పడకేసిన మగ్గం - చేదెక్కిన చెరకు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పడకేసిన మగ్గం - చేదెక్కిన చెరకు

పడకేసిన మగ్గం - చేదెక్కిన చెరకు

Written By news on Sunday, November 30, 2014 | 11/30/2014


నేతన్నకు గిట్టుబాటెక్కడ?
VIPరిపోర్టర్ 
ఆర్.కె. రోజా,నగరి ఎమ్మెల్యే

‘పడకేసిన మగ్గం - చేదెక్కిన చెరకు’
నగరి నియోజకవర్గంలో నేత కార్మికులు, చెరకు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.ఒకప్పుడు దర్జాగా బతికిన నేతన్న.. ఇప్పుడు ముడిసరుకుల ధర పెరగడం.. గిట్టుబాటు ధర లేకపోవడంతో డీలాపడిపోయాడు. పెట్టుబడిలేక.. ప్రభుత్వాలు ఆదుకోక కూలీగా మారిపోయాడు. చెరకు రైతుల పరిస్థితీ అంతే. పది మందికీ పట్టెడన్నం పెట్టే అన్నదాత పిడికెడు మెతుకుల కోసం వెంపర్లాడుతున్నాడు. ఒక పక్క వర్షాభావం.. మరో పక్క గిట్టుబాటు ధరలేక అల్లాడాల్సి వస్తోంది. వీటిని పరిష్కరించి.. తమ బతుకులు కుదురుకునేదెప్పుడోనని కుమిలిపోతున్నారు. వీరి కష్టాలు.. కన్నీళ్లు తెలుసుకునేందుకు నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్‌కే.రోజా ‘సాక్షి’ తరపున విలేకరిగా మారారు. నియోజకవర్గంలోని చింతలపట్టెడ, కొత్తపేట, ఏకాంబరకుప్పం, గొల్లపల్లె, తడుకు గ్రామాల్లోని రైతులు, నేతన్నల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
 
ఆర్కే రోజా: నమస్తే అన్నా.. నేను ఎమ్మెల్యే రోజాని. ‘సాక్షి’ తరపున విలేకరిగా వచ్చా. ఏం బాగున్నారా.. చేనేతకు ఉచిత కరెంట్ ఇస్తున్నారా?
ఉదయన్ (నేతన్న): 
సుమారు 30 ఏళ్లుగా మగ్గం నేస్తా ఉండా. ఎవరూ మాకు చేసిందేమీ లేదు. ఉచితంగా కరెంటు ఇయ్యడం లేదు. తమిళనాడులో ఇచ్చే విధంగా రెండు నెలలకు 500 యూనిట్లు ఉచితంగా ఇస్తే బాగుంటుంది. అట్లా ఇస్తేనన్నా కరెంటు బిల్లు కట్టే కష్టమన్నా తగ్గుతుంది. ప్రభుత్వం వారు పట్టించుకోవడంలేదు మేడం..
 
ఆర్కేరోజా: ప్రభుత్వం మీకు ఏం చేయాలని   కోరుకుంటున్నారు? ఏం చేస్తే సమస్య తీరుతుంది?
జగన్నాథం (నేతన్న): 
పెభుత్వం వాళ్లు మమ్మల్ని మరమగ్గ కార్మికులమని గుర్తించి గుర్తింపు కార్డులు ఇస్తే మేలు. తమిళనాడులాగా కుటుంబానికి ఒక కార్డు ఇయ్యాల. ఆ కార్డుల ఆధారంగా పింఛన్లు ఇయ్యాల. ఆ కార్డులు గవర్నమెంటు అధికారులే ఇంటింటికీ తెచ్చి ఇయ్యాల. గత పెభుత్వం నేత రుణాలు రద్దు చేస్తామని చెప్పింది. ఇప్పటి వరకూ రూపాయి కూడా రద్దు కాలేదు. బ్యాంకులో కొత్త అప్పులు పుట్టడంలేదు. ఏం చేసేదో అర్థం కావడం లేదు.
 
ఆర్కే రోజా: నూలు అందడంలో ఏవైనా ఆటంకాలు ఉన్నాయా? మీ ప్రాంతంలో ఈటీపీ (రసాయ న నీటి శుద్ధీకరణ ప్లాంటు) కట్టారు కదా? అది మీకు ప్రయోజనకరమేనా?
నీలమేఘం (మాస్టర్ వీవర్):
 వ్యవసాయదారుడు ఎంత ముఖ్యమో నేత కార్మికుడు కూడా అంతే ముఖ్యం. అయితే వ్యవసాయానికి విత్తనాలు సబ్సిడీ పై అందించే ప్రభుత్వం మాకు నూలును మాత్రం ఆ రకంగా అందించడం లేదు. ఈటీపీ ప్లాంటు కట్టడం మంచిదే. అయితే దాన్ని తొందరగా ప్రారంభించాలని కోరుతున్నాను. డైయింగ్ యూనిట్ల నుంచి వచ్చే నీళ్ల కారణంగా నీటి కాలుష్యం అవుతోంది. ఈ నీటిని ప్లాంటులో శుభ్రపరుస్తారు కాబట్టి ఆ సమస్య తీరుతుంది. అయితే డైయింగ్ యూనిట్లకు మీటర్లు ఏర్పాటుచేసి నీటిని తెప్పించి ట్రయల్ రన్ చేస్తామని చెప్పిన అధికారులు ఆ పనులను నానుస్తున్నారు.
 
ఆర్కేరోజా: మహిళా నేత కార్మికుల విషయంలో ప్రభుత్వం ప్రత్యేకసదుపాయాలేమైనా కల్పిస్తోందా?
శారద (నేత కార్మికురాలు): అట్టాంటిదే మీ లేదమ్మా. మాకేం ప్రత్యేక సదుపాయాలులేవు. తమిళనాడులో అయితే చాలా చేస్తా ఉండారు. మా అక్క సొరకాయపేటలో ఉం ది. అక్కడ మగ్గం నడిపే ఆడోళ్లకి గర్భం వస్తే ప్రభుత్వమే నెలనెలా డబ్బు ఇస్తుంది. ఇక్కడ అలాంటిదేమీ లేదు. ఎంతకష్టమైనా భార్యాభర్తలిద్దరూ భరించాల్సిందే.
 
ఆర్కేరోజా: పట్టువస్త్రాల తయారీలో లాభాలు ఉన్నాయా? సొంతంగా తయారు చేస్తున్నారా, కూలీకి నేసి ఇస్తున్నారా?
ఆలూరు నరసింహులు, సుబ్రమణ్యం (చేనేత కార్మికులు): పట్టువస్త్రాల తయారీకి ఆర్డర్లు తగ్గాయి. ముడిసరకుల ధర పెనుభారంగా మారింది. లాభాలు అనే మాట మరిచిపోయాం. వేలకు వేలు పెట్టుబడి పెట్టి ముడి సరకులు కొనుగోలు చెయ్యలేక అవస్థలు పడుతున్నాం. ఈ కారణంగా చీర ధర పెరుగుతోంది. అమ్మకాలు తగ్గాయి. సొంతంగా తయారుచేయలేక.. ముడిసరకులు ఇచ్చేవారికి కూలికి నేసి ఇస్తున్నాం.
 
ఆర్కేరోజా: దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నేతన్నలకు పని కల్పించడానికి జనతా వస్త్రాల తయారీ విధానం ప్రవేశపెట్టారు. ప్రస్తుత ప్రభుత్వం అలా పనికల్పిస్తోందా?
హరిహరన్ (నేతన్న): ఎన్టీఆర్ కల్పించిన సదుపాయం ఇప్పుడు లేదు. పనిలేని సమయాల్లో నేతకార్మికులు చాలా కష్టపడుతున్నారు. నలుగురూ పనిచేసినా ఇల్లు గడవని పరిస్థితి ఉంది. తమిళనాడులో పనిలేని సమయాల్లో పనికల్పించడం కోసం ప్రభుత్వమే చీరలు, పంచెల ఆర్డర్లు ఇస్తోంది. చేనేత, మరమగ్గ కార్మికులు అనే భేదాభిప్రాయం లేకుం డా అన్ని సదుపాయాలు కల్పిస్తోంది. చిత్తూరు జిల్లాకు చెందిన ఇద్దరు నేతలు సీఎంలుగా పనిచేసినా ఇక్కడి నేతకార్మికులకు ఎలాంటి సదుపాయాలు కల్పించకపోవడం మా దౌర్భాగ్యం. దయనీయంగా చెరకు రైతు
 
ఆర్కేరోజా: ప్రస్తుతం చెరకు పంట సీజన్ నడుస్తోంది కదా? మీ పరిస్థితి ఎలావుంది. పాత బకాయిలను ఫ్యాక్టరీలు చెల్లించాయా?
రామూర్తిరెడ్డి (చెరకు రైతు): చెరకు రైతులకు బకాయిలు ఇంకా ఇవ్వలేదు. జిల్లా వాసి చంద్రబాబు సీఎం ఉన్నారు. ఏం ప్రయోజనం.. ఆయనకు చీమకుట్టినట్లు కూడా లేదు. చిత్తూరు కో-ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలో రైతులకు లక్షలకొద్దీ బకాయిలు నిలిచిపోయాయి. నాకు నాలుగు లక్షలదాకా రావాలి. ఇలా ఉంటే పంట సాగు ఎలా చెయ్యగలం. మేం పండించి ఇచ్చిన పంటను తీసుకున్న ఫ్యాక్టరీ యాజమాన్యం మాకు డబ్బులు ఇవ్వకుండా కాలం వెళ్లదీస్తోంది. ఇది మంచి పద్ధతి కాదు. ఈ పరిస్థితి కొనసాగితే రైతులు ఆత్యహత్యలు చేసుకోవాల్సిందే.
 
ఆర్కేరోజా: వ్యవసాయానికి విద్యుత్ సరఫరా ఏ మేరకు అందుతోంది? 9 గంటల కోతలేని విద్యుత్ అందిస్తున్నారా?
శ్రీనివాసులు రెడ్డి (రైతు): అబ్బే లేదమ్మా. రోజుకి 6 గంటలు కూడా సక్రంగా ఇవ్వడం లేదు. అది కూడా అర్ధ రాత్రి ఇస్తున్నారు. కయ్యల్లో నీరు కట్టడానికి నానా తిప్పలు పడుతున్నాం. కూలోళ్లు కూడా రావడం లేదు. దీన్ని వదిలేసి వేరే పని చేసుకుందామనుకున్నా కొత్తగా ఏ పనీ రాకపోయే. మా పరిస్థితి చెప్పుకుంటే ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారైంది.
 
ఆర్కేరోజా: చెరకురైతు పట్ల ప్రభుత్వ నిర్లిప్తతపై మీరేమంటారు?
రవిశేఖర్‌రాజు (రైతు): గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు సీఎంలు అయ్యారు. వీరిద్దరూ జిల్లా వాసులే. అయినప్పటికీ రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఎలాంటి కృషీ చేయలేదు. రెండేళ్లుగా బకాయిలు పేరుకుపోతు న్నా యాజమాన్యాలతో చర్చించలేదు. బకాయిలు అందే విధంగా ఎవ్వరూ చొరవ తీసుకోవడంలేదు. ఇది చాలా బాధకలిగిస్తోంది. మనస్సు కుంగదీస్తోం ది. ఇప్పుడు మళ్లీ క్రషింగ్ మొదలైంది. చెరకు ఏ వి ధంగా వారికి తోలాలని ఆలోచనలో పడ్డాం. ఈ నెల 30న సహకార చక్కెర పరిశ్రమ మేనేజింగ్ డెరైక్టర్లతో సీఎం చంద్రబాబు చర్చిస్తామంటున్నారు. ఆ చర్చలేమైనా ఫలితాన్ని ఇస్తాయో లేదో.. చూడాల్సి ఉంది. లేకుంటే ధర్నాలకు దిగడం తప్ప మరోదారి లేదు.
 
చెరకు రైతుల గోడు
నగరి నియోజకవర్గంలో చెరకు రైతులెక్కువ. ఇక్కడ సుమారు 6 వేల హెక్టార్ల వరకు చెరకు పండిస్తారు. గానుగాడలేని వారు సమీపంలోని ఎస్వీ షుగర్స్, ప్రుడెన్షియల్, సాగర్ షుగర్ ఫ్యాక్టరీలకు తరలిస్తుంటారు. కానీ ప్రభుత్వాలు చెరకు రైతులను చిన్నచూపు చూస్తున్నాయి. పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలేదు. దీనికితోడు షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు ఏళ్లతరబడి బకాయిలు చెల్లించకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
 
నేతన్నల ఆక్రందన
నగరి నియోజకవర్గం నేత కార్మికులకు పెట్టింది పేరు. ఇక్కడి వస్త్రాలు దేశ విదేశాలకూ ఎగుమతి అవుతుంటాయి. జిల్లాలో 25 వేల మరమగ్గాలుంటే అందులో నగరి నియోజకవర్గంలోనే 530 క్లస్టర్ యూనిట్లు ఉన్నాయి. వీటిపై 24 వేల మంది కార్మికులు ఆధారపడి జీవిస్తున్నారు. ఏడాదికి 2000 మిలియన్ మీటర్ల వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. వీరికి నేతపని తప్ప మరేపనులూ తెలి యవు. మగ్గమాడితేగాని డొక్కలేవని పరిస్థితి. పక్కనే ఉన్న తమిళనాడు ప్రభుత్వం రైతులకు అన్ని వసతులు కల్పిస్తోంది. కానీ ఇక్కడి పాలకులు ఆదిశగా చర్యలు చేపట్టకపోవడం వారిని మరింత కుంగదీస్తోంది.

ఆర్.కె.రోజా హామీలు
మీ గ్రామానికి విలేకరిగా వచ్చా. సమస్యలు అడిగి తెలుసుకున్నాను. నేతన్నలు తమిళనాడు తరహాలో తమకు ఎలాంటి సదుపాయాలూ లేవని, ఈ కారణంగా వృత్తిలో ముందడుగు వేయలేక పోతున్నామని చెప్పారు. చక్కెర ఫ్యాక్టరీలు తమకు బకాయిలు చెల్లించడం లేదని, దానికి ప్రభుత్వం చొరవ చూపడం లేదని, విద్యుత్ సరఫరా సక్రమంగా లేదని చెరకు రైతులు నా దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో పోరాడుతా. రైతులకు, నేతన్నలకు అండగా ఉంటా.
Share this article :

0 comments: