ఐదు రాష్ట్రాల్లో ..ఎన్నికల నగారా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఐదు రాష్ట్రాల్లో ..ఎన్నికల నగారా

ఐదు రాష్ట్రాల్లో ..ఎన్నికల నగారా

Written By ysrcongress on Sunday, December 25, 2011 | 12/25/2011

 ఉత్తరప్రదేశ్‌లో ఏడు విడతల్లో పోలింగ్.. 
మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా 
శాసనసభలకు ఒకే విడతలో
జనవరి 28న మణిపూర్‌తో మొదలై.. మార్చి 3న గోవాతో ముగియనున్న పోలింగ్.. 
మార్చి 4న ఐదు రాష్ట్రాల ఫలితాలు
శనివారం నుంచే అమల్లోకి ఎన్నికల నియమావళి
అభ్యర్థుల వ్యయంపై నిఘా.. ప్రతి అభ్యర్థీ ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరవాలని నిబంధన..

న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి, ఆమె తనయుడు రాహుల్ గాంధీకి, ముఖ్యమంత్రి మాయావతికి అత్యంత ప్రతిష్టాత్మకమైన.. వీరందరూ ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. బహుజన్ సమాజ్‌వాది పార్టీ అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఏడు దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది. దీంతోపాటు మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. ఈ రాష్ట్రాలన్నింటిలో ఒకే విడతలో ఎన్నికలు పూర్తవుతాయి. వీటిలో రెండింట(గోవా, మణిపూర్) ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్- బీజేపీ కూటమి, ఉత్తరాఖండ్‌లో బీజేపీ అధికారంలో ఉంది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న అన్నా హజారే.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఆ ప్రభావం కచ్చితంగా ఉంటుందని పరిశీలకుల అంచనా.

మరోవైపు ఈ ఎన్నికల్లో నోటుతో ఓటు దండుకోవాలనుకునే నేతలకు, మీడియాకు డబ్బులు వెదజల్లి వార్తల రూపంలో ప్రచారం చేసుకోవాలనుకునే నాయకులకు చెక్ పెట్టే ప్రత్యేక చర్యలకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. నాయకులు వెధవ్వేషాలేస్తే ఓటర్లు ఫిర్యాదు చేయడానికి 24 గంటలపాటు పనిచేసే ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్‌నూ ప్రవేశపెడుతున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్.వై.ఖురేషీ వెల్లడించారు. శనివారం ఢిల్లీలో షెడ్యూలు విడుదల చేసిన సందర్భంగా ఖురేషీ విలేకరులతో మాట్లాడారు. మణిపూర్‌లో జనవరి 28న మొదలయ్యే ఈ ఎన్నికలు.. గోవాలో మార్చి 3న జరిగే పోలింగ్‌తో ముగుస్తాయన్నారు. ఆ మరుసటి రోజే అన్ని రాష్ట్రాల ఫలితాలు ప్రకటిస్తామన్నారు. ఫిబ్రవరి నెలాఖరులో ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్, కేంద్ర బడ్జెట్‌ల ప్రభావం ఎన్నికలపై పడకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ఓ ప్రశ్నకు బదులుగా చెప్పారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి శనివారం నుంచి అమల్లోకి వస్తుందని, మార్చి 9న ఎన్నికల నిర్వహణ క్రతువు ముగుస్తుందని వివరించారు.

ఈవీఎంలకు పేపర్ బ్యాకప్ లేనట్లే: ఈ సారి ఎన్నికల్లో ఈవీఎంకు పేపర్ బ్యాకప్ సౌకర్యాన్ని జతపరుస్తున్నారా అని అడగ్గా..‘‘ ఈ అంశంపై నిపుణుల కమిటీ కసరత్తు చేస్తోంది. ఒక సారి ప్రయోగాత్మకంగా ఈవీఎం పేపర్ బ్యాకప్ చేశారు. నిపుణుల కమిటీ ఎలాంటి సిఫార్సులూ చేయలేదు. పెండింగ్‌లో ఉంది’’ అని ఖురేషీ బదులిచ్చారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం ఎన్నికల్లో తీసుకున్న, తీసుకోబోయే చర్యలివీ..

బోగస్ ఓట్లకు చెక్: ఎన్నికల్లో బోగస్ ఓట్లకు చెక్ పెట్టేందుకు ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. ఓటు వేయాలంటే ఓటరు గుర్తింపు కార్డు తప్పనిసరి చేయనుంది. ఈమేరకు ఇప్పటికే గోవాలో 98.06 శాతం, మణిపూర్‌లో 87.2 శాతం, పంజాబ్‌లో 99.66శాతం, ఉత్తరప్రదేశ్‌లో 98.5 శాతం, ఉత్తరాఖండ్‌లో 99.8 శాతం మంది ఓటర్లకు ఇప్పటికే ఫొటోగుర్తింపు కార్డులు జారీ చేసింది. ఇవి లేకున్నా.. ఓటరు జాబితాలో పేరున్న వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది.

ఎన్నికల వ్యయంపై నిఘా: ఈ సారి అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని ఎన్నికల సంఘం చాలా గట్టిగా పర్యవేక్షించనుంది. అభ్యర్థుల ఖర్చుపై కన్నేసి ఉంచడానికి వ్యయ పరిశీలకులు, సహాయ వ్యయ పరిశీలకులను నియమించనుంది. అలాగే ప్రతి అభ్యర్థీ ప్రత్యేక బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా తెరవాలని, ఎన్నికల ఖర్చులన్నీ ఆ ఖాతా ద్వారానే చేయాలని నిర్దేశించింది. వీటితోపాటు వ్యయ పర్యవేక్షణకు సమగ్ర ఆదేశాలను ఈసీ విడిగా జారీ చేసింది. ఫ్లయింగ్ స్క్వాడ్‌ల ఏర్పాటు, నియోజకవర్గాల్లో వీడియో నిఘా, ఆదాయపు పన్ను శాఖ ఇన్వెస్టిగేషన్ డెరైక్టర్ భాగస్వామ్యం తదితర అంశాలు సదరు ఆదేశాల్లో ఉన్నాయి. ఎన్నికల్లో వెదజల్లే డబ్బును ముందే పట్టుకోడానికి విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు తదితర ప్రాంతాలను పర్యవేక్షించాలని ఆదాయ పన్ను శాఖను ఈసీ కోరింది.

వార్తా ప్రచారంపై కమిటీ..: ‘పెయిడ్ న్యూస్’(డబ్బులిచ్చి రాయించే వార్తలు) వ్యవహారాన్ని కూడా ఎన్నికల కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. ప్రెస్ కౌన్సిల్ నామినేట్ చేసే ఒక సీనియర్ జర్నలిస్టు, మరో ముగ్గురు సభ్యులతో రాష్ర్ట్ర స్థాయిలోను, తర్వాత జిల్లా స్థాయుల్లోనూ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ఆ కమిటీలు ఈ పెయిడ్ న్యూస్‌ను పరిశీలిస్తాయి. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు, మీడియా సంస్థల ప్రతినిధులకు కూడా ఈ ఆదేశాలపై సమాచారమిచ్చారు.

సూక్ష్మ పరిశీలకులు: ఎన్నికల్లో సాధారణ పరిశీలకులకు అదనంగా సూక్ష్మ పరిశీలకులను కూడా మోహరించనున్నారు. కేంద్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల అధికారులను సూక్ష్మపరిశీలకులుగా పంపనున్నారు. వీరు నిర్దేశించిన ప్రాంతాల్లో ఓటింగ్ రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి కదలికను నిశితంగా గమనిస్తారు. 

తొలిసారిగా.. 24 గంటల కాల్ సెంటర్

ఎన్నికలు జరిగే ప్రతి రాష్ట్రంలోనూ ఫిర్యాదుల పరిష్కారానికి దేశంలోనే తొలిసారిగా.. 24 గంటలపాటు పనిచేసే కాల్‌సెంటర్‌ను ఈసీ ఏర్పాటు చేస్తోంది. 1950 అనే టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి పైసా ఖర్చు లేకుండా ఫిర్యాదు చేయవచ్చు. ఇందులో ఎన్నికల సంఘం ఏర్పడిన 1950 సంవత్సరాన్నే ఫోన్ నంబరుగా పెట్టడం గమనార్హం. ఇక రాష్ట్రాల వారీగా ఫిర్యాదు నమోదుకు వెబ్‌సైట్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఆ వివరాలను ఆయా ప్రధాన ఎన్నికల అధికారులు విడిగా వెల్లడిస్తారు. ఈ ఫిర్యాదులపై నిర్దిష్ట గడువులోగా చర్యలు తీసుకుంటారు. ఏ చర్యలు తీసుకున్నామనే సమాచారాన్ని ఫిర్యాదు దారులకు ఎస్‌ఎంఎస్ ద్వారా, ఫోన్‌కాల్ ద్వారా కాల్‌సెంటర్ తెలియచేస్తుంది. చర్యల వివరాలను వెబ్‌సైట్‌లో కూడా చూసుకోవచ్చు.









ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ అన్ని రాజకీయ పార్టీల్లో వేడి రాజేసింది. ఈ రాష్ట్రాల్లోకెల్లా అత్యధిక స్థానాలున్న ఉత్తరప్రదేశ్(403 స్థానాలు)పై అన్ని పార్టీలు ఇప్పటికే దృష్టిసారించాయి. యూపీని ‘హస్త’గతం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ‘కేంద్ర తాయిలాలు’ ఎర వేయగా...అధికారాన్ని నిలుపుకునేందుకు బీఎస్పీ, సత్తాచాటేందుకు ఎస్పీ రంగంలోకి దిగుతున్నాయి. సంప్రదాయ అగ్రవర్ణ ఓటుబ్యాంకుపై ఆశలుపెట్టుకున్న బీజేపీ ‘రామరాజ్య’ ఫార్ములాతో ముందుకెళ్లనుంది. పంజాబ్, ఉత్తరాఖండ్‌లలో మిత్రపక్షాలతో కలిసి మరోసారి గెలిచేందుకు బీజేపీ సిద్ధమవుతుండగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేకతపైనే ఆశలు పెట్టుకుంది. గోవాలో మైనింగ్ కుంభకోణం కాంగ్రెస్‌కు ప్రతికూలాంశంగా నిలుస్తుండగా బీజేపీ దాన్నే ప్రచారంగా మలుచుకోనుంది. మణిపూర్‌లో హ్యాట్రిక్ విజయం కోసం కాంగ్రెస్ తహతహలాడుతుండగా చిన్న పార్టీలు కూడా గట్టి పోటీకి సిద్ధమవుతున్నాయి. మొత్తంమీద ఈ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. -సాక్షి, స్పెషల్ డెస్క్


ఉత్తరప్రదేశ్
ముస్లిం ఓట్లే నిర్ణయాత్మకం!
అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో చతుర్ముఖ పోటీకి రంగం సిద్ధమైంది. 20 ఏళ్ల తర్వాత తిరిగి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి కాంగ్రెస్ సర్వ శక్తులూ ఒడ్డుతున్నప్పటికీ.. బహుజన సమాజ్ పార్టీ, సమాజ్‌వాది పార్టీకి మధ్య నువ్వా నేనా అనే రీతిలో రసవత్తర పోటీ జరుగుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఎన్నికల షెడ్యూలు ప్రకటించడానికి ముందు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్‌లో విజయమే లక్ష్యంగా వెదజల్లిన వరాలు పార్టీకి ఎన్ని సీట్లు తెచ్చిపెట్టగలుగుతాయన్న అంశం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

యూపీ అసెంబ్లీలో 403 సీట్లున్నాయి. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో 206 సీట్లతో తిరుగులేని మెజారిటీ సాధించిన బీఎస్పీ ప్రాభవం 2009 నాటి లోక్‌సభ ఎన్నికల్లో తగ్గింది. మూడు శాతం ఓట్లను కోల్పోయిన ప్రతిపక్ష సమాజ్‌వాది పార్టీ కన్నా 3 సీట్లు తక్కువగా 20 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో 8.6 శాతం ఓట్లతో 22 స్థానాలు గెల్చుకున్న కాంగ్రెస్.. పార్లమెంట్ ఎన్నికల్లో 18.2 శాతం ఓట్లతో 21 సీట్లను గెల్చుకొని తలపండిన రాజకీయ పండితులను సైతం ఆశ్చర్యపరచింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, అమేథీ ఎంపీ అయిన యువనేత రాహుల్ గాంధీ మాయావతి ప్రభుత్వంపై యుద్ధ భేరీ మోగిస్తున్నారు. యూపీ పార్లమెంటు ఎన్నికల్లో రెండో పెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ అసెంబ్లీకి జరగబోయే ఎన్నికల్లో ఆ స్పీడ్‌ను ఏ మేరకు కొనసాగిస్తుందో వేచి చూడాలి. 

పది అసెంబ్లీ సీట్లు, 5 పార్లమెంటు సీట్లున్న అజిత్ సింగ్ నేతృత్వంలోని ఆర్‌ఎల్‌డీతో పొత్తు ఓటర్లను ఎంతమేరకు కాంగ్రెస్‌కు లాభిస్తుందన్నది మరో ముఖ్య అంశం. ఎన్నికల వేళ వివిధ కేంద్ర పథకాల ద్వారా దాదాపు రూ. 6,500 కోట్ల నిధులను యూపీకి కేటాయించడం ద్వారా కాంగ్రెస్ రైతులు, చేనేత కార్మికులు, తదితర వర్గాల ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఓబీసీ కోటాలో మైనారిటీలకు 4.5 శాతం ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించడం వంటి ప్రజాకర్షక చర్యలు ఉత్తర ప్రదేశ్ ఓటర్లను కాంగ్రెస్ వైపునకు తిప్పగలుగుతాయో చూడాలి. ఎస్పీ, బీఎస్పీలకు మద్దతుపలుకుతున్న ఓబీసీలను చీల్చడానికి కాంగ్రెస్ వేసిన ఎత్తుగడ.. హిందూ ఓబీసీలను పార్టీకి ఇతర రాష్ట్రాల్లో కూడా దూరం చేస్తుందేమోనన్న చర్చ కూడా ప్రారంభమైంది. 

బీఎస్పీ, ఎస్పీలకు రానున్న ఎన్నికల్లో 25 శాతం చొప్పున ఓట్లు రావచ్చని, హంగ్ అసెంబ్లీ ఏర్పడవచ్చని ఇటీవల ఓ సర్వేలో తేలింది. రాష్ట్రంలో 18 శాతం ఓట్లున్న ముస్లింల పాత్ర రానున్న ఎన్నికల్లో గెలుపు ఓటములను నిర్దేశించబోతున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముస్లింల ప్రభావం 130 నియోజకవర్గాల్లో ప్రబలంగా ఉంటుంది. కనీసం 106 నియోజకవర్గాల్లో విజయావకాశాలను ముస్లింల ఓట్లే నిర్దేశించనున్నాయి. అత్యధికంగా 47 శాతం ముస్లింల మద్దతు ఎస్పీకి ఉందని అంచనా. ముస్లింల ఓట్ల కోసం బీజేపీ అగ్రశ్రేణి నేత ఎల్‌కే అద్వానీ, రాజ్‌నాథ్‌సింగ్ నానా తంటాలు పడుతుండడం ఇటీవలి పరిణామం.



మాయావతి భీకర పోరు
కాంగ్రెస్ ధాటికి దీటుగా ప్రతిదాడికి దిగుతున్న యూపీ ముఖ్యమంత్రి మాయావతి బీకర పోరాటానికి సిద్ధమవుతున్నారు. దళితులను, అగ్రవర్ణాలను ఏకతాటిపైకి తేవడం అనే ఫార్ములాను విజయవంతంగా అమలుచేస్తున్న మాయావతిని ఎదుర్కోవడం ప్రతిపక్షాలకు అంత తేలికైన విషయం కాదు. 11వ పంచవర్ష ప్రణాళిక కాలంలో వేగంగా అభివృద్ధి సాధిస్తున్న 5 రాష్ట్రాల జాబితాలో నిలపగలగడం ఐదేళ్లూ పదవిలో కొనసాగిన మాయావతికి నిస్సందేహంగా ప్లస్ పాయింటే. ముస్లింలు, ఓబీసీల మద్దతుతో బలమైన శక్తిగా ఉన్న ప్రతిపక్ష సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఈ సారి ఎన్నికల్లో తన కుమారుడు అఖిలేశ్ యాదవ్‌ను రంగంలోకి దింపి యువతను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. 

పంజాబ్
అధికార మార్పిడి ఈ సారీ సాధ్యమేనా?

పంజాబ్‌లో అధికార శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ), బీజేపీల కూటమికి కాంగ్రెస్‌కు మధ్య ముఖాముఖి పోరుకు మరోసారి రంగం సిద్ధమైంది. ఎస్‌ఏడీ, బీజేపీల కూటమి మరోసారి సమరోత్సాహంతో ఎన్నికలు ఎదుర్కోవడానికి సిద్ధం అవుతోంది. ప్రకాశ్ సింగ్ బాదల్‌కు వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్‌ను, అభివృద్ధి నినాదాలను అధికార పక్షం ఈ సారి ఎన్నికల అస్త్రాలుగా వాడుకోవాలని చూస్తోంది. 2007 ఎన్నికల్లో మొత్తం 117 అసెంబ్లీ సీట్లకుగాను.. అకాలీదళ్ 48 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించి అధికారాన్ని చేపట్టింది. బీజేపీ 19 సీట్లలో గెలవగా, ఇండిపెండెంట్లు ఐదు సీట్లలో గెలుపొందారు. బీజేపీ సహకారంతో ప్రకాశ్ సింగ్ బాదల్ నాలుగోసారి పంజాబ్ ముఖ్యమంత్రి అయ్యారు. 

వృద్ధ నేత ప్రకాశ్ సింగ్ ఈ ఎన్నికలానంతరం రాజకీయాల నుంచి విరమిస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2002 నుంచి ఐదేళ్లపాటు అధికారం చెలాయించిన అమరీందర్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ 2007లో పరాజయం పాలై 44 సీట్లకే పరిమితం అయ్యింది. గత ఎన్నికల్లో కోల్పోయిన స్థానాలను నెగ్గుకు రాగలమనే ఉత్సాహంతో ఉన్న అధికార కూటమి శ్రేణులు ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించగలమన్న ఆశాభావంతో ఉన్నాయి. ఇక లోక్‌పాల్, కేంద్ర ప్రభుత్వ హయాంలో అవినీతి మరకలు రాష్ట్ర కాంగ్రెస్‌ను దెబ్బతీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2007 ఎన్నికల్లో హోరాహోరీగా పోరాడినా అధికారంలోకి రాలేకపోయిన కాంగ్రెస్ అమరీందర్‌సింగ్ నేతృత్వంలో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకొంది. పంజాబ్‌లో వ్యవసాయాభివృద్ధి ఇరు పార్టీల ఎజెండాలోనూ ఉంది.

‘హరిత విప్లవా’నికి ప్రతీకగా నిలిచిన తొలి రాష్ట్రం పంజాబ్‌లో ఇటీవల వ్యవసాయ కుటుంబాల్లో క్యాన్సర్ మహమ్మారి బారిన పడుతుండడం, భూగర్భ జలాలు తీవ్రంగా కలుషితం కావడం వంటి పర్యావరణాంశాలపై రాష్ట్రంలో ఇటీవల చర్చ సాగుతోంది. వ్యవసాయక పర్యావరణ సంక్షోభం ఎన్నికలాంశంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అమృత్‌సర్ ను వాటికన్ తరహా పవిత్ర నగరంగా ప్రకటించే లక్ష్యంతో ఉన్న అకాలీదళ్ సిక్కుల ఓట్లను ఆకర్షించడంలో పైచేయి సాధించే అవకాశం ఉందని పరిశీలకులు చెపుతున్నారు. పీపుల్స్ పార్టీ ఆఫ్ పంజాబ్ అధినేత, ప్రకాశ్ సింగ్ బాదల్‌కు దగ్గరి బంధువు అయిన మనిప్రీత్ సింగ్ మూడో ప్రత్యామ్నాయం అందించాలన్న ఉబలాటంతో బరిలోకి దిగుతున్నారు. 

పంజాబ్ ఎన్నికల్లో మాదక ద్రవ్యాలు, మద్యం ప్రభావం అధికంగా ఉంటుందని భావిస్తుండడంతో అధికార యంత్రాంగం నిబంధనావళిని కఠినంగా అమలుచేసేందుకు సన్నద్ధమవుతోంది. గత మూడు దఫాలుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికార పార్టీ పరాజయం పాలవుతోంది. ఒకరి తర్వాత మరొకరికి అవకాశం ఇస్తూ వస్తున్న పంజాబీ ఓటర్లు ఈ సారి ఎటువైపు నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. 




గోవా
కాంగ్రెస్‌కు గడ్డుకాలం!
గోవాలో పాతికేళ్లపాటు అధికారం చెలాయించిన కాంగ్రెస్ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గడ్డు పరిస్థితిని ఎదుర్కోబోతోంది. 1963లో గోవా రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 18 ఏళ్లపాటు మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ (ఎంజీపీ) పాలించింది. ఆ తర్వాత బీజేపీ అధికారంలో ఉన్న (2000 నుంచి 2005 వరకూ) ఐదేళ్లు మినహా కాంగ్రెస్ అధికారంలో కొనసాగుతోంది. పదేళ్ల క్రితం రాష్ట్రంలో చెప్పుకోదగ్గ అస్థిత్వం లేని బీజేపీ బలమైన ప్రతిపక్షంగా నిలదొక్కుకుంది. 40 స్థానాలున్న గోవాలో ముఖాముఖి పోరుకు రంగం సిద్ధమైంది. 

దిగంబర్ కామత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అక్రమ మైనింగ్ వ్యవహారం భూతంలా వెంటాడుతోంది. ప్రతిపక్ష నేత మనోహర్ పర్రికర్ అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వాన్ని అవకాశం దొరికినప్పుడల్లా దుయ్యబడుతున్నారు. దీన్నే ప్రధాన ఎన్నికల ప్రచారాంశంగా బీజేపీ ఎంచుకుంది. భూ కేటాయింపు పథకంపై ప్రజా వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ ఉరకలువేస్తోంది. ప్రాథమిక విద్యలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టిన కాంగ్రెస్‌పై బీజేపీ ఒంటికాలితో లేస్తోంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకోగలుగుతుందా అన్నది చర్చనీయాంశమైంది.



ఉత్తరాఖండ్
ప్రభుత్వ వ్యతిరేకతపైనే కాంగ్రెస్ ఆశలు 
11 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఉత్తరాఖండ్ రాష్ట్రం మూడో దఫా అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు వల్ల గత రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్, బీజేపీల మధ్య అధికార మార్పిడి జరిగింది. చెరి సగం కాలం రాష్ట్రాన్ని పాలించిన బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య ఈ సారి కూడా ముఖాముఖి పోటీ జరగబోతోంది. 2000లో బీజేపీ నేతృత్వంలో ఉత్తరాఖండ్‌లో తొలి ప్రభుత్వం ఏర్పాటైంది. నిత్యానంద్ స్వామి ముఖ్యమంత్రి అయ్యారు. ఏడాదిలోపే బీజేపీ అధిష్టానం ముఖ్యమంత్రిని మార్చి.. కోషియారిని సీటులో కూర్చోపెట్టింది. 2002 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించటంతో నారాయణ్‌దత్ తివారీ సీఎంగా ఎన్నికయ్యారు. 

2007 ఎన్నికల్లో మళ్లీ బీజేపీ గెలవడంతో బీసీ ఖండూరీ ముఖ్యమంత్రి అయ్యారు. 2009 జూన్‌లో ఖండూరీని పదవి నుంచి తొలగించిన బీజేపీ రమేశ్ పొక్రియాల్‌ను సీఎం చేసింది. పొక్రియాల్ ప్రభుత్వంపై తీవ్ర అవినీతి ఆరోపణలు రావటంతో ఈ ఏడాది సెప్టెంబర్ 11న ఖండూరీకే తిరిగి అధికారం చిక్కింది. బీజేపీ టీమ్‌కు ఖండూరీనే నాయకత్వం వహించనున్నారు. ఐదేళ్లుగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ యశ్‌పాల్ ఆర్య నాయకత్వంలో అవినీతే ప్రధానాంశంగా బరిలోకి దిగుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లపైనే ఆయన ఆశలుపెట్టుకున్నారు. 



మణిపూర్
విపక్షాల బలహీనతే కాంగ్రెస్ బలం!
ప్రభుత్వాలు పేక మేడల్లా కూలిపోతుండడం మణిపూర్ రాజకీయాల ప్రత్యేకత. ప్రాంతీయ పార్టీల కూటముల బలహీన ప్రభుత్వాలు.. చీటికీ మాటికీ రాష్ట్రపతి పాలనలతో సతమతమైన మణిపూర్‌లో.. గత దశాబ్దకాలంగా సుస్థిర పాలన అందించిన ఘనత ఒక్రమ్ ఇబిబో సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్‌కు దక్కింది. 2002, 2007 ఎన్నికల్లో పార్టీని సింగ్ విజయపథంలో నిలిపారు. లోకాయుక్త బిల్లును ఇటీవలే పాస్ చేయించిన సింగ్ ప్రజల జేజేలందుకున్నారు. ఈ బుల్లి రాష్ట్రం అంతటినీ ప్రభావితం చేయగలిగిన మరో బలమైన పార్టీ లేకపోవటం కాంగ్రెస్‌కు పెద్ద ప్లస్ పాయింట్. మణిపూర్ పీపుల్స్ పార్టీ నేతృత్వంలోని చిన్న పార్టీల కూటమికి కాంగ్రెస్‌కు మధ్య ముఖాముఖి పోటీకి రంగం సిద్ధమైంది. ప్రతిపక్షాల బలహీనతే కాంగ్రెస్‌కు బలంగా పరిణమించనుంది.
Share this article :

0 comments: