తెలంగాణ కోసం రాజీనామా చేసిన వారిపై పోటీ పెట్టం - జగన్మోహన రెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తెలంగాణ కోసం రాజీనామా చేసిన వారిపై పోటీ పెట్టం - జగన్మోహన రెడ్డి

తెలంగాణ కోసం రాజీనామా చేసిన వారిపై పోటీ పెట్టం - జగన్మోహన రెడ్డి

Written By ysrcongress on Friday, December 30, 2011 | 12/30/2011

 ఉప ఎన్నికలలో తమ పార్టీ మొత్తం 18 స్థానాల్లో పోటీ చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి చెప్పారు. ఉప ఎన్నికలలో తమ పార్టీ అనుసరించే విధానాలను ఆయన ఈరోజు తెలిపారు. రైతుల కోసం విప్ ని ధిక్కరించిన ఎమ్మెల్యేలే తమ పార్టీ అభ్యర్థులని ఆయన ప్రకటించారు. రాజీనామా చేసిన ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి తమ పార్టీ తరపున పోటీ చేస్తారని చెప్పారు. టిడిపి కుమ్మక్కు విధానాలను వ్యతిరేకిస్తూ రాజీనామా చేసిన ప్రసన్న కుమార్ రెడ్డి కూడా తమ పార్టీ తరపున పోటీ చేస్తారని తెలిపారు. 

తెలంగాణ కోసం రాజీనామా చేసిన వారిపై పోటీ పెట్టం అని ఆయన స్సష్టం చేశారు. బలమైన ఆకాంక్షతో వారు పదవులు వదులుకున్నందున వారిని గౌరవించాలని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు. 

అకాల మరణం చెందిన మహబూబ్ నగర్ ఎమ్మెల్యే రాజేశ్వర రెడ్డి సతీమణిని వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయమని కోరుతున్నామని చెప్పారు. ఒక వేళ ఆమె వేరే పార్టీ నుంచి పోటీ చేసినా, ఆమెపై పోటీ పెట్టం అని జగన్ స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగే అవకాశాలున్న 24 శాసనసభా నియోజకవర్గాలకు గాను తమ పార్టీ 18 స్థానాల్లో పోటీ చేస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించారు. ప్రత్యేక రాష్ట్రం కావాలన్న ఆకాంక్షతో తమ పదవులకు రాజీనామా చేసిన తెలంగాణ ప్రాంత మాజీ ఎమ్మెల్యేల స్థానాల్లో తమ పార్టీ పోటీ చేయకూడదని కూడా నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. తామిచ్చిన పిలుపు మేరకు విప్‌ను ధిక్కరించిన 16 మంది కాంగ్రెస్, ఒక పీఆర్పీ ఎమ్మెల్యేలు, టీడీపీ అనుసరిస్తున్న కుమ్మక్కు విధానాలకు నిరసనగా తమ పార్టీలో కలిసిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డితో కలిపి 18 మందిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దింపుతుందని ఆయన శుక్రవారం రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. 

మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేగా ఉంటూ మృతి చెందిన ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి సతీమణిని తమ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలని జగన్ ఆహ్వానించారు. అలా కాక ఆమె ఏ పార్టీ తరపున పోటీ చేసినా వ్యతిరేకంగా తాము అభ్యర్థిని పెట్టబోమని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో తమ పార్టీ వైఖరిని వివరిస్తూ జగన్ విడుదల చేసిన ప్రకటన పూర్తి పాఠం కింది విధంగా ఉంది. 

‘ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా 24 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఉప ఎన్నికలు రావడానికి కారణమైన నేపథ్యమేమిటో మీకు తెలియనిది కాదు. అయినా ఒక రాజకీయ పార్టీగా మేము అనుసరించాల్సిన వైఖరిని వెల్లడించడానికి ముందు ఈ నేపథ్యాన్ని మీకు మరోసారి గుర్తు చేయాలనుకుంటున్నాము. రైతుల పట్ల, వ్యసాయం పట్ల, పేదవాడి పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అలక్ష్య వైఖరికి నిరసనగా 16 మంది కాంగ్రెస్ సభ్యులు, ఒక పీఆర్పీ సభ్యురాలు మొన్నటి అవిశ్వాసతీర్మానానికి మద్దతుగా ఆ పార్టీల విప్‌లను ధిక్కరించి ఓటేశారు. 

శాసనసభ సాక్షిగా ఆ సభ్యులు పార్టీ విప్‌ను ధిక్కరించారు. కనుక సహజంగానే వారు ఎమ్మెల్యే సభ్యత్వాలకు అనర్హులు కాబోతున్నారు. విప్‌ను ధిక్కరించాల్సినంత కఠిన నిర్ణయం ఆ సభ్యులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో కూడా మీకు తెలియని విషయం కాదు. గత రెండేళ్లుగా వ్యవసాయరంగం ఎంతటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోందో మనందరం చూస్తూనే ఉన్నాం. పెట్టుబడులు మూడింతలయ్యాయి. రాబడులు మూడోవంతు కన్నా పడిపోయాయి. దానికి తోడు కరువు, తుఫానులు, ప్రభుత్వ నిష్క్రియాపరత్వం, అన్నదాత రోడ్డున పడ్డ పరిస్థితి. 

వరి వేసుకోవడం కంటే ఉరివేసుకోవడం మేలన్న నానుడి జన జీవితంలోకి వచ్చింది. వేల సంవత్సరాల వ్యవసాయ సాగు చరిత్రలో మొట్టమొదటి సారిగా ఈ రాష్ట్రంలో రైతు వ్యవసాయానికి సెలవు ప్రకటించాడు. రైతు సమ్మె ప్రకటించాడు. రైతు వీధిన పడ్డాడు. మరి రైతు మీదే ఆధారపడ్డ కూలీల పరిస్థితి ఏమిటి పొట్ట చేతబట్టుకుని వలసల బాట పట్టాల్సిన దుర్భర స్థితి. ఈ పరిస్థితి మారాలనీ, రైతును నిలబెట్టాలనీ, మద్దతు ధర పెంచాలనీ, ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని, ఎరువుల ధరలు తగ్గించాలనీ నష్టపోయిన రైతుకు పరిహారం చెల్లించాలనీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎన్నో ఆందోళనలు , దీక్షలు నిర్వహించాం. ఈ సర్కారు స్పందించ లేదు. 

మా పోరాటం చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లయింది. ఇక ఈ జనకంటక సర్కార్‌ను కూలదోస్తే తప్ప రైతుకు ముక్తి లేదన్న నిర్ణయానికి మా పార్టీ వచ్చింది. అధికార పక్షంతో అంటకాగుతూ ప్రతిపక్ష మోదానే కళంకితం చేస్తున్న టీడీపీ పార్టీకి సవాల్ విసిరాం. మీకు నిజాయితీ ఉంటే, దమ్ముంటే అధికాపక్షంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని కోరాం. మొదట ఆ సవాల్‌ను టీడీపీ స్వీకరించలేదు. వెన్ను చూపింది. మోసగించింది ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టడమే తమ ధ్యేమన్నట్లు ప్రవర్తించింది. చిరంజీవి గారీ పార్టీ విలీనం అవడంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోదు అన్న నిర్థారణకు వచ్చిన తరువాత చంద్రబాబు గారు కాంగ్రెస్ పెద్దలతో కుయుక్తులు పన్నారు. 

అవిశ్వాసం పెట్టాలని మా పార్టీ పదే పదే డిమాండ్ చేయడం, మరో పక్క జనంలో కాంగ్రెస్ -టీడీపీ కుమ్మక్కయ్యాయన్న అభిప్రాయం బయటపడడంతో ఆ పార్టీలు వ్యూహాన్ని మార్చాయి. కాంగ్రెస్ పార్టీ తన శాసనసభ్యులు ఎవరూ వ్యతిరేకంగా ఓటు వేయకుండా నయాన భయాన మచ్చిక చేసుకొని, కొందరిని భయపెట్టి, కొందరికి పదవులు, కొందరికి ప్యాకేజీలు ప్రవహింపజేసి ఇక భయం లేదనుకొన్న తరువాత టీడీపీకి కనుసైగ చేసింది. ఆ సైగకు స్పందించిన టీడీపీ మొక్కుబడిగా అవిశ్వాసం పెట్టింది. చర్చ సందర్భంగా, అవిశ్వాసానికి మద్దతుగా కాంగ్రెస్ సభ్యులెవరూ ఓటు వేయకుండా ఉండాలని రైతు సమస్యల్ని పక్కన బెట్టి, చనిపోయి రెండున్నరేళ్లు అయినా వైఎస్సార్‌పై నీచమైన విమర్శలకు దిగింది. 

ఇన్ని రకాల ఇబ్బందులూ, బెదిరింపులు ఎదురైనా, శాసనసభ్యత్వం రద్దు కాబోతోందని తెలిసినా, రైతులు కన్నీరు కార్చడం రాష్ట్రానికి అరిష్టం అని భావించి, రైతుల కోసం, పేదవాటి కోసం, విలువల కోసం, విశ్వసనీయత కోసం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపునకు స్పందించి 16 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఒక పీఆర్పీ ఎమ్మెల్యే అవిశ్వాసానికి మద్దతుగా ఓటేసి అపూర్వ త్యాగనిరతిని చాటిన విషయం మీరంతా గమనించారు. అలాగే మరో సభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి టీడీపీ తరపున ఎన్నికైనా రైతు రాజ్యం కోసం, వైఎస్సార్ సంక్షేమ పాలన కోసం, టీడీపీ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మరో నియోజకవర్గంలో ఇండిపెండెంట్‌గా ఎన్నికై కాంగ్రెస్ అనుబంధ సభ్యునిగా కొనసాగిన రాజేశ్వర్‌రెడ్డి దురదృష్టవశాత్తూ అకాల మృత్యువు పాలయ్యారు. 

మరో ముగ్గురు టీడీపీ సభ్యులు, ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని ఒక బలమైన కాంక్షతో వారు ఇంత వరకూ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల శాసనసభ్యత్వాలను వదులుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మా పార్టీ ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వైఖరిపై ఒక నిర్ణయానికి వచ్చాము. మా పార్టీ పిలుపు మేరకు విప్‌ను ధిక్కరించిన 16 మంది కాంగ్రెస్, ఒక పీఆర్పీ ఎమ్మెల్యే, అలాగే టీడీపీ అనుసరిస్తున్న కుమ్మక్కు విధానాలకు నిరసనగా మా పార్టీతో కలిసిన ప్రసన్నకుమార రెడ్డి మొత్తం 18 మంది మా పార్టీ తరపున రంగంలోకి దిగుతారు. 
అలాగే తెలంగాణ కోసం రాజీనామా చేసిన వారు అంతకుముందు వరకు ఆయా నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేలు, ఒక బలమైన ఆకాంక్షతో పదవులు వదులుకున్నారు కాబట్టి వారిని గౌరవించాలన్నది, వారు ఏ పార్టీ తరపున రంగంలోకి దిగినా పోటీ పెట్టరాదన్నది మా నిర్ణయం. స్వార్థపూరిత, అవకాశవాద రాజకీయాలకు దూరంగా ఉండే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ సూత్రబద్ధ, నైతిక నిర్ణయాన్ని ప్రజాశ్రేణులు హర్షిస్తాయన్నది మా విశ్వాసం.’ అని జగన్ తన ప్రకటనను ముగించారు. 
Share this article :

0 comments: