భారీ ధర చెల్లించి విద్యుత్ కొనేందుకు సిద్ధమైన సర్కారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » భారీ ధర చెల్లించి విద్యుత్ కొనేందుకు సిద్ధమైన సర్కారు

భారీ ధర చెల్లించి విద్యుత్ కొనేందుకు సిద్ధమైన సర్కారు

Written By news on Saturday, December 29, 2012 | 12/29/2012

యూనిట్ ధర రూ.20 దాకా చేరుతుందని ట్రాన్స్‌కో వారించినా వినని వైనం
కాంగ్రెస్ ఎంపీ సుబ్బరామిరెడ్డికి సంబంధించిన కంపెనీతోనూ చర్చలు

భవిష్యత్తులో విద్యుత్ సరఫరా, ధరలు ఎలా ఉంటాయో తెలియకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఈస్ట్‌కోస్ట్ విద్యుత్ ప్లాంటుతో 25 ఏళ్లపాటు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కంపెనీ నుంచి మొత్తం 300 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం యూనిట్‌కు రూ.3.466 వసూలు చేస్తామని ఈస్ట్‌కోస్ట్ కంపెనీ చెబుతున్నా.. 25 ఏళ్లలో యూనిట్ ధర రూ.20 దాకా చేరుతుందని ట్రాన్స్‌కో చెబుతోంది. అంటే యూనిట్ విద్యుత్‌కు రూ.20 వెచ్చించాల్సిన పరిస్థితులు వస్తాయన్నమాట! రెండేళ్ల తర్వాత అంటే 2015 జనవరి నుంచి 25 ఏళ్ల పాటు ఈస్ట్‌కోస్ట్ కంపెనీ నుంచి రాష్ట్రం విద్యుత్‌ను కొనుగోలు చేయనుంది. మున్ముందు కరెంటు సరఫరా, డిమాండ్, ధరలు ఎలా ఉంటాయో అంచనా వేయకుండానే ఏకంగా 25 ఏళ్లకు ఒప్పందం కుదుర్చుకోవాల్సిన అవసరం ఏమిటన్న ట్రాన్స్‌కో సీఎండీ సమారియా మాటలను పెడచెవిన పెడుతూ.. ప్రభుత్వం చివరికి ఈస్ట్‌కోస్ట్ వైపే మొగ్గడం గమనార్హం. ప్రభుత్వ పెద్దల అండదండలతో ఈస్ట్ కోస్ట్ కంపెనీ ఏర్పాటు అవుతుండటమే ఇందుకు కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ సుబ్బరామిరెడ్డికి చెందిన థర్మల్ పవర్ టెక్ కంపెనీతో కూడా ఒప్పందం కుదుర్చుకునేందుకు చర్చలు జరుగుతున్నాయి.

ఒప్పందం వెనుక ఒత్తిళ్లు..!

రానున్న 25 ఏళ్లకుగానూ 2 వేల మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు రెండేళ్ల క్రితం ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది. ఈ బిడ్డింగ్ ప్రక్రియలో భాగంగా 620 మెగావాట్ల విద్యుత్ (సుమారు 14.6 మిలియన్ యూనిట్లు)ను యూనిట్‌కు 3.466 రూపాయల చొప్పున విక్రయిస్తామని ఈస్ట్‌కోస్ట్ కోట్ చేసి ఎల్-1గా నిలిచింది. అయితే బిడ్డింగ్ ప్రక్రియ ఆలస్యం కావడంతో ఇప్పుడు 300 మెగావాట్లు మాత్రమే ఇస్తానని ఈ కంపెనీ అంటోంది. బొగ్గు, ఆపరేషన్, నిర్వహణ (ఓ అండ్ ఎం) ఖర్చులు పెరగడం వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటే యూనిట్ ధర ప్రతి ఏటా పెరుగుతుంది. ఇలా కంపెనీ నుంచి 25 ఏళ్ల తర్వాత కొనే యూనిట్ విద్యుత్ ధర ఏకంగా రూ.20కి చేరుకోనుంది. భవిష్యత్తులో పరిస్థితి ఏవిధంగా ఉంటుందో తెలియకుండా ఇప్పుడు ఇంత అధిక ధరను వెచ్చించి కొనాల్సిన అవసరం లేదని ట్రాన్స్‌కో సీఎండీ సమారియా వాదించినట్టు సమాచారం. 

అయినా ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తెచ్చి ఈ కంపెనీ నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అలాగే బిడ్డింగ్‌లో ఎల్-5 ఉన్న థర్మల్ పవర్‌టెక్‌తోనూ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. యూనిట్ ధరను (రూ.3.685కు) తగ్గించుకోవాలని పవర్‌టెక్‌ను ఇంధనశాఖ కోరింది. అయితే అందుకు ఆ సంస్థ ససేమిరా అంటున్నట్టు సమాచారం. ఈ సంస్థతో కూడా ఒప్పందం కుదుర్చుకోవాలని అధికారులపై ప్రభుత్వ పెద్దలు ఒత్తిళ్లు తెస్తున్నారు. ఎల్-2గా వచ్చిన హిందుజాతో నేరుగా విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) కుదుర్చుకుంటుండగా, ఎల్-3గా వచ్చిన ఎథెనా, ఎల్-4గా వచ్చిన నెల్‌క్యాస్ట్ బిడ్డింగ్ నుంచి తప్పుకున్నాయి.

http://www.sakshi.com/main/FullStory.aspx?catid=513846&Categoryid=1&subcatid=33
Share this article :

0 comments: