నాడు వైఎస్‌కు, చంద్రబాబు పాలనకు తేడా విశ్వసనీయతే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నాడు వైఎస్‌కు, చంద్రబాబు పాలనకు తేడా విశ్వసనీయతే

నాడు వైఎస్‌కు, చంద్రబాబు పాలనకు తేడా విశ్వసనీయతే

Written By news on Friday, March 7, 2014 | 3/07/2014

* నరసరావుపేట జనభేరిలో వైఎస్ జగన్ ఉద్ఘాటన
* నాడు వైఎస్‌కు, చంద్రబాబు పాలనకు తేడా విశ్వసనీయతే
* అన్నీ ఫ్రీ అని చెప్పి ఎన్నికలయ్యాక మాట తప్పడం చంద్రబాబు నైజం
* ఆయనకివే చివరి ఎన్నికలు కాబట్టి ఎన్ని అబద్ధాలైనా ఆడతారు
* నేను యువతరం ప్రతినిధిని.. మాట కోసం ఎందాకైనా పోతాను..
* వైఎస్ నుంచి నాకు వారసత్వంగా వచ్చింది విశ్వసనీయత
* చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో నిజాయితీని తీసుకొద్దాం..   మళ్లీ సువర్ణ యుగాన్ని తీసుకొద్దాం
 

సాక్షి, గుంటూరు: ‘‘దివంగత నేత రాజశేఖరరెడ్డి పాలనకు, అంతకుముందు చంద్రబాబు పాలనకు ఒకే తేడా ఉంది. ఆ తేడా విశ్వసనీయత అన్న పదమే అని గట్టిగా చెబుతున్నా. చంద్రబాబైతే అన్నీ ఫ్రీగా ఇస్తానని ఏ మొహమాటం లేకుండా అబద్ధాలు చేప్పేస్తారు. కారణం ఏమిటంటే ఎన్నికలు అయిపోయిన తరువాత ప్రజలతో నాకేంటని అనుకునే వ్యక్తి చంద్రబాబు. ఆయన వయసు 65 సంవత్సరాలు.. ఆయనకు ఇదే చివరి ఎన్నిక కాబట్టి ఎన్ని అబద్ధాలైనా చెబుతారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. ‘‘ఇదే చంద్రబాబుకునేను ఒకటి చెప్పదలచుకున్నా.
 
 ఆయనకన్నా నేను 25 సంవత్సరాలు చిన్నవాడిని. నేను యువతరానికి ప్రతినిధిని. ఒక మాటంటూ ఇస్తే ఆ మాట కోసం ఎందాకైనా పోతానని చెబుతున్నా. విశ్వసనీయతకు పెద్ద పీట వేస్తానని చెబుతున్నా. నాకూ చంద్రబాబుకు తేడా అది. విశ్వసనీయత అన్నది రాజశేఖరరెడ్డి గారి నుంచి నాకు వారసత్వంగా వచ్చిందని నేను గట్టిగా, గర్వంగా చెబుతున్నా’’ అని జగన్‌మోహన్‌రెడ్డి ఉద్ఘాటించారు. గురువారం గుంటూరు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన ‘వైఎస్‌ఆర్ జనభేరి’ బహిరంగ సభలో ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆయన మాటల్లోనే..
 
  వైఎస్ పేదరికానికి వైద్యం చేశారు..
 ‘‘ఒక్క మాటలో చెప్పాలంటే రాముని రాజ్యమైతే నేను చూడలేదుగానీ రాజశేఖరుని సువర్ణ యుగం మాత్రం మనమంతా చూశాం. పేదరికానికి కులముండదు, మతం ఉండదు, పార్టీలుండవు, రాజకీయాలుండవు. అలాంటి పేదరికానికి వైద్యం చేయాలని ఓ డాక్టర్‌గా ముందుకు వచ్చిన వ్యక్తి రాజశేఖరరెడ్డి. ఈ రోజు వైఎస్ బతికి ఉంటే ఎంతో బాగుండని అనే మాట రాష్ట్రం మొత్తం వినిపిస్తుంది. ఆ పాలనను సువర్ణ యుగం అంటారు. ఆ పాలనను విశ్వసనీయత పాలనంటారు. నిజాయతీతో కూడిన పాలనంటారు. రాజశేఖరరెడ్డి చనిపోయిన తరువాత ఈ రాజకీయ వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయింది.
 
 ఈ రాజకీయ వ్యవస్థ మీదే అసహ్యం పుడుతోంది..
 రాజకీయాలు నేడు చదరంగంలా తయారయ్యాయి. ఒక మనిషిని తప్పించడానికి ఎలా దొంగ కేసులు పెట్టాలి? అని చూస్తున్నారు. ఒక పార్టీ లేకుండా చేయడం కోసం ఆ మనిషిని జైలుకు పంపేందుకు మనస్సాక్షి కూడా అడ్డురావడం లేదు. ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టడానికి వెనుకాడని పరిస్థితికి ఈ రాజకీయ వ్యవస్థ దిగజారిపోయింది. మొన్న విభజన బిల్లు విషయంలో పార్లమెంటు, అసెంబ్లీలో జరిగిన తీరును మనమందరం గమనించాం. పార్లమెంటులో జరిగిన తీరును ఒక్కసారి చూస్తే రాజకీయ వ్యవస్థ మీదనే అసహ్యం పుడుతుంది. కారణం ఏమిటంటే ఆ పార్లమెంటు జరుగుతున్న సమయాన ఇదే చంద్రబాబు నాయుడు బిల్లు చాలా అన్యాయంగా ఉందని మాట్లాడుతారు. లోపలేమో ఆ బిల్లుకు అనుకూలంగా తన ఎంపీల చేత ఓటు వేయిస్తారు.
 
 సువర్ణ యుగాన్ని తిరిగి తీసుకొద్దాం.
 చదువుకున్న ప్రతి పిల్లాడు ఉద్యోగం కోసం హైదరాబాద్ నగరం వైపు చూస్తాడు. కానీ అడ్డగోలు విభజనతో ఇప్పుడు ఆ నగరాన్ని మనకు కాకుండా చేశారు. కొత్త రాజధాని కట్టుకునేందుకు ఎంత డబ్బులు ఇస్తారు? ఎక్కడ కట్టుకోవాలనే విషయం కూడా చెప్పకుండా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టారు. ఇంతటి దారుణంగా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే.. రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు, పార్లమెంటులో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఇద్దరూ కూడా ఓ వైపు బిల్లు అన్యాయంగా ఉందీ అంటూనే దానికి అనుకూలంగా ఓటేశారు. ఇది న్యాయమా? అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించిన ఈ పార్టీలు మళ్లీ ప్రజల వద్దకు వచ్చి ఓట్ల కోసం, సీట్ల కోసం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయి. ఈ రాజకీయ వ్యవస్థను మనం మార్చేద్దాం. ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో నిజాయితీని తీసుకొద్దాం. ఆ దివంగత నేత రాజశేఖరరెడ్డి అందించిన సువర్ణ యుగాన్ని కలిసికట్టుగా మళ్లీ సాధించుకుందాం.
 
 దేవుడు చూస్తున్నాడు..
 వీళ్ళు చేసిన అన్యాయం... చేస్తున్న అన్యాయం ఎవరూ చూడడం లేదని అనుకుంటున్నారు. కానీ పై నుంచి దేవుడు అనేవాడు మాత్రం కచ్చితంగా చూస్తున్నాడు. త్వరలో ఎన్నికలు వస్తాయి.. ఆ ఎన్నికలు వచ్చినప్పుడు మనం మన సువర్ణ యుగాన్ని తెచ్చుకుందాం... రాజన్న రాజ్యాన్ని తెచ్చుకుందాం.. అదే రాజన్న యుగాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాం. ప్రమాణ స్వీకారం రోజు దివంగత నేత రాజశేఖరరెడ్డి గర్వపడేలా నాలుగు సంతకాలు పెడతాను. ఈ నాలుగు సంతకాలు రాష్ట్ర చరిత్రను మార్చేస్తాయి. మొట్టమొదటి సంతకం నా అక్కాచెల్లెళ్ల కోసం.. వారి జీవితానికి భరోసా కోసం ‘వైఎస్సార్ అమ్మ ఒడి’ పథకంపై చేస్తా. ఇక నుంచి మీ పిల్లలను మీరు పనికి కాకుండా బడికి పంపించండి. మీ పిల్లలను ఇంజనీర్లుగా, డాక్టర్లుగా నేను చేస్తా.
 
 ప్రతి స్కూల్‌లోనూ ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడతా. ప్రతి పిల్లాడికి రూ. 500లు చొప్పున కుటుంబానికి ఇద్దరు పిల్లలకు రూ. వెయ్యి నెలానెలా అక్కాచెల్లెమ్మల బ్యాంకు అకౌంట్‌లో మేము వేస్తామని హామీ ఇస్తున్నా. రెండో సంతకం అవ్వాతాతల కోసం పెడతానని గర్వంగా చెబుతున్నా. రెండు నెలలు ఆగండి.. మీ మనవడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఇవాళ ఇస్తున్న రూ. 200 పింఛన్‌ను రూ.700కు పెంచుతూ సంతకం పెడతాడు. ఇక మూడవ సంతకం ప్రతి రైతన్న కోసం చేసి.. రూ. 3వేల కోట్లతో స్థిరీకరణ నిధిని తీసుకొస్తా. మద్దతు ధర, గిట్టుబాటు ధర కోసం రైతన్నకు భరోసా ఇస్తా. నాలుగో సంతకం కూడా మళ్లీ అక్కాచెల్లెళ్ల కోసం పెడతా. డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తూ సంతకం చేస్తానని భరోసా ఇస్తున్నా.’’
 
 జన నీరాజనం
 నరసరావుపేటలో గురువారం వైఎస్ జగన్ నిర్వహించిన రోడ్‌షో, జనభేరి సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి రాజన్న బిడ్డపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. బుధవారం రాత్రి ఖమ్మంలో జనభేరి సభను ముగించుకొని ఆయన గుంటూరు చేరుకున్నారు. ఉదయం 5 గంటల నుంచే ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున జగన్ బస చేసిన ప్రాంతానికి చేరుకొని జై జగన్ నినాదాలతో హోరెత్తించారు. ఉదయం 10.30 గంటలకు గుంటూరు నగరం నుంచి ఆయన నరసరావుపేట బయలు దేరారు. అడుగడుగునా మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, వికలాంగులు ఆయనకు పూలతో స్వాగతం పలికారు. దీంతో కొంత ఆలస్యంగా ఆయన సభా ప్రాంతానికి చేరుకున్నారు. సభకు హాజరైన జనసందోహంతో నరసరావుపేట పట్టణం పోటెత్తింది.  ప్రముఖ పారిశ్రామికవేత్త ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి జగన్ సమక్షంలో పార్టీలో చేరారు.
 
 ఈ సందర్భంగా పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి అయోధ్యరామిరెడ్డి, నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలను అత్యధిక మెజార్టీలతో గెలిపించాలని జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. 2009లో పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసిన కపిలవాయి విజయకుమార్, కాంగ్రెస్ ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ ఖాజావలితో పాటు అనేక మంది మాజీ కౌన్సిలర్లు, నేతలు, న్యాయవాదులు పార్టీలో చేరారు. ఈ సభలో జిల్లా పార్టీ అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, పార్టీ నాయకులు బాలశౌరి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు మేకతోటి సుచరిత, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నేతలు మోపిదేవి వెంకట రమణ, నందమూరి లక్ష్మీపార్వతి, ఆర్కే, విజయచందర్, అంబటి రాంబాబు, రావి వెంకట రమణ, జంగా కృష్ణమూర్తి, నియోజకవర్గ సమన్వయకర్తలు పాల్గొన్నారు.
వీళ్ల మోసాలను నమ్మొద్దు..
 ‘‘కాంగ్రెస్, టీడీపీ నాయకులు రాబోయే ఎన్నికల్లో మోసాలు చేస్తూ ఎన్నెన్నో మాటలు చెబుతారు. నేనైతే ఒకే ఒక మాట చెబుతున్నా. వీళ్ల మోసాలను ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. కొద్దిరోజుల క్రితమే మన కళ్లెదుటే పార్లమెంటు సాక్షిగా ఏం జరిగిందో మనమంతా చూశాం. కాంగ్రెస్ పార్టీ బిల్లు తెస్తే ఆ బిల్లుకు మద్దతు ఇచ్చి మనల్ని హతం చేశారు. చంద్రబాబు నాయుడు పరిస్థితి ఎలా ఉంది అంటే మనిషిని పొడిచేసి శ్మశానానికి కూడా తానే తీసుకుపోతానని మోసం చేసేలా.. ఇటువైపు వచ్చి సీమాంధ్రను సింగపూర్ చేస్తానని చెబుతున్నారు. జరగబోయే ఎన్నికల్లో నిజాయితీ, విశ్వసనీయత ఒకవైపు ఉంటే... మరో వైపు వంచన, కుమ్మక్కు రాజకీయాలు ఉంటున్నాయి. ఢిల్లీ అహంకారానికి, తెలుగువారి ఆత్మగౌరవానికి మధ్య జరుగబోయే ఎన్నికలివి.’’    
- వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
Share this article :

0 comments: