సాగు సమస్యలు పట్టని ప్రభుత్వం రాష్ట్రానికే పెను ముప్పు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సాగు సమస్యలు పట్టని ప్రభుత్వం రాష్ట్రానికే పెను ముప్పు

సాగు సమస్యలు పట్టని ప్రభుత్వం రాష్ట్రానికే పెను ముప్పు

Written By ysrcongress on Monday, December 5, 2011 | 12/05/2011

వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలకు స్పష్టంచేసిన జగన్
సాగు సమస్యలు పట్టని ప్రభుత్వం రాష్ట్రానికే పెను ముప్పు
రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలతో సంబంధం లేకుండా
అవిశ్వాసం ఎవరు పెట్టినా మద్దతివ్వాలని సూచన
ప్రభుత్వం పడుతుందా.. లేదా అన్నది పక్కనపెట్టి 
సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని స్పష్టీకరణ
ప్రభుత్వం పడిపోదని, మాపై వేటు పడుతుందన్న 
ఎత్తుగడతోనే చంద్రబాబు తీర్మానం: ఎమ్మెల్యేలు
అయినా వెనకడుగేయం.. పార్టీ నిర్ణయమే శిరోధార్యం
ఎవరు తోడు వచ్చినా రాకున్నా.. 
రైతు వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఓటు
అనర్హత వేటు పడితే.. ఉప ఎన్నికలకూ సిద్ధం

హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో 70 శాతం మందికి జీవనాధారమైన వ్యవసాయ రంగం సంక్షోభంలో చిక్కి విలవిల్లాడుతున్నా.. దాన్ని నమ్ముకున్న రైతు, రైతు కూలీ బతుకులు బక్కచిక్కిపోతున్నా.. వారిని అనాథల్లా వదిలేసిన ఈ అధ్వాన ప్రభుత్వం రాష్ట్రానికే పెను ముప్పని, దాన్ని తక్షణమే గద్దె దించాల్సిన అవసరం ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన వైఎస్ రాజశేఖరరెడ్డి రెక్కల కష్టంపై అధికారంలోకొచ్చిన ఈ కాంగ్రెస్ సర్కారు.. ఇప్పుడు ఆ రైతన్న బతుకుతోనే చెలగాటమాడుతోందని దుయ్యబట్టింది. 

లక్ష ఎకరాలను బీడుపెట్టి సాగు సమ్మెకు దిగినా అన్నదాతలను ఆదుకున్న పాపానపోలేదని, కల్లబొల్లి హామీలు, కంటితుడుపు మాటలు మినహా.. కచ్చితమైన కార్యాచరణతో రైతన్నకు భరోసా ఇవ్వలేకపోయిందని వైఎస్సార్ కాంగ్రెస్ ధ్వజమెత్తింది. ఇలాంటి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు.. రాజకీయ వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో సంబంధం లేకుండా, విలువలకు, విశ్వసనీయతకు కట్టుబడి.. సోమవారం నాటి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన వైఎస్ అభిమాన ఎమ్మెల్యేల సమావేశం దృఢ నిర్ణయం తీసుకుంది.

శాసనసభలో సోమవారం అవిశ్వాసంపై ఓటింగ్ జరగనున్న తరుణంలో.. పార్టీ విలువలకు కట్టుబడి తీసుకున్న నిర్ణయాన్ని జగన్‌మోహన్‌రెడ్డి సమావేశంలో ఎమ్మెల్యేలకు తెలియజేశారు. అవిశ్వాసం ఎవరు ప్రవేశపెట్టారన్న అంశంతో సంబంధం లేకుండా.. అన్ని విషయాల్లోనూ విఫలమైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడాలని సమావేశంలో నిర్ణయించారు. అనంతరం ఎమ్మెల్యేలు విలేకరులతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు తెలిసినా.. ప్రభుత్వం పడిపోతుందా? లేక కొనసాగుతుందా.. అన్న అంశంతో సంబంధం లేకుండా.. పార్టీ సూత్రబద్ధ నిర్ణయానికి కట్టుబడి అవిశ్వాసానికి మద్దతిస్తాం’ అని స్పష్టంచేశారు.

రైతుకు, రైతుకూలీకీ.. ఇద్దరికీ భరోసాలేదు

సమావేశంలో జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ఓదార్పు యాత్రలో పల్లెలకు వెళ్లినప్పుడు అక్కడ రైతుల దుస్థితిని కళ్లారా చూశాను. ఓవైపు ఎరువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఓ రోజున్న రేటు మరుసటి రోజుకి మరింత పెరుగుతోంది. వేళాపాళా లేని కరెంటు కోతలు.. అయినా కష్టపడి సాగుచేస్తే ఇటు పంటకు మద్దతు ధర రావట్లేదు. రైతుకు భరోసా లేదు. పంట కోయడానికే భయపడుతున్నామని రైతన్నలు అంటుంటే.. గుండె తరుక్కుపోయింది’ అని ఆవేదన వ్యక్తంచేశారు. ‘రైతునే నమ్ముకున్న కూలీకీ భరోసాలేదు. ఉప్పూ, పప్పుల ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో రోజుకు రూ.100 కూలీ రావడమే కష్టంగా ఉంది. కూలీ పెంచమని రైతన్నకి చెప్దామంటే.. అతడి పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. పొగాకు, పత్తి, పసుపు రైతుల పరిస్థితీ ఇంతే. ఇలాంటి దుస్థితికి కారణమైన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంకా కొనసాగించడం.. ఏ మాత్రం సమంజసం కాదు’ అని జగన్ అన్నట్లు తెలిసింది. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ఏ పార్టీ అవిశ్వాసం పెట్టినా మద్దతు ఇవ్వాలని ఆయన సూచించినట్లు సమాచారం. అయితే అన్నదాతలపై మొసలి కన్నీరు కారుస్తూ.. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రవేశపెట్టిన తీర్మానంలో చిత్తశుద్ధి ఉందని తాము ఏ కోశానా భావించడంలేదని ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వం పడిపోదనే చంద్రబాబు ధీమా..

చంద్రబాబు ఏం చేసినా రాజకీయాలనే దృష్టిలో పెట్టుకుని చేస్తారని, తాజా అవిశ్వాసం వెనుకా అలాంటి కారణమే ఉందని వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు సమావేశంలో అభిప్రాయపడ్డారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ.. కాంగ్రెస్‌లో విలీనం కాకముందే ఈ అవిశ్వాసం పెట్టి ఉంటే.. ఈ దిక్కుమాలిన ప్రభుత్వం పడిపోయి ఉండేదని అన్నారు. ఆ సమయంలో ఓ వైపు లైలా తుపాను, జల్ తుపాను రైతాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేసినా.. పాలకుల నుంచి కనీస సాయం అందలేదని, మరోవైపు ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఆత్మహత్యలకు సైతంసిద్ధపడ్డారని కొందరు ఎమ్మెల్యేలు గుర్తుచేశారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన వరలక్ష్మి అనే విద్యార్థిని ఈ ఫీజు రీయింబర్స్‌మెంటు దక్కకే ప్రాణాలు తీసుకుందని అన్నారు. అంతటి తీవ్రమైన పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నప్పుడు చంద్రబాబు ఆ సమస్యలపై కనీసం స్పందించలేదని, అవిశ్వాసం పెట్టమంటే.. పెట్టలేదని దుయ్యబట్టారు. ఇప్పుడు మాత్రం రైతులపై ప్రేమ ఒలకబోస్తూ.. ఎలాగూ ప్రభుత్వం పడిపోదన్న నిర్ణయానికొచ్చాక అవిశ్వాసం డ్రామాను తెరపైకి తెచ్చారని అన్నారు.

వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలే.. బాబు లక్ష్యం..

వైఎస్సార్ అభిమాన ఎమ్మెల్యేలను ఇరుకునపెట్టాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు ఇప్పుడు అవిశ్వాసాన్ని తెరపైకి తెచ్చారని సమావేశం అభిప్రాయపడింది. ప్రభుత్వం ఎలాగూ పడిపోదు కాబట్టి.. వైఎస్ అభిమాన ఎమ్మెల్యేలు తీర్మానానికి మద్దతిస్తే వారిపై అనర్హత వేటు పడుతుందని, ఒకవేళ మద్దతివ్వకుంటే.. కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ కలిసి కుట్ర చేశాయని ఆరోపించొచ్చని చంద్రబాబు కుట్ర పన్నారని నేతలు పేర్కొన్నారు. ఆయన కుట్రలు తమకు స్పష్టంగా అర్థమైనప్పటికీ, తమ పదవులు పోయి ఉప ఎన్నికలు వచ్చే అవకాశముందని తెలిసినప్పటికీ.. తాము అవిశ్వాసానికి మద్దతు ఇస్తామని ఎమ్మెల్యేలు స్పష్టంచేశారు. 

సమావేశానంతరం ఎమ్మెల్యేలు విలేకరులతో మాట్లాడుతూ..‘చంద్రబాబు ఎత్తుజిత్తులు, వ్యూహ ప్రతివ్యూహాలతో సంబంధం లేకుండా.. విలువలు, విశ్వసనీయతలకు కట్టుబడి.. అవిశ్వాసం ఎవరు పెట్టినా మద్దతివ్వాలని పార్టీ సూత్రబద్ధంగా నిర్ణయించింది. ఎమ్మెల్యేలు ఎంతమంది తోడు వస్తారన్న సంఖ్యతో సంబంధం లేకుండా.. పార్టీ నిర్ణయానుసారం.. ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి మా శాయశక్తులా కృషి చేస్తాం. ఇందులో వెనక్కు తగ్గేది లేదు. అనర్హత వేటు పడితే.. ఉప ఎన్నికలకూ మేం సిద్ధం’ అని స్పష్టంచేశారు. అవిశ్వాసానికి మద్దతుగా నిలుస్తున్న ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌వారు ప్రలోభపెడుతున్నారని, పలువురిని బెదిరిస్తున్నట్లు సమాచారం వస్తోందని, ఆ విషయంపైన కూడా సమావేశంలో చర్చించామని శాసనసభ్యులు తెలిపారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసి ఎన్ని ప్రతికూల పరిస్థితులు కల్పించినప్పటికీ రైతుకు, రైతు కూలీలకు బాసటగా నిలిచే విషయంలో వెనక్కు తగ్గేది లేదన్నారు.
Share this article :

0 comments: