వైఎస్సార్ సీపీ గుర్తు సీలింగ్ ఫ్యాన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ సీపీ గుర్తు సీలింగ్ ఫ్యాన్

వైఎస్సార్ సీపీ గుర్తు సీలింగ్ ఫ్యాన్

Written By news on Tuesday, May 29, 2012 | 5/29/2012

* ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులందరి గుర్తు ఇదే: భన్వర్‌లాల్
* ఉప స్థానాల బరిలో 255 మంది... 25 మంది ఉపసంహరణ
* ఆ జిల్లాల్లో ఎవరినీ ముందస్తు అరెస్టులు చేయెద్దు... చేసిన వారిని వదిలేయండి
* అరెస్టుల ద్వారా ప్రచారాన్ని అడ్డుకోవడం కోడ్ ఉల్లంఘన కింద పరిగణిస్తాం
* డీజీపీ, జిల్లా కలెక్టర్లు, ఎస్‌పీలకు ఉత్తర్వులు జారీ
* వైఎస్ జగన్ అరెస్టుపై ఫిర్యాదును ఈసీకి పంపిస్తాం
* కేబుల్ ప్రసారాలను అడ్డుకోవడంపై పరిశీలిస్తాను

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరికీ సీలింగ్ ఫ్యాన్ గుర్తును కేటాయించినట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. నెల్లూరు లోక్‌సభతో పాటు 17 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తాజా మాజీ ఎమ్మెల్యేలైనందున వారందరికీ గుర్తు కేటాయింపులో ప్రాధాన్యతలో భాగంగా సీలింగ్ ఫ్యాన్ గుర్తు కేటాయించినట్లు వివరించారు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి తాజా మాజీ కాకపోయినప్పటికీ రిజిస్టర్డ్ పార్టీగా ప్రాధాన్యత ఇస్తూ సీలింగ్ ఫ్యాన్ గుర్తు కేటాయించినట్లు చెప్పారు. భన్వర్‌లాల్ సోమవారం సచివాలయంలో విలేకరుల సమావే శంలో మాట్లాడారు. 

నామినేషన్ల ఉపసంహరణ తరువాత నెల్లూరు లోక్‌సభతో పాటు 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 255 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల స్థానాల్లో మొత్తం 280 మంది నామినేషన్లను ఆమోదించగా 25 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారని, దీంతో మొత్తం బరిలో 255 మంది మిగిలినట్లు వివరించారు. అత్యధికంగా ఒంగోలులో 23 మంది, రాజంపేట, తిరుపతిలో 19 మంది చొప్పున అభ్యర్థులు పోటీలో ఉన్నారని చెప్పారు. ఈ మూడు స్థానాల్లో మాత్రమే రెండేసి బ్యాలెట్ యూనిట్లను వినియోగించనున్నామని, మిగతా స్థానాల్లో ఒక బ్యాలెట్ యూనిట్ సరిపోతుందని తెలిపారు. అతి తక్కువగా పోలవరం, నర్సన్నపేటలో ఆరుగురు చొప్పున, నర్సాపురం, పాయకరావుపేటలో తొమ్మిది మంది చొప్పున పోటీలో ఉన్నారని ఆయన వెల్లడించారు. 

జిల్లాల్లో ఎవరినీ ముందస్తు అరెస్టులు చేయవద్దు
ఉప ఎన్నికలు జరుగుతున్న జిల్లాల్లో ఎవరినీ ముందస్తు అరెస్టులు చేయరాదని డీజీపీ, జిల్లా కలెక్టర్లు, ఎస్‌పీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు భన్వర్‌లాల్ తెలిపారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులతో పాటు ప్రచారంలో పాల్గొంటున్న ఆ పార్టీ నేతలను ముందస్తు అరెస్టులు చేసినట్లు ఫిర్యాదు అందిందన్నారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకుని అరెస్టు చేసిన వారిని వదిలేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఏ పార్టీకి చెందినవారిని కూడా ముందస్తు అరెస్టులు చేయరాదన్నారు. అరెస్టుల ద్వారా ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకోవడం ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని స్పష్టంచేశారు. ప్రచారానికి ఇబ్బందులు, ఆటంకాలను కలిగిస్తే వాటిని తొలగింప చేస్తామన్నారు. ఉప ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో పరిస్థితి ప్రశాంతంగా ఉందని చెప్పారు. బంద్‌లు చేసినా ప్రచారాన్ని నిలువరించరాదని ఆయన తెలిపారు. 

జగన్ అరెస్టు ఫిర్యాదును ఈసీ దృష్టికి తీసుకువెళ్తా
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్టు చేయడం ద్వారా ప్రచారం చేయకుండా నిలువరించారని, దీనివల్ల ఎన్నికల్లో సమాన అవకాశాలకు భంగం కలిగినందున తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అందిన ఫిర్యాదును కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్తానని భన్వర్‌లాల్ తెలిపారు. పరకాలలో పోలీసు అధికారి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ నుంచి నివేదిక తెప్పించుకుని తగిన చర్యలు తీసుకుంటామన్నారు. జగన్ అరెస్టు నేపథ్యంలో కేబుల్ ప్రసారాలను నియంత్రించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన విషయాన్ని పరిశీలిస్తానని, దీనిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటానని ఆయన చెప్పారు.
Share this article :

0 comments: