మరో రూ. 1600 కోట్లు జనం పైనే వేద్దాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మరో రూ. 1600 కోట్లు జనం పైనే వేద్దాం

మరో రూ. 1600 కోట్లు జనం పైనే వేద్దాం

Written By ysrcongress on Thursday, February 23, 2012 | 2/23/2012

ఉచిత కరెంటు భారం మనకెందుకు..?
మరో రూ. 1600 కోట్లు జనం పైనే వేద్దాం

సాగు భారం (600కోట్లు) మోయలేమని స్పష్టీకరణ
జనం నెత్తినే రుద్దుతామని ఈఆర్‌సీని కోరిన డిస్కంలు
వైఎస్ హయాంలో పూర్తిగా ప్రభుత్వమే భరించింది
పంపిణీ నష్టాల భారమూ (1000కోట్లు) ప్రజల పైనే!


హైదరాబాద్, న్యూస్‌లైన్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నింటికీ వరుసగా మంగళం పాడుతూ వస్తున్న కిరణ్ సర్కారు రాష్ట్ర ప్రజలకు వరుసబెట్టి మరిన్ని కరెంటు షాకులిచ్చేందుకు పూర్తిస్థాయిలో రంగం సిద్ధం చేస్తోంది. తన నిర్వాకంతో పెను సంక్షోభంలో చిక్కిన వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు ఏ చర్యలూ తీసుకోకపోగా.. సాగుకు వైఎస్ అందిస్తూ వచ్చిన ఉచిత విద్యుత్ భారాన్ని కూడా వీలైనంతగా వదిలించుకోవాలని తాజాగా నిర్ణయించుకుంది. 2004-2009 మధ్య వైఎస్ హయాంలో వ్యవసాయానికి కోటాకు మించి సరఫరా అయిన అదనపు కరెంటు భారాన్ని ప్రభుత్వమే భరించగా, ఇకపై దాన్ని కూడా జనం నెత్తినే రుద్దాలని, చేతులు దులుపుకోవాలని కిరణ్ సర్కారు నిర్ణయించింది! 2010-11కు సంబంధించి ఈ భారాన్ని ప్రజల నుంచే వసూలు చేసుకోవాలని పంపిణీ సంస్థ (డిస్కం)లకు ఇప్పటికే సూచించింది. అంతటితో ఆగకుండా డిస్కం అసమర్థత తాలూకు భారాన్ని కూడా జనం నెత్తినే పడేయనుంది. వీటి ఫలితంగా మరో రూ.1,600 కోట్ల మేరకు చార్జీల రూపంలో జనం నెత్తిన అదనంగా పిడుగు పడనుంది. ఎన్నడూ లేనివిధంగా కరెంటు చార్జీలను ఏకంగా రూ.5,000 కోట్ల మేరకు పెంచేందుకు అనుమతి కోరుతూ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ)కి డిస్కంలు గత డిసెంబర్‌లోనే ప్రతిపాదనలు సమర్పించడం తెలిసిందే. దీనికి రూ.1,600 కోట్ల తాజా భారాన్ని కలిపితే జనం నెత్తిన ఏకంగా రూ.6,600 కోట్ల మేరకు త్వరలో కరెంటు పిడుగు పడనుందన్నమాట! వీటికి తోడు, 2012 జూన్ నుంచి మధ్యకాలిక బిడ్డింగ్ ద్వారా కొనుగోలు చేసే కరెంటు భారాన్ని కూడా చార్జీల పెంపు రూపంలో ప్రజలపైనే మోపాలని కూడా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది!

భారం మోయడానికి ప్రభుత్వం ససేమిరా..!

వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని వైఎస్ 2004 నుంచీ అమలు చేయడం తెలిసిందే. అప్పటి నుంచీ సాగుకు సరఫరా చేసే మొత్తం కరెంటుకు సరిపడే నిధులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ వచ్చింది. వ్యవసాయానికి ఎంత విద్యుత్ సరఫరా అవుతోందో ఈఆర్‌సీ నిర్ణయిస్తుంది. ఒకవేళ డిస్కంలు అంతకుమించి సరఫరా చేసినా, ఆ మొత్తాన్ని కూడా ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. 2004 నుంచి 2009 దాకా వైఎస్ హయాంలో అదే జరిగింది. సాగుకు కోటాకు మించి సరఫరా జరిగితే సదరు అదనపు విద్యుత్ కొనుగోళ్లకు కూడా వైఎస్ నిధులు మంజూరు చేశారు. గృహ, పారిశ్రామిక, వాణిజ్య అవసరాల కోసం కొనుగోలు చేసిన అదనపు కరెంటుకూ నిధులు విడుదల చేసేందుకు కూడా ఆయన హామీ ఇచ్చారు. కానీ తాజాగా డిస్కంలు, ‘‘2010-11లో వ్యవసాయానికి నిర్ణీత లక్ష్యానికి మించి కరెంటు సరఫరా చేశాం. ఈ భారానికి తోడు పంపిణీ నష్టాలు కూడా నిర్ణీత లక్ష్యం కంటే అధికంగా నమోదయ్యాయి’’ అంటూ ఈఆర్‌సీకి మొరపెట్టుకున్నాయి. ఈ అదనపు భారాలను ‘వాస్తవిక వ్యయాన్ని రాబట్టుకునే’ (ట్రూయింగ్ అప్) పద్ధతిలో ప్రజలపై మోపేందుకు అనుమతివ్వాలని ప్రతిపాదించాయి. వాటిపై ఈఆర్‌సీ ప్రస్తుతం బహిరంగ విచారణ నిర్వహిస్తోంది. హైదరాబాద్, నిజామాబాద్, తిరుపతిలల్లో ఇప్పటికే విచారణను పూర్తవగా ఈ నెల 27న కాకినాడలో జరగనుంది. అనంతరం మార్చి చివరి వారంలో చార్జీల పెంపు ఆదేశాలు జారీ అయి, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

మోయలేనంత భారం...

2012-13 ఆర్థిక సంవత్సరానికి వర్తించే విద్యుత్ చార్జీల ప్రతిపాదనలను డిసెంబర్‌లో డిస్కంలు ఈఆర్‌సీకి సమర్పించాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా రూ.5,000 కోట్ల మేరకు చార్జీల పెంపును ప్రతిపాదించాయి. 30 యూనిట్ల పైబడి నెలవారీ వాడకమున్న గృహ వినియోగదారులందరితో పాటు వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు కూడా చార్జీల షాకిచ్చేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. రూ.1,600 కోట్ల తాజా పెంపునూ కలిపితే మొత్తంమీద కరెంటు చార్జీల వడ్డన మరింత ఎక్కువగా ఉండవచ్చని విద్యుత్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి 2008-09, 2009-10 ఇంధన సర్దుబాటు చార్జీలను కూడా జనం మీదే మోపాలని ప్రభుత్వం నిర్ణయించడమే గాక, వాటిని ఫిబ్రవరి నుంచే వసూలు చేయాలంటూ ఈఆర్‌సీకి ఆదేశాలు కూడా జారీ చేసింది. పాతకాలం నాటి సర్దుబాటు చార్జీలను తాజాగా మోపడం సరికాదంటూ వాటిని హైకోర్టు కొట్టేయడంతో జనంపై భారం తప్పింది.

అసమర్థత భారమూ జనం మీదే..!

కరెంటు ఉత్పత్తి స్థానం నుంచి వినియోగదారులకు చేరే మధ్యలో జరిగే సరఫరా, పంపిణీ నష్టాలను లైన్ల ఆధునికీకరణ, పనితీరు మెరుగుదల తదితరాల ద్వారా తగ్గించుకోవాలని ఈఆర్‌సీ ఆదేశిస్తుంటుంది. ఏటా ఏ మేరకు తగ్గించుకోవాలో లక్ష్యం కూడా విధిస్తుంది. కానీ పాత కాలం నాటి కరెంటు లైన్లను మార్చకుండా, వాటి నిర్వహణకు సరిపడా సిబ్బంది లేకుండా నెట్టుకొస్తున్న కారణంగా ఆ లక్ష్యాలను చేరలేకపోతున్నామని డిస్కంలే స్వయంగా స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నష్టాల తగ్గింపు లక్ష్యాన్ని తగ్గించాలని ఈఆర్‌సీని అవి కోరాయి. అందుకు ఈఆర్‌సీ ససేమిరా అనడంతో 2010-11లో లక్ష్యానికి మించి వచ్చిన నష్టాల భారాన్ని కూడా ప్రజలపైనే మోపేందుకు అవకాశమివ్వాలని డిస్కంలు కోరాయి. అంటే డిస్కంల అసమర్థత భారమూ జనం నెత్తినే పడనుందన్నమాట!
Share this article :

0 comments: