అవిశ్వాసంపై ఓటింగ్‌లో మేజిక్ ఫిగర్ 144 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అవిశ్వాసంపై ఓటింగ్‌లో మేజిక్ ఫిగర్ 144

అవిశ్వాసంపై ఓటింగ్‌లో మేజిక్ ఫిగర్ 144

Written By ysrcongress on Sunday, December 4, 2011 | 12/04/2011



అసెంబ్లీలో రేపు ఓటింగ్ సర్కారు మనుగడపై సర్వత్రా ఉత్కంఠ
అవిశ్వాసంపై ఓటింగ్‌లో మేజిక్ ఫిగర్ 144
సర్కారు ‘సాంకేతిక’ బలం 179.. విపక్షాల బలం 108
వేడెక్కిన రాజకీయాలు... వేగంగా మారుతున్న సమీకరణాలు
తారుమారవుతున్న లెక్కలు.. కాంగ్రెస్ గుండెల్లో గుబులు
ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిని సన్నిహితులకు అప్పగించిన కిరణ్
తన వర్గం మంత్రులతో విడివిడిగా మాట్లాడుతున్న బొత్స
కీలక సమయంలో అసమ్మతి గళం విప్పిన పీఆర్పీ ఎమ్మెల్యేలు
వై.ఎస్.జగన్‌తో వైఎస్‌ఆర్ అభిమాన ఎమ్మెల్యేల సమావేశం
రైతు సంక్షేమం కోసం సర్కారుకు వ్యతిరేకంగా ఓటేస్తామని ప్రకటన
తాయిలాలతో ప్రలోభపెడుతున్న కాంగ్రెస్ పెద్దలు... విలువల కోసం అనర్హత వేటుకైనా సిద్ధమంటున్న వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు
అవిశ్వాసం విషయంలో టీడీపీ నిబద్ధతపై సర్వత్రా అనుమానం

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. అవిశ్వాసంపై చర్చకు స్పీకర్ అనుమతించారు. సోమవారం దీనిపై ఓటింగ్ జరగనుంది. ఈ పరిణామంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇప్పుడు అందరి దృష్టీ అసెంబ్లీ సమావేశాలపైనే పడింది. అసెంబ్లీలో అవిశ్వాసంపై చర్చ అనివార్యమైనందున ఓటింగ్ నిర్వహిస్తే ప్రభుత్వం నెగ్గుతుందా? ఓడిపోతుందా? కాంగ్రెస్ సర్కారు నిలబడుతుందా? కూలిపోతుందా? అన్న అంశంపై సర్వత్రా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రాజకీయ నాయకుల్లో, సామాన్య జనంలో ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగితే సునాయాసంగా బయటపడతామని నిన్నటి వరకు ధీమాతో ఉన్న కాంగ్రెస్ నేతల్లో ఇప్పుడు ఆందోళన మొదలైంది. కాంగ్రెస్ పెద్దల్లో ఒక్కసారిగా కదలిక మొదలైంది. ఎమ్మెల్యేలు కట్టు తప్పకుండా చూసేందుకు ఒక్కో ఎమ్మెల్యేతో నేరుగా సంప్రదింపులు ప్రారంభించారు. మరోవైపు.. శనివారం నల్లగొండలో శ్రీకాంతాచారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌లు మాట్లాడుతూ.. తెలంగాణ సాధించుకోవటానికి ఇదే అవకాశమని.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని పిలుపునివ్వటంతో తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కలకలం మొదలైంది.

ఆధిపత్య పోరు.. అసమ్మతి హోరు...

నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా సర్కారు పగ్గాలు చేపట్టినప్పటి నుంచి నిత్యం అసమ్మతితో రగలిపోతున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేస్తారా? లేక సర్కారుకు బాసటగా నిలుస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు అధికార పక్షంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో విభేదాలు తీవ్రమయ్యాయి. ముఖ్యమంత్రిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న బొత్స శనివారం మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, గీతారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, విశ్వరూప్, ముఖేష్‌లతో విడివిడిగా మంతనాలు జరిపారు. దీనికి తోడు పీఆర్పీ ఎమ్మెల్యేలు కీలక సమయంలో కాంగ్రెస్ నాయకత్వంపై ఒక్కసారిగా అసంతృప్తి గళం విప్పటంతో కాంగ్రెస్ నేతలు గందరగోళంలో పడ్డారు. పీఆర్పీ ఎమ్మెల్యేలు ఉన్నట్లుండి శనివారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసంతృప్తి రాగం అందుకోవటం వెనుక బొత్స ప్రమేయం ఉందని ముఖ్యమంత్రి సన్నిహితులు అనుమానాలు వ్యక్తం చేశారు.
దాంతో వెంటనే పీఆర్పీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలతో సీఎం ప్రత్యేకంగా మాట్లాడారు. రానున్న రోజుల్లో పదవులు అప్పగించే విషయంలో వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు అవిశ్వాసాన్ని ఎదుర్కొనటానికి ఎమ్మెల్యేలతో మాట్లాడాలని ముఖ్యమంత్రి తన సన్నిహితులైన మంత్రులను పురమాయించారు.

తాయిలాలు.. ప్రలోభాలు...

వై.ఎస్.రాజశేఖరరెడ్డిని అభిమానిస్తున్న పలువురు ఎమ్మెల్యేలు.. రైతుల కోసం, రైతు సంక్షేమం కోసం అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేస్తామని ప్రకటించటంతో పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారాయి. అవిశ్వాసాన్ని ఎదుర్కొనడానికి ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలకు తాయిలాలు ప్రకటించటమే కాకుండా మరికొందరిని ప్రలోభాలకు గురిచేశారన్న ప్రచారం అసెంబ్లీలో గుప్పుమంది. పేరుకు అసెంబ్లీ సమావేశం జరుగుతున్నప్పటికీ అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షంలో చర్చలన్నీ దీనిచుట్టే పరిభ్రమించాయి. పీఆర్పీలో అసంతృప్తి గళం వినిపించటంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆరా తీశారు. చిరంజీవి క్యాంపులో ఏం జరుగుతోందో తెలుసుకోవాలని పార్టీ నేతలను పురమాయించారు. మరోవైపు వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు కొందరు శనివారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. పలువురు ఎమ్మెల్యేలు జగన్‌ను కలిసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు. ఒక్కొక్కరినీ విడివిడిగా పిలిపించుకుని ప్రత్యేక భేటీలు జరిపారు. ఈ బాధ్యతలను మరికొంత మంది సన్నిహితులకు కూడా అప్పగించారు. ఇదిలావుండగా.. అవిశ్వాసం నోటీసు ఇచ్చిన టీడీపీ చిత్తశుద్ధి పైనా అటు రాజకీయ పరిశీలకుల్లో, ఇటు సామాన్య ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పటికీ ఇతర పార్టీల మద్దతు మాత్రం అడగబోమని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వారి అనుమానాలకు కారణంగా చెప్తున్నారు. అయినప్పటికీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తామని టీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐ, లోక్‌సత్తా పార్టీలు ఇప్పటికే ముందుకొచ్చాయి.

లెక్కలు తారుమారు...

మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డి హఠాన్మరణం, మరో ఆరుగురి ఎమ్మెల్యేల రాజీనామాల ఆమోదంతో అసెంబ్లీలో ప్రస్తుతం ఎమ్మెల్యేల సంఖ్య 287కు చేరింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం మెజారిటీ నిరూపించుకోవాలంటే కనీసంగా 144 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే సాంకేతికంగా చూస్తే సభలో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వానికి 179 మంది ఎమ్మెల్యేల మద్దతుంది. వీరిలో కాంగ్రెస్‌కు 154 (ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కూన శ్రీశైలంతో కలిపి), పీఆర్పీకి 18 (శోభా నాగిరెడ్డితో కలిపి) మంది, ఎంఐఎంకు ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ఇందులో ముఖ్యంగా వైఎస్‌ఆర్ అభిమాన ఎమ్మెల్యేలు ఎంత మంది? వారు ఎలాంటి వైఖరి తీసుకుంటారు? అన్న అంశం కీలకంగా మారింది. ఆ ఎమ్మెల్యేలు తీసుకునే నిర్ణయంపై కాంగ్రెస్ బలం ఆధారపడి ఉంది. మరోవైపు ప్రతిపక్షాల విషయానికొస్తే తెలుగుదేశం (86), టీఆర్‌ఎస్ (12), సీపీఐ (4), సీపీఎం (1), వైఎస్‌ఆర్ కాంగ్రెస్ (1), బీజేపీ (2), లోక్‌సత్తా (1), ఇండిపెండెంట్ (సోమారపు సత్యనారాయణ) పార్టీలతో కలిపితే మొత్తం 108 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది. ఈ గణాంకాలు చూస్తే అవిశ్వాస తీర్మానం పెట్టినా ప్రభుత్వ మెజారిటీకి ఢోకా లేదు. ఒకవేళ ప్రభుత్వం పడిపోవాలంటే మాత్రం అధికార పార్టీలోని 36 మంది ఎమ్మెల్యేలు సర్కారుకు వ్యతిరేకంగా ఓటేయాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో శనివారం జరిగిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశానికి అధికార పార్టీకి చెందిన 22 మంది వై.ఎస్.రాజశేఖరరెడ్డి అభిమాన ఎమ్మెల్యేలు హాజరవటంతో.. అవిశ్వాస తీర్మానం ఫలితం ఎలా ఉంటుందన్న దానిపై ఉత్కంఠ రేగింది. ఈ లెక్కన పరిమిత సంఖ్యలో ఎమ్మెల్యేలు అటుఇటుగా మారితే పరిస్థితి ఏమిటన్నదానిపై రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ప్రభుత్వం కచ్చితంగా పడిపోయే పరిస్థితి ఏర్పడితే టీడీపీ ఎలా వ్యవహరిస్తుందన్న అంశంపైన కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఉపఎన్నికలకు సైతం సిద్ధం...

ప్రస్తుతం రాష్ట్రంలో రైతాంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని, రైతులను ఆదుకోవలసిన ప్రభుత్వం ఆ పని చేయనప్పుడు ఎందుకు మద్దతునివ్వాలని పలువురు వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. అవసరమైతే ఉపఎన్నికలకు సైతం వెనుకాడేది లేదని, వాటిని ఎదుర్కోటానికి కూడా సిద్ధమని జగన్‌తో సమావేశం అనంతరం పలువురు ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఈ విషయంలో టీడీపీ వైఖరి ఎలా ఉన్నప్పటికీ తమవరకు అవిశ్వాస తీర్మానానికి మద్దతునిస్తామని స్పష్టంచేశారు. జగన్‌తో పలువురు ఎమ్మెల్యేలు సమావేశమై ఇదే అంశాన్ని చర్చించి తీర్మానించుకోవటంపై కాంగ్రెస్, టీడీపీలు ఆరా తీశాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు అవిశ్వాసంపై ఓటింగ్‌కు పట్టుపడతారా లేదా అన్నది ప్రధానాంశంగా మారింది. ఈ పరిస్థితుల్లో తమ తమ ఎమ్మెల్యేలు ఆదేశాలను జవదాటకుండా ఉండేలా ఆయా పార్టీలు విప్‌లు జారీచేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే విప్ జారీ చేసింది. పీఆర్పీని కూడా విప్ జారీ చేయాలని కాంగ్రెస్ నేతలు పీఆర్పీ అధినేత చిరంజీవిని ఆదేశించారు. టీడీపీ ఆదివారం విప్ జారీ చే యనుంది. మిగతా పార్టీలు కూడా ఇదే తరహాలో విప్‌లు జారీ చేయడానికి సిద్ధమయ్యాయి.
Share this article :

1 comments:

AVALA ARUN said...

congress kee noo support in andra state
we all will support to our JAGAN anna
because he is son of dr Y S RAJASHEKAR REDDY a great leader for the poor people and at the same time JAGAN anna will do like his father we all will support JAGAN ANNA
JAI YSR....
JAI JAGAN...