పాకిస్థాన్‌కు వెళ్లినట్టుంది! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పాకిస్థాన్‌కు వెళ్లినట్టుంది!

పాకిస్థాన్‌కు వెళ్లినట్టుంది!

Written By news on Tuesday, May 29, 2012 | 5/29/2012

* చంచల్‌గూడ వైపు వెళ్లకుండా అడ్డుకున్న ఖాకీలు 
* 20 నిమిషాల పాటు రోడ్డుపైనే నిలిపేసిన వైనం

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించే సమయంలో పోలీసులు చేసిన ఓవరాక్షన్‌పై జగన్ సతీమణి వైఎస్ భారతి తీవ్రంగా మండిపడ్డారు. తమను ఆ దిశగా వెళ్లనీయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారంటూ ఆగ్రహించారు. ‘‘ప్రజాస్వామ్య దేశంలో కనీసం వ్యక్తిగత స్వేచ్ఛ కూడా లేకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. వారి తీరు చూస్తుంటే, ఎక్కడికెళ్లినా ఏదో పాకిస్థాన్‌కు వెళ్లినట్టుగా ఉంది’’ అంటూ విమర్శించారు. జగన్‌ను చంచల్‌గూడకు తరలిస్తున్న సమయంలో భారతితోపాటు కుటుంబ సభ్యులు, ఆడిటర్ విజయసాయిరెడ్డి ఒక వాహనంలో జైలు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ మలక్‌పేట నుంచి చంచల్‌గూడ జైలు చౌరస్తా వద్దకు రాగానే వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. జైలు వైపు వెళ్లనిచ్చేదే లేదంటూ కరాఖండిగా చెప్పారు. 

‘‘మేమేమీ జైలు లోపలికి వెళ్లబోం. సమయం ముగిసింది కాబట్టి జగన్‌ను కలవబోం కూడా. కేవలం ఆ రోడ్డు మార్గం గుండా వెళ్లిపోతాం’’ అని భారతి స్పష్టం చేసినప్పటికీ ఖాకీలు ఖాతరు చేయలేదు. దాంతో విజయసాయిరెడ్డి కారు దిగారు. భారతిని అటువైపుగా వెళ్లేందుకు అనుమతించాలని అక్కడే ఉన్న ఏసీపీ సాయికృష్ణను కోరారు. ఉన్నతాధికారులతో మాట్లాతానని ఆయన బదులివ్వడంతో బారికేడ్ల వద్దే సుమారు 20 నిమిషాల పాటు నిలుచుండిపోయారు. ‘పై వారితో మాట్లాడాం. ఆ రోడ్డులోకి ఎవర్నీ అనుమతించొద్దని ఆదేశాలిచ్చారు’ అని అనంతరం ఏసీపీ తేల్చిచెప్పారు. వాహనాన్ని అనుమతించకుంటే నడిచైనా వెళ్తామంటూ భారతి, కుటుంబ సభ్యులు, విజయసాయిరెడ్డి బయల్దేరారు. అప్పటికే జైలు లోపలికి వెళ్లిన జగన్‌ను తామేమీ కలిసే ప్రయత్నం చేయబోమని, కేవలం ఆ రోడ్డు గుండా వెళ్తామని భారతి మరోసారి చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. వారందరినీ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దూరంగా ఉన్న మీడియా ప్రతినిధులంతా పోలీసుల హడావుడి చూసి చుట్టూ మూగారు. 

ఖాకీల తీరుపై భారతి తీవ్రంగా ఆగ్రహించారు. ‘‘నగరంలో ఎక్కడ చూసినా పోలీసుల తీరు వల్ల అంతా ఇబ్బందులకు గురి కావలసి వస్తోంది. ఎక్కడికెళ్లినా ఏదో పాకిస్థాన్‌కు వెళ్లినట్టుగా ఉంది’’ అంటూ మండిపడ్డారు. ‘‘వాహనం లేకుండా కాలినడకన వెళ్లేందుకు కూడా అభ్యంతరమెందుకు? మేమేమీ నిషేధిత ప్రాంతానికి వెళ్లడం లేదు. అలాంటప్పుడు ఎందుకిలా అడ్డుకుంటున్నారు?’’ అంటూ పోలీసులను నిలదీశారు. దాంతో కంగుతిన్న ఖాకీలు హడావుడిగా వాహనం తెప్పించారు. అందులోనే వెళ్లేందుకు భారతి తదితరులందరినీ అనుమతించారు. అనంతరం వారంతా చంచల్‌గూడ జైలు ప్రధాన ద్వారం వద్ద ఒక్క నిమిషం పాటు ఆగారు. అనంతరం అదే వాహనంలో వెళ్లిపోయారు.
Share this article :

0 comments: