రాష్ట్రం కన్నా నా ప్రాణం ముఖ్యం కాదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్రం కన్నా నా ప్రాణం ముఖ్యం కాదు

రాష్ట్రం కన్నా నా ప్రాణం ముఖ్యం కాదు

Written By news on Saturday, August 31, 2013 | 8/31/2013

రాష్ట్రం కన్నా నా ప్రాణం ముఖ్యం కాదు
ఉస్మానియా వైద్యులకు స్పష్టం చేసిన జగన్
ఇంతటి కీలక తరుణంలోనూ ఎవరూ నిలదీయకుంటే ఎలా?
విభజన జరిగితే కృష్ణా డెల్టా పూర్తిగా ఎడారవుతుంది
తెలంగాణ, సీమాంధ్రల్లోని ప్రజలంతా ఇక్కట్లపాలవుతారు

హైదరాబాద్: ‘‘నేనొక లక్ష్యం కోసం దీక్ష చేస్తున్నాను. అది నెరవేరే వరకూ దీక్ష విరమించబోను. రాష్ట్ర ప్రయోజనాల కంటే నా ప్రాణం విలువైనదేమీ కాదు. రాజకీయ దురుద్దేశాలతో ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలను ఎవరూ ప్రశ్నించకపోతే, పట్టించుకోకపోతే ఎలా? అన్ని ప్రాంతాలకూ న్యాయం చేయడం సాధ్యం కాదనుకుంటే ఈ రాష్ట్రాన్ని సమైక్యంగానే కొనసాగించాలి. అడ్డగోలుగా తీసుకున్న విభజన నిర్ణయం వల్ల కృష్ణా ఆయకట్టు పూర్తిగా ఎడారిగా మారే ప్రమాదంలో పడింది. అదే జరిగితే... కృష్ణా బేసిన్ ఇటు తెలంగాణలోనూ, అటు సీమాంధ్రలోనూ ఉన్నందున రెండు ప్రాంతాల ప్రజలూ తీవ్ర ఇక్కట్ల పాలవుతారు. కృష్ణా డెల్టా ఎడారవడమే గాక కొత్త అంతర్రాష్ట్ర వివాదాలు తలెత్తుతాయి. అటు రాయలసీమలో, ఇటు తెలంగాణలోనూ మిగులు జలాలపై ఆధారపడ్డ ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు కూడా వట్టిపోతాయి. అవన్నీ మొండిగోడలుగా మిగులుతాయి. అందుకే నేను దీక్ష చేయాల్సి వస్తోంది. అనాలోచితంగా రాష్ట్రాన్ని విడదీసి ఇలాంటి పెను సమస్యలు సృష్టించే బదులు సమైక్యంగానే కొనసాగించడమే అందరికీ శ్రేయస్కరం. ప్రజల కోసం మనం చేసే పనుల రాష్ట్రానికి ప్రయోజనం కలిగి, తద్వారా ఓట్లయినా, అధికారమయినా రావాలి. అంతే తప్పితే కేవలం ఓట్ల కోసం, సీట్ల కోసమే పనులు చేయడం నైతిక రాజకీయం కాజాలదు.
 
చంద్రబాబు నాయుడు ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా ఏమాత్రం ఆలోచించినా ఈ దుస్థితి వచ్చేది కాదు. ఇంతటి కీలక తరుణంలో ఎవరూ గట్టిగా నిలదీయకపోతే ఎలా? పార్టీలన్నీ చిత్తశుద్దితో వ్యవహరించాల్సిన అవ సరముంది. ఇన్ని రోజులుగా నేను చేస్తున్న దీక్ష వల్ల ఏ కొద్దిగానైనా రాష్ట్ర హితం కోసం ఆలోచిస్తారని, ప్రజలకు కొంతయినా మేలు జరుగుతుందని ఆశిస్తున్నాను’’ అని ఉస్మానియా వైద్యులతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా, నిరంకుశ వైఖరితో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆగస్టు 25 నుంచీ చంచల్‌గూడ జైల్లో నిరాహార దీక్ష చేస్తున్న జగన్‌ను గురువారం అర్ధరాత్రి వేళ ఉస్మానియా ఆస్పత్రికి తరలించడం తెలిసిందే. జైల్లో ఐదు రోజుల పాటు ఏ రకంగా నిరాహార దీక్ష కొనసాగించారో, ఆరో రోజు శుక్రవారం కూడా ఉస్మానియాలో అదే మాదిరిగా ఆయన దీక్షను కొనసాగించారు. ఈ సందర్భంగా తనకు వైద్య పరీక్షలు చేస్తున్న వైద్యులతో శుక్రవారం పలు సందర్భాల్లో మాట్లాడుతూ జగన్ పై వ్యాఖ్యలు చేశారు. ఆహారం తీసుకోవాలని వైద్యులు కోరగా సున్నితంగా తిరస్కరించారు. పరిస్థితి విషమిస్తుండటంతో బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు శుక్రవారం సాయంత్రం ప్రయత్నించగా ఆయన అంగీకరించలేదు. ‘‘నాలో దీక్ష చేసే శక్తి ఇంకా ఉంది. మీరు అర్ధరాత్రి వేళ నా గదిలోకి వచ్చినా మీలో ప్రతి ఒక్కరినీ గుర్తు పట్టగల స్థితిలో ఉన్నాను. గతంలో ఏడు రోజులు దీక్ష చేశాను. దయచేసి నా దీక్షను మీరు బలవంతంగా నిలిపివేయవద్దు. మీరు చేసే వైద్య పరీక్షలకు నేను పూర్తిస్థాయిలో సహకరిస్తాను. కానీ మంచినీళ్లు మినహా ఏ రకమైన ద్రవహారాన్నీ తీసుకోను. మీరు కూడా బలవంతంగా నాకు ఆహారం ఇచ్చేందుకు ప్రయత్నించకండి. వైద్యులుగా మీరు చేస్తున్న సేవలకు నా కృతజ్ఞతలు...’’ అని వారితో పేర్కొన్నారు. ఉస్మానియా సూపరింటెండెంట్ సూచన మేరకు శుక్రవారం రాత్రి 11.40 ప్రాంతంలో జగన్‌ను పోలీసులు నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
 
 ఆందోళనకరంగా పరిస్థితి
 అంతకుముందు శుక్రవారం రాత్రి దాకా ఉస్మానియాలో ఐదుగురు వైద్యుల బృందం జగన్‌కు నాలుగు దఫాలు వైద్య పరీక్షలు నిర్వహించింది. ఆహారం తీసుకునేందుకు జగన్ నిరాకరించడంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘గంటగంటకూ మీ ఆరోగ్యం క్షీణిస్తోంది. మీరు ఆహారం తీసుకోకపోతే శారీరక ఇబ్బందులు తలెత్తుతాయి. ఇప్పటికే శరీరంలో పలు ప్రతికూల మార్పులు చోటుచేసుకున్నాయి’’ అని చెప్పారు. అయినా వారి సూచనను జగన్ సున్నితంగా తిరస్కరించారు. ఎంత చెప్పినా దీక్ష కొనసాగించేందుకే జగన్ మొగ్గుచూపారని, కనీసం ద్రవాహారం తీసుకోవాలని సూచించినా సున్నితంగా తిరస్కరించారని వైద్యులు చెప్పారు. ఆయనకు వారు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ‘‘జగన్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. శరీరంలో కీటోన్స్ (గ్లూకోజ్ నిల్వలు తగ్గి, కొవ్వులు శక్తి రూపంలో వినియోగమవుతున్నప్పుడు విడుదలయ్యే చెడు పదార్థాలు) పెరుగుతున్నాయి. సాధారణంగా అవి నార్మల్‌గా, అంటే జీరోగా ఉండాలి. శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు కీటోన్స్ 3గా నమోదయ్యాయి. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమాయానికి 4ను దాటాయి. కీటోన్స్ పెరగడం వల్ల మూత్రపిండాలపై దుష్ర్పభావం పడుతుంది. గుండె కొట్టుకునే వేగం కూడా తగ్గిపోయింది. నిమిషానికి 72గా ఉండాల్సిన పల్స్ రేటు 50-60కి పడిపోయింది. బీపీ 110/70కి, చక్కెర నిల్వలు 100 నుంచి 60కి పడిపోయాయి’’ అని వివరించారు. చక్కెర నిల్వలు పడిపోవడంతో హైపో గ్లైసీమియా వస్తుందని వైద్యులు హెచ్చరించారు. దీనివల్ల శరీరం నీరసించిపోవడం, కళ్లుతిరగడం, పల్స్‌రేటు మరింతగా పడిపోవడం జరుగుతుందని చెప్పారు. మరికొద్ది గంటల్లో జగన్ ఆహారం తీసుకోకపోతే తీవ్ర ప్రమాదం జరిగే ఆస్కారముందని తెలిపారు.
 
 రెండుగంటలు వైద్యుల భేటీ: ఓవైపు జగన్ హెల్త్ బులెటిన్ల కోసం ఆస్పత్రి బయట మీడియా ఎదురుచూపులు. అవి సకాలంలో రాకపోయేసరికి అభిమానుల్లో ఆందోళన. లోపల జగన్ ఆరోగ్యం ఎలా ఉంది, బులెటిన్‌లు ఎప్పుడు విడుదల చేస్తారు, అసలు ఏం జరుగుతోందంటూ వారు ఆందోళన చెందారు. ఉస్మానియా వైద్యులు జగన్ ఆరోగ్యంపై రెండు గంటల పాటు సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాందాస్, ఉస్మానియా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పుట్టా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏడుగురు స్పెషలిస్టు వైద్యులు సమావేశమయ్యారు. వారంతా జగన్ ఆరోగ్య పరిస్థితిపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వాటి ఆధారంగా రూపొందించిన నివేదికను వైద్య విద్యా సంచాలకులు శుక్రవారం సాయంత్రం డీఎంఈకి పంపారు. జగన్‌కు చేయాల్సిన వైద్య పరీక్షలతో పాటు ఉస్మానియాలో వసతుల లేమిపై చర్చించారు.
 
 జైళ్ల శాఖకు ఉస్మానియా సూపరింటెండెంట్ లేఖ
 జగన్‌ను వేరే ఆస్పత్రికి తరలించాలని కోరుతూ జైళ్ల శాఖ అధికారులకు ఉస్మానియా సూపరింటెండెంట్ శుక్రవారం సాయంత్రం లేఖ రాశారు. ‘‘ప్రస్తుతం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఒంట్లో కీటోన్స్ బాగా పెరిగాయి. దీనివల్ల కిడ్నీ సమస్యలు వచ్చే ఆస్కారముంది. ఫ్లూయిడ్స్ ఎక్కించడానికి జగన్‌మోహన్‌రెడ్డి నిరాకరిస్తున్నారు’’ అని వివరించారు. ఆయనకు ఏ క్షణంలోనైనా బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు అనుమతివ్వాలని లేఖలో ఆయన కోరారు. అంతేగాక, ‘ఉస్మానియాలో వసతుల లేమి ఉంది. పైగా ఆస్పత్రి పోలీసుల దిగ్బంధంలో ఉండటంతో సామాన్య రోగులకు ఇబ్బందిగా ఉంది’ అని వివరించారు. ఈ కారణాల రీత్యా జగన్‌ను వేరే ఆస్పత్రికి తరలించేందుకు అనుమతివ్వాలని కోరారు. ఏ ఆస్పత్రికి తరలించాలో సూచించాలంటూ జైళ్ల శాఖ అధికారులు తిరిగి లేఖ రాయడంతో, నిమ్స్‌కు పంపాల్సిందిగా వారికి ఉస్మానియా సూపరింటెండెంట్ సూచించారు.
 
 మీ ప్రాణం ముఖ్యమని చెప్పాను: డాక్టర్ అశోక్‌కుమార్
 జగన్‌మోహన్‌రెడ్డికి వైద్యం అందించిన ఉస్మానియా వైద్య బృందానికి డాక్టర్ అశోక్‌కుమార్ సారథ్యం వహించారు. శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించిన సందర్భంగా పలుమార్లు వైఎస్ జగన్‌తో తాను ప్రత్యేకంగా మాట్లాడినట్టు ఆయన ‘సాక్షి’కి చెప్పారు. ‘‘ప్రాణం కంటే ముఖ్యమైనదేదీ లేదని చెప్పాను. ఇక ఆలస్యం చేయకుండా ఆహారం తీసుకోవాలని సూచించాను. కానీ జగన్ సున్నితంగా తిరస్కరించారు. దీక్ష కొనసాగిస్తానన్నారు’’ అని చెప్పారు. జగన్‌కు వైద్యం అందించిన ఉస్మానియా బృందంలో డాక్టర్ అశోక్‌కుమార్‌తో పాటు డాక్టర్ శ్రీధర్ (జనరల్ సర్జరీ), డాక్టర్ జయంతీ రమేశ్ (ఎండోక్రైనాలజీ), డాక్టర్ లక్ష్మణరావు (కార్డియాలజీ), డాక్టర్ మనీషా సహాయ్ (నెఫ్రాలజీ) ఉన్నారు.
 
 వెన్నునొప్పితో బాధపడుతున్న జగన్
 
 వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి వెన్నునొప్పితో బాధపడుతున్నారు. దాంతో ఉస్మానియాలో ఆయనకు వేడినీళ్ల కాపడం పెట్టడంతో పాటు, వీపుకు కొన్ని రకాల ఆయింట్‌మెంట్లు రాశారు. వాటితో ఆయనకు కొంత ఉపశమనం కలిగినట్టు వైద్యులు పేర్కొన్నారు. ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న కారణంగా శక్తి బాగా సన్నగిల్లినందుకే వెన్నునొప్పికి గురై ఉండవచ్చని వివరించారు. అయితే జగన్‌లోని సంకల్ప శక్తి తమను ఆశ్చర్యానికి గురి చేసిందని ఆయనకు పరీక్షలు చేస్తున్న ఒక వైద్యుడు ‘సాక్షి’తో అన్నారు. శారీరకంగా పూర్తిగా నీరసించిన స్థితిలో ఉండి కూడా తమతో ఆయన ఓపికగా, చిరునవ్వుతో మాట్లాడారని వివరించారు.
Share this article :

0 comments: