రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం.. నిస్పృహలో అన్నదాత - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం.. నిస్పృహలో అన్నదాత

రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం.. నిస్పృహలో అన్నదాత

Written By ysrcongress on Friday, December 23, 2011 | 12/23/2011

గత ఖరీఫ్‌లో 53 లక్షల ఎకరాల్లో పూర్తిగా దెబ్బతిన్న పంట
ఇందులో కరెంటు కోత వల్లే 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం
రబీలో ఇప్పటికి 50 శాతం విస్తీర్ణంలోనూ సాగు కాని దుస్థితి
రుణాల లక్ష్యం రూ. 10,700 కోట్లు.. ఇచ్చింది రూ. 3,457 కోట్లే
25 లక్షల మంది కౌలు రైతులుండగా, 5.46 లక్షల మందికే రుణ అర్హత కార్డుల పంపిణీ.. ఇచ్చిన రుణాలూ స్వల్పమే
రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం.. నిస్పృహలో అన్నదాత

‘‘ఆంధ్రప్రదేశ్ భారత దేశపు ధాన్యాగారమూ.. అన్నపూర్ణ..’’.. చిన్నప్పుడు పుస్తకాల్లో మనం ఇదే విషయాన్ని చదువుకున్నాం.. ఇప్పుడు మన పిల్లలూ ఇదే విషయాన్ని చదువుకుంటున్నారు.. పాఠ్య పుస్తకంలో పదాలు కించిత్తు కూడా మారలేదు. బయట రైతన్న బతుకు మాత్రం గత రెండేళ్లలో చాలా మారిపోయింది. సాగు సంక్షోభంలో చిక్కుకుంది. వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో రాజులా బతికిన రైతన్న.. వ్యవసాయం దండగన్న చంద్రబాబు హయాం నాటి దుర్భర పరిస్థితులను ఇప్పుడు చవిచూస్తున్నాడు. ప్రకృతే కాదు.. ప్రభుత్వమూ దగా చేయడంతో అందరికీ అన్నం పెట్టే అన్నదాత నోట్లోకే ఐదు వేళ్లూ పోని పరిస్థితి నెలకొంది. గిట్టుబాటు ధర సంగతి పక్కనపెడితే.. సర్కారు నిర్లక్ష్యం పుణ్యమాని కనీస మద్దతు ధర కూడా దక్కడం లేదు. వందల ఏళ్ల నుంచీ వ్యవసాయం చేస్తున్నా ఏనాడూ విరామమెరుగని రైతన్న.. చరిత్రలో తొలిసారిగా లక్ష ఎకరాల్లో సాగుకు విరామమిచ్చాడు. అటు రైతుకు బాసటగా మహానేత స్ఫూర్తితో 17 మంది వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు సైతం తమ పదవులను తృణప్రాయంగా తలిచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో నినదించినా గుడ్డి సర్కారు కళ్లు తెరవలేదు. రైతుకీ దుస్థితి ఏమిటి? అప్పుల భారం మోయలేక.. పంట చేలోనే ప్రాణాలు తీసుకోవాల్సిన అగత్యమేమిటి?


హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో వ్యవసాయ రంగం మళ్లీ సంక్షోభంలో చిక్కుకుంది. గడిచిన రెండేళ్లలో ఇటు ప్రకృతి, అటు ప్రభుత్వ చేతకానితనం రైతన్న నడ్డివిరిచాయి. 2009-10లో దుర్భర కరువు, గతేడాది అధిక వర్షాలు, వరదలతో సర్వం నష్టపోయిన అన్నదాతను ఈ ఏడాది కష్టాలు కరెంటు కోతల రూపంలో కాటేశాయి. ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. వ్యవసాయం ఆధారపడ్డ 1,076 మండలాలకు గాను 865 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించి చేతులు దులిపేసుకుంది. సాయం సంగతే మరిచింది. ఓవైపు కరెంటు కోతలు, మరోవైపు వర్షాలు ముఖం చాటేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్‌లో 53 లక్షల ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతింది. ఇలా జరగడం రాష్ట్ర చరిత్రలోనే ఓ రికార్డు. అందులోనూ ఒక్క కరెంటు కోత వల్లే 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వ గణాంకాలే పేర్కొంటున్నాయి. దీంతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు నష్టపోయిన మొత్తం రూ.10 వేల కోట్లు!

పంట రుణం.. పగటి కలే..


ఇక రైతులకు పంట రుణం అన్నది ఓ కలే. ఎందుకంటే.. ఇప్పటివరకూ ఎన్నడూ పంట రుణం తీసుకోని రైతులే రాష్ట్రంలో 30 లక్షల మంది దాకా ఉన్నారు. అక్టోబర్‌లో ప్రారంభమైన రబీ నుంచి రైతులకు రూ.లక్ష వరకూ వడ్డీ లేని రుణాలిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఆర్థిక భారం పడుతుందనే ఉద్దేశంతో పంట రుణాల పంపిణీ విషయంలో బ్యాంకులను కదిలించలేకపోతోంది. రబీలో రూ.10,700 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికి 32 శాతం(రూ.3,457 కోట్లు) మాత్రమే ఇచ్చారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయం. రాష్ట్రంలో 25 లక్షల మంది కౌలు రైతులు ఉన్నట్లు ప్రభుత్వమే చెబుతోంది. రుణ అర్హత కార్డులను 5,46,131 మందికే పంపిణీ చేశారు. రబీలో ఇప్పటివరకూ 50,785 మంది కౌలు రైతులకు రూ.78.97 కోట్ల రుణాలిచ్చారు. గతేడాది రబీలో పంట నష్టపోయిన రైతులకు ఇవ్వాల్సిన బీమా పరిహారాన్ని ఏడాదైనా ఇప్పటికీ మంజూరు చేయలేదు. ఇటు ప్రభుత్వ రుణాలు దొరకక.. అటు ప్రైవేటు అప్పుల భారం మోయలేక గత రెండేళ్లలో వందలాది మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరోవైపు ఖరీఫ్‌లో పంటలు వేశాక వాటిని ఎండబెట్టిన సర్కారు ఇప్పుడు రబీలోనూ నాట్లు, విత్తనాలు వేసే సమయంలోనే అడ్డగోలుగా కరెంటు కోతలు విధిస్తోంది. డెల్టాలో సైతం నీరివ్వలేమంటూ చేతులెత్తేసింది. దీంతో రబీలో కోటి ఎకరాలు సాగు కావాల్సి ఉండగా రైతుల వద్ద పెట్టుబడి లేకపోవడంతో 50% విస్తీర్ణంలో కూడా సాగు కాని పరిస్థితి నెలకొంది. 

పెట్టుబడి మరింత భారం: అటు ఎరువులు, విత్తనాల ధరలు అమాంతం పెరిగి.. పెట్టుబడి వ్యయం ఆకాశాన్ని తాకింది. కేంద్రం 2010 ఏప్రిల్ నుంచి అమల్లోకి తెచ్చిన షోషకాల ఆధారిత సబ్సిడీ ఎరువుల విధానం సాగును మరింత భారంగా మార్చేసింది. కంపెనీలకు అనుకూలంగా ఉన్న ఈ విధానంతో ఎరువుల ధరలు నెలకోసారి పెరుగుతున్నాయి. యూరియా మినహా అన్ని ఎరువుల ధరలు రెట్టింపయ్యాయి. ఒక్కో ఎరువు బస్తా కోసం రైతులు పోలీసుల దెబ్బలు తింటూ రోజుల తరబడి దుకాణాల ముందు పడిగాపులు కాయాల్సిన దుస్థితి. కేంద్రం డీజిల్ ధరలనూ భారీగా పెంచేయడంతో దుక్కుల కోసం ఉపయోగించే ట్రాక్టర్ బాడుగ ఖర్చు ఏడాదిలోనే రెట్టింపైంది. ఇటు రాష్ట్ర సర్కారు కూడా.. పత్తి విత్తనాల ప్యాకెట్ ధరను రూ.750 నుంచి 930కి పెంచింది. సబ్సిడీ వేరుశనగ విత్తనాల ధరను రూ.2,500 నుంచి రూ.3,500కు పెంచేసింది. శనగ విత్తనాల ధర గతేడాది క్వింటాల్ రూ.2,250 ఉంటే రూ.5,200కు పెంచారు. 

వ్యవసాయం దండగ నుంచి పండగ దాకా..

టీడీపీ అధినేత చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో రైతులు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. విద్యుత్ బిల్లులు చెల్లించని రైతులపై కేసులు పెట్టి.. జైల్లో పెట్టించిన ఘనత ఆయనది. 1996 సెప్టెంబరు 3న పశ్చిమ గోదావరి జిల్లా కాల్దరిలో నీటి తీరువా, విద్యుత్ చార్జీల పెంపుపై నిరసన వ్యక్తం చేసినందుకు అన్నదాతలపైనే కాల్పులు జరిపించారు. ఇద్దరిని బలితీసుకున్నారు. ఇక బషీర్‌బాగ్ కాల్పుల ఘటన సంచలనం సృష్టించింది. 2000 సంవత్సరంలో కరెంటు చార్జీల పెంపును ప్రశ్నిస్తూ.. బషీర్‌బాగ్‌లో నిరసన ప్రదర్శన చేస్తున్న వారిపై కర్కశంగా కాల్పులు జరిపించారు. ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించారు. బాబు హయాంలో రైతన్న జీవితంలో వెలుగే కరువైంది. అలాంటి పరిస్థితుల్లో వైఎస్ అధికారాన్ని చేపట్టారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, కరెంటు బకాయిల మాఫీ, జలయజ్ఞం, పంట రుణాల మాఫీ, మద్దతు ధర పెంపు, గ్రామం యూనిట్‌గా బీమా వంటి పథకాలతో అన్నదాతలకు కొత్త వెలుగునిచ్చారు. దండగన్న వ్యవసాయాన్ని పండుగలా మార్చారు. 

దేశానికి సబ్సిడీ ఇస్తున్న రైతు... 

ప్రపంచంలో ఎక్కడైనా ఆహార భద్రత కోసం ప్రభుత్వాలు అన్నదాతలకు సబ్సిడీలు ఇస్తుంటాయి. వ్యవసాయం జీవన విధానంగా ఉన్న మన దేశంలో మాత్రం దీనికి విరుద్ధంగా జరుగుతోంది. రైతు కొవ్వొత్తిగా కరిగిపోతూ.. తాను పండించిన పంటను పెట్టుబడి వ్యయం కంటే తక్కువగా ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరకు(ఎంఎస్‌పీ) అమ్ముకుంటున్నాడు. తద్వారా తాను నష్టపోయిన మొత్తాన్ని దేశానికి సబ్సిడీగా ఇస్తున్నాడు. ఇలా ఇస్తూ.. ఇస్తూ.. సంక్షోభంలోకి కూరుకుపోతున్నాడు. ఫలితంగా కేవలం వరి, గోధుమ, చక్కెర, పత్తి వంటి నాలుగు ప్రధాన పంటలతోనే దేశ వ్యాప్తంగా రైతులు ఏటా రూ.లక్ష కోట్లు నష్టపోతున్నారు. అన్ని పంటలు కలిపితే ఈ మొత్తం రూ.3 లక్షల కోట్లు ఉంటుంది. రాష్ట్రంలోని అన్నదాత ఇలా రూజ50 వేల కోట్లు నష్టపోతున్నాడు. అటు ప్రభుత్వాలు కూడా రైతులకు ఆసరాగా నిలవాల్సింది పోయి.. మార్కెట్‌లో డిమాండ్, సరఫరా సూత్రాలపై ఆధారపడి శాస్త్రీయత కొరవడిన లెక్కలతో పెట్టుబడి ఖర్చు కంటే తక్కువగా కనీస మద్దతు ధరను నిర్ణయిస్తున్నాయి. ఇక ప్రభుత్వం కనీస మద్దతు ధరలు ప్రకటించని మిరప, పసుపు, ఉల్లి పంటల సాగు మన రాష్ట్రంలో చాలా ఎక్కువ. ఈ మూడు పంటల విస్తీర్ణం రాష్ట్ర సాగు విస్తీర్ణంలో 15 శాతం వరకు ఉంటోంది. ప్రభుత్వం ఈ పంటలకు ఎంఎస్‌పీ ప్రకటించకపోవడంతో రైతులు భారీగా నష్టపోతున్నారు. గతేడాది క్వింటాల్ రూ.18 వేలు పలికిన పసుపు ధర ఇప్పుడు రూ.3 వేలకు పడిపోయింది. అలాగే మిరప రైతులకు గతేడాది క్వింటాల్‌కు రూ.9 వేలు రాగా ఇప్పుడు రూ.4 వేలు రావడం కష్టంగా మారింది. ఉల్లి రైతుల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. గతేడాది ఇదే సమయానికి ఉల్లి రైతులకు క్వింటాల్‌కు రూ.4 వేలు రాగా ఇప్పుడు కేవలం రూ.400కు పడిపోయింది. పొగాకు రైతుల పరిస్థితీ ఇలాగే ఉంది. 

శాస్త్రీయత లోపించింది..

కరువు మండలాల ప్రకటన శాస్త్రీయంగా లేదు. ఆయకట్టు ప్రాంతాలను కూడా కరువుగా ప్రకటించారు. వర్షపాతం, పంటల సాగు, దిగుబడి తగ్గుదల అంశాలను పట్టించుకోలేదు. ఇప్పుడు పరిహారం అందించే విషయంలో జాప్యం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రతి మండలానికి రూ.10 కోట్ల తక్షణ నిధిని మంజూరు చేయాలి. పంట ఎండిపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు చొప్పున పరిహారం ఇవ్వాలి. పంట రుణాలు మాఫీ చేయాలి. ప్రైవేటు అప్పులపై మారటోరియం ప్రకటించాలి. జాబ్ కార్డుదారులందరికీ ఉన్న ఊళ్లోనే ఉపాధి కల్పించాలి.
- కె.రామకృష్ణ, అధ్యక్షుడు, ఏపీ రైతు సంఘం.

గిట్టుబాటు దక్కితేనే...

వరుసగా నాలుగైదేళ్లు మంచి పంట పండినా ఒక్క సీజనులో విపత్తు వస్తే తట్టుకునే పరిస్థితి లేకపోవడం.. వ్యవసాయరంగ సంక్షోభ పరిస్థితిని తెలియజేస్తోంది. పండిన పంటకు గిట్టుబాటు ధర వస్తేగానీ ఈ దుస్థితి మారదు. ఒక్క ఏడాది కరువుతోనే మళ్లీ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. మన రాష్ట్రంలోని అన్నదాతలకు రుణ భారమే పెద్ద సమస్య. బ్యాంకులు వ్యవసాయరంగానికి ఇస్తున్న రుణాలు కచ్చితంగా ఎంతనేది ఎవరికీ అర్థం కావడంలేదు. కౌలు రైతులకు రుణాలపై సర్కారు విధానం సరిగా లేదు. చిత్తశుద్ధితో వరుసగా కొన్నేళ్లపాటు వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తేనే సరైన ఫలితం ఉంటుంది. 
-ఇ.రేవతి, ప్రొఫెసర్, కాకతీయ విశ్వవిద్యాలయం
Share this article :

0 comments: