సంతకాలు చేయించింది బొత్సే: కొండా సురేఖ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సంతకాలు చేయించింది బొత్సే: కొండా సురేఖ

సంతకాలు చేయించింది బొత్సే: కొండా సురేఖ

Written By ysrcongress on Wednesday, December 7, 2011 | 12/07/2011

మేం విప్‌ను ధిక్కరించినట్లు అసెంబ్లీ రికార్డుల్లో ఉంది కదా..
అనర్హులుగా ప్రకటిస్తే ప్రజల వద్దకు వెళతాం
ఉప ఎన్నికల్లో పులివెందుల ఫలితాలే పునరావృతమవుతాయి
గెలిచినా.. ఓడినా జగన్ వెంటే ఉండాలని నిర్ణయించుకున్నాం
నేటి నుంచి మేం వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులం
ఎన్నో ప్రలోభాలకు, బెదిరింపులకు గురిచేసినా.. 
మాటకు కట్టుబడ్డాం.. మా అందరికీ గర్వంగా ఉంది

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్ర ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన తమపై అనర్హత వేటు వేసే విషయంలో ఆలస్యమెందుకని, అనర్హులుగా ప్రకటిస్తే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి సత్తా చూపిస్తామని వైఎస్సార్ అభిమాన ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరారు. మంగళవారం వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తమను ఎన్నో ప్రలోభాలకు గురిచేసినా లొంగలేదని, బెదిరింపులకు వెరవలేదని స్పష్టంచేశారు. విలువలకు, విశ్వసనీయతకు కట్టుబడి.. జగన్ మాట మేరకు అవిశ్వాసానికే మద్దతిచ్చామని, ఇది తమకు చాలా గర్వంగా ఉందని అన్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలు వారి మాటల్లోనే..

వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులం: సుభాష్ చంద్రబోస్

మేమంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని తీసుకుంటున్నాం. మాపై అనర్హత వేటు వేస్తే.. మా నియోజకవర్గాల్లో జరిగే ఉప ఎన్నికల్లో కూడా కడప, పులివెందుల తరహా ఫలితాలే పునరావృతమవుతాయి. ఒకవేళ ఓడిపోయినా ఏమాత్రం చింత లేదు. ఎప్పటికీ జగన్ వెన్నంటే ఉండాలని నిర్ణయించుకున్నాం. మా శాసనసభా సభ్యత్వం పోతుందని తెలిసినా ఒక సిద్ధాంతానికీ, విధానానికీ కట్టుబడి మా నాయకుడు జగన్ ఆదేశానుసారం ఓటు వేశాం. రైతుల సంక్షేమం కోసం, రైతు కూలీల బాగు కోసం అవిశ్వాస తీర్మానం పెట్టామని చెప్పారు కనుక అందుకు అనుగుణంగానే మా పార్టీ విధానాల ప్రకారం ఓటేశాం. వ్యవసాయ ప్రధానమైన ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా కోనసీమలో లక్ష ఎకరాల్లో క్రాప్ హాలిడే ప్రకటించారు. ఈ పరిస్థితిని మేం చూస్తూ ఊరుకోలేం. అందుకే అవిశ్వాసం ఎవరు పెట్టారన్నదానితో సంబంధం లేకుండా మద్దతిచ్చాం.

సంతకాలు చేయించింది బొత్సే: కొండా సురేఖ

దివంగత మహానేత రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ అసెంబ్లీలో తన తొలి ప్రసంగం చేస్తే బొత్స ఆమెను విమర్శించడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం. జగన్‌పై ఆరోపణలు చేసే అర్హత బొత్సకు లేదు. వైఎస్ చనిపోగానే.. మంత్రులందరినీ తన ఇంటికి అల్పాహార విందుకు పిలిచి జగన్ ముఖ్యమంత్రి కావాలని మా అందరితో సంతకాలు చేయించింది బొత్సనే. ఎమ్మెల్యేల చేత సంతకాలు చేయించింది అప్పటి చీఫ్ విప్ మల్లు భట్టి విక్రమార్క. జగన్ ఎవరినైనా ముఖ్యమంత్రి పదవి కావాలని అడిగారా? కనీసం ఎవరికైనా ఫోన్ చేసి విజ్ఞప్తి చేశారా? చెప్పాలి. అంతే కాదు జగన్‌కు మద్దతు కోరుతూ చిరంజీవి వద్దకు వెళ్లిందెవరో చెప్పాల్సిన బాధ్యత కూడా ఆరోపణలు చేస్తున్న వారిపైనే ఉంది. జగన్ అధిష్టానవర్గాన్ని అడిగింది ముఖ్యమంత్రి పదవి కాదు. ఓదార్పు యాత్ర చేయడానికి అనుమతి మాత్రమే. అవిశ్వాసం చర్చ సందర్భంగా వైఎస్సార్‌నూ, ఆయనను అభిమానించే ఎమ్మెల్యేలను విమర్శించడానికే బాబు సమయాన్ని ఉపయోగించుకున్నారు. వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు సభలో ఉన్నంత సేపూ ఒక్కొక్కరి చుట్టూ ఇద్దరేసి మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు చుట్టుముట్టి వారిని తమవైపు లాక్కునే యత్నం చేశారు. మమ్మల్ని అనర్హులుగా ప్రకటించడానికి ఇంకా మీకు గడువెందుకు? విప్‌ను ఉల్లంఘించి ఓటేశామని స్పష్టంగా అసెంబ్లీ రికార్డుల్లో ఉందికదా! అనర్హులుగా ప్రకటిస్తే మేమంతా ప్రజల వద్దకు వెళతాం.

జగన్ ఎవరినీ ఒత్తిడి చేయలేదు: శోభా నాగిరెడ్డి

అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేయాలని జగన్ మాలో ఎవ్వరినీ ఒత్తిడి చేయలేదు. ‘ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయమని నేనెవ్వరినీ బలవంతం చేయను... నన్ను కాదని పోయే వాళ్ల మీద కోపం కూడా లేదు. నేనేమీ అనుకోను’ అని జగన్ ఎమ్మెల్యేలందరికీ చెప్పారు. అసలు చంద్రబాబుకు అవిశ్వాస తీర్మానంపై చిత్తశుద్ధి లేదనేది సోమవారం నాటి పరిణామాలు చూస్తే ఎవరికైనా అర్థం అవుతుంది. అవిశ్వాసం పెట్టిన నాయకుడెవరైనా సరే ఇతర పక్షాలతో సమన్వయం చేసుకుంటారు.. అయితే బాబు అలాంటి ప్రయత్నమే చేయలేదు. పైగా అవిశ్వాసానికి మద్దతు ఇస్తామని ప్రకటించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనీ, మమ్మల్నీ విమర్శించడానికే ప్రాధాన్యత ఇచ్చారు. అవిశ్వాస తీర్మానాన్ని చంద్రబాబు తనను తాను పొగుడుకోవడానికీ, వైఎస్‌ను విమర్శించడానికే ఉపయోగించుకున్నారు.

ఎన్నో ప్రలోభాలకు గురిచేశారు: టి.బాలరాజు

శాసనసభలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలంటూ నన్ను ఎన్నో ప్రలోభాలకు గురిచేశారు. డబ్బులు, పదవులు, నియోజకవర్గానికి ప్యాకేజీలు అంటూ ఎన్ని ఆశలు చూపినా.. తలొగ్గలేదు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నాను. నేను లొంగకపోయే సరికి చివరికి భయపెట్టాలని చూశారు. అయినా బెదరలేదు. విశ్వసనీయత, విలువలకు కట్టుబడి జగన్ మాట మేరకు రైతు సమస్యల పట్ల అవిశ్వాసానికి మద్దతుగా నిలిచినందుకు రాష్ట్ర ప్రజలు హర్షిస్తున్నారు. 

ఆనందంగా ఉంది: ధర్మాన కృష్ణదాస్

కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినందుకు మాకు ఆనందంగా ఉంది. కడవరకూ మేం జగన్ వెంటే ఉంటాం. సోమవారం రోజంతా అధికారపక్షం నుంచి రకరకాల ప్రలోభాలు పెట్టారు. అయినా ఎవ్వరూ లొంగలేదు. ధైర్యశాలి అయిన జగన్‌కు మరింత బలం చేకూర్చాలనే ఉద్దేశంతోనే ఆయన వెంట నిలిచాం. శాసనసభ సభ్యత్వం పోతుందనీ మాకు తెలుసు. ఎన్నికలకు సిద్ధపడే ఈ నిర్ణయం తీసుకున్నాం. మా ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల్లో తప్పకుండా ప్రజా విశ్వాసం చూరగొంటారు. వైఎస్ బొమ్మను పెట్టుకుని గెలిచిన వారందరూ.. ప్రతిపక్షం ఆయనను తిడుతూ ఉంటే మౌనంగా ఉండడం చూసి చాలా బాధనిపించింది.

అండమాన్‌కు పంపుతారట: మేకతోటి సుచరిత

అవిశ్వాసం సందర్భంగా ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయకపోతే, కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఉన్న నా భర్తను వేధిస్తామని మంత్రులు బెదిరించారు. ‘‘ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయకపోతే నీ భర్తకు వేధింపులు తప్పవు. కేంద్రంలో కూడా మా ప్రభుత్వమే ఉంది. నీ భర్త ఉద్యోగానికి చిక్కులు పెడతాం. మానసికంగా వే ధించడానికి గౌహతి లేదా అండమాన్‌కు ట్రాన్స్‌ఫర్ చే యిస్తాం’’ అని కాంగ్రెస్ నేతలు బెదిరింపులకు పాల్పడ్డారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకున్నా. ఎన్ని కష్టాలెదురైనా ఎదురొడ్డి పోరాడతాను.

గర్వంగా ఉంది: గొల్ల బాబూరావు
రైతు సమస్యల మీద ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాసంపై మాటకు కట్టుబడి అనుకూలంగా ఓటు వేసినందుకు చాలా గర్వంగా ఉంది. ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా మేంలొంగలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకత్వంలో ప్రజల పక్షాన నిలబడినందుకు పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలు హర్షిస్తున్నారు. నాపై కాంగ్రెస్ పార్టీ అనర్హత వేటు వేసినాలెక్కచేయను. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతిచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక మామూలు ఉద్యోగినైన నన్ను దివంగత వైఎస్సార్ పిలిచి టికెట్ ఇచ్చి గెలిపించారు. ఈ రాజకీయ భిక్ష వైఎస్ కుటుంబం పెట్టిందే. రాజకీయాల్లో ఉన్నన్నాళ్లూ ఆ కుటుంబానికి అండగా ఉండాలని నిర్ణయించుకున్నా. ఇందులో ఎప్పటికీ ఎలాంటి మార్పూ ఉండదు.

మాదే గెలుపు: ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి

ఉపఎన్నికలు సంభవిస్తే వాటిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తప్పకుండా విజయం సాధిస్తారు. అవిశ్వాసానికి ఓటు వేసే విషయంలో విలువలకు కట్టుబడాలన్న జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం మేరకే మేం నడుచుకున్నాం. మా శాసనసభ్యత్వం రద్దు అవుతుందని తెలిసీ అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేసిన సంఘటన దేశ చరిత్రలో చరిత్రాత్మకమైనదిగా గుర్తుండిపోతుంది. ఉప ఎన్నికలొస్తే.. ప్రజల్లోకి వెళతాం. ప్రజా వ్యతిరేక ప్రభుత్వ విధానాలను వారికి వివరిస్తాం. వైఎస్సార్‌పై నిందలు వేయడం, వైఎస్ కుటుంబంపై విమర్శలు చేయడం మినహా రైతులు, పేద ప్రజలకోసం బాబు అవిశ్వాసం పెట్టలేదని ప్రజలకు అర్థమైంది.
(అమర్‌నాథ్‌రెడ్డి రాజంపేటలో ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు)
Share this article :

0 comments: