కొట్టి, బలవంతంగా వారిచే తప్పుడు మాటలు చెప్పించి వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు బయట తిరగకుండా చేయాలని - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కొట్టి, బలవంతంగా వారిచే తప్పుడు మాటలు చెప్పించి వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు బయట తిరగకుండా చేయాలని

కొట్టి, బలవంతంగా వారిచే తప్పుడు మాటలు చెప్పించి వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు బయట తిరగకుండా చేయాలని

Written By news on Sunday, May 27, 2012 | 5/27/2012

సీఎం ఆలోచనలను పోలీసులు అమలు చేస్తున్నారు
మా కార్యకర్తలమీద దౌర్జన్యాలపై కోర్టులను ఆశ్రయిస్తాం

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి తాబేదారుగా మారిందని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి బాజిరెడ్డి గోవర్ధన్ మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు వంద బస్సులు తగలబెడుతున్నారంటూ కట్టు కథలతో దుష్ర్పచారం చేస్తోందని దుయ్యబట్టారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘వైఎస్సార్ కాంగ్రెస్ సేవాదళం కన్వీనర్ కోటింరెడ్డి వినయ్‌రెడ్డి ఒక కుట్ర పన్నారని, మెసేజ్‌లు పంపారంటూ.. పోలీసులు ఒక పేపర్ ప్రింట్ ఇచ్చారు. అందులో ‘జైల్ భరోకు రెడీగా ఉండండి’ అని ఉంది. ఇదేమీ నిషేధం కాదు కదా?’ అని బాజిరెడ్డి ప్రశ్నించారు. ‘ఇద్దరు వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు ఒక లీటర్ పెట్రోల్ బాటిల్ పట్టుకొని మోటార్‌సైకిల్‌పై పట్టుబడ్డారని పోలీసులు చెప్పారు. వారి లెక్క ప్రకారమైనా.. లీటర్ పెట్రోల్‌తో వంద బస్సులు కాల్చడం ఎలా సాధ్యమవుతుంది? ఇద్దరు వ్యక్తులను పట్టుకొని, వారిని కొట్టి, బలవంతంగా వారిచే తప్పుడు మాటలు చెప్పించి వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు బయట తిరగకుండా చేయాలని పోలీసులు భావిస్తున్నారా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే సీఎం కిరణ్ ఆలోచనలను పోలీసులు పక్కాగా అమలు చేస్తున్నారనే అనుమానం కలుగుతోంది’ అని అన్నారు. పోలీస్ కమిషనర్ మీడియాతో మాట్లాడిన మాటలను గోవర్ధన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ‘కిరోసిన్ బాటిల్‌తో తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే అదుపులోకి తీసుకున్నాం అని చెప్పారు. 

కానీ ఆ కాసేపటికే విడుదల చేసిన నోట్‌లో మాత్రం పెట్రోల్ అని చెప్పారు. ఇలా వారే ఒక విధమైన అస్పష్టతతో ఉన్నారు’ అని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలను విపరీతంగా కొట్టి, చిత్రహింసలకు గురిచేసి అబద్ధపు ప్రచారం చేస్తున్న పోలీసులపై హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు చేయడంతో పాటు న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పై జరిగే కుట్రలు, కుతంత్రాలను తాము ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు. పార్టీపై పోలీసుల దుష్ర్పచారాన్ని ప్రజలు నమ్మవద్దని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని, పోలీసులు నేతల ఇళ్లల్లోకి వెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని గోవర్ధన్ మండిపడ్డారు. 

ఏది ఏమైనా కార్యకర్తలు సంయమనంతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. అరాచకాలు చేస్తే పార్టీ ఒప్పుకోదని స్పష్టం చేశారు. కుట్రలు, కుతంత్రాలు చేయడం వైఎస్సార్ కాంగ్రెస్ నైజం కాదని గోవర్ధన్ స్పష్టం చేశారు. తమ పార్టీ అధినేత జగన్ చేపట్టిన కార్యక్రమాలన్నీ గాంధేయ పద్దతిలోనే జరిగాయన్నారు. ఇప్పటిదాకా తాము చేపట్టిన ధర్నాలు, ఆందోళనల్లో తమ కార్యకర్తలు ఏమైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన ఘటన ఒక్కటైనా ఉందా? అని నిలదీశారు. పోలీసులు చేస్తున్న ఆరోపణల్లో ప్రభుత్వ పెద్దల హస్తముందని, ముందస్తుగా తయారు చేసుకున్న ప్లాన్‌ను పక్కాగా నడిపిస్తున్నారని దుయ్యబట్టారు.
Share this article :

0 comments: