దద్దరిల్లిన అనంత - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » దద్దరిల్లిన అనంత

దద్దరిల్లిన అనంత

Written By news on Saturday, December 6, 2014 | 12/06/2014


దద్దరిల్లిన అనంత
రుణమాఫీపై ప్రభుత్వ మోసపూరిత వైఖరిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నా విజయవంతమైంది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి వేలాది రైతులు భారీగా తరలివచ్చి ధర్నాలో పాల్గొన్నారు. సర్కారు తీరును ముక్త కంఠంతో ఖండించారు. ఇచ్చిన హామీ మేరకు రైతులు, డ్వాక్రా రుణాలను సంపూర్ణంగా మాఫీ చేసి తీరాల్సిందేనని నినదించారు. చంద్రబాబు ఎన్ని డొంక తిరుగుడు సమాధానాలు చెప్పి తప్పించుకోవాలని చూసినా, ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే దాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, రైతులకు తాము అండగా ఉంటామని వైఎస్సార్‌సీపీ నేతలు భరోసా ఇచ్చారు. తొందర పడి ఆత్మహత్యలకు తెగించొద్దని విన్నవించారు.
 
  సాక్షిప్రతినిధి, అనంతపురం :  రైతు, డ్వాక్రా రుణ మాఫీ చేస్తానని హామీ ఇచ్చి సీఎం పీఠాన్ని దక్కించుకున్న చంద్రబాబు నాయుడు ఆరు నెలలైనా ఇచ్చిన హామీ నెరవేర్చక పోవడాన్ని నిరసిస్తూ శుక్రవారం వైఎస్సార్‌సీపీ చేపట్టిన ధర్నాతో జిల్లా కలెక్టరేట్ పరిసరాలు హోరెత్తారుు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ అధ్యక్షతన మహాధర్నాను నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి, ఆత్మహత్యలు చేసుకున్న రైతులకూ నివాళులర్పించారు. ఉదయం 10.45 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకూ రైతులు ధర్నాలో కూర్చున్నారు. రుణమాఫీపై చంద్రబాబు అనుసరిస్తోన్న మోసపూరిత విధానాలు, రైతు ఆత్మహత్యలపై బాధ్యతారాహిత్యంగా మాట్లాడంపై నేతలు చేసిన ప్రసంగాలు ఆకట్టుకున్నారుు.
 
  మధ్య మధ్యలో చంద్రబాబు తీరును నిరసిస్తూ..‘చంద్రబాబు డౌన్‌డౌన్’ అంటూ నినదించారు. చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలు, సాగిస్తున్న పాలనపై ఫ్లకార్డులు ప్రదర్శించారు. జిల్లాలో 42 మంది రైతుల ఆత్మహత్యలకు పూర్తి కారకుడు చంద్రబాబే అని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు, డ్వాక్రా, చేనేత రుణాలను పూర్తిగా మాఫీ చేసేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ‘అనంత’లో 10.24 లక్షల ఖాతాల్లో 6,817కోట్ల రూపాయల రుణాలున్నాయని వీరంద రి రుణాలు మాఫీ చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
 
  సీఎం చేసిన విధాన ప్రకటన మేరకు జిల్లాలో కేవలం 3 లక్షల మంది మాత్రమే రుణమాఫీ కిందకు వస్తారని, తక్కిన 6.50 లక్షల రైతుల పరిస్థితి ఏంటని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు. రుణాలు మాఫీ కావని ఇప్పుడు చెబితే వాటిపై 14 శాతం వడ్డీని వసూలు చేస్తారని, దానికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. ఇప్పటికే జిల్లాపై 955 కోట్ల రూపాయల వడ్డీ భారం పడిందన్నారు. బంగారు రుణాలపై 3నెలలుగా నోటీసులు వస్తున్నాయని, ఈ ఒత్తిళ్లను తాళలేక రైతులు ఆత్మహత్యలకు తెగిస్తున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ ఒత్తిడితోనే పాక్షికంగా అయినా రుణమాఫీ చేసేందుకు చంద్రబాబు కొంత మేరకు సిద్ధమవుతున్నారన్నారు. తక్కిన రుణాల మాఫీ కూడా ముక్కు పిండి చేరుుస్తామన్నారు. రైతులు ైధైర్యం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకోవద్దని విన్నవించారు.
 
  ఏ పల్లెకు వెళ్లినా రైతులు, మహిళలు రుణమాఫీపైనే చర్చించుకుంటున్నారని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. 20 శాతం రుణమాఫీ చేసి, తక్కిన 80 శాతానికి బాండ్లు ఇస్తానని చెబుతున్నారని, వీటి ఆధారంగా బ్యాంకర్లు రుణాలు ఎలా ఇస్తారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. నిస్సిగ్గుగా మోసపూరిత మాటలు చెబుతూ రైతులు ఆత్మహత్యలు చేసుకునేందుకు కారణం అవుతున్నారని ఆరోపించారు. జిల్లాలో 42 మంది ఆత్మహత్యలు చేసుకుంటే రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం లేదని చంద్రబాబు చెప్పడం అతని బాధ్యతారాహిత్యానికి నిదర్శనమన్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ మృతుల కుటుంబాలపై విచారణ చేస్తోందని, ఈక్రమంలో సీఎం ఇలాంటి ప్రకటనలు చేస్తే అధికారులు ధైర్యంగా వాస్తవాలను ఎలా రిపోర్ట్ చేస్తారని ప్రశ్నించారు. ఈ ఏడాది 5 లక్షల హెక్టార్లలో పంట తుడిచి పెట్టుకుపోయిందని, రైతులు బ్యాంకు మెట్లు కూడా ఎక్కే పరిస్థితి లేకపోవడంతో బీమా వచ్చే పరిస్థితి కూడా లేదన్నారు. గతేడాదికి సంబంధించి రూ.226 కోట్ల పంటల బీమాను పాత బకాయిల కింద జమ చేసుకుంటుంటే జిల్లాలోని అధికార పార్టీ నేతలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
 
 రూ.674 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ కూడా వచ్చే పరిస్థితి కన్పించడం లేదన్నారు. చంద్రబాబు వల్ల జిల్లాలోని ఏ ఆడబిడ్డ మెడలోనూ బంగారు గొలుసు కనిపించకుండా పుస్తెల తాడు కన్పిస్తోందన్నారు. జిల్లా నుంచి 12 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలను గెలిపించారని, అందులో స్థానికేతరుడైన బాలకృష్ణను కూడా గెలిపించారని, ఇలాంటి జిల్లాకు ఏం చేశావని చంద్రబాబును ప్రశ్నించారు. ధర్నా అనంతరం జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ సయ్యద్‌ఖాజామెహిద్దన్‌కు వినతిపత్రం అందజేశారు.
 
  రైతు ఆత్మహత్యలపై చిత్తశుద్ధితో రిపోర్ట్ రూపొందించి ప్రభుత్వానికి నివేదించాలని ఏజేసీకి విజయసాయిరెడ్డి విన్నవించారు. దీనిపై ఏజేసీ సానుకూలంగా స్పందించారు. ధర్నాలో జిల్లా నేతలు ఎర్రిస్వామిరెడ్డి, చవ్వారాజశేఖరరెడ్డి,అధికార ప్రతినిధి సీపీ వీరన్న, ఏడీసీసీ బ్యాంకు చైర్మన్ లింగాల శివశంకర్‌రెడ్డి, నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి, పార్టీ నేత నదీమ్ అహ్మద్, ట్రేడ్‌యూనియన్ నాయకులు కొర్రపాటి హుస్సేన్‌పీరా, విద్యార్థి నేతలు సోమశేఖర్, బండిపరశురాం, కృష్ణవేణి, ప్రమీల, ఆలమూరు శ్రీనివాసరెడ్డి, మారుతీనాయుడు, మిద్దె భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: