వీపు విమానం మోత మోగడమంటే ఏమిటో మీకు తెలుసా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వీపు విమానం మోత మోగడమంటే ఏమిటో మీకు తెలుసా?

వీపు విమానం మోత మోగడమంటే ఏమిటో మీకు తెలుసా?

Written By ysrcongress on Tuesday, December 27, 2011 | 12/27/2011

వీపు విమానం మోత మోగడమంటే ఏమిటో మీకు తెలుసా? ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం పుణ్యమాని త్వరలోనే మీరా అనుభవాన్ని ప్రత్యక్షంగా చవిచూడనున్నారు! రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ప్రభుత్వం కరెంటు చార్జీలను పెంచాలని ప్రతిపాదించింది. ఏ ఒక్కరినీ వదిలిపెట్టకుండా అందరి నడ్డీ విరగ్గొట్టింది! గృహ వినియోగదారులు, పరిశ్రమలు, వాణిజ్య సంస్థలతోపాటు చిన్న చిన్న బడ్డీ కొట్లను నడుపునేవారిని సైతం వదిలిపెట్టలేదు. అటు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు సరఫరా చేసే తాగునీటికీ, వీధి దీపాలకూ చార్జీల ఎసరు పెట్టింది. ఇటు అదనపు విద్యుత్ కొనుగోలు భారాన్నీ ప్రజలపైకే నెట్టింది. మొత్తంగా 2012-13 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.4,950 కోట్ల పెను భారాన్ని మన నెత్తిన పడేసింది. 

ఇందులో గృహ వినియోగదారుల వాటానే రూ.1,500 కోట్లు ఉండటం గమనార్హం. ఈ ప్రతిపాదిత చార్జీలను ‘వార్షిక ఆదాయ, వ్యయ నివేదిక’(ఏఆర్‌ఆర్) పేరిట ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ)కి విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు సోమవారం సమర్పించాయి. వీటిపై ప్రజల అభిప్రాయం స్వీకరించిన తర్వాత మార్చి చివరి వారంలో చార్జీల పెంపుపై ఈఆర్‌సీ ఆదేశాలు జారీ చేస్తుంది. దీంతో 2012 ఏప్రిల్ 1 నుంచి మన వీపు చార్జీల మోత మోగుతుంది. 

గృహాలకు కరెంటు షాక్....: 50 యూనిట్ల లోపు కరెంటు వాడేవారిని మినహాయిస్తే.. మిగిలిన వారందరికీ యూనిట్‌కు 55 పైసల నుంచి రూపాయి వరకూ చార్జీల వాత పెట్టారు. అయితే, 51 నుంచి 100 యూనిట్ల శ్లాబు వారికి ప్రస్తుతం యూనిట్‌కు రూ.2.80 ఉన్నదాన్ని.. రూ.2.60కి తగ్గించారు. అయినా వీరికి చార్జీల మోత మోగనుంది. ఎందుకంటే.. ఈ శ్లాబు వారికి టెలిస్కోపిక్ విధానాన్ని ఎత్తేయడంతో వీరికి గతంలోలాగ మొదటి 50 యూనిట్లకు 1.45 చొప్పున కాకుండా.. 1 నుంచి 100 యూనిట్ల వరకూ రూ.2.60నే వసూలు చేస్తారు. రాష్ట్రంలో మొత్తంగా 2 కోట్ల మంది గృహ వినియోగదారులుండగా.. తాజా పెంపు భారం 1.80 కోట్ల మందిపై పడనుందని అంచనా. అలాగే.. వచ్చే ఏడాది జూలై నుంచి 2013 మార్చి వరకు అదనపు విద్యుత్ కొనుగోలుకు అయ్యే వ్యయాన్ని మనమీదే బాదనున్నారు. 

బడ్డీ కొట్లనూ బాదారు.. 

బడ్డీ కొట్లపైనా బాదారు. లో-టెన్షన్(ఎల్‌టీ) కేటగిరీలో 0-50 యూనిట్లలోపు వాడేవారికి ఇప్పటివరకూ యూనిట్‌కు రూ.3.85గా ఉంది. 51-100 యూనిట్ల వారికి రూ.6.20 చొప్పున ఉండేది. ప్రతిపాదిత చార్జీల్లో 51-100 యూనిట్ల శ్లాబు వారికి రూ.6.20 నుంచి రూ.6కు తగ్గించారు. అయితే, ఆ శ్లాబు వారికీ టెలిస్కోపిక్ విధానం ఎత్తేయడం వల్ల వీరికీ ఇకపై మొత్తం యూనిట్లకు రూ.6 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అంటే చార్జీలు తగ్గించినట్లే కనిపించినా.. టెలిస్కోపిక్ విధానం ఎత్తేయడం వల్ల వారికీ మోత మోగుతుందన్నమాట! ఇక 100 యూనిట్లకుపైగా వినియోగించే వాణిజ్య సంస్థల విద్యుత్ చార్జీలను యూనిట్‌కు రూ.6.50 నుంచి రూ.7కు పెంచారు. 

పెద్ద షాపులకు సాయంత్రం షాక్..: హై-టెన్షన్ (హెచ్‌టీ) కేటగిరీలోని షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్, సినిమా హాళ్లు మొదలైన వాణిజ్య సంస్థలకు టైం ఆఫ్ డే(టీవోడీ) వర్తింప చేయనున్నారు. ఇందులో భాగంగా సాయంత్రం ఆరు నుంచి రాత్రి పది వరకు వినియోగించే విద్యుత్‌కు యూనిట్‌కు అదనంగా రూపాయి మేరకు వసూలు చేస్తారు. ఇప్పటికే వీటికి యూనిట్‌కు రూ.4.10 నుంచి 4.80 వరకూ వసూలు చేస్తున్నారు. దీనికి సాయంత్రం మరో రూపాయి అదనపు బాదుడన్నమాట! ఇప్పటికే పరిశ్రమలకు టీవోడీ వ ర్తింపజేస్తుండగా.. ఇప్పుడు దాన్ని వాణిజ్య సంస్థలకూ విస్తరించారు. 

పరిశ్రమలా.. నిన్నొదల బొమ్మాళీ..

గత రెండేళ్లుగా పరిశ్రమలతో చార్జీల చెడుగుడు ఆడేసుకున్న సర్కారు.. ఈసారి అదే పని చేసింది. ఎల్‌టీ కేటగిరీలోని పరిశ్రమల విద్యుత్ చార్జీలను యూనిట్‌కు రూ.4.13 నుంచి రూ.5కు పెంచింది. అదేవిధంగా హెచ్‌టీ కేటగిరీలోని పరిశ్రమలకు యూనిట్‌కు రూ.1 నుంచి 1.28 వరకూ పెంచారు. 
నీటికీ.. దీపానికీ ఎసరు..: కార్పొరేషన్లలో మంచి నీటి సరఫరాకు వాడే విద్యుత్ చార్జీలను యూనిట్‌కు 65 పైసల నుంచి 95 పైసల వరకూ పెంచారు. మునిసిపాలిటీల్లో 75 పైసల నుంచి 95 పైసల వరకూ వడ్డించారు. మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలోని వీధి దీపాలకు సరఫరా చేసే విద్యుత్ చార్జీలనూ బాదారు. గ్రేడ్ 3 మునిసిపాలిటీల్లో ప్రస్తుతం యూనిట్‌కు రూ.3.29 ఉండగా.... దీన్ని రూ.3.75కు పెంచారు. గ్రేడ్ 1, 2 మునిసిపాలిటీల్లో రూ.3.59 నుంచి రూ.4కు పెంచగా.. స్పెషల్ గ్రేడ్ మునిసిపాలిటీల్లో రూ.3.88 నుంచి ఏకంగా రూ.4.50కు పెంచారు. అటు కార్పొరేషన్లలో యూనిట్‌కు రూ.4.17గా ఉండగా.. దాన్ని రూ.5కు పెంచాలని ప్రతిపాదించారు. 

డిస్కంల ప్రతిపాదనల్లో మరికొన్ని ముఖ్యాంశాలివీ..

ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలకు ప్రస్తుతం యూనిట్‌కు రూ.2.65 మేర వసూలు చేస్తున్నారు. ఇకపై వీటికి హెచ్‌టీ కేటగిరీలోని పరిశ్రమలకు వర్తించే చార్జీలను వసూలు చేయనున్నారు.

గ్రామీణ విద్యుత్ సహకార సంఘాల(రెస్కో)కు సరఫరా చేసే యూనిట్ ధరను 20 పైసల నుంచి 66 పైసలు దాకా పెంచారు.

వచ్చే ఆర్థిక సంవత్సరానికి డిస్కంల రెవెన్యూలోటు 35,062 కోట్లు కాగా.. ప్రస్తుతం వసూలు చేస్తున్న చార్జీల ద్వారా రూ.24,009 కోట్లు సమకూరనుంది. చార్జీల పెంపు వల్ల రూ.4,950 కోట్లు వసూలు అవుతాయని డిస్కంలు అంచనా వేశాయి. మిగిలిన రూ.6,103 కోట్ల లోటును ప్రభుత్వం ఉచిత విద్యుత్ సబ్సిడీ రూపంలో భరిస్తుంది.


టెలిస్కోపిక్ అంటే.. 

ప్రస్తుతం గృహ, వాణిజ్యసంస్థలకు టెలీస్కోపిక్ విధానం కింద విద్యుత్ చార్జీలను వసూలు చేస్తున్నారు. టెలిస్కోపిక్ విధానం అంటే.. ఒక గృహ వినియోగదారుడు నెలకు 90 యూనిట్ల విద్యుత్ వాడారని అనుకుందాం. ఈ వినియోగదారుడు వినియోగించిన మొదటి 50 యూనిట్లకు యూనిట్‌కు రూ.1.45 చొప్పున.. 51 నుంచి 90 యూనిట్ల వరకు యూనిట్‌కు 2.60 చొప్పున(ప్రతిపాదిత చార్జీ) వసూలు చేస్తారు. ఇప్పుడు 51 నుంచి 100 యూనిట్ల గృహ, వాణిజ్య వినియోగదారులకు ఈ విధానం ఎత్తేయడం వల్ల ఉదాహరణకు.. గృహ వాడకందార్లు 90 యూనిట్లు వాడితే.. వారికి మొదటి యూనిట్ నుంచి 90 యూనిట్ల వరకూ రూ.2.60 చొప్పున బాదేస్తారన్నమాట!
Share this article :

0 comments: