ఆ చిలుకను పలికిస్తున్నదెవరు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆ చిలుకను పలికిస్తున్నదెవరు?

ఆ చిలుకను పలికిస్తున్నదెవరు?

Written By news on Monday, May 13, 2013 | 5/13/2013

జగనన్న కేసులో సీబీఐని ఎవరు ఆడిస్తున్నారో తేలాలి: షర్మిల
ఈ కేసులో కాంగ్రెస్, టీడీపీల ప్రభావమెంతో తెలియాలి
సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలి
బొగ్గు స్కామ్‌పై సీబీఐ నివేదికను కేంద్రంలోని పెద్దలు తమకు అనుకూలంగా మార్చుకున్నారు
ఇంకా ఇలా ఎన్ని కేసుల్లోని నివేదికల్లో కాంగ్రెస్ నేతలు మార్పులు చేశారో తేలాలి
సాక్షులను ప్రభావితం చేస్తారంటూ ఏడాదిగా జగనన్నను జైల్లో పెట్టారు
సాక్ష్యాలను తారుమారు చేసే అధికారం, అవకాశం ఉన్న మంత్రులను అరెస్టు చేయలేదేం?


‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘కేంద్రం ఎలా చెప్తే సీబీఐ అలా చేయాల్సి ఉంటుందని, కేంద్రం పంజరంలో తాము చిలుకలం అని, కేంద్రం పలికించినట్టు సీబీఐ పలకాల్సి ఉంటుందని ప్రస్తుత సీబీఐ డెరైక్టరే స్వయంగా చెప్పారు. జగన్‌మోహన్‌రెడ్డి కేసులో ఈ సీబీఐ అనే చిలుకను ఎవరు పలికిస్తున్నారో నిగ్గు తేలాలి. జగన్‌మోహన్‌రెడ్డి విషయంలో ఎవరు ఎలా నడిపిస్తున్నారో.. ఎవరు ఎలా ఆదేశిస్తున్నారో.. ఎవరు ఎలా ఆడిస్తున్నారో తేలాలి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల.. పార్టీ తరఫున డిమాండ్ చేశారు. జగనన్న కేసు విషయంలో ఈ కాంగ్రెస్, టీడీపీలు కలిసి ఎంత వరకు సీబీఐని ప్రభావితం చేశాయో తెలుసుకోవడానికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర ఆదివారం ఖమ్మం జిల్లాలో పూర్తయి పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని గురుభట్లగూడెం గ్రామం క్రాస్ రోడ్డు వద్ద షర్మిల ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..
‘‘జగనన్న మీద కేసు మొదలు పెట్టినప్పటి నుంచీ ఈ రోజు వరకు ఎంత మంది నాయకులు ఇందులో జోక్యం చేసుకున్నారో, ఎంతమంది నేతలు ఈ కేసును ప్రభావితం చేశారో తెలుసుకోవడానికి సుప్రీంకోర్టు దర్యాప్తునకు ఆదేశించాలి. మన దేశంలో రాబోయే రోజుల్లో కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా మళ్లీ ఇలా సీబీఐని ఉసిగొల్పి అమాయకులను వేధించకుండా ఉండాలంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐని ఉపయోగించి అమాయకులను ఎంత దుర్మార్గంగా వేధించి పబ్బం గడుపుకొంటుందనే విషయం మీద విచారణ జరగాలి. కాంగ్రెస్ చేతిలో సీబీఐ కీలుబొమ్మగా మారిందన్న అంశం మీద విచారణ జరగాలి. బయటే ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారనే సాకు చెప్పి ఇప్పటికి సంవత్సరం రోజులుగా జగనన్నను సీబీఐ జైల్లోనే ఉంచింది. మరి జగనన్న బయట ఉన్నప్పుడు ఏ ఒక్కరోజైనా, ఏ ఒక్క సాక్షినైనా ప్రభావితం చేశారా? కనీసం అలాంటి ప్రయత్నం చేశారని నిరూపించగలరా? అని అడిగితే సీబీఐ దగ్గర నుంచి సమాధానం లేదు.

మంత్రుల సంగతేంటి?
కేవలం జగన్‌మోహన్‌రెడ్డి పేరు చార్జిషీటులో ఉన్నందుకు ఈ రోజు ఆయన్ను అరెస్టు చేశారు. అదే చార్జిషీటులో మంత్రుల పేర్లు కూడా ఉన్నాయి. మరి మంత్రులను ఎందుకు అరెస్టు చేయలేదో సీబీఐ సమాధానం చెప్పాలి. సాక్షులను ప్రభావితం చేసే అధికారం, అవకాశం మంత్రులకు ఉందా? లేక సాధారణ ఎంపీగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డికి ఉందా? సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్న మంత్రుల్లో హోం మంత్రి పేరు సైతం ఉన్నా.. వారిని మాత్రం ఈ సీబీఐ అరెస్టు చేయదు. జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకి కాబట్టే ఆయన్ను అరెస్టు చేశారు అనే విషయం మన రాష్ట్రంలో చిన్న పిల్లలకు కూడా అర్థమైపోయింది.

నివేదికలనే మార్చేసుకున్నారు
ఈ రోజు సీబీఐ, ఈడీలాంటి సంస్థలు కాంగ్రెస్ చెప్పినట్లు ఆడుతున్నాయన్నది పచ్చి నిజం. ఈ మధ్యే చూశాం.. బొగ్గు కుంభకోణం గురించి దేశం అంతా మాట్లాడింది. ఈ కుంభకోణంలో సీబీఐ సుప్రీంకోర్టుకు సమర్పించాల్సిన నివేదికను సాక్షాత్తూ ప్రధాన మంత్రి కార్యాలయంలోని వారు, న్యాయశాఖ మంత్రి తమ వద్దకు తెప్పించుకొని సాక్ష్యాలను, సాక్షులను తారుమారు చేసి వారికి అనుకూలంగా రాయించుకున్నారు. ఈ నివేదికలు తారుమారు చేయడం ఒక్క బొగ్గు స్కాంలో మాత్రమే కాదు.. సీబీఐ చేస్తున్న ప్రతి కేసులోనూ, ప్రతి పనిలోనూ కేంద్రం హస్తం ఉంది. ఇలా కేంద్ర ప్రభుత్వం గడిచిన కొంత కాలంగా సీబీఐకి ఎన్ని డిక్టేషన్లు ఇచ్చిందో తేలాల్సి ఉంది. గడిచిన కొన్నేళ్లుగా కేంద్రం ఎన్ని కేసుల్లో సీబీఐని ప్రభావితం చేసిందో తేలాల్సి ఉంది. ఇప్పటి వరకు ఎన్ని కేసుల్లో సాక్షులను, సాక్ష్యాలను తారుమారు చేసిందో తేలాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కేసుల్లో జోక్యం చేసుకొని, తనను వ్యతిరేకించిన వారిని ఎలా ఇరికించిందో తేలాల్సి ఉంది.

ఏడాది కాలాన్ని తిరిగివ్వగలరా?
జగన్‌మోహన్‌రెడ్డిని ఇప్పటికీ దోషి అని నిర్ధారించకుండానే సంవత్సర కాలంగా జైల్లో పెట్టారు అంటే.. నేరం నిర్ధారణ కాకుండానే ఆయనకు శిక్ష వేసినట్టు కాదా? ఒక వ్యక్తిని దోషి అని నిర్ధారించకుండానే ఇన్ని రోజులు జైల్లో పెట్టొచ్చని ఏ చట్టం, ఎక్కడ చెప్తుంది? తీరా కేసు అయిపోయాక జగనన్న నిర్దోషి అని తేలాక జగన్‌మోహన్‌రెడ్డి కోల్పోయిన ఈ ఏడాది కాలాన్ని ఈ కుట్రదారులు వెనక్కి ఇవ్వగలరా? జగనన్నను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం ఈ కాంగ్రెస్, టీడీపీ నాయకులకు లేదు. అందుకనే సీబీఐ వెనుకాల దాక్కొని దాడి చేస్తున్నారు.’’

12.2 కిలోమీటర్ల మేర యాత్ర
షర్మిల పాదయాత్ర 146వ రోజు ఆదివారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని తాళ్లమడ గ్రామ శివారు నుంచి ప్రారంభమయింది. షర్మిల అక్కడి నుంచి గంగారం చేరుకొని రచ్చబండలో పాల్గొన్నారు. అక్కడి నుంచి కొత్తపాకలగూడెం మీదుగా పాకలగూడెం చేరుకున్నారు. ఇదే గ్రామంలో వైఎస్సార్ విగ్రహానికి పూల మాల వేసి కొద్ది దూరం నడవటంతో ఖమ్మం జిల్లాలో పాదయాత్ర పూర్తయింది. అక్కడి నుంచి చింతలపూడి నియోజకవర్గం గురుభట్లగూడెం గ్రామం మీదుగా షర్మిల పశ్చిమగోదావరి జిల్లాలోకి అడుగు పెట్టారు. గురుభట్లగూడెం క్రాస్ రోడ్డు వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అక్కడి నుంచి నడుచుకుంటూ లింగగూడెం శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8.00 గంటలకు చేరుకున్నారు. ఆదివారం మొత్తం 12.2 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 1,952.8 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది.

పాదయాత్రలో పాల్గొన్న నేతల్లో ఎమ్మెల్యేలు మద్దాల రాజేశ్, ఆళ్ల నాని, తానేటి వనిత, ఎమ్మెల్సీ మేకాశేషుబాబు, ఖమ్మం, పశ్చిమగోదావరి జిల్లాల పార్టీ కన్వీనర్లు మచ్చా శ్రీనివాసరావు, టి.బాలరాజు, నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మొవ్వ ఆనంద శ్రీనివాసు, మాజీ ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, ముదునూరి ప్రసాదరాజు, పాతపాటి సర్రాజు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, గ్రంథి వెంకటేశ్వరరావు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు జలగం వెంకటరావు, నేతలు భానోతు మదన్‌లాల్, కొయ్యే మోషేన్‌రాజు, వైఎస్ కొండారెడ్డి, స్థానిక నాయకులు నంబూరి రామలింగేశ్వరరావు, మట్టా దయానంద్ విజయకుమార్, రామసహాయం నరేష్‌రెడ్డి, సాదు రమేష్‌రెడ్డి, కర్ర రాజారావు, భూక్యా దళ్‌సింగ్, మెండెం జయరాజ్ తదితరులున్నారు.

ఖమ్మం జిల్లాలో 222 కిలోమీటర్ల యాత్ర
ఖమ్మం జిల్లాలో షర్మిల 19 రోజుల పాటు యాత్ర చేసి 222 కిలోమీటర్లు నడిచారు. ఏప్రిల్ 22న జిల్లాలోకి ప్రవేశించిన యాత్ర మధిర, పాలేరు, ఖమ్మం, ఇల్లెందు, వైరా, కొత్తగూడెం, అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాలలో సాగగా.. దాదాపు 90 గ్రామా ల్లో షర్మిల నడిచి జనం సమస్యలు తెలుసుకున్నారు. మార్గమధ్యంలో షర్మిల 20 వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. కాగా జిల్లాలో యాత్ర సాగుతున్నప్పుడు షర్మిల ఎడమకాలి మడమ బెణకడంతో రెండు రోజులపాటు యాత్రకు విరామం ఇచ్చారు.

నాడు వైఎస్.. నేడు షర్మిల..మండే ఎండల్లో చిరుజల్లులు
అది చంద్రబాబు పాలన.. వరుసగా ఏడేళ్లు వర్షాలు లేవు. పొట్ట చేత పట్టుకొని జనం వలసబాట పట్టారు. గూడు చెదిరి, గుండె పగిలిన జనానికి అండగా నిలబడేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన ‘ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర మండే ఎండల్లో సాగుతూ 2003 మే 12న ఆదివారం గురుభట్లగూడెం గ్రామం మీదుగా పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. రానున్న రామరాజ్యానికి సంకేతంగా ఆ రోజు నిండువేసవిలో పశ్చిమగోదావరి మేఘావృతమై అక్కడక్కడ చిరు జల్లులు కురిశాయి. సరిగ్గా 10 ఏళ్ల తరువాత చరిత్ర పునరావృతమైంది. వైఎస్సార్ కుమార్తె షర్మిల చేపట్టిన ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర మే నెల 12వ తేదీ ఆదివారం రోజు కాకతాళీయంగా గురుభట్లగూడెం మీదుగానే పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. ఆశ్చర్యంగా ఆకాశంలో మార్పులు... భగభగమండిన సూర్యుడు మబ్బుల చాటుకు వెళ్లిపోయాడు. షర్మిల రాకతో జిల్లాలో ఆకాశం మేఘావృతమై చిరు జల్లులు కురిశాయని, ఇది రాబోయే రాజన్న రాజ్యానికి సంకేతమని రాష్ట్ర పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, జిల్లా పార్టీ కన్వీనర్ టి.బాలరాజు, చింతలపూడి ఎమ్మెల్యే మద్దాల రాజేశ్ అభివర్ణించారు.

షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’
ఆదివారం యాత్ర ముగిసేనాటికి
రోజులు: 146, కిలోమీటర్లు: 1,952.
- See more at: http://www.sakshi.com/main/FullStory.aspx?catid=597726&Categoryid=1&subcatid=33#sthash.PZ3ZBSMX.dpuf
Share this article :

0 comments: