ఎస్సార్ లీజులో సీఎంకు ముడుపులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎస్సార్ లీజులో సీఎంకు ముడుపులు

ఎస్సార్ లీజులో సీఎంకు ముడుపులు

Written By news on Sunday, May 26, 2013 | 5/26/2013

 కాంగ్రెస్, బాబు కుమ్మక్కుకు పరాకాష్ట
- కాంగ్రెస్ పెద్దలతో భేటీకే బాబు ఢిల్లీ యాత్రలు
- జగన్ వస్తే తమ ఉనికి ఉండదనే జైల్లో పెట్టారు

 రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకు ఇచ్చిన భూములను రద్దు చేసి ఎస్సార్ మినరల్స్ సంస్థకు కేటాయించడం వెనుక ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డికి ముడుపులు ముట్టాయని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బి.గుర్నాథరెడ్డి ధ్వజమెత్తారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... గతంలో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఈ భూములను ప్రభుత్వ సంస్థ అయిన ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసి)కు కేటాయిస్తే ఇపుడు ప్రయివేటు సంస్థకు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ఫలితంగా ముఖ్యమంత్రికి ముట్టిన ముడుపులు ఎంతని నిలదీశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నిర్దేశకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందనడానికి ఈ సంఘటనే ఒక నిదర్శనమని ఎద్దేవా చేశారు. అటవీశాఖ అనుమతులు సాధించుకోలేని ఎస్సార్ మినరల్స్‌కు ఆ భూమిని కేటాయించడమంటే ప్రభుత్వ రంగ సంస్థలను నీరుగార్చడమేనని విమర్శించారు. 

ఈ విషయంలో కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలు స్పష్టంగా వెల్లడవుతున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, రైతుల ఇక్కట్ల గురించి ఏనాడూ మాట్లాడని చంద్రబాబు... అవిశ్వాస తీర్మానం పెడితే ప్రభుత్వానికి మద్దతునిచ్చిన టీడీపీ అధినేత... ఇపుడు కళంకిత మంత్రుల పేరుతో వారిని తొలగించాలని డిమాండ్ చేయడం విచిత్రంగా ఉందని విమర్శించారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానవర్గంతో ఆయనకున్న అనుబంధానికి ఈ అంశం అద్దం పడుతోందన్నారు. ఢిల్లీ పెద్దలను కలవడానికే చంద్రబాబు తరచూ ఢిల్లీ వెళుతున్నారని ఆరోపించారు. ఓ వైపు 26 జీవోల్లో ఎలాంటి తప్పూ లేదంటూనే, మరోవైపు కళంకిత మంత్రులంటూ దుమారం రేగడానికి రాష్ట్ర ప్రభుత్వమే ఆస్కారం కలిగిస్తోందని ఆయన తప్పుబట్టారు. 

జగన్ అంటే వాళ్లకు భయం
నిరాధారమైన ఆరోపణలతో జగన్‌మోహన్‌రెడ్డిని అక్రమ నిర్బంధంలో ఉంచి ఏడాది దాటుతున్నా చార్జిషీటు దాఖలు చే యలేని స్థితిలో దర్యాప్తు సంస్థలున్నాయని గుర్నాథరెడ్డి విమర్శించారు. జగన్ బయటకు వస్తే తమ పార్టీలు గల్లంతు అవుతాయని కాంగ్రెస్, టీడీపీ రెండూ భావిస్తున్నాయని, అందుకే సాధ్యమైనన్ని ఎక్కువ రోజులు ఆయన్ను జైల్లో పెట్టాలని కలిసి కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు ఎపుడు జరిగినా కాంగ్రెస్, టీడీపీలకు ఘోరపరాజయం తప్పదన్నారు.

తక్షణం పంచాయితీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. జూన్ 10 నుంచి జరిగే శాసనసభా భేటీల్లో చంద్రబాబు అవిశ్వాస తీర్మానం పెట్టాలని, లేదంటే తమ పార్టీయే మళ్లీ ప్రతిపాదిస్తుందని గుర్నాథరెడ్డి చెప్పారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరక్కపోవడం వల్ల ప్రజా సమస్యలు అపరిష్కృతంగా పేరుకు పోయాయన్నారు. ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న కిరణ్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు తమ పార్టీ ఎపుడూ ప్రయత్నిస్తూనే ఉంటుందని తేల్చి చెప్పారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా విప్‌ను ఉల్లంఘించి ఓట్లేసిన ఎమ్మెల్యేలను తక్షణం అనర్హులుగా ప్రకటించి ఉప ఎన్నికలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. నీటికి కటకటలాడే తమ అనంతపురం జిల్లాలో మెగా సౌరశక్తి విద్యుత్ ప్లాంటుకు 0.4 టీఎంసీల నీటిని కేటాయించడం వెనుక అక్రమాలు జరిగాయని ఆరోపించారు.
Share this article :

0 comments: