జనం కోర్టులో జగన్ నిర్దోషి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జనం కోర్టులో జగన్ నిర్దోషి

జనం కోర్టులో జగన్ నిర్దోషి

Written By news on Wednesday, January 16, 2013 | 1/16/2013


గత ఉప ఎన్నికల ఫలితాలు, జనం సంతకాలే రుజువు: విజయమ్మ 
పార్టీ ప్రతినిధులతో రాష్ట్రపతిని కలిసిన విజయమ్మ, వినతిపత్రం సమర్పణ
కోటీ 96 లక్షల సంతకాలు పార్టీ కార్యాలయానికి చేరగా వాటిలో కోటీ 56 లక్షల సంతకాలు స్కాన్ చేసి.. ఆ సీడీలు రాష్ట్రపతికి అందజేత
జగన్‌కు ప్రజాదరణ చూసి ఓర్వలేకే కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కయ్యాయి
ఆ రెండు పార్టీలు సీబీఐతో కలిసి జగన్‌ను జైలులో పెట్టించాయి 
ఈ కుమ్మక్కు కుట్రలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దృష్టికి తీసుకెళ్లాం 
బెయిల్ రాకుండా అడ్డుకుంటున్న సీబీఐ కక్షపూరిత ధోరణిని వివరించాం 
అన్ని అంశాలను పరిశీలిస్తామని ప్రణబ్ హామీ ఇచ్చారన్న విజయమ్మ

సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి క్రమంగా ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై సీబీఐని అడ్డం పెట్టుకొని సాగిస్తున్న కుట్రలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ తెలిపారు. విచారణ పేరుతో జగన్‌కు బెయిల్ రాకుండా అడ్డుకుంటూ సీబీఐ సాగిస్తున్న కక్షపూరిత ధోరణిని రాష్ట్రపతికి నివేదించామన్నారు. కాంగ్రెస్‌ను వీడి బయటికొచ్చాక జరిగిన కడప ఉప ఎన్నికలు మొదలుకొని ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ జగన్ నిర్దోషని ప్రజలు స్పష్టంగా తీర్పు ఇచ్చారని విజయమ్మ పేర్కొన్నారు. ప్రస్తుతం పార్టీ చేపట్టిన ‘జగన్ కోసం - జనం సంతకం’ ఉద్యమంలోనూ రెండు కోట్ల మంది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని జగన్ అక్రమ అరెస్ట్‌ను నిరసించారని చెప్పారు. జనం కోర్టులో జగన్ నిర్దోషి అని తీర్పుచెప్పారన్నారు. ఈ అంశాలన్నింటినీ ప్రణబ్ దృష్టికి తీసుకెళ్లామని ఆమె తెలిపారు. రాజ్యాంగ పెద్దగా కుమ్మక్కు కుట్రలను అర్థం చేసుకుని జగన్ అరెస్ట్ విషయంలో సరైన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. అన్ని అంశాలనూ పరిశీలిస్తానని రాష్ట్రపతి ఈ సందర్భంగా హామీ ఇచ్చినట్లు విజయమ్మ చెప్పారు. 

రాష్ట్రపతితో విజయమ్మ బృందం భేటీ...

జగన్ అక్రమ అరెస్ట్‌కు నిరసనగా జగన్ కోసం-జనం సంతకం పేరిట చేపట్టిన సంతకాలను రాష్ట్రపతికి అందించేందుకు ఢిల్లీకి వచ్చిన విజయమ్మ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం మంగళవారం సాయంత్రం 6.30 నిమిషాలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రణబ్ ముఖర్జీతో భేటీ అయింది. విజయమ్మతో పాటు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శోభానాగిరెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, కె.శ్రీనివాసులు, గొల్ల బాబూరావు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు, పార్టీ సీఈసీ సభ్యుడు కోన రఘుపతిలు రాష్ట్రపతితో 15 నిమిషాల పాటు భేటీ అయ్యారు. కేవలం మూడు వారాల్లో సేకరించిన కోటీ 56 లక్షల సంతకాలతో స్కాన్ చేసిన సీడీలను రాష్ట్రపతికి అందించారు. జగన్ అక్రమ అరెస్ట్‌ను వివరిస్తూ, సరైన న్యాయం చేయాలని కోరుతూ 4 పేజీల నోట్‌ను ఆయనకు అందించారు. కేవలం మూడు వారాల్లో 2 కోట్ల సంతకాలు సేకరించటంపై రాష్ట్రపతి ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాష్ట్రపతితో భేటీ అనంతరం విజయమ్మ విలేకరులతో మాట్లాడారు. 

విచారణ పేరుతో జగన్ బయటకు రాకుండా కుట్ర... 

జగన్ బెయిల్‌పై బయటకు రాకుండా సీబీఐ దర్యాప్తు పేరుతో అడ్డుకుంటోందని విజయమ్మ ఆరోపించారు. 90 రోజుల్లో దర్యాప్తు పూర్తికాకపోతే.. బెయిల్ ఇవ్వాలని చట్టంలో విస్పష్టంగా ఉన్నా.. చార్జిషీట్‌లు వేస్తున్నామంటూ సీబీఐ కుట్రపూరితంగా వ్యవహరిస్తూ జగన్ బెయిల్‌ను అడ్డుకుంటోందని ధ్వజమెత్తారు. ‘‘మాటమీద నిలబడటం నేరంగా, రోజురోజుకూ ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై సీబీఐతో కలిసి ఈ రోజు విచారణ పేరుతో జగన్‌ను ఎనిమిది నెలలుగా జైలులో పెట్టించారు. 17 నెలలుగా దర్యాప్తు జరుగుతున్నా సీబీఐ చార్జిషీట్ల పేరుతో కుట్ర పన్నుతోంది. 90 రోజుల్లో దర్యాప్తు పూర్తిచేయకపోతే బెయిల్ ఇవ్వటం రాజ్యాంగపరమైన హక్కు. అయినా.. 8 నెలలుగా చార్జిషీట్లు వేస్తూ ఉన్నాం, విచారణ ముగియలేదు అన్న సాకుతో జగన్ మరిన్ని రోజులు జైలులో ఉండేలా చేస్తోంది’’ అని ఆమె వివరించారు. 

ప్రజా కోర్టులో ప్రతిసారీ జగన్ నిర్దోషిగా తేలారు... 

ఇదే సమయంలో ప్రజాకోర్టులో జగన్ ప్రతిసారీ నిర్దోషిగా తేలారని విజయమ్మ పేర్కొన్నారు. ‘‘జగన్ కాంగ్రెస్ నుంచి బయటికొచ్చాక కడప లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల్లో 5 లక్షల పైచిలుకు మెజారిటీతో గెలిచారు. 18 నియోజకవర్గాల ఉప ఎన్నికల్లోనూ 15 అసెంబ్లీ స్థానాలతో పాటు మరో ఎంపీ స్థానాన్ని కూడా అత్యంత మెజారిటీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలు కొన్ని స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ ప్రజాకోర్టులో జగన్ నిర్దోషని రుజువవుతూ వచ్చింది’’ అని చెప్పారు. ‘జగన్ అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ మనం ఏమీచేయలేమా?’ అని ప్రజలు తనను కలిసి అడిగారని.. వారి ఆకాంక్ష మేరకే జగన్ కోసం - జనం సంతకం కార్యక్రమానికి పిలుపునిచ్చామని విజయమ్మ తెలిపారు. కోటీ సంతకాలు చేపట్టాలని తాము భావించినా సుమారు 2 కోట్ల మంది స్వచ్ఛందంగా సంతకాలు చేశారని వివరించారు. కోటి 96 లక్షల మంది సంతకాలు పార్టీ కార్యాలయానికి చేరగా ఇందులో 1.56 కోట్ల సంతకాలను స్కాన్ చేసి సీడీల రూపంలో రాష్ట్రపతికి అందించామన్నారు. మరో 30 లక్షల సంతకాల వరకు వివిధ జిల్లాల నుంచి పార్టీ కార్యాలయానికి చేరే అవకాశం ఉందన్నారు. ప్రజాకోర్టులో జగన్ నిర్దోషిగా తేలినా.. సీబీఐ మాత్రం దోషిగా చూపేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నట్లు రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లామన్నారు. ‘‘జగన్‌ను అన్యాయంగా, అక్రమంగా అరెస్ట్ చేశారు. అందరికీ సమాన న్యాయం చేసే బాధ్యత మీపై ఉంది. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకుని తగిన న్యాయం జరిగేలా చూడాలని రాష్ట్రపతిని కోరాం’’ అని తెలిపారు. దీనిపై రాష్ట్రపతి స్పం దిస్తూ.. తాము అందించిన నోట్‌ను ప్రధానమంత్రికి పంపిస్తానని, అన్ని అంశాలను పరిశీలిస్తానని హామీ ఇచ్చారని విజయమ్మ తెలిపారు. ‘కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారనే విమర్శలు మీపై వస్తున్నాయ’ని కొందరు విలేకరులు ఈ సందర్భంగా ప్రశ్నించగా.. ‘‘కాంగ్రెస్‌తో కుమ్మక్కు నిజమైతే జగన్‌ను ఇన్ని రోజులు జైల్లో ఎలా పెడతారు? చార్జిషీట్ల పేరుతో ఎందుకు ఆలస్యం చేస్తారు?’’ అని విజయమ్మ ప్రశ్నించారు. 

జీవోలు సక్రమమైతే క్విడ్ ప్రో కో ఎక్కడ?: మేకపాటి 

వివాదాస్పద 26 జీవోలతో ప్రమేయం ఉందన్న కారణంతో జగన్‌ను అరెస్ట్ చేశారని.. అయితే ఆ 26 జీవోలు సక్రమమేనని సంబంధిత మంత్రులు, అధికారులు సుప్రీంకోర్టుకు తెలిపారని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి గుర్తుచేశారు. జీవోలన్నీ సక్రమమే అయినప్పుడు జగన్ ఎలా దోషి అవుతారని, ఇక్కడ క్విడ్ ప్రో కోకు అవకాశం ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగ పెద్దగా ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని న్యాయం చేయాలని రాష్ట్రపతిని కోరామని, దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేస్తారనే వార్తలు వస్తున్నాయని ప్రశ్నించగా ‘‘మేమెందుకు పార్టీని విలీనం చేస్తాం? ప్రజలు మా పక్కనే ఉన్నారు. ఈ విషయం చాలా సందర్భాల్లో స్పష్టమైంది. ఇప్పుడు ఎన్నికలు వచ్చినా 30కి పైగా పార్లమెంట్ స్థానాలు, 230కి పైగా అసెంబ్లీ స్థానాలు గెలిచే అవకాశం ఉంది. విలీనం అన్న మాటకు తావులేదు’’ అని ఆయన స్పష్టంచేశారు. 

చేతులెత్తి నమస్కరిస్తున్నా..

జగన్ కోసం సంతకాలు చేసిన వారికి విజయమ్మ కృతజ్ఞతలు

సాక్షి, హైదరాబాద్: దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడైన జగన్‌మోహన్‌రెడ్డిని జనం తమ సొంత బిడ్డగా భావించి ఆదరించారని.. వారందరికీ పేరు పేరునా చేతులెత్తి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నానని.. జగన్ తల్లి, వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పేర్కొన్నారు. జగన్‌కు మద్దతుగా జనం సంతకాల రూపంలో కురిపించిన అభిమానం.. చరిత్రలో ఎన్నడూ జరిగి ఉండదన్నారు. మంగళవారం రాష్ట్రపతిని కలిసేం దుకు ఢిల్లీ వెళ్లే ముందు విజయమ్మ.. పార్టీ కార్యాలయంలో పార్టీ ఎంపీ, లెజిస్లేటర్లు, ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. అనంతరం ఆమె మీడియాతో ఉద్వేగభరితంగా మాట్లాడారు. ‘‘జగన్‌ను అక్రమంగా అరెస్టు చేసి ఎనిమిది నెలలు కావస్తోంది. దీనిపై ప్రజాకోర్టులో సంతకాల కోసం నేను ఇచ్చిన పిలుపునకు ప్రజలు ఇవాళ అపూర్వమైన రీతిలో స్పందించి 1.96 కోట్ల మంది సంతకాలు చేశారు. ఇవన్నీ ఢిల్లీకి తీసుకుపోయి రాష్ట్రపతికి సమర్పించబోతున్నాం. ఇప్పటికి 1,56,64,000 సంతకాలను సీడీల రూపంలో ఆయనకు ఇస్తున్నాం. ప్రజలెప్పుడూ వైఎస్ బిడ్డను తమ బిడ్డగా అక్కున చేర్చుకున్నారు. ఆయన పోయిన తరువాత కడప ఉప ఎన్నికల్లో ఎవరూ ఊహించని మెజారిటీతో జగన్‌ను గెలిపించారు. ఉప ఎన్నికల్లో కూడా ప్రజలు ఈ కుటుంబ పక్షంగా, జగన్‌బాబు పక్షంగా ఉన్నారని చూపించారు. ఈ రోజు కూడా ప్రజలు వారి కలంతో జగన్‌బాబును అన్యాయంగా అరెస్టు చేశారని చాటి చెప్పారు. ఆ బిడ్డ పక్షాన నిలిచారు. వారందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. చరిత్రలో ఎవరికీ ఇలా జరిగి ఉండక పోవచ్చు.

ప్రజలందరికీ పేరు పేరునా నమస్కరిస్తున్నా... జగన్‌బాబును తమ కొడుకుగా, మనవడిగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా ఆశీర్వదించినందుకు నమస్కరిస్తున్నా... అసలు ప్రజలందరికీ కృతజ్ఞతలు ఏ విధంగా తెలపాలో నాకు తెలియడం లేదు. జరిగే వాటన్నింటినీ దేవుడు చూస్తూ ఉన్నాడు. తప్పకుండా జగన్‌బాబును బయటికి తెస్తాడు. ైవె ఎస్ సువర్ణయుగాన్ని మరోసారి చూపిస్తారు’’ అని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రపతిని కలిసే సమయం కోసం కొద్ది రోజులుగా వైఎస్సార్ సీపీ నేతలు చేస్తున్న ప్రయత్నం ఫలితంగా సోమవారం రాత్రి పండుగ పూట వారికి మంగళవారం సాయంత్రం 6-30 ఢిల్లీకి రావాలని వర్తమానం అందింది. హుటాహుటిన అందుబాటులో ఉన్న ముఖ్య నేతలు, ఎంపీ, ఎమ్మెల్యేలతో పార్టీ కార్యాలయంలో మంగళవారం ఉదయం సమావేశమైన విజయమ్మ మధ్యాహ్నం వారితో కలిసి ఢిల్లీ వెళ్లారు.
Share this article :

0 comments: