కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలకు మరో నిదర్శనమిది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలకు మరో నిదర్శనమిది

కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలకు మరో నిదర్శనమిది

Written By ysrcongress on Saturday, December 24, 2011 | 12/24/2011

వారిపై అనర్హత వేటు పడకుండా తాత్సారం చేస్తూ కాంగ్రెస్ నాటకం
ఉప ఎన్నికలు జరిగితే ఘోర పరాభవం తప్పదని నేతల ఆందోళన
వెంటనే ఉప ఎన్నికలు వస్తే రైతాంగ సమస్యలపైనే చర్చ 
జరుగుతుందని కాంగ్రెస్ భయమంటున్న పరిశీలకులు

హైదరాబాద్, సాక్షి ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాలకు మరో నిదర్శనమిది. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు పడకుండా తాత్సారం చేయడం వెనుక ఉప ఎన్నికలను సాధ్యమైనంత ఆలస్యం చేయాలన్న దురుద్దేశం ఉన్నట్లు కనపడుతోంది. ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ పరిస్థితుల్లో ఉప ఎన్నికలు రాకూడదని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. పైగా, రైతు సంక్షేమాన్ని కోరుతూ వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసినందున, ఈ ఉప ఎన్నికల్లో రైతు సమస్యలపైనే ప్రధానంగా చర్చ జరుగుతుందని, అదే జరిగితే కాంగ్రెస్‌కు ఘోర పరాభవం తప్పదని వారు ఆందోళన చెందుతున్నారు. అందుకే ఈ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ వెంటనే స్పీకర్‌కు ఫిర్యాదు చేయకుండా కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగా తాత్సారం చేసింది. 

ఇప్పటికే ఖాళీగా ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలతో పాటు వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనూ ఉప ఎన్నికలు జరగకూడదన్న దురుద్దేశంతోనే కాంగ్రెస్ ఈ నాటకమాడిందన్న విమర్శలు వస్తున్నాయి. ఈనెల ఐదో తేదీ అర్ధరాత్రి శాసన సభలో అవిశ్వాసంపై ఓటింగ్ జరిగింది. స్పీకర్ సాక్షిగా వైఎస్సార్ అభిమాన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ జారీ చేసిన విప్‌ను ఉల్లంఘించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఆరోజు అసెంబ్లీ సమావేశం ముగిసేసరికి అర్ధరాత్రి అయినందున, వీరిపై వెంటనే కాకపోయినా, మరుసటి రోజయినా కాంగ్రెస్ ఫిర్యాదు చేసి ఉండాల్సింది. ఈ ఎమ్మెల్యేలపై ఫిర్యాదుకు వేరే సాక్ష్యాలు కూడా అవసరంలేదు. అయినా కాంగ్రెస్ పార్టీ కావాలనే అనర్హత పిటిషన్ దాఖలు చేయకుండా వారం రోజులు తాత్సారం చేసింది. తాపీగా 12వ తేదీ రాత్రి 8 గంటలకు ఆ 16మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. వెంటనే అనర్హత పిటిషన్ దాఖలు చేసి స్పీకర్ చర్య తీసుకొని ఉంటే, ఖాళీగా ఉన్న ఏడు స్థానాలతో పాటే 16 నియోజకవర్గాలకూ ఉప ఎన్నికలు వస్తాయని కాంగ్రెస్ భయపడటమే దీనికి కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

రాష్ట్రంలో రైతు సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. వెంటనే అనర్హత వేటు పడి, ఉప ఎన్నికలు వచ్చి ఉంటే రైతాంగ సమస్యలపై చర్చ జరగడంతో పాటు ప్రభుత్వ డొల్లతనం బయటపడుతుందని, దాని నుంచి తాత్కాలికంగా తప్పించుకోవడానికి అనర్హత పిటిషన్‌ను ఆలస్యం చేశారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ‘‘మామూలు సందర్భాల్లో అనర్హత పిటిషన్ దాఖలు చేయడానికి ఆధారాలు కావాలి. కానీ, ఇక్కడ ఆ పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు విప్ ఉల్లంఘించడం స్వయంగా స్పీకర్ చూశారు. శాసన సభ రికార్డుల్లోనూ అది నమోదైంది. అందువల్ల వెంటనే ఫిర్యాదు చేసి ఉండాల్సింది’’ అని శాసన వ్యవహారాల్లో అనుభవం కలిగిన ఓ న్యాయ నిపుణుడు వ్యాఖ్యానించారు. వెంటనే ఎన్నికలు రాకుండా ఉండేందుకే కాంగ్రెస్ ఈ వ్యూహం పన్నినట్లు కనిపిస్తోందని ఆయన అన్నారు. ఫిబ్రవరిలో ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటే ఈ 16 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు రావడం అనివార్యమనే విషయాన్ని గుర్తించే కాంగ్రెస్ కావాలని కాలయాపన చేసిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఓ రకంగా చూస్తే కాంగ్రెస్ ఎన్నికలకు భయపడినట్లేనని కూడా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Share this article :

0 comments: