వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి బోడ జనార్దన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి బోడ జనార్దన్

వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి బోడ జనార్దన్

Written By ysrcongress on Sunday, December 18, 2011 | 12/18/2011

26న పార్టీ సభ్యత్వం స్వీకరించనున్నట్టు వెల్లడి 
పార్టీలో చేరిన కొమురం భీం మనుమడు సోనేరావు

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు మాజీ మంత్రి, తెలుగుదేశం రెబెల్ నేత బోడ జనార్దన్ ప్రకటించారు. ఆయన శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకుని తన అభీష్టాన్ని తెలియజేశారు. ఆదిలాబాద్ జిల్లా తెలుగునాడు విద్యార్థి అధ్యక్షుడు తూముల నరేష్ కూడా జనార్దన్‌తోపాటు ఉన్నారు. భేటీ అనంతరం జనార్దన్ విలేకరులతో మాట్లాడుతూ జగన్‌ను తాను శనివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నానని, ఈ నెల 26న పార్టీ సభ్యత్వం తీసుకుంటానని తెలిపారు. ఇదిలా ఉండగా కొమురం భీం మనుమడు కొమురం సోనేరావు పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి చేతులమీదుగా శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. మరోవైపు నిజామాబాద్ మాజీ ఎంపీ కేశ్‌పల్లి గంగారెడ్డి కూడా జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా వీరి వెంట పార్టీ నేతలు బాజిరెడ్డి గోవర్ధన్, జనక్ ప్రసాద్, ఆదిలాబాద్ జిల్లా బోథ్ మాజీ ఎమ్మెల్యే సోయం బాబూరావు తదితరులున్నారు.

బాబుది వాడుకొని వదిలేసేతత్వం: జనార్దన్

చెప్పిన మాటకు, విలువలకు కట్టుబడి ఉండాలన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తత్వం చూసే తాను ఆ పార్టీలో చేరుతున్నట్టు బోడ జనార్దన్ తెలిపారు. తానే కాదు.. చాలామంది ప్రజాప్రతినిధులు, మాజీలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని చెప్పారు. శనివారం సాక్షి టీవీ చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జగన్ తన తండ్రి సమాధి వద్ద ప్రజలకిచ్చిన మాటకోసం కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఎదిరించి ప్రజల్లోకి వెళ్లారని, అందుకే ప్రజల్లో ఆయనకు అంతటి ఆదరణ ఉందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుది వాడుకొని వదిలేసే మనస్తత్వమని, కష్టంలో ఆదుకోవాలన్న ఆలోచన ఆయనకు ఉండదని జనార్దన్ అన్నారు. 

‘యూజ్ అండ్ త్రో’ అని బాబుకు ముద్దు పేరు ఉందన్నారు. చంద్రబాబు ద్వంద్వవైఖరి కారణంగానే ప్రజలు టీడీపీని అసహ్యించుకుంటున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయనే చంద్రబాబు తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని ప్రచారం చేసుకుంటున్నారని జనార్దన్ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వం చెప్పినట్టు ప్రతిపక్షం, ప్రతిపక్షం చెప్పినట్టు ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. ప్రభుత్వంతో కలిసి ప్రతిపక్షం పనిచేస్తే ప్రజాసమస్యలను ఎవరు పట్టించుకుంటారని ప్రశ్నించారు. అందుకోసమే జగన్ వైఎస్సార్ కాంగ్రెస్‌ను ఏర్పాటు చేయాల్సి వచ్చిందన్నారు. జగన్‌కు తోడుగా ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను తగ్గించి చూపాలన్న ఉద్దేశంతో సీఎంతో కుమ్మక్కై చంద్రబాబు అవిశ్వాస తీర్మానం పెట్టారు తప్పితే ఆయనకు రైతుల సమస్యలపై శ్రద్ధలేదని జనార్దన్ విమర్శించారు. రైతులకోసమే అవిశ్వాస తీర్మానం పెట్టిఉంటే తెలంగాణలో విద్యుత్ కోతలతో పంట ఎండిపోతుండడంపై గట్టిగా నిలదీసి ఉండేవారన్నారు.
Share this article :

0 comments: