జగన్ విచారణ సీడీలను విడుదల చేయాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ విచారణ సీడీలను విడుదల చేయాలి

జగన్ విచారణ సీడీలను విడుదల చేయాలి

Written By news on Wednesday, May 30, 2012 | 5/30/2012

ఎల్లో మీడియా తప్పుడు వార్తలపై సీబీఐ అధికారులకు వైఎస్సార్ కాంగ్రెస్ నేతల విజ్ఞప్తి

హైదరాబాద్, న్యూస్‌లైన్: వై.ఎస్.జగన్ కంపెనీల్లో పెట్టుబడుల కేసుకు సంబంధించి ఎల్లో మీడియాలో వస్తున్న అసత్య కథనాలపై సీబీఐ ప్రజలకు వివరణ ఇవ్వాలని.. వాటిని ఖండించి, దీనిపై ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు పార్టీ నేతలు బాజిరెడ్డి గోవర్ధన్, జనక్ ప్రసాద్, మహేందర్‌రెడ్డి, వెంకట్‌ప్రసాద్‌లు సీబీఐ తాత్కాలిక కార్యాలయం దిల్‌కుశ అతిథి గృహంలో అధికారులను కలసి వినతి పత్రం అందజేశారు. సీబీఐ విచారణ సమయంలో మ్యాట్రిక్స్ అధినేత నిమ్మగడ్డ ప్రసాద్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి దురుసుగా ప్రవర్తించారంటూ ఎల్లోమీడియాకు చెందిన ఒక పత్రికలో వచ్చిన కథనాన్ని ఆ పార్టీ నేతలు తప్పుపట్టారు. విచారణ విషయం సీబీఐ అధికారులు, సిబ్బందికి మాత్రమే తెలిసే అవకాశం ఉంటుందని.. ఇన్ కెమెరాలో జరిగిన విషయాలనూ ఎల్లో మీడియాలో ప్రచురిస్తున్నారని ఆరోపించారు. జగన్ విచారణ సందర్భంగా ఏం జరిగిందనే విషయంపై సీబీఐ సీడీలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అసత్య వార్తలు ప్రచురితమైనందున ఆ వార్తలను సీబీఐ జాయింట్ డెరైక్టర్(జేడీ) వీవీ లక్ష్మీనారాయణ ఖండించాలని వారు కోరారు. లేదంటే ఆయన కూడా ఎల్లో మీడియాతో చేతులు కలిపారంటూ ప్రజల్లో ఉన్న అనుమానాలు నిజమైనట్లు అవుతుందన్నారు. ‘సీబీఐ విచారణకు సంబంధించి సత్య దూరమైన వార్తలు ప్రచురితమైనప్పుడు అధికారులు వివరణ ఇవ్వడం ఆ విభాగం నియమ నిబంధనల్లో భాగం. 

సీబీఐ ఉన్నతస్థాయి వర్గాలు కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నాయి. అయితే, మన రాష్ట్రంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. జగన్ కంపెనీల్లో పెట్టుబడుల కేసులో ఎఫ్‌ఐఆర్ నమోదైనప్పటి నుంచి జేడీ లక్ష్మీనారాయణ ఒక విషయంలో మాత్రమే మీడియాకు ఖండన ఇచ్చారు. ఎంపీ లగడపాటి రాజగోపాల్ సోదరుడు శ్రీధర్ జగన్ కంపెనీల్లో పెట్టుబడులు మాత్రమే పెట్టారని, అది క్విడ్ ప్రో కో కాదని ఆయన వివరణ ఇచ్చారు. మరి.. ఎల్లో మీడియాలో వచ్చిన ఇతర అసత్య వార్తలను సీబీఐ జేడీ ఎందుకు ఖండించడం లేదు? పైగా.. కోర్టు తీర్పులో ఉన్న శ్రీధర్ పేరునూ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చలేదు’ అని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలను అయోమయానికి గురి చేసే విధంగా ఎల్లో మీడియాలో తప్పుడు కథనాలు ప్రచురితమవుతున్నాయని చెప్పారు.

అడ్డుకున్న పోలీసులు: సీబీఐ జేడీ లక్ష్మీనారాయణకు విజ్ఞాపన పత్రం అందించేందుకు వచ్చిన వైఎస్సార్ సీపీ నేతలు దిల్‌కుశ అతిథి గృహం గేటు బయటే గంటకుపైగా నిరీక్షించాల్సి వచ్చింది. విజ్ఞాపన పత్రం అందించేందుకు వచ్చిన పార్టీ నేతలను పోలీసులు గేటు బయటే అడ్డుకున్నారు. తాము వినతిపత్రం అందించి వెళతామని పోలీసులకు వివరించినప్పటికీ ఫలితం లేకపోయింది. ‘మీరు లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదు’ అని పోలీసులు కరాఖండీగా చెప్పారు. సీఐబీ జేడీ, ఎస్పీ కోర్టుకు వెళ్లారని తెలిపారు. 

పోనీ.. సీబీఐ కార్యాలయంలో అధికారి ఎవరు ఉంటే వారికే విజ్ఞాపన పత్రం అందిస్తామని నేతలు విన్నవించినప్పటికీ పోలీసులు ఖాతరు చేయలేదు. అరగంట వ్యవధిలోనే అదనపు బలగాలను అక్కడకు రప్పించి హడావుడి చేశారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు సీబీఐ ఎస్పీ వెంకటేష్‌తో ఫోన్‌లో మాట్లాడారు. తాము అందుబాటులో లేనందున విజ్ఞాపన పత్రం కార్యాలయంలో ఇచ్చి వెళ్లాలని ఎస్పీ సూచించినా.. పోలీసులు ఒక పట్టాన వారిని లోనికి అనుమతించలేదు. సంబంధిత అధికారి బయటకే వచ్చి విజ్ఞాపన పత్రం తీసుకుంటారని మెలిక పెట్టారు. దీంతో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ప్రశ్నించారు. దీంతో దిగొచ్చిన పోలీసులు లోపలికి వెళ్లేందుకు వారిని అనుమతించారు.
Share this article :

0 comments: