జస్టిస్ ఈశ్వరయ్య కుటుంబసభ్యులు తెలుగుదేశం పార్టీలో - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జస్టిస్ ఈశ్వరయ్య కుటుంబసభ్యులు తెలుగుదేశం పార్టీలో

జస్టిస్ ఈశ్వరయ్య కుటుంబసభ్యులు తెలుగుదేశం పార్టీలో

Written By ysrcongress on Friday, December 9, 2011 | 12/09/2011

బాబు అక్రమాస్తుల కేసులో అనూహ్య మలుపు

విచారణ నుంచి తప్పుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి



*జస్టిస్ ఈశ్వరయ్య నేతృత్వంలోని ధర్మాసనానికి బాధ్యతలు
*రిలయన్స్ ఇంప్లీడ్ పిటిషన్ నేపథ్యంలో చీఫ్ జస్టిస్ లోకూర్ నిర్ణయం
*రిలయన్స్‌లో తనకూ వాటాలున్నాయని వెల్లడి
*అందువల్ల ఈ కేసును తాను విచారించడం సబబు కాదన్న సీజే
*ఈ వ్యవహారంపై ముందుగానే బాబు సన్నిహితుల కసరత్తు
*‘నాట్ బిఫోర్’లతో చక్రం తిప్పిన టీడీపీ నేతలు
*టీడీపీతో జస్టిస్ ఈశ్వరయ్య కుటుంబసభ్యులకు ప్రత్యక్ష సంబంధాలు!
*టీడీపీ తరఫున జెడ్పీటీసీగా పనిచేసిన ఆయన సతీమణి
*కుటుంబ సభ్యులంతా ఆ పార్టీలో క్రియాశీలంగా ఉన్నవారే

హైదరాబాద్, న్యూస్‌లైన్: చంద్రబాబు అక్రమాస్తుల కేసు ఊహించని మలుపు తిరిగింది. సీబీఐ ప్రాథమిక విచారణకు ఆదేశించడంలో తప్పేముందంటూ హైకోర్టు ధర్మాసనం కీలక ప్రశ్నలు సంధిస్తున్న సమయంలో.. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయడం ఈ కేసును కీలక మలుపు తిప్పింది. చంద్రబాబు అక్రమాస్తులపై సీబీఐ విచారణ కోరుతూ వైఎస్ విజయమ్మ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని, సీబీఐ విచారణకు ఆదేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ చంద్రబాబు, రామోజీరావు, సీఎం రమేష్ తదితరులు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను తాము విచారించబోమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి.లోకూర్, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం గురువారం తేల్చి చెప్పింది. 

చంద్రబాబుకు మద్దతుగా రిలయన్స్ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో.. రిలయన్స్‌లో తనకు వాటాలు ఉన్నందున ఈ కేసును తాను విచారించడం సబబుగా ఉండదని, అందువల్ల ఈ కేసు మొత్తాన్ని మరో ధర్మాసనానికి నివేదిస్తున్నానని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ కేసును విచారించే బాధ్యతను న్యాయమూర్తులు జస్టిస్ వంగాల ఈశ్వరయ్య, జస్టిస్ కె.ఎస్.అప్పారావులతో కూడిన ధర్మాసనానికి అప్పగించారు. ఊహించని పరిణామంతో ఈ కేసును మొదటినుంచీ ఆసక్తిగా పరిశీలిస్తున్న న్యాయవాద వర్గాలన్నీ తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యాయి. శుక్రవారం చంద్రబాబు తదితరుల అనుబంధ పిటిషన్లను జస్టిస్ ఈశ్వరయ్య నేతృత్వంలోని ధర్మాసనం విచారించనున్నది.

ప్రతివాది కాకున్నా రిలయన్స్ ఇంప్లీడ్ పిటిషన్!
చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులు పెద్ద ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టారని, బాబు తన బినామీలైన రామోజీరావు, సీఎం రమేష్ తదితరులకు భారీస్థాయిలో ప్రయోజనాలు చేకూర్చి ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చారని పేర్కొంటూ.. దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు ధర్మాసనం... చంద్రబాబు అక్రమాస్తులపై విచారణ జరిపి వేర్వేరుగా నివేదికలు ఇవ్వాలని గత నవంబర్ 14న సీబీఐ, ఈడీ తదితరులను ఆదేశించింది. దీనిపై రామోజీ, సీఎం రమేష్ తదితరులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు, రామోజీరావు తదితరులు హైకోర్టులో వేర్వేరుగా అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ అనుబంధ పిటిషన్లన్నింటిపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ ప్రారంభించింది. గత రెండురోజుల్లో రామోజీ తరఫు న్యాయవాదికి పలు కీలక ప్రశ్నలు సంధించింది. ఈ నేపథ్యంలో ఎవరూ ఊహించని విధంగా రిలయన్స్ ఈ కేసులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసింది. తమకు నోటీసులు ఇవ్వకుండానే హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించిందని అందులో పేర్కొంది. వాస్తవానికి రిలయన్స్‌కు హైకోర్టు నోటీసులు ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే విజయమ్మ తన పిటిషన్‌లో రిలయన్స్‌ను ప్రతివాదిగా చేర్చనే లేదు. ప్రతివాదిగా కానప్పటికీ తమకు హైకోర్టు నోటీసులు ఇవ్వలేదని రిలయన్స్ చెప్పడం హాస్యాస్పదమని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

బాబు సన్నిహితుల దూరాలోచన నేపథ్యంలో..
అయితే ఈ కేసు విచారణ బాధ్యతలు జస్టిస్ ఈశ్వరయ్య నేతృత్వంలోని ధర్మాసనానికి వెళ్లడం వెనుక కొన్ని ప్రత్యేక కారణాలే ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఏదైనా కారణం చేత తమ అనుబంధ పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించని పక్షంలో ఏం జరుగుతుందనే దానిపై చంద్రబాబుకు సన్నిహితుడైన ఒకరు చేసిన దూరాలోచనే ఈ కేసు జస్టిస్ ఈశ్వరయ్య ధర్మాసనం ముందుకు రావడానికి కారణమైందని భావిస్తున్నారు. టీడీపీ న్యాయవాదులు హైకోర్టులో ప్రస్తుతం అమలవుతున్న ‘నాట్ బిఫోర్’ (నా ముందు వద్దు) విధానాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నారని సమాచారం. 

ప్రధాన న్యాయమూర్తి ఈ కేసును విచారించడానికి నిరాసక్తత కనబరచిన నేపథ్యంలో ఈ కేసు వాస్తవానికి జస్టిస్ గులాం మహ్మద్, జస్టిస్ నూతి రామ్మోహనరావులతో కూడిన ధర్మాసనం ముందుకు రావాలి. ఇదే ధర్మాసనం చంద్రబాబు అక్రమాస్తులపై దర్యాప్తునకు ఆదేశించింది. కానీ తమ పిటిషన్లు ఈ ధర్మాసనం ముందుకు వెళ్లకూడదనే ఉద్దేశంతో టీడీపీ నేతలు.. ఈ ఇద్దరు న్యాయమూర్తుల ముందు నాట్ బిఫోర్‌గా ఉన్న ఇద్దరు న్యాయవాదులు.. సి.రామచంద్రరాజు, డి.శ్రీనివాసరావులతో తమ తరఫున వకాలత్‌లు దాఖలు చేయించినట్లు సమాచారం. దీంతో ఈ కేసు జస్టిస్ గులాం మహ్మద్ నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. జస్టిస్ గులాం మహ్మద్ తరువాత సీనియర్ అయిన జస్టిస్ ఎ.గోపాల్‌రెడ్డి ఈ నెల 20న పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో.. సంప్రదాయం ప్రకారం ఆయనకు బాధ్యతలు అప్పగించలేదు. 

ఇక జస్టిస్ గోడా రఘురాం నేతృత్వంలోని ధర్మాసనం.. జస్టిస్ వి.వి.ఎస్.రావు నేతృత్వంలోని ధర్మాసనం ముందు కూడా సి.రామచంద్రరాజు నాట్ బిఫోర్‌గా ఉన్నారు. దీంతో అక్కడ కూడా కేసు విచారణకు వచ్చే అవకాశమే లేదు. ఏ ధర్మాసనం ముందుకు కేసు వస్తే తమకు ఇబ్బందిగా ఉంటుందో.. ఆ ధర్మాసనం వద్ద నాట్ బిఫోర్‌గా ఉన్న న్యాయవాదులతో టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగానే వకాలత్‌లు దాఖలు చేయించారు. ఒకవేళ జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనానికి ఈ బాధ్యతలు అప్పగించినా.. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఆ ధర్మాసనం ఈ కేసును విచారించే పరిస్థితులు లేవు. ఇక మిగిలింది జస్టిస్ ఈశ్వరయ్య నేతృత్వంలోని ధర్మాసనం ఒక్కటే. ఆ మేరకు ఈ కేసు విచారణ విచారణ బాధ్యతలు ఆ ధర్మాసనానికే వెళ్లాయి.

ఈశ్వరయ్య కుటుంబానికి టీడీపీతో సంబంధాలు!
తెలుగుదేశం పార్టీతో జస్టిస్ వంగాల ఈశ్వరయ్య కుటుంబా నికి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జస్టిస్ ఈశ్వరయ్య ఈ కేసును విచారిస్తుండటంపై న్యాయవాద వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులు కాక ముందు ఆయన భార్య వంగాల శ్యామలాదేవి నల్గొండ జిల్లా వలిగొండ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున జెడ్‌పీటీసీగా ఎన్నికయ్యారు. 1994 నుంచి దాదాపు ఐదు సంవత్సరాల పాటు ఈశ్వరయ్య న్యాయమూర్తిగా నియమితులయ్యేంతవరకు ఆ పదవిలో కొనసాగారు. 

జస్టిస్ ఈశ్వరయ్య కుటుంబసభ్యులు పలువురు ఇప్పటీకీ నల్గొండ జిల్లాలో తెలుగుదేశం పార్టీలో పలు పదవులు నిర్వహిస్తూ క్రియాశీలకంగా ఉన్నారు. జస్టిస్ ఈశ్వరయ్య తండ్రి వంగాల అంజయ్యగౌడ్. ఆయనకు నలుగురు కుమారులు.. వంగాల బాలనర్సయ్య గౌడ్, వంగాల స్వామిగౌడ్, వంగాల ఈశ్వరయ్యగౌడ్, వంగాల వాసుగౌడ్ ఉన్నారు. 

బాలనర్సయ్యగౌడ్ : ఈయన 2010లో రివాల్వర్‌తో కాల్చుకుని చనిపోయారు. ఈయన 2006 నుంచి చనిపోయేంత వరకు తెలుగుదేశం పార్టీకి వలిగొండ మండలాధ్యక్షుడిగా పనిచేశారు. సారా, మద్యం కాంట్రాక్టర్. ఆర్ధికంగా బాగా ఉన్న వ్యక్తి.

స్వామిగౌడ్: గ్రామంలోనే ఉండేవారు. వ్యవసాయం తదితర పనులు చూసుకునేవారు. అనారోగ్యంతో చాలాకాలం కిందటే మరణించారు.

ఈశ్వరయ్యగౌడ్ : ప్రస్తుత హైకోర్టు న్యాయమూర్తి. ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఒక కుమారుడు రామచంద్రగౌడ్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. భార్య శ్యామలాదేవి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు.

వాసుగౌడ్ : ఈయన 2006లో వలిగొండ మండలం, నెమలికాల్వ నుంచి తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీగా గెలుపొందారు. ఇటీవల ఎంపీటీసీల పదవీకాలం ముగిసేదాకా ఆ పదవిలో ఉన్నారు.

జస్టిస్ ఈశ్వరయ్య పెదనాన్న కుమారుడి పేరు కూడా వంగాల స్వామిగౌడే. ఆయన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నల్లగొండ జిల్లా కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈయన 2004 ఎన్నికల్లో మిర్యాలగూడ లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు.

న్యాయవ్యవస్థ ప్రతిష్టను నిలబెట్టిన సీజే
టీడీపీతో తన కుటుంబానికి ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్న జస్టిస్ ఈశ్వరయ్య.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు, కీలక నేతలు సీఎం రమేష్, నామా నాగేశ్వరరావు తదితరులు దాఖలు చేసిన పిటిషన్లను విచారించనుండటంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. రిలయన్స్‌లో కేవలం తనకు వాటాలు ఉన్నందుకే చీఫ్ జస్టిస్ మదన్ బి.లోకూర్ ఈ కేసు విచారణ నుంచి తప్పుకుని..ఏ విధంగా అయితే న్యాయవ్యవస్థ ప్రతిష్టను నిలబెట్టారో.. అదే విధంగా జస్టిస్ ఈశ్వరయ్య కూడా ఈ కేసు నుంచి తప్పుకుంటే న్యాయవ్యవస్థపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని న్యాయ నిపుణులు అంటున్నారు.

ఏమిటీ నాట్ బిఫోర్?!
న్యాయవాది గానీ, జిల్లా జడ్జి గానీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన వెంటనే హైకోర్టులో తనకు సన్నిహితులు, మిత్రులు, జూనియర్లు తదితర న్యాయవాదుల పేర్లను రిజిస్ట్రీకి పంపి, వీరు దాఖలు చేసే కేసులను తమ ముందు విచారణకు రానివ్వద్దని ఆదేశిస్తారు. ఇలా తము ముందు ఫలానా న్యాయవాదుల కేసులను విచారణకు వేయవద్దని చెప్పడాన్నే నాట్ బిఫోర్ అంటారు. ఇటీవలి కాలంలో కొందరు న్యాయవాదులు ఉద్దేశపూర్వకంగానే న్యాయమూర్తులతో అకారణంగా ఘర్షణకు దిగుతూ.. నాట్‌బిఫోర్ జాబితాలో చేరుతున్నారు. తద్వారా సదరు న్యాయమూర్తి ముందు తమ కేసులు రాకుండా చేసుకుంటూ ఆయాచిత లబ్ది పొందుతున్నారు. 

నిబంధనలకు అనుగుణంగా కేసులను విచారించే న్యాయమూర్తుల ముందు తమ కేసులు రాకుండా ఉండేందుకు కొందరు తెలివిగా ఈ నాట్‌బిఫోర్ న్యాయవాదులను ప్రయోగిస్తున్నారు. కొందరు న్యాయవాదులు ఇటీవలి కాలంలో నాట్‌బిఫోర్‌ను అడ్డంపెట్టుకుని పెద్ద మొత్తంలో డబ్బు ఆర్జించారు. ఇలా ఓ న్యాయవాది దిల్‌సుఖ్‌నగర్ సమీపంలో ఓ ఇండిపెండెంట్ ఇల్లు, ఖరీదైన కారు కూడా కొనుగోలు చేశారు.
Share this article :

0 comments: