎస్‌ఎమ్మెస్‌ల రూపంలో సమాచారం ఇచ్చారు. సైబరాబాద్ పోలీసులకు సంబంధించిన 9490617197 నెంబర్ నుంచి మధ్యాహ్నం 2.30 - 3.30 గంటల మధ్య మీడియాకు రెండుసార్లు సందేశం వచ్చింది. నిందితుడి వీడియో స్టేట్‌మెంట్ యూట్యూబ్‌లో అందుబాటులో ఉందంటూ దాని లింకు (http://youtube/xtYlQy5PROg)నూ పంపారు. 

అడిగితే తడబాటు.. ఆపై నిర్లక్ష్యం...
సైబరాబాద్ పోలీసులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మీడియా అడిగిన ప్రశ్నలకు తొలుత తడబడిన పోలీసులు ఆపై నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ‘ఉద్దేశపూర్వకంగానే వెల్లాల రామ్మోహన్‌ను అరెస్ట్ చేశారా?’ అని ప్రశ్నించగా.. సైబరాబాద్ ఇన్‌చార్జి కమిషనర్ రాజీవ్ రతన్, మాదాపూర్ డీసీపీ యోగానంద్ తడబడ్డారు. ‘రామ్మోహన్ ఇంటిలో నిద్రిస్తుండగా శనివారం తెల్లవారుజామున 5.30 గంటలకు కూకట్‌పల్లి పోలీసులు తీసుకువెళ్లారు.. అలాంటప్పుడు ఆయన మీరు చెప్పిన మియాపూర్ స్పాట్‌కు ఎలా వచ్చారు?’ అని విలేకరులు ప్రశ్నించారు. అయితే.. రామ్మోహన్ మియాపూర్ వచ్చారని మొదట, రాలేదని తర్వాత పోలీసులు రెండు రకాలుగా సమాధానం చెప్పారు. మళ్లీ బస్సులు తగలబెట్టడానికి ప్రయత్నించారని అన్నారు. దీనిపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు పోలీసులు సమాధానం దాటవేశారు. 

కేవలం కుట్రకు సంబంధించిన వివరాలు తాము వెల్లడించామని, సెకండ్ వెర్షన్ మీరు రాసుకోండంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిన ఇన్‌చార్జి కమిషనర్‌తో జాయింట్ క మిషనర్ అతుల్‌సింగ్, మాదాపూర్ డీసీపీ యోగానంద్ వంతపాడారు. వారిని ఉద్దేశపూర్వకంగా కేసులో ఇరికించినట్లు అనిపిస్తోందని విలేకరులు అడగ్గా.. తామేం మాట్లాడబోమంటూ వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రామ్మోహన్‌తో మాట్లాడించాలని మీడియా కోరగా నిరాకరించారు. ఇదే సమయంలో.. తమను ఎవరూ, ఏమీ ఆదేశించలేదని.. పోలీసులే ఇంటి నుంచి తీసుకువెళ్ళారని చెప్తున్న రామ్మోహన్‌ను, మిగతా ఇద్దరు నిందితులను పోలీసులు దూరంగా లాక్కుపోయారు. ఇదంతా వాస్తవాల్ని కప్పిపుచ్చడానికే అనేది స్పష్టమవుతోంది. అనంతరం పోలీసులు నిందితులు ముగ్గురినీ మియాపూర్ ఆల్విన్ కాలనీలో ఉన్న 9వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరిచారు. వీరికి మెజిస్ట్రేట్ సత్యనారాయణ 14 రోజుల పాటు రిమాండ్ విధించటంతో వారిని చర్లపల్లి జైలుకు తరలించారు.

హింసించి.. చెప్పించారు: రామ్మోహన్ భార్య 
తన భర్త రామ్మోహన్‌ను ఇంట్లో అందరి ముందు దారుణంగా హింసించి, బలవంతంగా స్టేట్‌మెంట్ ఇప్పించి, కొట్టుకుంటూనే తీసుకెళ్లారని ఆయన భార్య జ్యోతి చెప్పారు. ‘‘ఉదయమే 5.30-6.00 గంటల మధ్య పది పదిహేను మంది పోలీసులు మా ఇంటికి వచ్చారు. తలుపుకొడితే నేనే తీశాను. రామ్మోహన్ ఉన్నారా అని అడుగుతూ లోపలికి వచ్చారు. ఆ సమయంలో మా వారు నిద్రపోతున్నారు. ఆయన్ని లేపాను. ఆయన హాల్లోకి రాగనే మీరేనా రామ్మోహన్ అంటూ పోలీసులు అడిగారు. అవునని ఆయన అనగానే, తలుపులు మూసేసి దూషించడం మొదలెట్టారు. చాలా అసభ్యంగా మాట్లాడారు. కొట్టడం ప్రారంభించారు. వారు చెప్పినట్లు చెప్పాలని, లేకపోతే కేసులు బనాయించి జైల్లో వేస్తామని హెచ్చరించారు. నలుగురి పేర్లు చెప్పాలని బలవంతం చేశారు. 

రాజ్‌ఠాకూర్, ఆదం విజయ్‌కుమార్, పుత్తా ప్రతాప్‌రెడ్డి, వినయ్‌కుమార్‌రెడ్డిల పేర్లు చెప్పించి, వారు చెప్పింది మళ్లీ ఆయన చేత చెప్పించారు. ఆయన చెబుతున్నప్పుడు సెల్ ఫోన్‌లో రికార్డ్ చేశారు. చాలా రాక్షసంగా కొట్టారు. నేను, పిల్లలం భయపడిపోయాం. వాళ్లు కోరుకున్నట్లుగా చెప్పగానే, ఆయన్ని తీసుకెళ్లిపోయారు. వాళ్లు రెండు జీపుల్లో వచ్చినప్పటికీ, మా వారి కారులోనే ఆయన్ని తీసుకెళ్లారు. తర్వాత ఆయన ఏమయ్యారోనన్న ఆందోళనతో సెల్‌ఫోన్‌కు ఫోన్ చేసినా కలవలేదు. మధ్యాహ్నం ఓ ఛానల్‌లో వచ్చిన వార్తను చూసి షాకయ్యాం. మా వారిని మియాపూర్‌లో పట్టుకున్నారన్నట్లుగా వార్త వచ్చింది. ఇది పచ్చి అబద్ధం. మా వారు జగన్‌సార్‌కు సపోర్టు చేస్తున్నందుకే ఇలా హింసిస్తున్నారు. పోలీసులు ఇంత ఘోరంగా, అన్యాయంగా ప్రవర్తించడం నేనెప్పుడూ చూడలేదు’’ అంటూ ఆమె విలపించారు.

పోలీసుల తీరు చాలా దారుణం: రామ్మోహన్ అక్క రాధ
పోలీసులు వ్యవహరించిన తీరు చాలా దారుణం. ఉదయ్యాన్నే మా మరదలు ఫోన్ చేసింది. పది పదిహేనుమంది పోలీసులొచ్చి మీ తమ్ముడ్ని తీసుకెళ్లిపోయారు. ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియదు. ఏమయిపోయారో కూడా తెలియదని ఏడుస్తూ చెప్పింది. మా తమ్ముడు అందరికీ సహాయం చేసేవాడే కానీ, ఎవరికీ అపకారం చేసే వాడు కాదు. కేవలం జగన్‌కు మద్దతు తెలుపుతున్నందుకే ఇంత దారుణంగా హింసిస్తున్నారు. జగనే మా తమ్ముడ్ని కాపాడాలి.

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది: వైఎస్సార్ సీపీ మహిళా నేతలు
వెల్లాల రామ్మోహన్‌ను పోలీసులు పట్టుకెళ్లారన్న విషయం తెలుసుకున్న పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నేతలు పలువురు ఆయన ఇంటికి వచ్చి ఆయన భార్యను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం తీరును దుయ్యబట్టారు. పోలీసుల తీరు మనుషుల్లా లేదని, మృగాల్లా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగలను కొట్టినట్టుగా చేతులు వెనక్కిపెట్టి నించోపెట్టి వళ్లంతా గాయపరిచారని, నీచాతినీచంగా వ్యవహరించారని చెప్పారు. జగన్‌కు మద్దతిచ్చిన వారందరినీ ఇదే విధంగా హింసిస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, పోలీసుల తీరు ఇదే విధంగా ఉంటే ప్రజలే చెప్పుతో కొట్టినట్లు మహిళలంతా ఈ ప్రభుత్వానికి ఉప ఎన్నికల్లో బుద్ధిచెబుతారని చెప్పారు.
Share this article :

0 comments: