ప్రజాక్షేత్రంలోకి: వై.ఎస్.విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజాక్షేత్రంలోకి: వై.ఎస్.విజయమ్మ

ప్రజాక్షేత్రంలోకి: వై.ఎస్.విజయమ్మ

Written By news on Tuesday, May 29, 2012 | 5/29/2012



జగన్‌ను ప్రచారానికి దూరం చేసినందున.. ఎన్నికల ప్రచార బాధ్యతను తీసుకుంటున్నా..
జగన్‌ను రిమాండ్‌కు పంపారనే విషయం తెలుసుకుని కంటతడి పెట్టిన విజయమ్మ
పార్టీ నేతల వినతి మేరకు 21 గంటలుగా కొనసాగిస్తున్న దీక్ష విరమణ
30 నుంచి విజయమ్మ ఉప ఎన్నికల ప్రచారం
దీక్ష సందర్భంగా పోలీసుల అతి.. అడుగడుగునా ఆటంకాలు
కరెంటు నిలిపివేత.. షామియానా వేయడానికి అభ్యంతరాలు
మద్దతు తెలపడానికి వస్తున్న ప్రజలను ఎక్కడికక్కడ అడ్డుకున్న ఖాకీలు
రెండుసార్లు లాఠీచార్జి.. పలువురి అరెస్టు

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఉప ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలవడమే మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి సువర్ణయుగానికి నాంది అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ చెప్పారు. ఇందుకోసం వైఎస్‌ను ప్రేమించే రాష్ట్ర ప్రజలంతా ఏకంకావాలని ఆమె పిలుపునిచ్చారు. తన కుమారుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీబీఐ కుట్రపూరితంగా అరెస్టు చేయడానికి నిరసనగా దీక్ష చేపట్టిన వై.ఎస్.విజయమ్మ.. సాయంత్రం 4.15 గంటల సమయంలో తన కుమారుడిని జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపారనే విషయం తెలుసుకుని చలించిపోయారు. కంటతడి పెట్టారు.

అయితే, తన కుమారుడిని ఉప ఎన్నికల ప్రచారానికి దూరం చేశారనే వాస్తవాన్ని గ్రహించిన విజయమ్మ.. వెంటనే గుండె దిటవు చేసుకున్నారు. కర్తవ్య నిర్వహణకు కంకణం కట్టుకున్నారు. పార్టీ నేతల విజ్ఞప్తి మేరకు 21 గంటలుగా కొనసాగిస్తున్న నిరసన దీక్షను సోమవారం సాయంత్రం విరమించారు. కుట్రలను, కుతంత్రాలను ప్రజాబలంతోనే ఎదుర్కోవాలనే నిర్ణయం తీసుకున్నారు. రైతులు, నిరుపేదల కోసం పదవులను త్యాగం చేసిన వారిని గెలిపించుకునేందుకు తాను ప్రజల్లోకి వస్తున్నానని ప్రకటించారు. ఇక న్యాయనిర్ణేతలు ప్రజలేనన్నారు.

పార్టీ నేతల విజ్ఞప్తిని మన్నించి..

జగన్ అరెస్టు విషయం తెలుసుకుని ఆదివారం రాత్రి దిల్‌కుశ అతిథి గృహానికి వెళ్లిన విజయమ్మ అక్కడ దీక్షను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ కేంద్ర పాలక మండలి, కార్యనిర్వాహక మండలి సభ్యులు అత్యవసరంగా సమావేశమై, చర్చించారు. ఆ సమావేశం చేసిన తీర్మానం మేరకు నాయకులు చేసిన విజ్ఞప్తిని విజయమ్మ మన్నించారు. దీంతో మాజీ మంత్రి, పార్టీ నాయకురాలు కొండా సురేఖ నిమ్మరసం ఇచ్చి, విజయమ్మతో దీక్షను విరమింపజేయగా.. తల్లితో పాటు నిరసన దీక్ష కొనసాగిస్తున్న జగన్ సోదరి షర్మిలకు ఆళ్లగడ్డ వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి శోభానాగిరెడ్డి నిమ్మరసం ఇచ్చి, దీక్ష విరమింపజేశారు. జగన్‌ను ఉప ఎన్నికల ప్రచారానికి దూరం చేసినందున ప్రచార బాధ్యతలను తానే చేపడతానని, ఇక ప్రజల ముందుకు వెళతానని దీక్ష విరమణ సందర్భంగా విజయమ్మ ప్రకటించారు.

అధైర్యపడాల్సిన పనిలేదు..

రాష్ట్ర ప్రజలు అధైర్య పడవద్దని, ముఖ్యంగా పార్టీ శ్రేణులు, నాయకులు ఆందోళన చెందవద్దని వైఎస్ విజయమ్మ అన్నారు. దీక్ష విరమణ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘జగన్‌బాబును 14 రోజులు రిమాండ్‌లోకి తీసుకున్నారు. ఉప ఎన్నికల సందర్భంగా ప్రజలకు దూరంగా పెట్టడానికే ఇలా చేశారు. జగన్‌బాబు చెప్పినట్లు నేను ఎన్నికల ప్రచార బాధ్యతను తీసుకుంటున్నాను. ప్రజలు దేనికీ భయపడాల్సిన అవసరం లేదు, సంశయించాల్సిన అవసరం అంతకంటే లేదు. 18 మంది ఎమ్మెల్యేలు వాళ్ల పదవులను వైఎస్ కోసం, రైతుల కోసం త్యాగం చేశారు. వారిని గెలిపించుకోవడం మన ధర్మం అని జగన్‌బాబు నాకు చెప్పారు.

వారిని గెలిపించుకునేందుకే నేను ప్రజల్లోకి వస్తున్నాను. వైఎస్ గారి సువర్ణయుగం తెచ్చుకోవడానికి ఈ 18 ఎన్నికల్లో విజయం నాంది కావాలి. ప్రజలు ఎలాంటి సంశయం పెట్టుకోవద్దు. నేను మీ మధ్యకు వస్తున్నాను. జగన్ నాయకత్వంలో మీ ముందుకు వస్తున్నాను. దేవుని ఆశీస్సులు, వైఎస్ ఆశీస్సులు, మీ అందరి ఆశీస్సులతో ముందుకు వస్తున్నాను. మన పార్టీ అభ్యర్థులందరికీ ఫ్యాన్ ఉమ్మడి గుర్తుగా రావడం మనం తొలి విజయంగా భావించాలి. జగన్‌పై వచ్చిన ఆరోపణల విషయంలో తొమ్మిది నెలలుగా సీబీఐ దర్యాప్తు చేస్తున్నా ఎలాంటి ఆధారాలు లభించలేదు. జగన్ ఏ తప్పూ చేయలేదు. నిజం నిలకడ మీద తెలుస్తుంది. జగన్ నిర్దోషిగా బయటకు వస్తారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో మీ అందరికీ తెలుసు. న్యాయ నిర్ణేతలు ప్రజలే కనుక నేను మీ వద్దకు వస్తున్నాను’ అని విజయమ్మ అన్నారు. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై స్పందించమని కోరగా.. ఆమె నిరాకరించారు.

యుద్ధ వాతావరణాన్ని తలపించేలా..

తన నివాసం బయట రహదారిపై కుటుంబ సభ్యులతో వైఎస్ విజయమ్మ దీక్ష చేస్తున్నప్పుడు పోలీసులు అడుగడుగునా ఆటంకాలు కల్పించారు. జగన్‌ను సీబీఐ అరెస్టు చేసిన నేపథ్యంలో ఆదివారం రాత్రి దిల్‌కుశ అతిథి గృహం వద్ద నిరసనకు దిగిన విజయమ్మ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకుని లోటస్‌పాండ్‌లోని ఇంటి వద్ద వదిలిపెట్టారు. దాంతో రాత్రి నుంచి ఆమె తన నిరసన దీక్షను కొనసాగిస్తూనే ఉన్నారు. విజయమ్మ దీక్ష గురించి తెలుసుకున్న కార్యకర్తలు పెద్దఎత్తున తరలివస్తుండటంతోనే ఆ ప్రాంతమంతా పెద్దఎత్తున బారికేడ్లను, ముళ్లకంచెలను వేసి.. ఎవరినీ రానీయకుండా అడ్డుకున్నారు. రెండు గంటలకుపైగా ఆ ప్రాంతంలో కరెంట్ కట్ చేశారు. అయినప్పటికీ వారు దీక్ష కొనసాగించారు. అయితే, సోమవారం ఉదయం ఎండ తీవ్రత పెరుగుతుండటంతో కొంత నీడ కోసం ఇంటి ముందు తాత్కాలికంగా షామియాను ఏర్పాటు చేసుకుంటుండగా.. దాన్నీ పోలీసులు అడ్డుకున్నారు. కార్యకర్తలు ప్రతిఘటించడంతో చివరికి ఒప్పుకున్నారు. నివాసం చుట్టు పక్కల ఒక కిలోమీటరు వరకూ పరిసరాలను దిగ్బంధించారు. అటుపక్కగా ఎవరూ రాకుండా నిరోధించారు. జగన్ ఇంటి పరిసరాల్లో నివసించే వారిని సైతం గుర్తింపు కార్డులు చూపాలంటూ వేధించారు.

ఇళ్లలో పనిమనుషులను కూడా రానివ్వలేదు. అడుగడుగునా పోలీసులతో ఆ ప్రాంతాన్ని నింపేసి.. యుద్ధ వాతావ రణాన్ని తలపించేలా చేశారు. విజయమ్మ దీక్ష చేస్తున్న విషయం తెలుసుకుని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన ప్రజలను పోలీసులు ఎక్కడికక్కడే నిలిపేసి, చెల్లాచెదురు చేశారు. విజయమ్మను చూడాలని వచ్చిన వారందరినీ అటకాయించడంతో వారంతా నిరాశగా వెనుదిరిగారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన వందలాది మంది మహిళలు విజయమ్మను చూడ్డానికి వస్తే.. వారిని లోనికి వదిలే ప్రసక్తే లేదని నిలిపి వేయడంతో వారక్కడే కూర్చుండి పోయారు. అటుగా వెళుతున్న అనకాపల్లి ఎంపీ సబ్బం హరి విషయం తెలుసుకుని అనుమతించాలని కోరగా పోలీసులు నిరాకరించారు.

చూసి పోదామని వచ్చిన వారిని అటకాయించడం మంచిది కాదని ఆయన పోలీసులకు చెప్పడంతో గ్రూపుల వారీగా పంపారు. విజయమ్మను చూడ్డానికి పెద్ద ఎత్తున జనం అక్కడకు రావడాన్ని చూసిన పోలీసులు.. వారిని అడ్డుకునే యత్నం చేసినపుడు వారంతా గట్టిగా జై జగన్ అంటూ ప్రతిఘటించడంతో లాఠీచార్జి చేశారు. జగన్ నివాసానికి సమీపంలోని రావి నారాయణరెడ్డి ఆడిటోరియం వద్ద వందలాది మంది యువకులు విజయమ్మ దీక్ష చేస్తున్న ప్రాంతానికి వచ్చేం దుకు ప్రయత్నించగా పోలీసులు అటకాయించారు. వైఎస్సార్ కాంగ్రెస్ నేత చెవిరెడ్డి భాస్కర్ రె డ్డి వారందరినీ శిబిరం వద్దకు పంపాలని పోలీసులకు విజ్ఞప్తి చేసినా అనుమతించక పోవడంతో రోడ్డు మీదే నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు మళ్లీ లాఠీచార్జి చేశారు. చెవిరెడ్డి, మధుసూదన్‌రెడ్డి (సూర్యాపేట), శంకర్‌నాయక్ (కర్నూలు), సుబ్రమణ్యం (హైదరాబాద్) తదితర యువకులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

దీక్షకు సంఘీభావం

విజయమ్మ తన కుటుంబ సభ్యులతో కలిసి చేసిన దీక్షకు పలువురు ప్రముఖులు సంఘీభావం ప్రకటించారు. వీరిలో ఎంపీ సబ్బం హరి, ఎమ్మెల్యే ఆర్.వి.సుజయ్ కృష్ణ రంగారావు, ఎం.వి.మైసూరారెడ్డి, కొండా సురేఖ, శోభానాగిరెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, సి.సి.రెడ్డి, ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి, పార్టీ నేతలు వాసిరెడ్డి పద్మ, ఆర్.కె.రోజా, మాజీ మంత్రి మూలింటి మారెప్ప, గట్టు రామచంద్రరావు, ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్, ఆది శ్రీనివాస్, కె.కె.మహేందర్‌రెడ్డి, వాసిరెడ్డి పద్మ, బి.జనక్‌ప్రసాద్, వైఎస్సార్ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మల కుమారి, రంగారెడ్డి మహిళా విభాగం అధ్యక్షురాలు కె.అమృతాసాగర్, మాజీ మంత్రి ఎస్.సంతోష్‌రెడ్డి, సినీ నటుడు రాజా, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మహిపాల్ రెడ్డి తదితరులు ఉన్నారు. ప్రముఖ పాత్రికేయుడు ఎ.బి.కె.ప్రసాద్ తన కుమార్తెతో సహా వచ్చి కలిశారు.
Share this article :

0 comments: