ఈ ప్రభుత్వం ఇంకెందుకు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఈ ప్రభుత్వం ఇంకెందుకు?

ఈ ప్రభుత్వం ఇంకెందుకు?

Written By news on Monday, May 27, 2013 | 5/27/2013

* వీళ్లకు మనసు, మానవత్వం లేదు 
* చార్జీలు పెంచి రక్తం తాగడమే తెలుసు
* వికలాంగులకు వైఎస్సార్ ఇచ్చిన ఆసరా కూడా లేకుండా చేస్తున్నారు
* ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం కూలిపోకుండా చంద్రబాబు కాపాడారు
* అధైర్య పడవద్దు.. రాజన్న రాజ్యంలో వికలాంగులకు రూ.1000 పింఛన్ అందుతుంది

మరో ప్రజాప్రస్థానం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘ఈ నాయకులకు మనసు, మానవత్వం లేదు. వీళ్లకు చార్జీల మీద చార్జీలు పెంచి ప్రజల రక్తం తాగడమే తెలుసు. సహాయం చేయడం వీళ్లకు చేతకాదు. వికలాంగులకు చేతనైనంత ఎక్కువ సాయం చేయాలి.. కానీ వైఎస్సార్ వారికిచ్చిన ఒక్క ఆసరా కూడా లేకుండా చేస్తోంది ఈ ప్రభుత్వం. వికలాంగులను కూడా ఆదుకోలేని ఈ ప్రభుత్వం ఉంటే ఎంత? లేకుంటే ఎంత..?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మండిపడ్డారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, ఉండి నియోజకవర్గాల్లోని పల్లెల్లో కొనసాగింది. దారి వెంట రైతులు, వికలాంగులు, వృద్ధులు, మహిళలను షర్మిల పలకరించారు.

వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంలో శృంగవృక్షం గ్రామానికి చెందిన కౌలు రాముడు అనే వికలాంగ వృద్ధుడు... ‘‘అమ్మా.. నేను వికలాంగుణ్ని. కాలుకు పుండైతే కాలు తీసేశారు. రాజశేఖరరెడ్డి తొలుత సీఎం అయినప్పుడు రూ.200 పింఛన్ ఇచ్చారండీ.. దాన్నే తర్వాత రూ.500 చేశారండీ. కిరణ్‌కుమార్‌రెడ్డి సారు వచ్చి నా పింఛన్ తీసేసుకున్నారండీ.. నన్ను చూడు బిడ్డా.. ఈ కాలు చూడు.. నేను నడువగలనా... ఈ ముసలితనంలో ఏం తిని బతకాలమ్మా.. మా నోటి దగ్గరి ముద్ద గుంజుకొని వీళ్లు బాగుపడుతరా బిడ్డా..’’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాటలు విన్న షర్మిల చలించిపోయారు. అధైర్య పడవద్దని, రాజన్న రాజ్యంలో వికలాంగులకు వెయ్యి రూపాయల పింఛన్ అందుతుందని భరోసానిచ్చారు. పలుచోట్ల వికలాంగులతో మాట్లాడారు. షర్మిల ఏమన్నారో ఆమె మాటల్లోనే..

చంద్రబాబు 16 లక్షలు ఇస్తే వైఎస్సార్ 71 లక్షల పింఛన్లు ఇచ్చారు..
మానసిక వికలాంగులకు కూడా పింఛన్ ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్సార్. వికలాంగులకు చేతనైనంత వరకు సహాయపడాల్సిన ఈ ప్రభుత్వం వారిని గాలికి వదిలేసింది. పింఛన్ డబ్బు సరిపోవడం లేదు పెంచండి మహాప్రభో అని వాళ్లు మొరపెట్టుకుంటుంటే.. ఈ ప్రభుత్వం ఉన్న పింఛన్లను ఊడపీకేస్తుంది. చంద్రబాబు హయాంలో 16 లక్షల మందికి మాత్రమే పింఛన్లు ఇస్తే వైఎస్సార్ వచ్చాక 71 లక్షల మందికి పింఛన్లు ఇచ్చారు. అంటే 55 లక్షల మందికి అదనంగా పింఛన్లు ఇచ్చారంటే వైఎస్సార్‌ది ఎంత పెద్ద మనసో అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు రైతులు, వికలాంగులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబుగారు పాదయాత్ర చేస్తూ ఇది అసమర్థ ప్రభుత్వం అన్నారు. తుగ్లక్ పరిపాలన అన్నారు. ఈ ప్రభుత్వం ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండకూడదని అన్నారు. మరి ఈ చేతగాని ప్రభుత్వంపై అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి అవిశ్వాసం పెడితే.. తీరా అవి శ్వాసంలో ప్రధాన ప్రతిపక్షనాయకుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలబడ్డారు. ఆ ప్రభుత్వం కూలిపోకుండా రెండు చేతులు అడ్డం పెట్టి కాపాడారు. ఆ రోజున చంద్రబాబు అవిశ్వాసానికి మద్దతు ఇచ్చి ఉంటే ఈ ప్రభుత్వం కూలిపోయి ప్రజలకు బాధలు తప్పేవి. 

అమ్మా..! మీరు అధైర్యపడవద్దు.. త్వరలోనే మీరు కోరుకున్నట్టుగానే జగనన్న వస్తాడు. వైఎస్సార్ ఏ విధంగా సహాయపడ్డారో.. జగనన్న కూడా అలాగే ఆదరిస్తారు. మీ గురించి జగనన్న ఎప్పుడో ఆలోచన చేశారు. రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వికలాంగుల పింఛన్‌ను రూ.1000 చేస్తారు. మీ అందరినీ సంతోషంగా ఉంచుతారు. చదువు లేని వికలాంగులు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేందుకు వడ్డీ లేని రుణాలిచ్చి వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడే విధంగా ప్రోత్సహిస్తారు. చదువుకున్న ప్రతి వ్యక్తికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. అంత వరకు ఓపిక పట్టండి. ఆత్మస్థైర్యం కోల్పోవద్దు.

14.8 కి.మీ. యాత్ర..
ఆదివారం 160వ రోజు పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం లోని విస్సాకోడేరు నుంచి ప్రారంభమైంది. అక్కడ్నుంచి గొరగనమూడి, పెన్నాడ, శృంగవృక్షం, వీరవాసరం, బొమ్మనపల్లి మీదుగా పాదయాత్ర సాగింది. మత్స్యపురి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 7.45 గంటలకు షర్మిల చేరుకున్నారు. మొత్తం 14.8 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు మొత్తం 2122.7 కి.మీ యాత్ర పూర్తయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ విస్సాకోడేరు వద్ద షర్మిలను కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పాదయాత్రలో పాల్గొన్నవారిలో మాజీ ఎమ్మెల్యేలు సర్రాజు, గ్రంధి శ్రీనివాసు, ప్రసాదరాజు, మొవ్వ ఆనంద శ్రీనివాసు, స్థానిక నాయకులు తలారి వెంకట్రావ్, మేడిద జాన్సన్ ఉన్నారు. 

షర్మిలను కలిసిన వారిలో ఎమ్మెల్యే మద్దాల రాజేష్, ఎమ్మెల్సీలు మేకా శేషుబాబు, బొడ్డు భాస్కరరామారావు, నాయకులు కొయ్యే మోషేన్ రాజు, తోట గోపి, చీర్ల రాధయ్య, సువర్ణరాజు, కర్ర రాజారావు, కూనపురెడ్డి రాఘవేందర్‌రావు, మల్లుల లక్ష్మీనారాయణ, పండిబోయిన శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. 

సమన్వయకర్తలతో విజయమ్మ సమీక్ష
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా పార్టీ ముఖ్య నేతలు, సమన్వయకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. షర్మిల చేపట్టిన పాదయాత్రకు వచ్చిన ఆమె భీమవరం నియోజకవర్గంలోని వీరవాసరం వద్ద సమన్వయకర్తలతో మాట్లాడారు. వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలతో విడివిడిగా కలిసి మాట్లాడారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కార్యకలాపాల గురించి అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించారు. పార్టీని గ్రామస్థాయిలో అట్టడుగు వర్గాల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై విపరీతంగా చార్జీల భారం మోపుతోందని, విద్యుత్తు చార్జీల భారంతోపాటు పల్లెలు, పట్టణాలు, నగరాల్లో కరెంటు కోతలతో జనం ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన టీడీపీ ఆ పని చేయకుండా దానితో కుమ్మక్కయిందని, ఈ విషయాన్ని ప్రజల్లోకి విసృ్తతంగా తీసుకెళ్లాలని సూచించారు. ప్రజాసమస్యలపై పోరాటాలు చేయడంతోపాటు నిత్యం ప్రజల్లో ఉండాలని కోరారు. పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం సమీక్షలో పాల్గొన్నారు.

రేపు పాలకొల్లులో షర్మిల దీక్ష
కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై సీబీఐని కలుపుకొని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను అక్రమంగా అరెస్టు చేసి, ఏడాది కాలంగా జైల్లో ఉంచడాన్ని నిరసిస్తూ ఆయన సోదరి షర్మిల మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో దీక్ష చేపట్టనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆమె దీక్షలో పాల్గొంటారని పార్టీ ప్రోగ్రాం కన్వీనర్ తలశిల రఘురాం తెలిపారు.?
Share this article :

0 comments: