ఇలాగైతే పరిశ్రమలు మూసుకోవాల్సిందేఅంటున్న యజమానులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇలాగైతే పరిశ్రమలు మూసుకోవాల్సిందేఅంటున్న యజమానులు

ఇలాగైతే పరిశ్రమలు మూసుకోవాల్సిందేఅంటున్న యజమానులు

Written By ysrcongress on Tuesday, February 21, 2012 | 2/21/2012

జ్యూస్ సెంటర్ నడుపుకుంటూ పొట్టబోసుకునే ఓ బడుగు జీవి... 
పిండి గిర్నీపై వచ్చే ఆదాయంతో బతుకు బండిని లాగే ఓ కుటుంబం.. 
వెల్డింగ్ షాపులో పనిచేస్తూ పిల్లాపాపలను సాకే ఓ కార్మికుడు.. 
రైస్ మిల్లులో చెమటోడ్చి నాలుగు రూకలు సంపాదించుకునే ఓ కూలీ.. 
వందలు వేలు కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి లక్షలాది బతుకులు సర్కారు కరెంటు కోతల పుణ్యమా అని ఇప్పుడు రోడ్డున పడుతున్నాయి! స్వయం ఉపాధితోపాటు కుటీర, చిన్నతరహా పరిశ్రమలపై ఆధారపడ్డ లక్షల కుటుంబాలు కుదేలైపోతున్నాయి!! ఉపాధి కరువై పేదోడి నోట్లోకి ఐదు వేళ్లు వెళ్లడమే గగనంగా మారింది. 

ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్న లక్షలాదిమంది కార్మికులు, కూలీలు
అడ్డగోలు కరెంటు కోతలతో ఎక్కడిక్కకడ నిలిచిపోతున్న పనులు
పల్లెల్లో అధికారికంగానే 8 నుంచి తొమ్మిది గంటల కోత
అనధికారికంగా మరికొన్ని గంటలు కట్
విలవిల్లాడుతున్న రైస్‌మిల్లులు, ఐస్ 
ఫ్యాక్టరీలు, ప్లాస్టిక్, గ్రానైట్ పరిశ్రమలు
గణనీయంగా పడిపోతున్న ఉత్పత్తి.. 
ఇలాగైతే పరిశ్రమలు మూసుకోవాల్సిందేఅంటున్న యజమానులు
రాష్ట్రవ్యాప్తంగా ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైన చేదు వాస్తవాలు
న్యూస్‌లైన్ నెట్‌వర్క్: అడ్డగోలు కరెంటు కోతల కారణంగా.. రైస్ మిల్లులు, ఆయిల్ మిల్లులు, ప్రింటింగ్ ప్రెస్‌లు, వెల్డింగ్ షాపులు, జిరాక్స్ సెంటర్లు, టైలరింగ్ కేంద్రాలు, ఎలక్ట్రానిక్ షాపులు, పిండి మరలు, ఐస్ ఫ్యాక్టరీలు, చిన్నచిన్న ప్లాస్టిక్ వస్తువులు తయారుచేసే పరిశ్రమలు.. ఇలా ఒక్కటేమిటి బడుగు జీవుల జీవనాధారంతో ముడిపడి ఉన్న సమస్త రంగాలు విలవిల్లాడుతున్నాయి. పల్లెల్లో అధికారికంగానే 8 నుంచి 9 గంటలు కోతలు పెడుతున్నారు. అనధికారికంగా ఇది ఇంకా ఎక్కువే ఉంటుంది. ఈ కోతలను కూడా పనులు నడిచే పగటిపూటే విధిస్తున్నారు. దీంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.69 లక్షల చిన్నతరహా పరిశ్రమలు ఉన్నాయి. వీటిని ఏర్పాటు చేసేందుకు వాటి యజమానులు రూ.17.55 వేల కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఈ పరిశ్రమలనే నమ్ముకుని రాష్ట్రంలో దాదాపు 17 లక్షలకుపైగా కూలీలు, కార్మికులు ఉపాధి పొందుతున్నారు. రాష్ట్రంలో 72వేలకు పైగా మరమగ్గాలున్నాయి. వీటిపైనే ఆధారపడ్డవారు 20 వేల దాకా ఉన్నారు. సర్కారు అడ్డగోలు కరెంటు కోతల కారణంగా వీరందరి పరిస్థితి దుర్భరంగా తయారైంది. పనుల్లేక ఉపాధికి దూరమవుతున్నారు. పరిశ్రమల యజమానులదీ ఇదే దుస్థితి. పనులు సాగకపోవడంతో ఉత్పత్తి భారీగా పడిపోతోంది. ఫలితంగా నష్టాలను మూటగట్టుకుంటున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పరిశ్రమలు మూసుకోవడం తప్ప మరో గత్యంతరం లేదని వాపోతున్నారు.

చిన్న పరిశ్రమలకు పెద్ద కష్టాలు..

ప్రస్తుతం అమలవుతున్న కరెంటు కోతల వల్ల చిన్నతరహా పరిశ్రమల్లో సగటున 20 శాతం వరకు ఉత్పత్తి తగ్గుతున్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. పరిశ్రమల యజమానులు, వాటిలో పనిచేసే కార్మికులు, కూలీలు ఎవరిని కదిలించినా కష్టాల కథలే చెప్పుకున్నారు. మున్ముందు కోతలు ఇంకా పెరిగితే సగానికి సగం పరిశ్రమలు మూతపడే ప్రమాదం ఉందని యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్లాస్టిక్ వస్తువుల తయారీ పరిశ్రమ, చిన్న తరహా ఐరన్ పరిశ్రమల్లో ఫర్నేస్‌లు ఎప్పుడూ వేడిగా ఉండాలి. కరెంటు పోగానే అవి చల్లారి పోతాయి. మళ్లీ కరెంటు వచ్చిన తర్వాత ఆ యంత్ర పరికరాలు, ఫర్నేస్‌లు వేడి కావడానికి రెండు, మూడు గంటల సమయం పడుతుంది. అంటే ఈ పరిశ్రమల్లో రెండు గంటలు కరెంటు పోతే ఏకంగా నాలుగు గంటల పాటు ఉత్పత్తి ఆగిపోతుందన్న మాట. ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు వెయ్యిదాకా ఐస్ తయారీ పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడ కరెంటు కోతల కారణంగా అప్పటికే తయారై ఉన్న ఐస్ కరిగిపోతోంది. దీనివల్ల ఐసు కొరత ఏర్పడి ఆ ప్రభావం చేపల ఎగుమతిపైనా పడుతోంది.

మిల్లు.. గొల్లుగొల్లు..!

కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, మహబూబ్‌నగర్‌లతోపాటు అనేక జిల్లాల్లో ఇప్పటికే ఖరీఫ్ ధాన్యం రైస్ మిల్లులకు చేరింది. మిల్లుల యజమానులు లెవీకి బియ్యాన్ని సరఫరా చేయడం, ఒప్పందం మేరకు వ్యాపారులకు సమయానికి బియ్యాన్ని అందించాల్సి ఉంటుంది. అయితే కరెంటు కోతలతో ఇది సాధ్యపడడం లేదు. దీంతో యజమానులకు డీజిల్ జనరేటర్లను వినియోగించక తప్పడం లేదు. దీంతో మిల్లింగ్ వ్యయం పెరుగుతోంది. ఆ భారం అంతిమంగా వినియోగదారులపైనే పడనుంది. అప్రకటిత విద్యుత్ కోతల కారణంగా 20 శాతం వరకు రైస్ మిల్లులు మూతబడే స్థితికి చేరుకున్నాయి. రైస్ మిల్లులే కాదు ఆయిల్ మిల్లులకు కరెంట్ షాక్ తగులుతోంది. ప్రస్తుతం వేరుశనగ పంట సీజన్ కాబట్టి డికార్డిగేటర్లకు (ఆయిల్ మిల్లులకు) గిరాకీ ఉంటుంది. కానీ విద్యుత్ సమస్య తీవ్రంగా ఉండటంతో పనుల్లేక నష్టపోతున్నారు. ‘‘పన్నెండు గంటలు మిల్లు నడిస్తే 15 బ్యారళ్ల నూనె వస్తుంది. కరెంట్ సరిగ్గా ఉంటలేదు. ఇప్పుడు ఎనిమిది బ్యారెళ్లు కూడా వస్తలేదు’ అని నిజామాబాద్ జిల్లాకు చెందిన మిల్లు యజమాని మోటూరు అంజయ్య వాపోయారు.

జిల్లాల్లో వెతలు ఇవీ..

ఖమ్మం, కర్నూలు తదితర జిల్లాల్లో గ్రానైట్, నాపరాయి పరిశ్రమల్లో ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. ఖమ్మం జిల్లాలో కరెంటు కోతల కారణంగా సకాలంలో గ్రానైట్ రాళ్లు తయారు కావడం లేదు. దీంతో చాలామంది కొనుగోలుదారులు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు వెళుతున్నారు. జిల్లాలోని 700 గ్రానైట్ ఫ్యాక్టరీలు వెలవెల పోతున్నాయి. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలోని నాపరాయి పాలిషింగ్ యూనిట్లు కష్టాల్లో చిక్కుకున్నాయి. ఈ యూనిట్లలో కార్మికుల రాబడి సగానికి సగం తగ్గిపోయింది. అనంతపురం, గుంటూరు, ఖమ్మం తదితర జిల్లాల్లో మరమగ్గాలపై పనిచేసే నేత కార్మికుల నానా ఇబ్బందులు పడుతున్నారు. పనులు ఆగిపోతుండటంతో కూలి గిట్టుబాటు కాక ఒక పూట తింటే ఇంకో పూట పస్తు అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం కాకరవాయి గ్రామంలో మరమగ్గాలతో కళకళలాడే 70 చేనేత కుటుంబాలు పూడ గడవక వలస బాట పట్టాయి. కరీంనగర్ జిల్లాలో అనేక గ్రామాల్లో విద్యుత్‌పై ఆధారపడే పిండి గిర్నీలు, వెల్డింగ్ దుకాణాలు వెలవెలబోతున్నాయి. ఈ ఒక్క జిల్లాలోనే చిన్న పరిశ్రమలు 50 వేల వరకు చిన్న పరిశ్రమలు కోతలతో ప్రభావితమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, దండేపల్లి, లక్సెట్టిపేట ప్రాంతాలలో 22 సిరామిక్స్, 38 రైస్ మిల్లులు, ఏడు జిన్నింగ్ మిల్లులు, నాలుగు పైపుల కంపెనీలు, 25కు పైగా ఇటుకల తయారీ కేంద్రాలున్నాయి. వీటిలో పనిచేసే కార్మికులు చాలామంది రోడ్డున పడే పరిస్థితి నెలకొంది.

కార్మికులను తొలగిస్తున్న యాజమాన్యాలు

పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న పదివేలకు పైగా చిన్న తరహా కర్మాగారాల్లో దాదాపు రెండున్నర లక్షల మంది కార్మికులు పని చేస్తున్నారు. పరోక్షంగా మరో లక్ష మంది పరిశ్రమల్ని నమ్ముకుని ఉపాధి పొందుతున్నారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లోని పరిశ్రమలు రోజుకు కేవలం రెండు గంటలే ఉత్పత్తి చేస్తున్నాయంటే కోతల ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. కార్మికుల్ని ఖాళీగా ఉంచి జీతాలివ్వలేని యాజమాన్యాలు ఇప్పటికే దాదాపు 50 వేల మందిని తొలగించాయి. కృష్ణా జిల్లాలో ఇప్పటికేపదివేల మంది కార్మికులు ఉపాధికి దూరమైనట్లు తెలుస్తోంది. ఆటోనగర్ ప్రాంతంలో ఉన్న1,400 చిన్నతరహా పరిశ్రమలు, ఇంజినీరింగ్ అనుబంధ పరిశ్రమలపై ఆధారపడి వేలమంది కార్మికులు జీవనం సాగిస్తున్నారు. వీరి పరిస్థితి తలకిందులయ్యే ప్రమాదం పొంచి ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో కొబ్బరి నూనె మిల్లులు, తాళ్లు, పీచు, నూనె, పప్పుల తయారీ పనులు ఆగిపోతున్నాయి. తాళ్లకు డిమాండ్ ఏర్పడంతో పలువురు చిరు వ్యాపారులు, మహిళలు మోటరైజ్డ్ ర్యాట్‌లను ఏర్పాటు చేసుకున్నారు. వీటి ద్వారా రోజుకు 25 నుంచి 30 కేజీల తాళ్ల ఉత్పత్తి జరిగేది. విద్యుత్ కోతల కారణంగా ఇప్పుడు పది కేజీల తాళ్ల ఉత్పత్తి కూడా కూడా జరగడం లేదు. జిల్లాలో ఇలాంటి మెషీన్లు 400 వరకు ఉన్నాయి. విజయనగరం జిల్లాలో దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మచ్చుకు ఒక్క మెరకముడిదాం మండలాన్నే తీసుకుంటే... అక్కడ మొత్తం 25 రైస్ మిల్లులు, ఐదు ఆయిల్ మిల్లులు, ఒక జీడిపప్పు మిల్లు ఉన్నాయి. విద్యుత్ కోతల మూలంగా ఇవన్నీ మూసివేత దిశగా నడుస్తున్నాయి.

జీతాలు కూడా ఇవ్వలేక పోతున్నాం 

‘‘ఈ వేళాపాళా లేని కరెంటు కోతల కారణంగా మిల్లింగే జరగడం లేదు. వర్కర్లకు జీతాలు చెల్లించాలన్నా కష్టమవుతోంది. మరోవైపు బియ్యం కోసం అడ్వాన్స్ ఇచ్చిన వ్యాపారుల ఒత్తిడి పెరిగిపోతోంది’’

-కొండపల్లి రాధాకృష్ణ, 
రైస్ మిల్లు యజమాని, కొణిజర్ల, ఖమ్మం జిల్లా 


30 ఏళ్లలో ఏనాడూ ఈ పరిస్థితి లేదు..

‘‘30 ఏళ్ల నుంచి ఏనాడూ ఇటువంటి పరిస్థితి లేదు. ఇళ్లకు, వ్యవసాయానికి కోత పెట్టి అయినా చిన్న పరిశ్రమలకు విద్యుత్ సరఫరా చేసేవారు. విద్యుత్ కోతలతో ప్రస్తుతం 20 శాతానికి పైగా ఉత్పత్తి తగ్గుతోంది. కూలీలకు మాత్రం డబ్బు చెల్లించాల్సి వస్తోంది. ఏదో, మూడు నాలుగు నెలలయితే ఓపిక పట్టవచ్చు. ఎలాగోలా నెట్టుకురావచ్చు. ఏడాది పొడవునా కోతల పరిస్థితి ఇలాగే కొనసాగితే పరిశ్రమ నడపడం చాలా కష్టం. 

-రాఘవరెడ్డి, వీరాంజనేయ ఇండస్ట్రీస్, 
ఎస్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, వైఎస్సార్ జిల్లా
Share this article :

0 comments: