రాష్ట్ర వార్షిక బడ్జెట్‌పై వైఎస్ జగన్ బహిరంగ లేఖ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్ర వార్షిక బడ్జెట్‌పై వైఎస్ జగన్ బహిరంగ లేఖ

రాష్ట్ర వార్షిక బడ్జెట్‌పై వైఎస్ జగన్ బహిరంగ లేఖ

Written By ysrcongress on Sunday, February 19, 2012 | 2/19/2012


వైఎస్ పథకాలకు నిధులు కేటాయించటంలో సర్కారు పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శించింది 
వైఎస్ సంక్షేమ సూత్రాలతో బడ్జెట్ పెడితే.. ఆ క్రెడిట్ ఆయనకే దక్కుతుందని భయం
ఇంకెంత భారం పడుతుందోనని ప్రజలు భయపడుతున్నారు
కూడు, గూడు, విద్య, వైద్యంపై భరోసా ఇవ్వాలనేది వైఎస్ ఫిలాసఫీ 
కానీ వైఎస్ పథకాలకు నిధులు కేటాయించటంలో సర్కారు 
పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శించింది 
వైఎస్ సంక్షేమ సూత్రాలతో బడ్జెట్ పెడితే.. ఆ క్రెడిట్ వైఎస్‌కే పోతుందని భయం

9 గంటల విద్యుత్, 30 కేజీల బియ్యం హామీలకు రెండున్నరేళ్లయినా మోక్షం లేదా?
రైతుకు రూ. 50 వేల కోట్ల రుణాలు, గోదాముల నిర్మాణం వాగ్దానాలు ఏమయ్యాయి? 
రైతుల కోసం 3,000 కోట్లతో మార్కెట్ ఇంటర్‌వెన్షన్ ఫండ్ ఆశలు ఆవిరయ్యాయి 
రైతాంగ వడ్డీల కోసం రూ. 2,000 కోట్లు అవసరమైతే.. రూ. 600 కోట్లే ఇస్తారా? 
ఫీజులు, స్కాలర్‌షిప్‌లకు రూ. 7,900 కోట్లు అవసరమైతే.. ఇచ్చేది 3,600 కోట్లేనా? 
మహిళా సంఘాల పావలా వడ్డీకి ఇచ్చిన రూ. 700 కోట్లు బకాయిలకే సరిపోవు కదా? 
విద్యుత్ కేటాయింపులు చూస్తే.. చార్జీల వడ్డన, కోతల వెతలు తప్పవని తేలుతోంది 
ప్రాజెక్టులను పూర్తి చేస్తే వైఎస్‌కు పేరొస్తుందనే.. జలయజ్ఞాన్ని అటకెక్కించారు 
సంక్షేమ సువర్ణయుగం నుంచి సంక్షామ యుగానికి ఈ ప్రభుత్వం పయనిస్తోంది

సంక్షేమం పేరుతో ప్రజలపై భారీగా పన్నులు, చార్జీలు వ డ్డించే విధంగా రాష్ట్ర వార్షిక బడ్జెట్ ఉందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను గమనించిన తర్వాత ప్రజలు తమపై ఇంకెన్ని పన్నులు, చార్జీల భారం పడనుందోనని భయపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలకు నిధులు కేటాయించటంలో ప్రస్తుత ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శించిందని ఆయన ధ్వజమెత్తారు. ఈ బడ్జెట్‌లో ప్రజా వంచన, ఆత్మవంచన మేళవింపు మాత్రమే కనిపిస్తోందన్నారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌పై జగన్ శనివారం బహిరంగ లేఖ విడుదల చేస్తూ.. విద్యార్థుల ఫీజుల చెల్లింపు, రైతులకు వడ్డీలేని రుణాలు, మహిళా సంక్షేమం కేవలం లెక్కల్లో ఉంది తప్పితే ఆచరణలో మొండిచేయి చూపే విధంగా ఉందని విమర్శించారు. 

జగన్ బహిరంగ లేఖ పూర్తి పాఠం

2012-13 బడ్జెట్‌లో వంచన - ఆత్మవంచనల మేళవింపు మాత్రమే కనిపిస్తోంది. ప్రజా సంక్షేమం అనే ఫిలాసఫీ మీద పగబట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. దాదాపు 1 లక్షా 45 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని కోరుతూ బడ్జెట్ ప్రతిపాదించిందంటే.. ఆర్థికాంశాలమీద అవగాహన ఉన్న ఏ ఒక్కరికైనా ఇది ప్రజల కోసం కాదు, ప్రభుత్వం కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్టేనని అర్థమవుతుంది. ఇంత భారీ ఆదాయాన్ని ఈ మనసులేని ప్రభుత్వం తమ నుంచి వసూలు చేయటానికి ఇంకెన్ని పన్నులు, చార్జీలు పెంచుతుందోనని మొత్తంగా ప్రజానీకం బెంబేలెత్తక తప్పని వాతావరణం నెలకొని ఉంది. 

వైఎస్ హయాంలో మానవీయ కోణం... 

వైఎస్ హయాంలో బడ్జెట్ మానవీయ కోణంతో ఉండేది. వీలైనంతవరకూ పన్నుల మోత లేకుండా అంతర్గత వనరుల ద్వారా ఆదాయం పెంచుకుని ఎక్కువ సంక్షేమ పథకాలకు వెచ్చించాలనేది ఆయన ఫిలాసఫీ. కూడు, గూడు, వైద్యం, విద్య వంటి కనీస విషయాల్లో సగటు కుటుంబానికి ప్రభుత్వం భరోసా ఇవ్వాలనేది ఆయన సిద్ధాంతం. రెండు రూపాయల బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్యశ్రీ, 108, 104, ఫీజు రీయింబర్స్‌మెంట్, పెన్షన్లు వీటిల్లో ముఖ్యమైనవి. ఇదే సమయంలో పల్లెను, రైతును స్వయం సమృద్ధం చేయాలనేది ఆయన విధానం. అందుకే ఉచిత కరెంటు, ప్రాజెక్టుల నిర్మాణం, వ్యవసాయానికి తోడ్పాటుకు ప్రాధాన్యం ఇచ్చారు. కానీ ఇప్పటి బడ్జెట్ వైఎస్ విధానాలకు, పథకాలకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఒకవేళ వైఎస్ ప్రజా సంక్షేమ సూత్రాలతో గనుక బడ్జెట్ ఉంటే ఆ క్రెడిట్ దివంగత నేతకు వెళ్తుందేమోననే భావనే బడ్జెట్‌లో కనిపిస్తోంది. 

అడ్డదారుల్లో దండుకుంటారా? 

నేనడుగుతున్నాను.. ఈ రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా తమ బడ్జెట్‌లో ఎలాంటి కొత్త పన్నులూ లేవని చెపుతోంది.. ఇది అధికారంలో ఉన్నవారి పెద్ద మనసుకు నిదర్శనమా అని? ఈ ప్రభుత్వం ఈ మధ్యే కదా విద్యుత్ చార్జీల మోత మోగించింది! ఈ ప్రభుత్వమే కదా కొద్ది నెలల కిందటే నిర్దాక్షిణ్యంగా ఆర్‌టీసీ చార్జీలు పెంచింది! ఈ సర్కారే కదా.. కనీసం వంట గ్యాస్ ధరలో పెరుగుదలను భరించండంటే కుదరదు పొమ్మంది! ఈ అధికారంలో ఉన్న నాయకులే కదా రిజిస్ట్రేషన్ చార్జీలను ఏకంగా రెండు మూడు రెట్లు పెంచుకుపోయింది! ఈ ప్రభుత్వమే కదా.. మద్యం మీద గడచిన రెండున్నర ఏళ్ళలోనే వంద శాతం ఆదాయాన్ని పెంచుకోవటానికి విచ్చలవిడిగా లెసైన్సులు దానం చేసి, రేట్లు పెంచుకుపోయింది! చివరికి గడచిన రెండేళ్ళుగా ప్రజలు వినియోగించుకున్న విద్యుత్తు మీద కూడా యూనిట్‌కు ఇంతని ఫ్యూయల్ అడ్జెస్ట్‌మెంటు చార్జీల పేరుతో లాక్కోవటానికి తెగించింది కూడా ఈ ప్రభుత్వమే కదా! కొత్తగా వ్యాట్ విధించి, దాని శ్లాబులు మార్చి దండుకున్నది ఈ సర్కారే కదా! ఇన్ని అడ్డదారుల్లో బడ్జెట్‌తో నిమిత్తం లేకుండా ప్రజల నుంచి పన్నులు వసూలు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ఇక బడ్జెట్‌లో మళ్ళీ వేరేగా పన్నులు విధించే అవసరం ఏముంది? అయినా ముఖ్యమంత్రి ఏం చెపుతున్నారయ్యా అంటే.. బడ్జెట్‌లో పన్నులు వేయకపోయినా భవిష్యత్తులో విధించే ఆలోచన చేస్తామని! ప్రజలంటే ఇంత చులకనా? ముఖ్యమంత్రిగారూ.. మీ ప్రభుత్వం ఉన్నది ఎవరి కోసం? నిధుల కేటాయింపుల్లో మరీ ఇంత అమానుషంగా ఎలా వ్యవహరించగలిగారు? ఏ పథకాన్ని చూసినా మీ ప్రాధాన్యతలు తలకిందులైన వ్యవహారమే కనిపిస్తోంది. 

రైతన్నకు ‘మద్దతు’ ఏదీ? 

ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం ఉందంటే అది కేవలం వైఎస్ రెక్కల కష్టమేనన్న విషయం ఈ రాష్ట్రంలో ఏ మనసున్న మనిషిని అడిగినా చెప్తారు. 2004 ఎన్నికల్లో ఆయన చేసిన రెండే రెండు వాగ్దానాలైన తొమ్మిది గంటల విద్యుత్తు, 30 కేజీల బియ్యం.. ఈ రెండింటినీ రైతులు, పేదల కోసం అమలు చేయటానికి రెండున్నరేళ్ళు గడిచిపోయినా ఈ ప్రభుత్వానికి మనసు రావటం లేదు. అలాంటి వైఎస్ ప్రవేశపెట్టిన పథకాల మీద పగబట్టిన పాలకులు ఏకంగా ప్రజలతోనే చెలగాటం మొదలుపెట్టారు. రైతు కాడి, మేడి వదిలేసి పొలంలోకి దిగనని సమ్మె చేస్తుంటే.. ఈ బడ్జెట్‌లో రైతుకు ఏదన్నా మేలు జరుగుతుందేమోనని చూసిన వారికి తీవ్రమైన నిరాశే మిగిలింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇస్తామన్న మద్దతు లభించలేదు. 50 వేల కోట్ల రూపాయల రుణాలను రైతుకు ఇస్తామన్న వాగ్దానాలు గాల్లో కలిసిపోయాయి. రైతుల వడ్డీ కోసం చెల్లించాల్సిందే ఏకంగా రూ. 2,000 కోట్లు ఉంటుందని అనుకుంటే.. కేటాయింపులు రూ. 600 కోట్లు మించలేదు. ఎంఎస్‌పీ లభించేలా ధాన్యం కొనుగోలు కోసం 50 లక్షల చదరపు అడుగుల మేర గోదాములు నిర్మిస్తామన్న వాగ్దానం ఎటు పోయిందో తెలియదు. రూ. 3,000 కోట్లతో మార్కెట్ ఇంటర్‌వెన్షన్ ఫండ్ ఏర్పాటు చేస్తారన్న ఆశలు ఈ బడ్జెట్‌లో ఒట్టి చేతులు చూపటంతో ఆవిరైపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా 25 శాతం కడితే లభించే పంటల బీమా విషయంలోనూ పాలకుల గుండె ఏ కొంచమూ కరగటం లేదు. 

పేద విద్యార్థులు చదివేదెలా? 

ఈ బడ్జెట్‌లో ఫీజు రీయింబర్స్‌మెంటుకు కేటాయించిన నిధులనే చూడండి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు 2010-11 బకాయిలే ఇంకా రూ. 300 కోట్లున్నాయి. దీనికితోడు 2011-12 ఫీజులు, స్కాలర్‌షిప్పుల్లో ఒక్క పైసా ఇవ్వలేదు. అవి ఎంతలేదన్నా, ఎంతగా అర్హుల సంఖ్యను తగ్గించినా కనీసం రూ. 3,600 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వమే అంచనా వేసింది. అంటే వాటికే రూ. 3,900 కోట్ల మేరకు అవసరం కాగా.. వచ్చే ఏడాది అవసరాలు మరో రూ. 4,000 కోట్లు కావాలని లెక్కేసుకున్నా.. బడ్జెట్లో దాదాపు రూ. 7,900 కోట్లు పెట్టాలి. కానీ కేవలం రూ. 3,600 కోట్లు మాత్రమే పెట్టారు. ఇవి పాత బకాయిలకు కూడా సరిపోవు. స్కాలర్‌షిప్పులు సకాలంలో అందుతున్నాయా అంటే అదీ లేదు. మరి బీద విద్యార్థులు ఏం చదవాలి? ఏం తినాలి? మహిళా సంఘాలకు పావలా వడ్డీ బకాయిలు దాదాపు రూ. 700 కోట్ల మేరకు పేరుకుని ఉండగా బడ్జెట్‌లో కేవలం రూ. 700 కోట్లు కేటాయించటం చూస్తే.. వైఎస్ కోరుకున్న మహిళా స్వావలంబనకు క్రమేపీ గండి కొడుతున్న సర్కారు తీరుకు ఇది అద్దం పడుతోంది. 

ప్రజారోగ్యంపై ఇంత నిర్లక్ష్యమా? 

మరిన్ని ఎక్కువ జబ్బులను జాబితాలో చేర్చటం ద్వారా ఆరోగ్యశ్రీని మరింత పకడ్బందీగా అమలు చేయాల్సి ఉండగా.. ఆ జాబితాలోని వ్యాధులను తగ్గించారు. కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే వైద్యం చేయించుకోవాలంటూ మనుషుల ప్రాణాలను లెక్క చేయకుండా నిబంధనలు విధించారు. ఈ బడ్జెట్‌లో ఆరోగ్యశ్రీకి కేవలం రూ. 925 కోట్లు కేటాయించారు. అలాగే 108, 104 పథకాలను మరింత సమర్థంగా అమలు చేయాల్సి ఉండగా కేవలం రూ. 86 కోట్లు, రూ. 50 కోట్లు కేటాయించి వాటిని ఇకపై నడపలేమనే సంకేతాల్ని ప్రభుత్వమే స్పష్టంగా ఇస్తోంది. జూనియర్ డాక్టర్లే ఆస్పత్రుల్లో పరిస్థితులను మెరుగుపరచాలని డిమాండ్ చేర్చి సమ్మెకు దిగిన పరిస్థితి కనిపిస్తోంది. 

కరెంటు చార్జీల మోతలు, విద్యుత్ కోతలు తప్పవు... 

కాంగ్రెస్ గత ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన ముఖ్యమైన హామీల్లో 9 గంటల కరెంటు కూడా ఒకటి. పైగా ఈ అయిదేళ్ల కాలంలో ఒక్క పైసా కరెంటు చార్జీ పెంచబోననీ వైఎస్ హామీ ఇచ్చారు. ఆ హామీని తుంగలో తొక్కిన ఈ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే దాదాపు రూ. 10 వేల కోట్లకు పైగా ఎఫ్‌ఎస్‌ఏ, కరెంటు చార్జీలను పెంచటం మాత్రమే కాకుండా 9 గంటల కరెంటును మరిచేపోయింది. ఆ ఏడు గంటల విద్యుత్తును కూడా అర్ధరాత్రో అపరాత్రో.. అదీ ఏకబిగిన కాకుండా ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో, ఎంత సేపు ఉంటుందో తెలియకుండా కోత కోసే వ్యవహారమే నడుస్తోంది. మరోవంక.. పరిశ్రమలకు అనేక చోట్ల ఇప్పటికే వారానికి రెండు రోజులు పవర్ హాలిడే ఇస్తున్నారు. బయట నుంచి కొనుగోళ్లను తగ్గించేశారు. బయట రాష్ట్రాల నుంచి కొనుగోళ్ళ కోసం ముందుగానే విద్యుత్తు కారిడార్‌ను బుక్ చేసుకోవాల్సిన ముందస్తు ప్రణాళిక కూడా ఈ ప్రభుత్వానికి లేకపోయింది. ఈసారి విద్యుత్తుకు కేవలం రూ. 5,500 కోట్లు కేటాయించటం ద్వారా మరిన్ని కరెంటు చార్జీల మోతను, కరెంటు కోతలను చెప్పకనే చెప్పారు. రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా డిసెంబర్‌లో కూడా కరెంటు కోతను విధించిన ఈ ప్రభుత్వం.. మెట్ట ప్రాంత రైతాంగానికి నేరుగా చెప్పకపోయినా, మీరు పంట వేస్తే దైవాధీనమేననే సంకేతాన్ని పంపింది. 

సంప్రదాయ వృత్తులకు చేయూత ఏదీ? 

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, సంప్రదాయ వృత్తుల వారిని నిలబెట్టేలా ఈ బడ్జెట్‌లో ఏ కొంచమైనా కేటాయించారా? అంటే భూతద్దం పట్టుకున్నా కనిపించటం లేదు. 2009-10 బడ్జెట్‌లో వైఎస్ చేనేతన్నల రుణాల మాఫీకి కేటాయించినది రూ. 312 కోట్లయితే ఇప్పటి వరకు విడుదల అయినది కేవలం రూ. 136 కోట్లు. 2011 మార్చి వరకు నేతన్నల రుణాలన్నీ మాఫీ చేస్తాం అని చెప్పే గుండె కానీ మనసు కానీ ఈ ప్రభుత్వానికి ఎవరు అమర్చగలరు? వ్యక్తిగత రుణాలు అందక, రుణాలు మాఫీ కాక.. మళ్ళీ మొదలయిన బ్యాంకుల వేధింపులు చేనేత కార్మికుల జీవితాలతో చెలగాటంగా మారినా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అవేమీ కనిపించటం లేదు. ఉపాధి హామీలో ఒకనాడు లభించిన రోజు కూలీ రూ. 130 ఇప్పుడు పేదకు అందటం లేదు. కేవలం రూ. 60 లేదా రూ. 70 లభిస్తున్న పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం రూ. 4,500 కోట్లు కేటాయించినా వాటిని ఖర్చుచేయలేని దౌర్భాగ్యం పేదలపాలిటి శాపంగా మారుతోంది. 

జలయజ్ఞాన్ని అటకెక్కించారు... 

జలయజ్ఞానికి 2009-10 బడ్జెట్‌లో వైఎస్ రూ. 17 వేల కోట్లు పెట్టారు. కానీ ఈ ప్రభుత్వం దాన్ని 2011-12కు వచ్చేసరికి రూ. 15 వేల కోట్లకు కుదించింది. అందులో రూ. 9,000 కోట్లు కూడా ఖర్చు చే యలేకపోయింది. ఒక కోటి నుంచి రూ. 10 కోట్ల మేరకు మాత్రమే ఖర్చయ్యే దాదాపు 18 ప్రాజెక్టులకు రూ. 2,000 కోట్లు సరిగ్గా ఖర్చు చేస్తే అవి పూర్తయ్యే అవకాశాలున్నా.. వాటిని పూర్తి చేస్తే వైఎస్‌కు పేరొస్తుందనే భావనతో ప్రభుత్వంలో పెద్దలు వాటన్నింటినీ అటకెక్కించారు. ఈసారి కూడా మళ్లీ రూ. 15 వేల కోట్లు పేరుకు కేటాయించారు. 

ఇంటి నిధులకూ కోతేనా? 

వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో దేశంలో ఎక్కడా లేనట్లుగా.. తెలుగువారంతా గర్వించేలాగా.. 2005-08 మధ్య రాష్ట్రంలో 48 లక్షల పక్కా ఇళ్లను నిర్మించారు. అది పేదలకు సువర్ణయుగం. దేశం మొత్తంమీద స్వాతంత్య్రానంతరం 50 ఏళ్లలో కట్టిన ఇళ్ల సంఖ్యతో ఇది సమానం. కానీ ఈ ప్రభుత్వం నిర్మాణంలో ఉన్న 20 లక్షల ఇళ్లను పూర్తి చేయించలేకపోతోంది సరికదా కేటాయింపుల్లో కూడా కోత వేసింది. ఈ బడ్జెట్‌లో కేవలం రూ. 2,300 కోట్లు కేటాయించటమే ఇందుకు నిదర్శనం. 

పేదవాడికి 6 కిలోల బియ్యం ఇవ్వలేరా? 

ప్రతి వ్యక్తి పేరుతో ఆరు కిలోల బియ్యం ఇస్తామన్నది గత ఎన్నికల్లో వైఎస్ ఇచ్చిన హామీ. దీన్ని విస్మరించిన ప్రభుత్వం రూపాయి బియ్యం పేరుతో మభ్యపెడుతోంది. ఆహార భద్రత చట్టం వస్తున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తక్కువ ధరలకే బియ్యం ఇవ్వబోతోంది. మార్కెట్‌లో కొనాల్సిన పరిస్థితి లేదు. అలాంటప్పుడు 30 కిలోల హామీని నిలబెట్టుకోకుండా పేద ప్రజానీకానికి, వైఎస్ స్ఫూర్తికి ఈ ప్రభుత్వం గండికొట్టింది. మరో పది కేజీల బియ్యం అందితే ఆ పేద కుటుంబానికి కనీసం రూ. 200 మేర దన్ను లభించినట్టవుతుంది. కేవలం రూ. 20 తగ్గించిన ఈ ప్రభుత్వం ఆ బాధ్యత నుంచి తప్పుకోవటమే కాకుండా.. అదే అన్నింటికన్నా ఘన కార్యం అన్నట్టు.. తన ప్రచార పటాటోపానికి మాత్రం వందల కోట్లు తగలేస్తోంది. 

పన్నుల మీద పన్నులు వడ్డిస్తారా? 

ఈ రెండేళ్ళలోనే ఆర్‌టీసీ చార్జీలు రెండు సార్లు పెంచారు. నాలుగు శాతం వ్యాట్ శ్లాబును 5 శాతానికి పెంచటం ద్వారా దాదాపు నాలుగు వేల రకాల సరుకుల ధరలు పెంచారు. చక్కెర, వస్త్రాల మీద కొత్తగా పన్నులు విధించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేద వాడి దుస్తుల మీద కూడా పగబట్టి 5 శాతం వ్యాట్ వసూలు చేశారు. చిన్న దుకాణదార్లు పది రోజులు ధర్నా చేసినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు. 12.5 శాతం వ్యాట్ శ్లాబుని 14.5 శాతం శ్లాబ్‌గా పెంచారు. రవాణా శాఖలో కొన్ని రకాల వాహనాల మీద జీవిత పన్ను విధించారు. మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను, నీటి పన్ను భారీగా పెంచారు. బడ్జెట్‌లో రూ. 15,000 కోట్ల అదనపు ఆదాయాన్ని చూపించటం, పన్నుల పెంపు తప్పకపోవచ్చునని సాక్షాత్తు ముఖ్యమంత్రే చెపుతున్న తీరు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది. 

మానవత్వం లేని పాలకులు... 

ఒకవైపు నెలల కొద్దీ జీతాలు అందక అంగన్‌వాడీ సిబ్బంది, ఆదర్శ రైతులు, 104, 108, ఐకేపీ ఉద్యోగులూ, మరోవంక స్టైపెండ్ పెంచాల్సిందిగా జూనియర్ డాక్టర్లు ఆక్రందనలు చేస్తుంటే ఈ ప్రభుత్వం చెవికి ఎక్కటం లేదని బడ్జెట్ నిరూపిస్తోంది. ఇంత దయా కనికరాలు లేకుండా, మానవత్వం లేకుండా బడ్జెట్‌లో రైతులు, రైతు కూలీలు, పేదల పట్ల అమానుషంగా వ్యవహరించిన ముఖ్యమంత్రి.. తన 23 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఇంత మంచి బడ్జెట్ ఎప్పుడూ చూడలేదని ప్రకటిస్తున్నారు. తాము కేవలం రెండు రోజులు నిర్వహించిన పార్ట్‌నర్‌షిప్ సమిట్‌లో ఏకంగా రాష్ట్రంలోకి రూ. 6.5 లక్షల కోట్ల మేరకు పెట్టుబడులు వచ్చాయని బడ్జెట్‌లో రాయించుకుని మురిసిపోతున్నారు. ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి. ఈ రాష్ట్రం 1956లో ఏర్పడింది. ఈ 56 ఏళ్ళలో ఏర్పాటయిన మొత్తం ప్రభుత్వ, ప్రభుత్వ రంగ, ప్రైవేటు రంగ పరిశ్రమల పెట్టుబడి విలువ కలుపుకుని కూడా రూ. 6.5 లక్షల కోట్లు ఉండదు. అయినా చంద్రబాబునాయుడి వారసత్వాన్ని ఈ విషయంలోనూ కొనసాగించి ప్రజలకు పచ్చి అబద్ధాలు చెప్పాలన్నదే కిరణ్ ఆలోచన అయితే.. అది ఆయన వివేచనకు సంబంధించిన అంశం. 

23 ఏళ్ళలో ఎప్పుడూ చూడని బడ్జెట్ అన్న ముఖ్యమంత్రి మాటలు ఒక్క విషయాన్ని మాత్రం రూఢి చేస్తున్నాయి. ఇలాంటి బడ్జెట్టే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందనుకుంటే.. ఆ తరవాత ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో చరిత్రలో ఏనాడూ లేని విధంగా 26 సీట్లు వచ్చాయి. ముఖ్యమంత్రి తెస్తున్న పోలికలు, ఆయన అనుసరిస్తున్న విధానాలు, ప్రవేశపెడుతున్న బడ్జెట్లు చింతించదగిన అంశాలుగా మాత్రమే మిగులుతున్నాయి. సంక్షేమ స్వర్ణయుగం నుంచి సంక్షామ యుగానికి ప్రయాణిస్తున్న ఈ ప్రభుత్వాన్ని చూస్తే నా ఆందోళన పెరుగుతోంది. 

ప్రజల బడ్జెట్ ప్రవేశపెట్టటానికి కావాల్సిన హృదయాన్ని ఈ ప్రభుత్వానికి ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ...
భవదీయుడు
 
Share this article :

0 comments: