ప్రాణం ఉన్నంత వరకూ జగన్‌వెంటే.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రాణం ఉన్నంత వరకూ జగన్‌వెంటే..

ప్రాణం ఉన్నంత వరకూ జగన్‌వెంటే..

Written By news on Saturday, November 19, 2011 | 11/19/2011

రాయవరం(తూర్పుగోదావరి)/ ఎమ్మిగనూరు(కర్నూలు)/విశాఖపట్నం/ చెరుకుపల్లి(గుంటూరు), న్యూస్‌లైన్:తామంతా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే ఉంటామని వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు పలువురు శనివారం పునరుద్ఘాటించారు. తన రాజకీయ జీవితమంతా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంతోనే ముడిపడి ఉంటుందని మాజీమంత్రి, రామచంద్రపురం ఎమ్మెల్యే పిల్లి సుభాష్‌చంద్రబోస్ స్పష్టం చేశారు. శనివారం ఆయన తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్‌కు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారా? అన్న ప్రశ్నకు... ఎవరెవరు ఎటు వెళుతున్నారన్న విషయం తనకు తెలియదని జవాబిచ్చారు. తాను మాత్రం జగన్‌మోహన్‌రెడ్డితోనే ఉంటానని పునరుద్ఘాటించారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగడానికి ముందుగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్న ఎమ్మెల్యేలతో సమావేశం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సమావేశం ఎప్పుడు జరిగేది త్వరలో వెల్లడిస్తామన్నారు. జగన్‌కు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలందర్నీ ఆహ్వానిస్తామని, ప్రస్తుత పరిస్థితులపై ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 

వైఎస్ కుటుంబాన్ని విస్మరించను..


తాను కాంగ్రెస్ గూటికి చేరుతున్నట్లు కొన్ని పత్రికలు, చానళ్లు తప్పుడు ప్రచారం చేయడం విచారకరమని, వైఎస్ కుటుంబాన్ని విస్మరించే ప్రసక్తే లేదని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి తెలిపారు. ఆయన ఎమ్మిగనూరులో ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్‌లోనే కొనసాగుతూ.. జగన్ బాటలోనే నడుస్తానని స్పష్టం చేశారు. కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజల మనోగతాన్ని కాదని ఏ నిర్ణయం తీసుకోనన్నారు. వైఎస్ పేరును సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చటంవల్లే రాజీనామా చేశానని, ప్రలోభాలకు లొంగే వ్యక్తిని కానని అన్నారు. మొదటి నుంచి విలువలతో కూడిన రాజకీయాన్ని నమ్మిన వ్యక్తినన్నారు. 

స్పీకర్‌ను మర్యాద పూర్వకంగానే కలిశాం: కొర్ల భారతి, కృష్ణదాసు

తాము జగన్ వెంటే ఉంటామని, ఆయన ఏం చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యేలు కొర్ల భారతి, ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్ తొలిసారి ఉత్తరాంధ్రకు వచ్చారని, ఈ నేపథ్యంలో తాము కేవలం మర్యాదపూర్వకంగానే ఆయన్ను శనివారం విశాఖ విమానాశ్రయంలో కలిసినట్టు వారు వివరించారు. స్పీకర్ ఒక పార్టీకి చెందిన వ్యక్తి కాదని, ఆయన్ను ఎవరైనా కలవవచ్చని అన్నారు. రాజీనామాలపై ఆయనతో మాట్లాడలేదని వారు స్పష్టం చేశారు.

చీలిక తేవడానికి చేస్తున్న గోబెల్స్ ప్రచారం: సుచరిత

తాను రాజకీయాల్లో ఉన్నంతవరకు జగన్‌వెంటే కొనసాగుతానని గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. జగన్‌వర్గం ఎమ్మెల్యేల్లో చీలిక తెచ్చి అధికారపార్టీకి లబ్ధి చేకూర్చాలని కొందరు గోబెల్ ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. శనివారం ఆమె ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ తనతో మంత్రి మోపిదేవి వెంకటరమణారావు ఫోన్‌లో మాట్లాడారనేది అవాస్తమన్నారు. కాంగ్రెస్, టీడీపీలు జగన్‌ను ఎదుర్కోలేక ఆయనకు నైతికంగా మద్దతిస్తున్న ఎమ్మెల్యేలపై వదంతులు సృష్టించి ప్రతిష్ట దిగజార్చే పనులు చేస్తున్నాయని దుయ్యబట్టారు. జిల్లాలో జరుగుతున్న జగన్ ఓదార్పుయాత్రలో తాను పాల్గొంటున్నానని, మరోవారం తర్వాత ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రారంభమయ్యే ఓదార్పుయాత్ర కోసం ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు.

నగరం, న్యూస్‌లైన్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనుకూల ఎమ్మెల్యేలపై కాంగ్రెస్, టీడీపీ నాయకులు చేస్తున్న గోబెల్స్ ప్రచారాన్ని మానుకోవాలని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హితవు పలికారు. రాజకీయంగా వైఎస్ జగన్‌ను ఎదుర్కొనే ధైర్యం లేక ఉద్దేశపూర్వకంగా కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. నగరంలో శుక్రవారం జరిగిన ఓదార్పుయాత్రలో వైఎస్ జగన్‌ను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కలిశారు. 

యాత్ర జరిగినంత వరకూ జగన్ వెంటే ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన న్యూస్‌లైన్‌తో మాట్లాడుతూ తాను జగన్‌మోహన్‌రెడ్డికి దూరమవుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. కావాలని పదేపదే ఈ తరహా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ జగన్ వెంటే నడుస్తాను. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చడాన్ని నిరసిస్తూ రాజీనామా చేశాను. దానికే కట్టుబడతాను’ అని పిన్నెల్లి స్పష్టం చేశారు.

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘‘మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి పేరును సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో కుట్ర చేసి ప్రస్తావించడంతో మనస్థాపం చెంది ఎమ్మెల్యేలుగా మేమంతా రాజీనామా చేశాం. ఇప్పటికీ వాటికి కట్టుబడి ఉన్నాం. జగన్ వర్గ ఎమ్మెల్యేలు ఎట్టిపరిస్థితిలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. రాజకీయ భిక్ష ప్రసాదించిన వైఎస్‌ను ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. మేం ఎట్టి పరిస్థితిల్లోనూ జగన్‌తోనే ఉంటాం’’ అని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో స్పష్టం చేశారు. గొంతులో ప్రాణం ఉన్నంతవరకు, రాజకీయాల్లో కొనసాగినంతకాలం వైఎస్ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.

తాము తిరిగి కాంగ్రెస్ వైపు వెళ్తున్నామంటూ ఒక వర్గం మీడియా చేస్తున్న ప్రచారాన్ని వైఎస్సార్ అభిమాన ఎమ్మెల్యేలు తోసిపుచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రస్తుతం దృష్టి సారిస్తున్నామని, కష్టాలు, ఇబ్బందులు వస్తే మాత్రం తామంతా జగన్‌వెంటే నడుస్తామని జమ్మలమడుగు ఎమ్మెల్యే చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డి తెలిపారు. 

కాంగ్రెస్ టిక్కెట్‌పై గెలిచినందున ప్రభుత్వం పడిపోకుండా వయా మీడియాగా ఉండాలంటూ ప్రభుత్వంలోని వారినుంచి తమకు విన్నపాలున్నాయని, అదే సమయంలో ప్రజాసమస్యలూ పరిష్కార బాధ్యతా తమపై ఉందని వివరించారు. జగన్ కాంగ్రెస్‌లోకి వెళ్లే ప్రసక్తే ఉండదని, వాళ్లే ఆయన వద్దకు రావచ్చని అభిప్రాయపడ్డారు. జగన్ తమకు 20 కోట్లు, 50 కోట్లు ఇచ్చి ప్రలోభపెడుతున్నారంటూ కొందరు కాంగ్రెస్‌నేతలు విమర్శించడాన్ని ఖండించారు. జగన్ డబ్బుతో రాజకీయాలు చేసే వ్యక్తి కాదని చెప్పారు. వైఎస్సార్ పేరును సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినందుకు నిరసనగా మొదట రాజీనామా చేసిన తాను దానికే కట్టుబడి ఉన్నట్లు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి చీమకుర్తిలో తెలిపారు. రాజకీయాల్లో ఉన్నా, లేకున్నా తమ కుటుంబం మొత్తం జగన్ వెంటే ఉంటామని ఉద్ఘాటించారు. తామంతా రాజీనామాలు ఆమోదించమనే కోరుతున్నామని, బంతి స్పీకర్ కోర్టులో ఉందని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి ప్రకాశం జిల్లా పామూరులో మాట్లాడుతూ చెప్పారు.

తన కంఠంలో ప్రాణమున్నంతవరకు జగన్‌తోనే నడుస్తానని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గుంటూరుజిల్లా నగరంలో చెప్పారు. జగన్ వెంట ఉన్న ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడుతున్నారన్న ప్రచారం వాస్తవం కాదని, అదంతా మీడియా సృష్టేనని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో దుయ్యబట్టారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా ప్రకటించారా? అని ప్రశ్నించారు. సీబీఐ విచారణ నిష్పక్షపాతంగా ఉండడం లేదని ఆయన తప్పుబట్టారు.



వెనిగళ్లవారిపాలెం(నగరం), న్యూస్‌లైన్ : నగరం మండలంలోని వెనిగళ్లవారి పాలెంలో శుక్రవారం చిలకా నిర్మల కుటుం బాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్చారు. అధైర్యపడవద్దు.. మీకు అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. నిర్మల కుమారులు మరి యదాస్, జాన్‌పాల్‌ను కుశల ప్రశ్నలు వేశారు. జగన్ రాకపై జాన్‌పాల్ చెప్పాడిలా..

ఓదార్పుకు ముందు..
ఐదేళ్ల కిందటే మా తండ్రి డేవిడ్‌రాజు మృతిచెందారు. అప్పటినుంచి అమ్మ నిర్మల కూలీ చేస్తూ మా ఇద్దర్నీ పోషించింది. వైఎస్సార్ మరణవార్త విని అమ్మ గుండెపోటుతో తనువు చాలించింది. జగనన్నయ్య వస్తారని ఎప్పటి నుంచో చెపుతున్నారు. ఆయన రాకకోసం అన్నయ్య నేను వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాం.

ఓదార్పు తర్వాత..
అమ్మ నిర్మల మృతితో అనాధలమైన మాకు జగనన్నయ్య ఇచ్చిన భరోసా కొండంత అండగా ఉంది. నా చదువుకు సహాయం అందించి ఆదుకుంటానని ఆయన చెప్పారు. ఎప్పుడు ఏ కష్టమొచ్చినా అండగా ఉంటానన్నారు. ఈరోజును అన్నయ్య డేవిడ్, నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం.

పోస్టర్ ఆవిష్కరణ
నగరం, న్యూస్‌లైన్: తాడికొండ నియోజకవర్గంలో జరిగే ఓదార్పుయాత్రను విజయవంతం చేయాలని కోరుతూ రూపొందించిన పోస్టర్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా, నగర కన్వీనర్లు మర్రి రాజశేఖర్, లేళ్ళ అప్పిరెడ్డి, నాయకుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) శుక్రవారం ఆవిష్కరించారు. నగరం మండలం గాలివారిపాలెంలో జగన్ బస చేసిన ఇంట్లో ఈ కార్యక్రమం జరిగింది. తాడికొండ నియోజకవర్గ నేత మందపాటి శేషగిరిరావు పోస్టర్‌ను రూపొందించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు చిన్నపరెడ్డి, అమర్, అప్పిరెడ్డి, వెంకటరెడ్డి, కృష్ణారావు. వి.ప్రకాష్, ఎల్.శివరామిరెడ్డి, చిట్టా శివరామకృష్ణారెడ్డి, అల్లు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

మాపక్షాన పోరాడన్నా..
జగన్‌కు కాంట్రాక్టు అధ్యాపకుల వినతి
అన్నా.. మాపక్షాన నిల బడి పోరాడన్నా.. ఈ ప్రభుత్వం మా బాధల ను పట్టించుకోవడం లేదు. మన పార్టీ తరఫు న మా సమస్యలపై పోరాడి న్యాయం చేయన్నా.. అంటూ కాంట్రాక్టు అధ్యాపకులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిట్టా విజయభాస్కరరెడ్డి నేతృత్వంలో కాంట్రాక్టు అధ్యాపకులు శుక్రవారం వైఎస్ జగన్‌ను చిన్నమట్టపూడి గ్రామంలో కలిశారు. త్వరలో అధ్యాపక పోస్టులను భర్తీ చేయనున్న నేపథ్యంలో తమకు ప్రాధాన్యమివ్వాలని ప్రభుత్వాన్ని కోరితే ఎలాంటి స్పందన లేదని వారు వాపోయారు. ఎన్నో ఏళ్లుగా కాంట్రాక్టు అధ్యాపకులుగా చాలీ చాలని వేతనాలతో పనిచేస్తున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12 వేల మంది కాంట్రాక్టు అధ్యాపకులు ఉన్నార ని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడితే కచ్చితంగా న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ అంశంపై పోరాడ తానని జగన్ అధ్యాపకులకు భరోసా ఇచ్చారు.

జగన్‌ను కలసిన పీహెచ్‌సీ సిబ్బంది
నగరం, న్యూస్‌లైన్: అభిమానానికి అవధులు ఉండవు. వైద్యు లు, ఆర్యోగ సిబ్బంది, డిఫెన్స్ విద్యార్థులు ఇలా పలువురు జగన్‌కు విభిన్న రీతిలో స్వాగతం పలికారు. ఓదార్పుయాత్రలో భాగంగా నగరం గ్రామానికి వచ్చిన జగన్‌కు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ ఎం.సుహాసిని, సిబ్బంది పువ్వలు అందజేశారు. జగన్‌తో కరచాలనం చేయడానికి సుబ్బారెడ్డి డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు బారులు తీరారు. అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

ఈ వరిపంట చూడయ్యా..
‘అయ్యా వరి పంట ఎండిపోతోంది. వేలకు వేలు అప్పులు తెచ్చి మరీ పంట సాగుచేసి కష్టపడి పండిస్తే మార్కెట్‌లో సరైన ధర లేక నష్టపోతున్నాం..’ అంటూ ఓ రైతు జగన్ వద్ద ఆవే దన వ్యక్తం చేశారు. ఈదుపల్లిలో విగ్రహావిష్కర ణకు వచ్చిన జగన్‌ను స్థానిక రైతు పిట్టు రామిరెడ్డి కలసి వరికంకులు చూపి అన్నదాతల దుస్థితి విన్నవించారు. త్వరలో మన ప్రభుత్వం వస్తుంది కష్టాలు తొలిగిపోతాయని జగన్ భరోసా ఇచ్చారు.
-న్యూస్‌లైన్, నగరం

జగన్ ప్రత్యేక ప్రార్థనలు
అభిమానుల కోరిక మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఆలయాల్లో, చర్చిల్లో ప్రార్థనలు చేశారు. స్థానిక వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో పూజల్లో పాల్గొన్నారు. జగన్ సీఎం కావాలని అర్చకులు దీవించారు. రెడ్లపాలెం, పూడివాడ రెడ్లపాలెంలోని రామమందిరాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముత్తుపల్లి ఎస్సీకాలనీ, పూడివాడ లూథరన్ చర్చిలలో, బొరమాదిగపల్లిలోని చర్చిలో వైఎస్ జగన్ ప్రార్థనలు చేశారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని పాస్టర్లు ఆశీర్వదించారు.

చిన్నారికి నామకరణం
ఈదుపల్లిలో ఓ చిన్నారికి శుక్రవారం జగన్‌మోహన్‌రెడ్డి నామకరణం చేశారు. స్థానికులు మేరుగ బాల, అలేఖ్య దంపతులు తమ నాలుగునెలల చిన్నారికి నామకరణం చేయాలని కోరారు. పాపకు విజయమ్మగా పేరు పెట్టారు. జగన్ చిన్నారిని ఎత్తుకుని ముద్దాడడంతో వారి ఆనందానికి అవధుల్లేవు.

నాడు తండ్రి.. నేడు తనయుడు
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాకతో నగరం గ్రామం పులకించింది. నాడు వైఎస్సార్ పర్యటించిన మార్గంలోనే ఓదార్పుయాత్ర సాగింది. గతంలో వైఎస్ ప్రసంగించిన సెంటర్‌లోనే శుక్రవారం ఆయన విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. ఈ ఘటన యాదృచ్ఛికమే అయినా నాటి సంగతులను గ్రామస్తులు గుర్తుచేసుకున్నారు. పల్లెబాట కార్యక్రమంలో భాగంగా 2009 జనవరి 28న నగరంలో పర్యటించిన మహానేత రాజీవ్ గాంధీ సెంటర్‌లో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఇప్పుడు జగన్ అదే సెంటర్‌లో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి, ప్రసంగిం చారు. జగన్ ఈదుపల్లి, నగరంలో పర్యటించిన విధంగానే ఆనాడు వైఎస్సార్ కూడా ఒకేరోజు ఈరెండు గ్రామాల్లో పర్యటించారు.

మంచినీళ్లు తాగు అవ్వా..
‘వైఎస్సార్ అంటే మాకు ప్రాణం. ఆయన కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నా అంతే. మొదటిసారిగా మా ఊరికి వస్తున్న జగన్ మంచి చెడ్డలు చూసుకోవడం మా బాధ్యత..’ నగరం మండలం ఈదుపల్లి గ్రామానికి చెందిన చింతల లక్ష్మీతిరుపతమ్మ అనే వృద్ధురాలు చెప్పిన మాటలివి. ఓదార్పుయాత్రలో భాగంగా వచ్చిన జగన్‌కు ఆమె ఎదురేగి స్వాగతం పలికింది. దిష్టితీసి కొబ్బరికాయ కొట్టింది. జగన్ కారు దిగి నడిచివచ్చి ఆప్యాయంగా అవ్వా బాగున్నావా అని పలకరించారు. కారులో నుంచి మంచినీళ్ల బాటిల్ తెప్పించి అవ్వా మంచినీరు తాగూ అనడంతో ఆమె ఉప్పొంగిపోయింది.

ఆత్మీయ పలకరింపు
నగరం, న్యూస్‌లైన్: నగరంలో జగన్‌మోహన్‌రెడ్డి ఓ వికలాంగుడిని ఆత్మీయంగా పలకరించారు. తన కోసం ఎదురుచూస్తున్న ఎస్టీ కాలనీకి చెందిన శ్రీనును చూసిన జగన్ కాన్వాయ్ దిగి వచ్చారు. నీ పేరేంటీ.. పింఛను వస్తుందా.. అని ప్రశ్నించారు. జగన్ తనను పలకరించడం చాలా ఆనందంగా ఉందని శ్రీను తెలిపాడు.

మహిళలకు జగన్ భరోసా
నగ రం, న్యూస్‌లైన్: ‘అయ్యా, కాల్వకట్టపై మేం ఎన్నో ఏళ్ళుగా చిన్న పాకలు వేసుకుని ఉంటున్నాం. ఏఒక్కరికి ఇల్లు, పట్టాలు ఇవ్వలేదు. మీరే మాకు న్యాయం చేసి ఇళ్ల పట్టాలు ఇవ్వాలయ్యా’ అని నగరం మండలం మట్టుపల్లి గ్రామానికి చెందిన ఎస్టీకాలనీ మహిళలు వైఎస్ జగన్‌ను కోరారు. ఓదార్పుయాత్రలో భాగంగా మట్టుపల్లిలో పర్యటించిన జగన్‌కు మహిళలు ఘన స్వాగతం పలికారు. సుమారు 30 కుటుంబాలకు చెందిన మహిళలు తమకు ఇళ్లపట్టాలు ఇప్పించాలని జగన్‌ను కోరగా ‘త్వరలో మన ప్రభుత్వం వస్తుందమ్మా మీకష్టాలన్నీ పూర్తిగా తీరతాయమ్మా. కచ్చితంగా ప్రతి ఒక్కరికి మేలు జరిగేలా చూస్తా’ అని భరోసా ఇచ్చారు. దీంతో వారి ఆనందానికి అవధుల్లేవు.

పార్టీలో చేరిన శివరామకృష్ణారెడ్డి
నగరం, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో శుక్రవారం టీడీపీ నేత పిట్టు శివరామకృష్ణరెడ్డి పార్టీలో చేరారు. నగరంలో బహిరంగసభ ముగియగానే శివరామకృష్ణరెడ్డి జగన్‌ను కలి శారు. ఆయనను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

కల్లు మోకు, ముంత బహూకరణ
నగరం, న్యూస్‌లైన్: నగరం గ్రామంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి గీత కార్మికులు కల్లు మోకు, ముంతను బహూకరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మత్తి దివాకర రత్నప్రసాద్ నేతృత్వంలో గీత కార్మికులు జగన్‌ను కలిశారు. తమ స్థితిగతులను ఆయనకు వివరించి, సమస్యలు పరిష్కరించాలని కోరారు.

మారాజు.. మరిక లేడని..
నేటి ‘ఓదార్పు’ కుటుంబం
పేరు: తురుమెళ్ల అర్జునరావు(38)
గ్రామం: గూడవల్లి, చెరుకుపల్లి మండలం
వృత్తి: వ్యవసాయ కూలీ
చెరుకుపల్లి మండలం గూడవల్లి పంచాయతీ పరిధిలోని అంబేద్కర్‌కాలనీకి చెందిన తురుమెళ్ల అర్జునరావుది నిరుపేద కుటుంబం. రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితుడై ఆయనను స్మరిస్తూ ఉండేవాడు. మహానేత మరణవార్త విని కలత చెందాడు. ఆయన మరణాన్ని తట్టుకోలేక 2009 సెప్టెంబర్ తొమ్మిదిన గుండెపోటుతో మృతి చెందాడు. అంతకు ముందే ఆయన భార్య మృతి చెందింది. అర్జునరావుకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పెద్దకుమారుడు సురేష్ రేపల్లె ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ రెండోసంవత్సరం చదువుతున్నాడు. రెండో కుమారుడు సుధీర్ రేపల్లె ప్రభుత్వ పాఠశాలలో టెన్త్ చదువుతూ హాస్టల్‌లో ఉంటున్నారు. కుమార్తె జ్యోతి ఏడోతరగతి చదువుతోంది. వారంతా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తమ ఇంటికి ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నారు.
Share this article :

0 comments: