వాస్తవానికి 24 సాయంత్రం నుంచే దీక్షలో... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వాస్తవానికి 24 సాయంత్రం నుంచే దీక్షలో...

వాస్తవానికి 24 సాయంత్రం నుంచే దీక్షలో...

Written By news on Friday, August 30, 2013 | 8/30/2013


హైదరాబాద్ :
మూడు ప్రాంతాలకూ సమన్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని యథాతథంగానే ఉంచాలనే డిమాండ్‌తో జైలు నిర్బంధంలో నిరాహార దీక్ష మొదలు పెట్టిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దాన్ని కొనసాగించారు. తొలి రోజు నుంచే జైలు అధికారులు తనకు ములాఖత్‌లు రద్దు చేసినా ఆయన దృఢ దీక్ష ఏ మాత్రమూ సడలలేదు. ఏదేమైనా ప్రజల తరఫునే నిలవాలని నిశ్చయించుకున్నారు. రాష్ట్ర ప్రజానీకం మనోభావాలను దెబ్బతీసేలా, నిరంకుశ వైఖరితో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న విభజన నిర్ణయంపై సీమాంధ్ర ప్రజలు భగ్గుమనడం... విద్యార్థులు, యువత, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, చేతివృత్తుల వారితో సహా అన్ని వర్గాలూ రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగడం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ప్రజల్లో నెలకొన్న ఆందోళనలను తొలగించాలని, అన్ని ప్రాంతాలకూ సమ న్యాయం చేయలేని పక్షంలో రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ వైఎస్‌ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆగస్టు 19న గుంటూరులో ఆమరణ నిరాహార దీక్షకు దిగడం తెలిసిందే. సముచితమైన ప్రాతిపదిక ఏదీ లేకుండానే రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని నిరసిస్తూ తానే జైల్లో నిరాహార దీక్ష చేస్తానని నిజానికి విజయమ్మకు జగన్ అప్పుడే స్పష్టం చేశారు. తర్వాత విజయమ్మ దీక్షను ఐదు రోజుల అనంతరం ఆగస్టు 23న అత్యంత అమానుష రీతిలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం భగ్నం చేసింది. కనీసం అంబులెన్సు కూడా లేకుండా ఆమెను పోలీసు వాహనంలోనే ఆస్పత్రికి తరలించారు. అడ్డొచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులపై, నాయకులపై ఖాకీలు పాశవిక రీతిలో బల ప్రయోగానికి దిగారు.
 
వజ్ర సంకల్పం.. దృఢ దీక్ష
ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులని కూడా చూడకుండా పలువురిని వేదికపై నుంచి ఎత్తి పడేశారు. ఈడ్చుకుంటూ లాక్కెళ్లి వాహనాల్లో పడేసి నిర్బంధంలోకి తీసుకున్నారు. దీన్ని జగన్ తీవ్రంగా గర్హించారు. స్పందించాల్సిన ఈ సమయంలో స్పందించకపోతే రాష్ట్రం ఎడారిగా మారుతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల పరిరక్షణకు తాను స్వయంగా దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు ఆగస్టు 25 నుంచి చంచల్‌గూడ జైల్లోనే నిరాహార దీక్ష ప్రారంభించారు. ఐదు రోజులకు పైగా ఆహారం తీసుకోకపోవడంతో పూర్తిగా నీరసించినా జగన్‌లోని దృఢ దీక్ష మాత్రం అణుమాత్రమైనా సడలలేదు. మరోవైపు షరామామూలుగా జగన్ దీక్షపై తొలి రోజు నుంచే ఎల్లో మీడియా విష ప్రచారానికి దిగింది. అంతేగాక ప్రభుత్వం కూడా జగన్ ఆరోగ్య పరిస్థితిపై వాస్తవాలు వెల్లడించకుండా ముందు నుంచీ గోప్యత పాటిస్తూ వచ్చింది. దాంతో రాష్ట్ర ప్రజలు, అభిమానులు, వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
 
 తరలింపునకు పకడ్బందీ ఏర్పాట్లు
 దీక్షను భగ్నం చేసి, జగన్‌ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించేందుకు పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. గురువారం సాయంత్రం నాలుగింటికి ఆయనకు రక్త పరీక్షలు నిర్వహించారు. 7 గంటలకు జైలు అధికారులకు వైద్యులు నివేదికలు అందించారు. సుగర్ లెవల్స్ బాగా పడిపోవడంతో సాయంత్రం ఆరింటికి మరోమారు వైద్య పరీక్షలు నిర్వహించారు. వాటి ఫలితాలు రాత్రి 9.30కు జైలు అధికారులకు అందాయి. సుగర్ లెవల్స్ కనిష్ట స్థాయికి వచ్చిన నేపథ్యంలో తక్షణమే జగన్‌కు వైద్య సేవలు అందించాల్సి ఉందని, లేదంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు తలెత్తవచ్చని వైద్యులు స్పష్టం చేసినట్టు సమాచారం.  బాగా నీరసించడం వల్ల ఆయనకు పలమార్లు కళ్లు తిరిగినట్టు కూడా వైద్యులు గుర్తించారు. దాంతో జగన్‌కు వైద్య సేవలందించేందుకు జైలు అధికారులు ఉస్మానియా వైద్యులను సంప్రదించారు. ఆస్పత్రికి తరలిస్తే నిరంతరం ఈసీజీతో పాటు కిడ్నీ సంబంధిత పరీక్షలు కూడా చేయాల్సి ఉంటుంది. కానీ ఉస్మానియాలో కొన్ని వైద్య పరీక్షల పరికరాలు మరమ్మతులో ఉన్నట్టు జైలు అధికారుల దృష్టికి వచ్చిందని తెలిసింది. దాంతో నిమ్స్ వైద్యాధికారులతో కూడా వారు సంప్రదింపులు జరిపారు. ఏ ఆస్పత్రికి తరలించాలనే అంశంపై జైళ్ల శాఖ ఇన్‌చార్జి డీజీ ఎన్.సాంబశివరావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతితో రాత్రి 9 గంటల సమయంలో మాట్లాడినట్టు సమాచారం. చంచల్‌గూడ జైలుకు రెఫరల్ ఆస్పత్రి ఉస్మానియా కావడంతో అక్కడికే తరలించాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఉస్మానియా ఆస్పత్రి వద్ద భద్రతను కట్టుదిట్టంచేశారు. చంచల్‌గూడ నుంచి ఆస్పత్రి దాకా మార్గాన్ని పోలీసులు ఒక ద ఫా పరిశీలించారు. ఆయన్ను తరలించేందుకు బులెట్‌ప్రూఫ్ వాహనాలను రాత్రి 10.50 గంటలప్పుడు చంచల్‌గూడ జైలుకు తీసుకువచ్చారు. ఆ సమయంలో జైలు వద్దకు భారీగా అభిమానులు తరలి వచ్చారు. దాంతో పారా మిలటరీ, స్థానిక పోలీసుల భద్రతను భారీగా పెంచారు.
 
 

వాస్తవానికి 24 సాయంత్రం నుంచే దీక్షలో...
 అన్ని ప్రాంతాలకూ సమన్యాయం చేయని పక్షంలో రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనే డిమాండ్‌తో ఆగస్టు 25వ తేదీ ఉదయం 6 గంటల నుంచి చంచల్‌గూడ జైల్లో జగన్ నిరాహార దీక్ష ప్రారంభించారు. కానీ దీక్ష ప్రారంభానికి 12 గంటల ముందునుంచే ఆయన ఆహారం తీసుకోలేదు. జైలు నిబంధనల ప్రకారం రోజూ సాయంత్రం ఆరింటి లోపే ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ 24వ తేదీ సాయంత్రం ఆయన ఆహారం తీసుకోలేదని తెలుస్తోంది. అంటే వాస్తవానికి నిరాహార దీక్ష 24వ తేదీ సాయంత్రం నుంచే మొదలైనట్టు భావించాల్సి ఉంటుందని వైద్యులంటున్నారు. అందువల్లే ఐదు రోజుల్లోనే ఆయన బాగా నీరసించారని అభిప్రాయపడుతున్నారు. గతంలో ఫీజు దీక్ష సమయంలో జగన్ 7 రోజుల దాకా నిరాహార దీక్ష చేయడం తెలిసిందే. కానీ ఈసారి జైల్లో నాలుగు గోడల మధ్య ఒక్కరే కూర్చుని దీక్ష చేయడం, గాలీ, వెలుతురు వంటి సౌకర్యాలు అంతగా ఉండని చోటు కావడం వల్ల కూడా ఆయన ఐదున్నర రోజులకే నీరసించి ఉంటారని వైద్యులు వివరిస్తున్నారు.
Share this article :

0 comments: