అడుగడుగునా అవమానాలే ! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అడుగడుగునా అవమానాలే !

అడుగడుగునా అవమానాలే !

Written By news on Saturday, August 31, 2013 | 8/31/2013

అడుగడుగునా అవమానాలే !

వైఎస్ కుటుంబంపై సర్కారు కక్షసాధింపు
జగన్ అరెస్టు నుంచి నేటిదాకా పలు సందర్భాల్లో బట్టబయలు
జగన్‌మోహన్‌రెడ్డి అరెస్టుకు  నిరసనగా రోడ్డుపై బైఠాయించిన తల్లి, భార్య, సోదరిపై దౌర్జన్యం
బలప్రయోగం చేసి బలవంతంగా ఇంటికి తరలింపు
ఉప ఎన్నికల ప్రచారంలో విజయమ్మ సూట్‌కేసు తనిఖీ
ఇంటికెళ్లి వ్యక్తిగత వస్తువులూ జల్లెడ పట్టిన వైనం
బార్, స్విమ్మింగ్‌పూల్ కట్టుకున్నారంటూ ఎల్లోమీడియా శివాలు
ఈ విషప్రచారంపై ఏనాడూ కిమ్మనని ప్రభుత్వం, సీబీఐ
విజయమ్మ దీక్షను భగ్నం చేసి పోలీసు వాహనంలో ఆస్పత్రికి తరలింపు
ఏ హోదా లేని టీడీపీ నేతలను అంబులెన్సుల్లో ఆస్పత్రులకు
జగన్‌ను ఆస్పత్రికి తరలించే ముందు కనీసం కుటుంబ సభ్యులకూ చెప్పలేదు

హైదరాబాద్: వైఎస్ రాజశేఖరరెడ్డి... తుది శ్వాస దాకా రాష్ట్రానికి పెద్ద దిక్కుగా నిలిచిన మరపురాని మహా నేత. ముఖ్యమంత్రిగా, సీఎల్పీ నాయకునిగా, విలువలకు మారుపేరైన రాజకీయ నేతగా, వైద్యునిగా రాష్ట్ర ప్రజానీకానికి ఆయన చేసిన సేవలు అమూల్యం. అన్ని పార్టీల మన్ననలూ పొందిన అరుదైన నాయకుడు వైఎస్సార్. రాష్ట్ర రాజకీయ యవనికపై చెరగని ముద్ర వేసి జన హృదయాల్లో నిలిచిపోయారు. అలాంటి వైఎస్ భౌతికంగా ఈ లోకాన్ని వీడినప్పటి నుంచీ ఆయన కుటుంబం అష్టకష్టాలు పడుతోంది. అడుగడుగునా అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, తండ్రి ఆశయ సాధన కోసం పాటుపడతానని ఆయన తనయుడు, పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వాగ్దానం చేసినప్పటి నుంచీ ఆ కుటుంబంపై చెప్పలేనన్ని వేధింపులు అనునిత్యం కొనసాగుతూనే ఉన్నాయి.
 
 చెప్పినట్టు మాట వినలేదన్న కారణంగా జగన్‌ను ఏడాదికి పైగా జైలు నిర్బంధంలో ఉంచి ఆయన కుటుంబాన్ని అనునిత్యం అవమానానికి, వేధింపులకు గురి చేస్తున్నారు. అది చాలదన్నట్టు వైఎస్ సతీమణి విజయమ్మ, కోడలు భారతి, కూతురు షర్మిల... ఇలా దాదాపు ఆయన సొంత మనుషులందరిపైనా ఈ వేధింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. జగన్‌ను జైలుపాలు చేసింది మొదలు, రాష్ట్ర ప్రజల హితం కోసం జైలులోనే నిరాహార దీక్ష చేస్తున్న ఆయనను తాజాగా ఉస్మానియాకు తరలించేదాకా.. సందర్భమేదైనా ఆ కుటుంబాన్ని అవమానాలపాలు చేయడమే సింగిల్ పాయింట్ ఎజెండా అన్నట్టుగా అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు వ్యవహరిస్తున్నాయి. అడుగడుగునా వారికి వంతపాడే ఎల్లో మీడియా కూడా అందుకు అన్నివిధాలా తోడ్పాటు అందించేందుకు అహర్నిశలూ శ్రమిస్తోంది.
 
విచారణకంటూ పిలిచి:  వాస్తవానికి జగన్ ఆస్తులకు సంబంధించిన కేసులో మర్నాడు కోర్టులో విచారణ జరగాల్సి ఉండగా, విచారణ చేస్తామంటూ పిలిపించి, రాత్రి సమయంలో అరెస్టు చేసింది సీబీఐ. విచారణకు అన్నివిధాలా సహకరిస్తున్న వ్యక్తిని, తెల్లారితే కేసు కోర్టులో విచారణకు రానుండగా అకారణంగా ఎలా అరెస్టు చేస్తారంటూ నిలదీసేందుకు వెళ్లిన కుటుంబ సభ్యులను ఘోర అవమానానికి గురిచేశారు. రాత్రి సమయంలో రోడ్డుపై బైఠాయించి కన్నీళ్ల మధ్య నిరసన తెలిపిన జగన్ తల్లి విజయమ్మ, భార్య భారతి, సోదరి షర్మిలను వేధింపులకు గురిచేశారు. పోలీసులను పెట్టి బలవంతంగా అక్కడి నుంచి తరలించిన తీరు ఇప్పటికీ రాష్ట్ర ప్రజల కళ్లలో మెదులుతోంది. ఆ రోజున విజయమ్మ, భారతి, షర్మిల పడ్డ మానసిక వేదన అందరికీ గుర్తుకొస్తూనే ఉంది. ఆ తర్వాత ఏకంగా వైఎస్ కుటుంబం నివాసాన్ని కూడా లక్ష్యం చేసుకుంది సీబీఐ. విచారణ పేరుతో లోటస్‌పాండ్‌లోని వారి ఇంట్లో నానా హంగామా సృష్టించారు సీబీఐ అధికారులు. వ్యక్తిగత వస్తువులను దాచుకునే సూట్‌కేసులను కూడా జల్లెడ పట్టారు.
 
 సోదాలు జరిగిందే తడవుగా, ఏనాడూ మద్యాన్ని దగ్గరికైనా రానీయని జగన్ తన ఇంట్లో ఏకంగా బార్ నిర్మించుకున్నారని, స్విమ్మింగ్‌పూల్ కట్టుకున్నారని ఎల్లో మీడియా చేసిన విష ప్రచారం ఆయన కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. ఇంతటి విషప్రచారం జరుగుతున్నా సీబీఐ అధికారులు, ప్రభుత్వం గానీ జోక్యం చేసుకోలేదు. దాన్ని ఖండించే ప్రయత్నమూ చేయలేదు. ఆరోపణలను నిరూపించాలంటూ వైఎస్ కుటుంబ సభ్యులు, వైఎస్సార్‌సీపీ నేతలు సవాలు చేయడంతో అంతా తోకముడిచారు. జగన్ కుటుంబానికి జరుగుతున్న అన్యాయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.
 
 ఎన్నికల ప్రచారంలోనూ: ప్రజల తీర్పు కోరే సమయంలోనూ వైఎస్ కుటుంబాన్ని నిత్యం అవమానాలకు గురిచేశారు. ప్రజా కంటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో ఓటేసిన 15 మంది వైఎస్సార్ అభిమాన ఎమ్మెల్యేలను అనర్హతకు గురి చేసినందుకు ఉప ఎన్నికలు జరగడం తెలిసిందే. రాజీనామా చేసిన శోభా నాగిరెడ్డి ప్రాతినిధ్యం వహించే ఆళ్లగడ్డ, రాజ్యసభకు ఎన్నికయిన చిరంజీవి ప్రాతినిధ్యం వహించిన తిరుపతి అసెంబ్లీ స్థానాలకు కూడా అప్పుడే ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా గోదావరి జిల్లాల్లో విజయమ్మ ప్రచారానికి వెళ్లినప్పుడు కూడా వాహనాన్ని తనిఖీ చేసే నెపంతో ఆమెను తీవ్రంగా అవమానించారు. ఆమె సూట్‌కేసులను, వాటిలోని దుస్తులను కూడా తీసి మరీ తనిఖీలు చేశారు. గతంలో ఏ పార్టీ నాయకునికి గానీ, నాయకురాలికి గానీ ఇలాంటి అవమానం జరగలేదు.
 
 దీక్షల్లోనూ వివక్షే : ప్రజల పక్షాన దీక్షలు చేస్తున్న సందర్భంలోనూ వైఎస్ కుటుంబానికి అవమానాలే ఎదురయ్యాయి. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై పోరాటాలు చేసిన వైఎస్ కుటుంబం... రాష్ట్ర విభజన విషయంలో కూడా అన్ని పార్టీలు, అందరు రాజకీయ నాయకులకన్నా స్పష్టమైన వైఖరితో ప్రత్యక్ష ఆందోళనకు దిగింది. పార్టీ అధ్యక్షునితో పాటు గౌరవాధ్యక్షురాలు ప్రజాప్రతినిధులుగా తమకున్న పదవులకు రాజీనామా చేశారు. నిరవధిక దీక్షలకు దిగారు. గుంటూరులో దీక్ష చేపట్టిన విజయమ్మను ఐదోరోజు అర్ధరాత్రి పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించారు.
 
 ఆ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నేతల పట్ల అతి కర్కశంగా వ్యవహరించారు. పైగా విజయమ్మను ఉద్దేశపూర్వకంగా సాధారణ పోలీసు వాహనంలో ఆసుపత్రికి తరలించి అవమానించారు. ఏ హోదా లేని టీడీపీ నేతలను దర్జాగా ఆంబులెన్సులో ఆసుపత్రికి పంపిస్తున్న వైనం అందరూ చూస్తున్నదే. తర్వాత జగన్‌మోహన్‌రెడ్డి చంచల్‌గూడ జైల్లోనే నిరవధిక దీక్షకు దిగారు. ఐదురోజుల తర్వాత గురువారం ఆయనను ఆసుపత్రికి తరలించిన సమయంలోనూ అలాగే వ్యవహరించారు. పైగా ఆసుపత్రికి తీసుకెళ్లేటప్పుడు కుటుంబ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వలేదు. మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని జగన్‌ను పరామర్శించేందుకు వెళ్లిన విజయమ్మను, భారతిని గంటకు పైగా అనుమతించనేలేదు. వైఎస్ కుటుంబాన్ని ఇలా అడుగడుగునా వేధిస్తున్న తీరు ప్రజలను ఆలోచింపజేస్తోందని రాజకీయ పరిశీలకులంటున్నారు.
Share this article :

0 comments: