కేంద్రాన్ని కదిలించిన జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కేంద్రాన్ని కదిలించిన జగన్

కేంద్రాన్ని కదిలించిన జగన్

Written By ysrcongress on Wednesday, December 21, 2011 | 12/21/2011

తక్షణమే పరిష్కరించాల్సిన ఏడు ప్రధాన అంశాలపై 3 పేజీల వినతిపత్రం
స్పందించిన కేంద్ర వ్యవసాయ మంత్రి.. 
నేడు అత్యవసర భేటీకి నిర్ణయం
మీరు కూడా వస్తే సమగ్రంగా చర్చిద్దామంటూ జగన్‌ను కోరిన పవార్
తిరుగుప్రయాణం రద్దు చేసుకున్న జగన్.. 
సమావేశం తర్వాత రేపు హైదరాబాద్‌కు

న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాతల కష్టాలపై కేంద్రం దృష్టి పడేలా చేయడంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సఫలమయ్యారు. ఈ అంశంపై మంగళవారం కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్‌ను కలిసిన సందర్భంగా ఆయన అన్నదాతల కడగండ్లను వివరిం చారు. అష్టకష్టాల మధ్య బతుకుపై భరోసా లేక సేద్యానికి కన్నీటి వీడ్కోలు పలుకుతున్న రైతన్నల వ్యథలను పూసగుచ్చినట్లు తెలిపారు. అది విని చలించిన పవార్ వెనువెంటనే స్పందించారు. అన్నదాతల కడగండ్లు, గోదాముల కొరతపై చర్చించడానికి బుధవారం సాయంత్రం అత్యవసర సమావేశం ఏర్పాటుచేశారు. ఇందులో పాల్గొనాలని ఆయన జగన్‌ను ఆహ్వానించారు.

20 నిముషాలకుపైగా భేటీ..

కష్టాల సుడిలో చిక్కుకున్న రాష్ట్ర రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సాయంత్రం 4 గంటలకు పార్లమెంట్‌లో పవార్‌ను కలిశారు. ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, సబ్బం హరి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం కన్వీనర్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి, రైతు విభాగం చిత్తూరు జిల్లా నాయకుడు కె.కేశవరెడ్డితో కలిసి ఆయన పవార్ కార్యాలయానికి వెళ్లి సమావేశమయ్యారు. రైతులకు గిట్టుబాటు ధరలు లభించడం లేదని, సేద్యం దుర్భరంగా మారిందని చెప్తూ మూడు పేజీల వినతిపత్రాన్ని పవార్‌కు అందజేశారు. అన్నదాతలు ఎదుర్కొంటున్న 7 ప్రధాన సమస్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఇందులో కోరారు. ఇరవై నిమిషాలకుపైగా జరిగిన సమావేశంలో పవార్‌కు జగన్ రాష్ట్ర రైతుల పరిస్థితులను కళ్లకు కట్టారు.

రైతాంగం చితికిపోతుంది..

ఇప్పుడున్న కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) గిట్టుబాటు కావడంలేదని, పోనీ ఉన్న ఎంఎస్‌పీ అయినా లభిస్తోందా అంటే అదీ లేదని, ఈ పరిస్థితుల్లో కేంద్రం తక్షణమే చర్యలకు దిగకపోతే ఆంధ్రప్రదేశ్‌లో రైతాంగం చితికిపోతుందంటూ పవార్ వద్ద జగన్ ఆవేదన వెలిబుచ్చారు. ఇతర రాష్ట్రాల్లో లేని ఎంఎస్‌పీ గిట్టుబాటు సమస్య ఆంధ్రప్రదేశ్‌లోనే ఎందుకు వస్తోందని ఈ సందర్భంగా పవార్ అడగ్గా.. జగన్ వాస్తవ పరిస్థితిని, క్షేత్రస్థాయి వాస్తవాలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ‘‘పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో ప్రభుత్వం నేరుగా రైతుల నుంచి ధాన్యం సేకరిస్తోంది. దాంతో రైతులకు ఎంఎస్‌పీ కచ్చితంగా లభిస్తోంది... ఆంధ్రప్రదేశ్‌లో అందుకు పూర్తి భిన్నంగా భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ) మిల్లర్ల నుంచి ధాన్యం సేకరిస్తోంది. రైతులేమో మిల్లర్లకు పంటను అమ్ముకోవాలి. గోదాముల్లో నిల్వలు భారీగా ఉండటంతో ఎఫ్‌సీఐ మిల్లర్ల నుంచి కొనుగోలు చేయడం లేదు. ఆ ప్రభావం రైతులపై పడింది. మిల్లర్ల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో రైతులు దిక్కుతోచక ఎంతోకొంతకు పంటను తెగనమ్ముకోవాల్సిన దుస్థితి దాపురించింది. ఫలితంగా ఎంఎస్‌పీకన్నా బాగా తక్కువకు ధర పడిపోయింది’’ అని జగన్ వివరించారు.

థామస్‌కు పవార్ ఫోన్...

రైతు కష్టాలను విన్న పవార్ వెంటనే స్పందించారు. జగన్ సమక్షంలోనే ఆహార, వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ కె.వి.థామస్‌కు ఫోన్‌చేసి ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాతల వెతలు, గోదాముల కొరత సమస్యలపై బుధవారం సాయంత్రం 5.30కు అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నానని, దీనికి హాజరుకావాలని కోరారు. సమావేశానికి రావాలంటూ ఎఫ్‌సీఐ చైర్మన్‌కు కూడా సమాచారం ఇవ్వాల్సిందిగా ఆయన థామస్‌కు చెప్పారు. అనంతరం పవార్.. జగన్‌తో మాట్లాడుతూ... ‘‘మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను. మీరూ రండి. అందరం కలిసి రాష్ట్ర సమస్యలపై సమగ్రంగా చర్చిద్దాం. అందరితోనూ మాట్లాడకుంటే ఈ సమస్యలు తేలవు’’ అని అన్నారు. ఆయన ఆహ్వానం మేరకు బుధవారం సాయంత్రం జరిగే సమావేశంలో జగన్‌మోహన్‌రెడ్డి బృందం పాల్గొని సమస్యలు, వాటి పరిష్కారాలపై సవివరంగా చర్చించనుంది. పవార్‌ను కలిసిన తర్వాత జగన్ పార్లమెంటు ఆవరణలో తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ.. సమస్యలపై పవార్ బాగా స్పందించారని, రాష్ట్ర రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. సహ మంత్రి థామస్, ఎఫ్‌సీఐ చైర్మన్‌తో సమావేశానికి తమను ఆహ్వానించినట్టు ఆయన చెప్పారు.

తిరుగు ప్రయాణం రద్దు..

వాస్తవానికి మంగళవారం సాయంత్రం పవార్‌ను కలిసిన తర్వాత జగన్ రాష్ట్రానికి తిరిగివెళ్లాలని అనుకున్నారు. పార్లమెంట్ నుంచే నేరుగా విమానాశ్రయానికి వెళ్లి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కావడానికి ఏర్పాట్లు కూడా అయ్యాయి. అయితే పవార్ తక్షణమే స్పందించి సమావేశం ఏర్పాటు చేసి.. దానికి రావాలని కోరడంతో జగన్ తిరుగు ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. ఆయనతోపాటు ఎంపీ మేకపాటి కూడా ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. పవార్ నిర్వహిస్తున్న సమావేశంలో పాల్గొన్నాక గురువారం ఉదయం జగన్, మేకపాటి రాష్ట్రానికి తిరిగివెళ్లనున్నారు.
Share this article :

0 comments: