నలుగురికి అన్నం పెట్టిన రైతన్నే ఇప్పుడు పొట్టకూటి కోసం కూలి పనులు చేసుకోవాల్సిన దుస్థితి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నలుగురికి అన్నం పెట్టిన రైతన్నే ఇప్పుడు పొట్టకూటి కోసం కూలి పనులు చేసుకోవాల్సిన దుస్థితి

నలుగురికి అన్నం పెట్టిన రైతన్నే ఇప్పుడు పొట్టకూటి కోసం కూలి పనులు చేసుకోవాల్సిన దుస్థితి

Written By news on Wednesday, May 15, 2013 | 5/15/2013

* కరెంటు లేక పంటలు ఎండిపోయాయి
* చేతికొచ్చే సమయంలోనే దెబ్బతిన్నాయి
* పెట్టుబడులు పోయాయి.. అప్పులు మిగిలాయి..
* వైఎస్ ఉన్నప్పుడు అన్ని విధాలా ఆదుకున్నారు
* ఇప్పుడు పట్టించుకునే నాయకుడే లేడని ఆవేదన వ్యక్తం చేసిన రైతన్నలు
* జగనన్న సీఎం అయ్యాక మంచిరోజులు వస్తాయని భరోసా ఇచ్చిన షర్మిల

మరో ప్రజాప్రస్థానం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: పల్లె.. పాడి.. పంట.. ఈ మూడింటిని విడదీసి చూడలేం! కానీ ఈ దయలేని పాలకుల తీరుతో పల్లె కన్నీరు పెడుతోంది.. పాడి పాడెక్కుతోంది.. నోటి దగ్గరకొచ్చిన పంట చేనులోనే ఎండుతోంది..!! ఒకప్పుడు బాగా బతికి, నలుగురికి అన్నం పెట్టిన రైతన్నే ఇప్పుడు పొట్టకూటి కోసం కూలి పనులు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. పాలుబోసుకునే దశలో మొక్కజొన్న.. పొట్టకొచ్చిన వరిచేను.. మొగ్గ తొడిగిన అరటి.. తియ్యని చెరకు గడ.. బంగారువన్నె మామిడి.. ఒక్కటేమిటి పసుపు, కందలు, దుంపలు, కోకో.. ఇలా ఆరుగాల కష్టం చేతికొచ్చే దశలో పంటలన్నీ ఎండాయి.

ఇలాంటి ఆపత్కాలంలో ఉదారంగా ఆదుకోవాల్సిన పాలకులు కరెంటు బిల్లుల పేరుతో రైతుల నడ్డి విరుస్తున్నారు. ‘‘ఇలాగైతే రైతన్నవాడు మిగలడమ్మా..!’’ అంటూ అన్నదాతలు షర్మిలతో గోడు వెళ్లబోసుకున్నారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో షర్మిలతో రైతులు తమ బాధలు చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని పల్లెల్లో యాత్ర కొనసాగింది. గ్రామాల మీదుగా వెళ్తున్నప్పుడు రైతులు షర్మిలతో మాట్లాడారు. పంట పొలాల్లోకి తీసుకువెళ్లి ఎండిన పంటలను చూపించారు.

రైతును జగనన్న రాజులా చూసుకుంటారు: షర్మిల
రైతుల సమస్యలపై షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న సీఎం అయ్యాక కష్టాలు తీరతాయని భరోసా ఇచ్చారు. ‘‘ఒకవైపు ఎరువుల ధరలు పెరిగాయి. మరోవైపు కరెంటు లేక దిగుబడి తగ్గిపోయింది. మద్దతు ధర మాత్రం పెరగలేదు. రైతన్నకు రెండు విధాలుగా దెబ్బ తగిలింది. ఇది అన్యాయం. జగనన్న సీఎం కాగానే పామాయిల్ రైతుల కోసం ఒక హైలెవల్ కమిటీ వేస్తాం. రైతన్న రాజుగా బతకాలన్నది వైఎస్సార్ ఆశయం. ‘రైతన్న చాలా అభిమానవంతుడు, ఎప్పుడు కూడా నోరు తెరిచి నాకు అప్పులున్నాయి, నాకు ఈ కష్టం ఉంది అని చెప్పుకునేవాడు కాదు. అన్నం పెట్టేవాడే కానీ.. దేహీ అని అడగడు’ అని నాన్న చెబుతుండేవారు. వైఎస్సార్ రైతు పక్షపాతి. అందుకే తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఇదేరోజు మే14న ప్రమాణ స్వీకారం చేసిన రోజునే రైతులకు 7 గంటల ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం పెట్టారు.

రూ. 1,250 కోట్ల కరెంటు బకాయిలు రద్దు చేస్తూ రెండో సంతకం చేశారు. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న సీఎం అయిన తర్వాత రైతును రాజులా చూసుకుంటారు. రైతులు తన పంటను నష్టానికి అమ్ముకోకుండా ఉండేందుకు రూ.3 వేల కోట్లతో రైతు స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారు. రైతన్న అప్పులన్నీ తీరిపోతాయి. మంచి రోజులు వస్తాయి. రైతు మళ్లీ రాజు అవుతాడు.’’ అని షర్మిల అన్నారు. 148 వరోజు మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని సమ్మిరివారిగూడెం గ్రామ శివారు నుంచి ప్రారంభమైంది.

అక్కడి నుం చి పాతచింతలపూడి, చింతలపూడి, తీగలవంచ గ్రామాల మీదుగా సాగింది. క్రిష్ణానగర్ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి షర్మిల రాత్రి 7.40 గంటలకు చేరుకున్నారు. మంగళవారం మొత్తం 11.8 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు 1,977.9 కి.మీ. యాత్ర పూర్తయింది. పాదయాత్రలో పాల్గొన్నవారిలో జిల్లా పార్టీ కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఎమ్మెల్యేలు మద్దాల రాజేష్, ఆళ్ల నాని, జోగి రమేష్, తానేటి వనిత, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మొవ్వ ఆనంద శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, బొడ్డు భాస్కర రామారావు, వైఎస్ కొండారెడ్డి, స్థానిక నాయకులు కర్ర రాజారావు, పాశం రామకృష్ణ తదితరులున్నారు.

‘‘మూడు ఎకరాల్లో అంతరపంటగా కోకో వేశాను. ఎకరాకు రూ.20 వేల పెట్టుబడి పెట్టా. కరెంటు లేక, నీళ్లందక పంట దిగుబడి 50 శాతం తగ్గిపోయింది. మద్దతు ధర కూడా దించేశారు. క్వింటాల్ విత్తనాలకు రూ.11,000 మాత్రమే ఉంది. ప్రభుత్వం సబ్సిడీ తీసేసింది. వైఎస్సార్ ఉన్నప్పుడు క్వింటాల్‌కు రూ.16,500 పలికింది. ఎరువులు, డ్రిప్పు సబ్సిడీ మీద అందించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి వచ్చాక సబ్సిడీ ఎత్తివేశారు. ఎరువుల ధర పెంచి మద్దతు ధర దించారు’’

- తుమ్మల వెంకట కిష్టారావు, కోకో రైతు, తీగలవంచ

‘‘మంగు తెగులు సోకి పంటంతా పోయింది. మంగు సోకిన కాయకు ధర లేదండీ. టన్ను కాయలకు రూ.3 వేలు ఇస్తున్నారు. వైఎస్ ఉన్నప్పుడు మంగు తెగులు సోకకుండా ముందే రైతులకు కొంత మందును ఉచితంగా, మరికొంత సబ్సిడీపై ఇచ్చేవారు. అయినా తెగులు సోకి నష్టపోతే ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం కట్టించారండి. కిరణ్‌కు రైతుల గురించి పెద్దగా పట్టింపు లేదండీ’’.

- మామిడి రైతు రామినేని భాస్కర్, తీగలవంచ

‘‘చెరకు పరిస్థితి దారుణంగా ఉందండీ.. టన్నుకు రూ.2 వేలు కూడా పడటం లేదమ్మా, ఈ ఏడాది కరెంటు లేక పంటంతా పోయింది. ఎకరాకు 30 టన్నుల దిగుబడి రావాల్సిన చెరకు.. నీళ్లు లేక 15 టన్నులు కూడా రావడం లేదు. ఈ ప్రభుత్వం ఇంకా కొనసాగితే రైతన్నవాడు మిగలడమ్మా.. పంట పొలాలు అమ్మేసుకుని కూలి పనులు చేసుకోవాలి. లేకుంటే ఆత్మహత్యలు చేసుకోవాల్సిందేనమ్మా..’

- శ్రీనివాసరావు, చెరకు రైతు, క్రిష్ణానగర్

‘‘ఒక పామాయిల్ చెట్టుకు రోజుకు 300 లీటర్ల నీళ్లు కావాలి. కరెంటు లేక పంట దెబ్బతింటోంది. ఒక్కసారి నీళ్లు లేకపోతే దాని ప్రభావం వచ్చే రెండేళ్ల వరకు ఉంటుంది. టన్ను పామాయిల్ ఇప్పుడు రూ.5,600 మాత్రమే పలుకుతోంది. ఎకరాకు రూ.25 వేల వరకు పెట్టుబడి ఖర్చు వస్తుంది. పామాయిల్ కంపెనీలు మోసం చేస్తున్నాయి. మూడేళ్ల నుంచి పంట తీసుకోవడమే కానీ డబ్బులు ఇవ్వడంలేదు. ఇప్పటికి రూ.46 కోట్లు బకాయి పడ్డాయి’’.

- పెన్మత్స రామారావు, గోలి చంద్రశేఖరరెడ్డి, పామాయిల్ రైతులు
Share this article :

0 comments: