రెండు రోజుల్లో సుమారు 15 గంటలపాటు విచారణ.. పూర్తిగా సహకరించిన జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రెండు రోజుల్లో సుమారు 15 గంటలపాటు విచారణ.. పూర్తిగా సహకరించిన జగన్

రెండు రోజుల్లో సుమారు 15 గంటలపాటు విచారణ.. పూర్తిగా సహకరించిన జగన్

Written By news on Sunday, May 27, 2012 | 5/27/2012

* ప్రశాంత వదనంతో సీబీఐ కార్యాలయంలోకి.. అంతే ప్రశాంతంగా బయటకు
* రెండు రోజుల్లో సుమారు 15 గంటలపాటు విచారణ.. పూర్తిగా సహకరించిన జగన్
* బయటకువస్తూ మీడియాను నవ్వుతూ పలకరించిన జగన్... నేడు కూడా 
సీబీఐ విచారణకు వస్తానని వెల్లడి

హైదరాబాద్, న్యూస్‌లైన్: సీబీఐ వరుసగా రెండో రోజు శనివారం చేసిన విచారణకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తి స్థాయిలో సహకరించారు. వారి ప్రశ్నలకు ఓపిగ్గా, సవివరంగా సమాధానాలు ఇచ్చారు. విచారణకు వెళ్లే సమయంలో ఎంత ప్రశాంత వదనంతో వెళ్లారో తిరిగి వచ్చే సమయంలోనూ అంతకంటే ప్రశాంతంగా, ఉత్సాహంగా జగన్‌మోహన్‌రెడ్డి కనిపించారు. రెండు రోజులూ కలిపి దాదాపు పదిహేను గంటల పాటు సీబీఐ ఆయన్ను విచారించింది. శనివారం విచారణ ముగిసిన తరువాత తిరిగి వెళుతూ జగన్‌మోహన్‌రెడ్డి కాసేపు మీడియాతో మాట్లాడారు. నవ్వుతూ మీడియాను పలకరించిన ఆయన.. ‘రెండోరోజు కూడా విచారణ ప్రశాంతంగా సాగింది. మొదటిరోజు విచారణకు కొనసాగింపుగా కొన్ని వివరణలు అడిగారు. నేను వారికి పూర్తిగా వివరించాను. రేపు కూడా సీబీఐ కార్యాలయానికి వస్తాను’ అని చెప్పారు.

ఉదయం 10.30 నుంచి సాయంత్రం 6.10 వరకు..
జగన్‌మోహన్‌రెడ్డి ఉదయం 10.30 గంటలకు సీబీఐ తాత్కాలిక కార్యాలయమైన దిల్‌కుశ అతిథి గృహానికి వచ్చారు. అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు సబ్బం హరి, మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల నాని, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు కూడా ఆయనతోపాటు వచ్చారు. మధ్యాహ్నం సమయంలో సబ్బం హరి తిరిగి వెళ్లిపోయారు. మిగతా నేతలు విచారణ ముగిసే వరకూ దిల్‌కుశ అతిథి గృహంలోనే ఉన్నారు. సాయంత్రం 6.10 గంటలకు సీబీఐ విచారణ ముగిసింది. వాన్‌పిక్ వ్యవహారంలో అరెస్టయిన మ్యాట్రిక్స్ అధినేత నిమ్మగడ్డ ప్రసాద్, ఐఆర్‌టీఎస్ అధికారి బ్రహ్మానందరెడ్డి, తాజా మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను కూడా సీబీఐ అధికారులు వేర్వేరుగా విచారించారు. న్యాయవాదుల సమక్షంలోనే వారిని విచారించారు. నిమ్మగడ్డ, బ్రహ్మానందరెడ్డిలను సాయంత్రం నాలుగున్నర గంటలకు చంచల్‌గూడ జైలుకు తరలించారు.

జగన్ అభిమానులు సంయమనం పాటించాలి: జూపూడి 
వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి అభిమానులు సంయమనం పాటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు కోరారు. జగన్‌ను అరెస్టు చేస్తున్నారనే వదంతులను నమ్మవద్దన్నారు. జగన్‌పై చేసిన కుట్ర కారణంగా సీబీఐ విచారణకు హాజరవడంతో అభిమానుల్లో ఆందోళన ఉన్నమాట వాస్తవమేనన్నారు. అయితే, జగన్ అభిమానులు గాంధేయ తరహాలో మాత్రమే నిరసనలు తెలపడం మంచిదని సూచించారు. అల్లర్లు సృష్టించి వాటిని జగన్ మీదకు నెట్టాలనే కుట్రలలో ఇరుక్కోవద్దని కార్యకర్తలకు జూపూడి సూచించారు. కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదుచేసి వేధింపులకు గురిచేయవద్దని పోలీసులకు ఆయన విజ్ఞప్తిచేశారు. 

కార్యకర్తల కుటుంబీకులను కూడా పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇంట్లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వెల్లాల రామ్మోహన్‌ను అదుపులోకి తీసుకుని బస్ దహనం కుట్ర కేసు పెట్టారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంపైన, చట్టంపైన పూర్తి గౌరవం ఉన్నది కాబట్టే సీబీఐ విచారణకు జగన్‌మోహన్‌రెడ్డి పూర్తిగా సహకరిస్తున్నారని జూపూడి చెప్పారు. తెలుగు, ఇంగ్లీషు, హిందీతోపాటు తమిళం, కన్నడంలో అడిగినా ఆయన సమధానాలు చెపుతారన్నారు. కాంగ్రెస్, టీడీపీకి చెందిన 30 మంది ఎమ్మెల్యేలు జగన్‌మోహన్‌రెడ్డితో టచ్‌లో ఉన్నారని ప్రభాకరరావు వెల్లడించారు. కాంగ్రెస్‌కు చెందిన పది మంది ఎమ్మెల్యేలు వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీలో చేరితే మీడియా మంచి డ్రామా చూస్తుందన్నారు.

రెండోరోజూ పోలీసుల దిగ్బంధం
సీబీఐ విచారణ సందర్భంగా రెండోరోజు కూడా పోలీసుల దిగ్బంధనంతో సాధారణ ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. జగన్‌మోహన్‌రెడ్డి నివాసం లోటస్‌పాండ్‌తోపాటు సీబీఐ తాత్కాలిక కార్యాలయానికి వెళ్లే రహదారులను పోలీసులు మూసివేశారు. అయితే, పోలీసుల అత్యుత్సాహంపై పలు విమర్శలు వెల్లువెత్తడంతో కొద్దిగా సడలింపు ఇచ్చారు. ఉదయం 9.45 గంటల వరకు దిల్‌కుశకు వెళ్లే రహదారుల్లో వాహనదారులను అనుమతించారు. అప్పటి నుంచి సాయంత్రం 6.15 గంటల వరకు ట్రాఫిక్‌ను అనుమతించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. 

దిల్‌కుశ అతిథి గృహం ఎదురుగా ఉన్న మక్తా ప్రాంతంలో రెండో రోజు కూడా అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. దుకాణాలను పోలీసులు బలవంతంగా మూసివేయించారు. మక్తా నుంచి ప్రధాన రహదారికి వచ్చే రైల్వే గేటును సాయంత్రం వరకూ పూర్తిగా మూసివేశారు. బారికేడ్‌లు, ఇనుప కంచెలు వేశారు. సీబీఐ విచారణ కొనసాగుతున్న సమయంలోనే డీజీపీ దినేష్‌రెడ్డి రెండుసార్లు రాజ్‌భవన్ రూట్‌లో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు. ఆయన స్వయంగా పరిశీలించడంతో పోలీసులు మరింత కట్టుదిట్టంగా వ్యవహరించారు.

భారీగా తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు
జగన్‌మోహన్ రెడ్డి శనివారం ఉదయం తల్లి విజయమ్మ ఆశీస్సులు తీసుకుని సీబీఐ కార్యాలయానికి బయల్దేరారు. భారీ సంఖ్యలో వచ్చిన పార్టీ కార్యాకర్తల నినాదాల మధ్య ఆయన ముందుకు సాగారు. కాంగ్రెస్ ఎంపీ సబ్బంహరి, ఎమ్మెల్యే ఆళ్ల నాని కూడా ఆయన వెంట ఉన్నారు. ఉదయం జగన్‌ను ఆయన నివాసంలో కలుసుకున్న వారిలో పార్టీ ముఖ్య నేతలు వై.వి.సుబ్బారెడ్డి, అంబటి రాంబాబు, బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్.కె.రోజా, వాసిరెడ్డి పద్మ, పెనుమత్స సాంబశివరాజు, బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి, మాజీ మంత్రి శోభానాగిరెడ్డి తండ్రి ఎస్.వి.సుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్.వి.మోహన్ రెడ్డి, ఎడ్మ కిష్టారెడ్డి, బెక్కరి జనార్ధన్ రెడ్డి, ఆది శ్రీనివాస్, నందమూరి లక్ష్మీ పార్వతితో పాటు పలువురు నేతలు ఉన్నారు. తరువాత జగన్ బయటకు వచ్చి తొలి రోజు మాదిరిగానే అందరికీ అభివాదం చేసి సీబీఐ విచారణకు హాజరయ్యేందుకు వెళ్లారు.
Share this article :

0 comments: