వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల అరెస్ట్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల అరెస్ట్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల అరెస్ట్

Written By news on Monday, May 28, 2012 | 5/28/2012

 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అరెస్ట్ కు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ కార్యకర్తలు బంద్ నిర్వహించారు. ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. 

జంటనగరాల్లో పెద్దఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. మల్కాజ్‌గిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు సూర్యనారాయణరెడ్డి, సుమతి మోహన్ సహా 30 మంది కార్యకర్తలను గృహ నిర్బంధంలో ఉంచారు. కర్మాన్‌ఘాట్‌లో గాంధీ విగ్రహం వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వంగ మధుసూదన్‌ రెడ్డి, పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. చందానగర్‌లో 60 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళా కార్యకర్తలను అరెస్ట్ చేశారు. మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో పలువురు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేశారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ఎస్ సి సెల్ కన్వీనర్ ఎన్.రవికుమార్, రమణారెడ్డిలు బాలానగర్ పో్లీస్ స్టేషన్ లోనే నిరాహారదీక్ష చేపట్టారు. 

గుంటూరు జిల్లా మాచర్ల వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గృహనిర్బంధం చేశారు. బెల్లంకొండ, అచ్చంపేటలో పార్టీ కార్యకర్తలు పలువురిని అరెస్ట్ చేశారు. బాపట్లలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేత కోనా రఘుపతి అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ ముందు కార్యకర్తలు బైఠాయించారు. 

కృష్ణా జిల్లా నందివాడ మండలం జొన్నపాడులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలు రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేశారు. కైకలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు ప్రారంభించారు. పార్టీ జిల్లా కృష్ణా కన్వీనర్ సామినేని ఉదయభానుని హైదరాబాద్‌కు వస్తుండగా సూర్యాపేటలో అరెస్ట్ చేశారు. 

జగన్ అరెస్ట్ నిరసిస్తూ కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల ధర్నా, రాస్తారోకో చేశారు. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. షాపూర్‌నగర్‌లోని వైఎస్‌ఆర్ విగ్రహం వద్ద నోటికి నల్లరిబ్బన్ కట్టుకుని నిరసన తెలిపిన 100 మంది కార్యకర్తలను అరెస్ట్ చేశారు. 

నల్గొండ జిల్లా కన్వీనర్ బీరవోలు సోమిరెడ్డిని అరెస్ట్ చేశారు. కోదాడ, సూర్యాపేట, మిర్యాలగూడ, నల్గొండలలో వ్యపారస్తులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. 

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా పార్టీ నేత పువ్వాడ అజయ్ కుమార్ ని అరెస్ట్ చేశారు. అతనిని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

నెల్లూరు జిల్లా గూడూరులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేత ఎల్లసిరి గోపాలరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ సునీల్‌కుమార్‌సహా 100 మందిని అరెస్ట్ చేశారు.



లోటస్ పాండ్ వద్ద దీక్ష కొనసాగిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మను ఆపార్టీనేత కొండా సురేఖ పరామర్శించారు. తమను ప్రచారం చేయించుకోనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని ఆమె అన్నారు. ఈ వ్యవహారాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళతామన్నారు.


కూకట్‌పల్లిలోని బాలాజీ నగర్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జూపూడి ప్రభాకర్‌ రావును పోలీసులు గృహ నిర్బంధం చేసారు. ఉదయం బీపీ చెక్ చేయించుకోవడానికి హాస్పిటల్‌కు వెళ్లిన ఆయనను.. కూకట్‌పల్లి సీఐ శ్రీనివాసరావు తన సిబ్బందితో వెళ్లి అరెస్ట్ చేసారు. 

ఇది అత్యంత అప్రజాస్వామిక ధోరణి అని ప్రభుత్వం, టీడీపీ కలిసి కుట్ర పన్ని జగన్‌ను అణచివేయడానకి ప్రయత్నిస్తున్నాయనీ జూపూడి ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 18 స్థానాలలో భారీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేసారు. 

కాగా నెల్లూరులో శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్ధి మేకపాటి రాజమోహన్‌ రెడ్డిని పోలీసులు బలవంతంగా అరెస్ట్‌ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ తీరు ఎమర్జెన్సీని తలపిస్తుందని ఆయన మండిపడ్డారు. పోలీసుల చర్యను నిరసిస్తూ వైఎస్‌ఆర్‌ విగ్రహం ముందు బైఠాయించారు. ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఉండేందుకే జగన్‌ను అరెస్ట్‌ చేశారని రాజమోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.



గుంటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేసి పట్టాభిపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇంటి నుంచి బయటకు వచ్చి కారు ఎక్కుతున్న ఆయనను పోలీసులు బలవంతంగా పోలీస్ వాహనంలో ఎక్కించేందుకు యత్నించారు.

దాంతో అంబటి దాదాపు 15 నిమిషాలు పాటు తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ నేపథ్యంలో సీఐ దుర్గాప్రసాద్ కు అంబటికి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. పార్టీ కార్యాలయానికి వెళుతున్న తనను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ ఆయన ప్రశ్నించారు.



వైఎస్‌ విజయమ్మను దీక్ష విరమించాలని కోరనున్నట్లు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత శోభానాగిరెడ్డి తెలిపారు. ఎల్లుండి నుంచి విజయమ్మ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గోటుందని ఆమె చెప్పారు. జగన్‌ను ఇబ్బంది పెట్టడం తప్ప సీబీఐ సాధించిందేమీలేదన్నారు. ఈనాడుకు వచ్చినట్లే సాక్షికి పెట్టుబడులు వచ్చాయని శోభా నాగిరెడ్డి అన్నారు.





Share this article :

0 comments: