వరికి ‘మద్దతు’ పెంచండి: జగన్‌ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వరికి ‘మద్దతు’ పెంచండి: జగన్‌

వరికి ‘మద్దతు’ పెంచండి: జగన్‌

Written By ysrcongress on Wednesday, December 21, 2011 | 12/21/2011

ఆంధ్రప్రదేశ్ రైతుల కష్టాల ప్రస్తావన

న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ)ను పెంచాల్సిన అవసరాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పార్లమెంట్‌లో లేవనెత్తారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు హాజరవుతున్న జగన్ మంగళవారం లోక్‌సభలో 377వ నిబంధన కింద ఎంఎస్‌పీ అంశాన్ని ప్రస్తావించారు. ‘‘ఇది నా రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన నిర్దిష్ట ప్రస్తావన. అక్కడ రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయన్న వార్తలను మనం చూస్తున్నాం. కరువు, వరదలు వచ్చినపుడు తగిన సహాయ ప్యాకేజీలను అమలుచేయడంలో వైఫల్యం, సరిపోని కనీస మద్దతు ధర, ఎంఎస్‌పీ అమలు చేయకపోవడం, విత్తనాలు, కాంప్లెక్స్ ఎరువుల్లాంటి ఇన్‌పుట్ ఖర్చులు అసాధారణంగా పెరిగిపోవడం, నాణ్యమైన విత్తనాలు దొరక్కపోవడం, విశ్వసించదగ్గ పంటల బీమా పథకం లేకపోవడం, దిగుబడి అనంతర సౌకర్యాలు కొరవడటం.. వంటివి రైతుల నిరాశా నిస్పృహలకు కారణాలుగా కనిపిస్తున్నాయి. దేశంలోనే మొట్టమొదటి సారిగా మా రాష్ట్రంలో రైతులు సాగు సమ్మెకు దిగారు. ఎంఎస్‌పీ చెల్లింపు, ఎంఎస్‌పీ పెంపులో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ వారు క్రాప్ హాలిడే ప్రకటించారు. రైతులకు భారీమొత్తంలో పంట నష్టాలు వస్తుండటంతో వారు వ్యవసాయ కూలీ లకు తగిన కూలీ కూడా ఇవ్వలేకపోతున్నారు. ఫలితంగా కూలీల పరిస్థితి కూడా అధ్వానంగా మారింది’’ అని ఆయన రాష్ట్ర సాగు రంగ దుస్థితిని సభ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. రైతుల సమస్యలను సత్వరమే పరిష్కరించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
స్లిప్పులు సమర్పించాలని కోరిన ఫ్రాన్సిస్కో..

నిబంధన 377 కింద సమస్యలను ప్రస్తావించడానికి అనుమతించిన సభ్యులందరూ వాటిని లేవనెత్తే అవకాశం స్పీకర్ ఇవ్వలేని పరిస్థితి ఒక్కోసారి ఏర్పడుతుంటుంది. ఇలాంటప్పుడు స్పీకర్ కానీ, సభాపతి స్థానంలో ఉన్న ఎవరైనా కానీ వాటిని సభలో ప్రస్తావించినట్టుగానే పరిగణించడానికి స్లిప్పులు సమర్పించాలని సభ్యులను కోరతారు. మంగళవారం కూడా సమయాభావం వల్ల సభలో అనేకమంది సభ్యులకు స్వయంగా సమస్యలను ప్రస్తావించే వీలు దొరకలేదు. స్పీకర్ స్థానంలో ఉన్న ఫ్రాన్సిస్కో సర్డిన్హా సూచన మేరకు జగన్ సహా పలువురు సభ్యులు స్లిప్పులు అందజేశారు. వీరందరి ప్రస్తావనలను సభలో లేవనెత్తిన అంశాలుగానే పరిగణించి రికార్డుల్లో చేర్చారు.
Share this article :

0 comments: