ఈనాడులో కట్టుకథలు-‘అనకొండ పెన్నా కథనం ఈనాడు- సీబీఐ కుమ్మక్కుకు నిదర్శనం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఈనాడులో కట్టుకథలు-‘అనకొండ పెన్నా కథనం ఈనాడు- సీబీఐ కుమ్మక్కుకు నిదర్శనం

ఈనాడులో కట్టుకథలు-‘అనకొండ పెన్నా కథనం ఈనాడు- సీబీఐ కుమ్మక్కుకు నిదర్శనం

Written By ysrcongress on Friday, February 24, 2012 | 2/24/2012


‘అనకొండ పెన్నా’ కథనం వీరి కుమ్మక్కుకు నిదర్శనం
కోర్టులో ఎదురుదెబ్బతో ఈనాడులో కట్టుకథలు
సాయిరెడ్డికి బెయిల్ రానివ్వకుండా చేసేందుకు తప్పుడు రాతలు
ముందుగా అరెస్టులు.. తర్వాత ఆధారాల కోసం వెతుకులాటలు.. ఇదీ కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, చంద్రబాబు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తీరు

సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, ఈనాడు అధినేత రామోజీరావు కుమ్మక్కై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై బురదజల్లే కార్యక్రమం చేపట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. విజయసాయిరెడ్డికి బెయిల్ రానివ్వకుండా చూడాలనే దురుద్దేశంతోనే సీబీఐ ఈనాడుతో తప్పుడు రాతలు రాయిస్తోందని పేర్కొన్నారు. ఈ కుట్రలో భాగంగానే శ్రీలక్ష్మి, రాజగోపాల్‌లను తమ కస్టడీకి అప్పగించాలంటూ కోర్టులో పిటిషన్ వేసిందని ధ్వజమెత్తారు. గురువారం రాత్రి పద్మ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. 

ప్రకటన పూర్తి పాఠం...

‘‘దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబం మీద బురదజల్లే కార్యక్రమంలో రామోజీరావు నేతృత్వంలోని ఈనాడు, సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఎంతగా పెనవేసుకుపోయి సహకరించుకుంటున్నారో గురువారం ఈనాడు ప్రచురించిన పతాక శీర్షిక వార్త ద్వారా వెల్లడయింది. ‘అనకొండ పెన్నా’ అంటూ ప్రచురించిన ఆ వార్తలో బాక్సైట్‌ను మింగడానికే ‘రస్‌అల్ ఖైమా’ ముసుగు తొడిగారంటూ పేర్కొంది. అయితే శాసనసభ సమావేశాలు, విద్యుత్ చార్జీల దొంగ దెబ్బకు సర్కారు సిద్ధపడటం వంటి ప్రజలకు మేలు చేసే అంశాలను వదిలిపెట్టి రామోజీ పత్రిక ఉన్నట్టుండి పెన్నా సిమెంట్‌ను తెరపైకి తేవడం వెనుక ఉన్న కుతంత్రాన్ని ప్రజలకు వివరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ భావిస్తోంది. జగన్‌మోహన్‌రెడ్డి ఆస్తులు, వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉండగా తీసుకున్న నిర్ణయాలపై కాంగ్రెస్, టీడీపీలు కలిసి దాఖలు చేసిన వ్యాజ్యం ఆధారంగా రాష్ట్ర హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించడం...అదే సమయంలో చంద్రబాబు, ఆయన బినామీల ఆస్తులపై సీబీఐ విచారణ అవసరం లేదంటూ పిటిషన్ కొట్టి వేయడం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయాలే. సాక్షికి లభిస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక రామోజీరావు పత్రిక రాసిన అభూత కల్పనలనే ఆధారాలుగా భావించి ఇంతకాలం దర్యాప్తు జరిపిన సీబీఐ...అవి రూఢీకాక, లేనిపోని ఆరోపణలు.. అభాండాలతో కక్ష సాధింపునకు పూనుకోవడం న్యాయకోవిదుల దృష్టిని దాటి పోవడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ నమ్ముతోంది. 

జగన్ ఆస్తులకు సంబంధించిన కేసులో శ్రీలక్ష్మి, రాజగోపాల్‌లను కూడా విచారించాలన్న సీబీఐ పిటిషన్ వెనుక ఉద్దేశాలు సుస్పష్టం. ఈ కేసుకు సంబంధించి అసలు విజయసాయిరెడ్డి అరెస్టే అక్రమం. ఆయన ఏనాడూ పబ్లిక్ సర్వెంట్ నిర్వచనం పరిధిలోకి వచ్చిన వ్యక్తి కానే కాదు. అయినా ఆయనను అరెస్టు చేసి...సాక్షి పెట్టుబడులన్నీ వైఎస్ అధికార దుర్వినియోగం కారణంగానే వచ్చాయని చెప్పించడానికి సీబీఐ తన పరిధికి మించి వ్యవహరిస్తూ చేయరాని పనులెన్నో చేసుకుపోతోంది.

ఇప్పుడిక విజయసాయిరెడ్డిని ఎందుకు అరెస్టు చేశారో స్పష్టమైన ఆధారాలు చూపాలి. లేదంటే ఆయన్ను విడుదల చేయాల్సిన పరిస్థితి. అయితే 60 రోజుల తర్వాత కూడా విజయసాయిరెడ్డిని ఎలాగైనా జైల్లోనే ఉంచాలనే కుట్రపూరితమైన ఆలోచనతోనే.. శ్రీలక్ష్మి, రాజగోపాల్‌ల విచారణకు అనుమతించాలని సీబీఐ కోరుతోందనే విషయం స్పష్టం అవుతోంది. ముందుగా అరెస్టులు...ఆ తరువాత ఆధారాల వెతుకులాటలు! ఇదీ కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా, గతంలో చంద్రబాబు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా రాష్ట్రంలో తిరుగులేని కీర్తి సంపాదించిన సీబీఐ వ్యవహారశైలి. దీన్ని విచారణ అంటారా? లేక నియంతృత్వ దేశాల్లో కిరాయి సంస్థల రాజకీయ కక్ష సాధింపులకు ఇది సమానమైన వ్యవహారమా? అని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. ఈ కిరాయి కార్యక్రమానికి ‘ఈనాడు’ను, మరికొన్ని పత్రికలను సీబీఐ ఎంచుకుందనేది ఈ రాష్ట్రంలోని పాత్రికేయ మిత్రులందరికీ తెలిసిన విషయమే. 

ఈ కేసు విచారణ ప్రారంభం నుంచీ సీబీఐ ఏయే పత్రికలకు మెటీరియల్ సరఫరా చేసి జగన్ సంస్థలకు వ్యతిరేకంగా వార్తలు రాయించిందో.. ఆయా పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టు మిత్రులు కొందరికి కూడా ఈ విషయం తెలుసు. విజయసాయికి బెయిల్ లభించకుండా చేసేందుకు సీబీఐ పన్నిన పన్నాగం బయట పడుతూనే ఉంది. అది సీబీఐ కోర్టులో పారక పోయేసరికి, రామోజీతో కలిసి ఓ కట్టు కథనాన్ని సీబీఐయే వండించిందనే విషయం.. ఈ అంశాలను నిశితంగా పరిశీలించే వారెవరికైనా అర్థం అవుతుంది. రామోజీ.. నీకెందుకు వైఎస్ అనే రెండు అక్షరాలంటే అంత భయం? మహానేత మరణించిన రెండున్నరేళ్ల తర్వాత కూడా నీకు ఎందుకంత దడపుడుతున్నట్లు ? ఈ రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు కొందరిని ఎంచుకుని నువ్వు చేస్తున్న దాడులకు ప్రాతిపదిక ఏమిటి? ఇప్పుడు వైఎస్ కుటుంబం అధికారంలో లేదే! ఈ ప్రశ్నలకు బయటకు వచ్చి సమాధానం చెప్పే ధైర్యం ఏనాడూ నీకు లేదు, 

ఇక పెన్నా సిమెంట్ ప్రతాపరెడ్డి సాక్షి పత్రికలో ఎందుకు పెట్టుబడులు పెట్టారో.. ఒకటి కాదు, రెండు కాదు పదే పదే రామోజీ పత్రిక తన అవసరాన్ని బట్టి ఎన్నో కథనాలు ప్రచురిస్తూ వచ్చింది. బంజారాహిల్స్‌లోని తన స్థలంలో ఓ హోటల్ నిర్మించుకోవడానికి ప్రతాపరెడ్డికి కొన్ని నిర్మాణ మినహాయింపులు ఇవ్వడం వల్లే ఆయన పెట్టుబడులు పెట్టారన్నది కొన్ని సంవత్సరాలుగా టీడీపీ, దాని అధిష్టానమైన ఈనాడుల వాదన. ఈ వాదననే సీబీఐ నెత్తికి ఎత్తుకుని నిన్న మొన్నటి వరకు దర్యాప్తు జరిపింది. అదంతా డొల్ల వాదన అని అర్థం అవుతున్న నేపథ్యంలో ఇపుడు కొత్త పాట మొదలు పెట్టారు. 

యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌లో భాగమైన ‘రస్ అల్ ఖైమా’కు చెందిన సంస్థ భాగస్వామిగా ఉన్న అల్యూమినియం ప్రాజెక్టులో పెన్నా ప్రతాపరెడ్డి వాటాయే ఎక్కువ ఉందని ‘ఈనాడు’ తాజాగా కనిపెట్టిందట! నిజానికి పెన్నా సంస్థకు విశాఖ బాక్సైట్ తవ్వకాలకు ఏ సంబంధమూ లేదు. అదీ కాక ఒక సంస్థలో వాటాలు తగ్గడం, పెరగటం అన్నది నేరం అన్నట్లుగా రాయవచ్చని రామోజీకి ఎవరు చెప్పారు? పెన్నా ప్రతాపరెడ్డి ఆంధ్రప్రదేశ్ గర్వించదగిన పారిశ్రామికవేత్తల్లో ఒకరు. 

ఆయనేమీ పచ్చళ్లు-పత్రిక అనే విచిత్రమైన కాంబినేషన్‌తో వందలకోట్లు సంపాదించానని చెప్పుకునే వ్యక్తి కాదే! రామోజీవి కళ్లు బైర్లు కమ్మి, కళ్లు మూసుకుని రాస్తున్న కిరాయి రాతలు. అమెరికన్ ఐఎంజీ పేరుతో బిల్లీరావుతో కంపెనీ పెట్టించి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేబినెట్ ఆమోదం లేకుండానే జీవో జారీ చేయించి...ఆరుసూత్రాల పథకంలో భాగంగా ఏర్పడిన సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 450 ఎకరాలను కాజేసే కుట్రకు చంద్రబాబు పాల్పడినపుడు మీ కళ్లు ఏమయ్యాయి? ఇదే దుబాయ్ ప్రసాద్ అలియాస్ కోనేరు ప్రసాద్ ఎమ్మార్ ప్రాపర్టీస్‌లో పొందిన వాటా ఎంత? ఎమ్మార్‌లో దుబాయ్ ప్రభుత్వం వాటా ఎంత? ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడైన ప్రధానుల్లో ఒకరిగా పేరొందిన చంద్రబాబు ఆప్తమిత్రుడు మహతీర్ మహ్మద్ కొడుక్కి సంబంధించిన కంపెనీని ముందు పెట్టి...టీడీపీ ఒకప్పటి ఎంపీ బోళ్ల బుల్లిరామయ్య దగ్గరి వ్యక్తులకు, చంద్రబాబుకున్న అనేక బినామీల్లో ఒకరిగా భావించే కేవీరావుకు కాలక్రమంలో కాకినాడ పోర్టు ఎలా అందిందో అదే ఆర్‌ఓసీలో చూడాలని రామోజీకి ఏనాడూ ఎందుకు అనిపించలేదు? ఇంతకీ కాకినాడ పోర్టులోని చంద్రబాబు విదేశీ మిత్ర కంపెనీలు ఏమయ్యాయి? వాటి డబ్బును విత్‌డ్రా చేసి చంద్రబాబు ఏయే దేశాల్లో ఎంతెంత మూటలు కట్టుకుంటున్నారో పరిశోధించాలని ఎందుకు అనిపించ లేదు? అంతెందుకు? చంద్రబాబునాయుడు కోడలు ఎక్కువకాలం సింగపూర్‌లోనే ఎందుకు ఉంటోందో నిగ్గు తేల్చాలని మీకెందుకు అనిపించడం లేదు? రామోజీ ఎవరికోసం నీ జర్నలిజం...? ఏ ప్రయోజనాల కోసం మీ రాతలు? విశాఖ బాక్సైట్‌కు సంబంధించిన నిజాలను వెలికితీస్తే అందులో బయటపడేది చంద్రబాబు నాయుడు మాత్రమే. సీబీఐకి కళ్లుంటే చూడాల్సిన అంశాల్లో మొదటిది అసలు రస్ అల్ ఖైమానుగానీ, దుబాయ్ అల్యూమినియం కంపెనీ (దుబాల్)ను గానీ ఈ రాష్ట్రానికి తీసుకువచ్చింది ఎవరు? చంద్రబాబుకు బినామీగా పేరొందిన వ్యక్తులు 2000కు పూర్వమే రంగం సిద్ధం చేసుకుని యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ప్రభుత్వాలను ముందుంచి మన రాష్ట్రంలో ఎందుకు కాలు మోపారు? చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యుల మలేసియా, సింగపూర్, యూఏఈ, ఐరోపా పర్యటనల్లో అసలు మర్మం ఏమిటి? ఇలా.. సీబీఐ ఏ కేసును తవ్వినా అవినీతి మూలాలు తేలేది, చంద్రబాబు ఇంట్లోనే. అయినా మీ పత్రికకు పారిశ్రామికవేత్తలు అనకొండలు....చంద్రబాబు కుటుంబసభ్యులు బంగారు కొండలు! జనం చూస్తున్నారు. కనీసం మీ రాతలకు మీరు సిగ్గుపడండి రామోజీ! 

ఇక విశాఖ బాక్సైట్ విషయానికొస్తే... ఇవీ నిజాలు

1)గిరిజన ప్రాంతాల్లో మైనింగ్ హక్కులు గిరిజనులకు మాత్రమే చెందుతాయని సమతా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రపదేశ్ అండ్ అదర్స్ కేసులో సుప్రీంకోర్టు చెప్పినా...2000లోనే విశాఖ బాక్సైట్‌ను చంద్రబాబు తన ఖాతాలోకి లాగించేసుకోవడానికి దుబాయ్ బాబులను రంగంలోకి దింపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలు సంబంధిత శాఖలో అందుబాటులో ఉన్నాయి.

2)గిరిజన చట్టాలను తుంగలో తొక్కి, సుప్రీంకోర్టు సమతా కేసులో ఇచ్చిన తీర్పును కూడా కాదని...2000 మే 24న విశాఖపట్నం గిరిజన కార్పొరేషన్‌లో గిరిజన సలహా మండలి సమావేశం నిర్వహింపజేసి...మైన్స్ అండ్ మినరల్స్ (డెవలప్‌మెంట్ అండ్ రిజిస్ట్రేషన్) యాక్ట్ 1957లోని సెక్షన్ 5ను నిర్వీర్యం చేసింది చంద్రబాబునాయుడే. ఈ చట్టం ప్రకారం షెడ్యూల్డ్ ప్రాంతాల్లో మైనింగ్ లీజులను షెడ్యూల్డ్ తెగ కు చెందనివారికి ఇచ్చే వీల్లేదు. దాన్ని చంద్రబాబునాయుడు గిరిజన సలహా మండలితోనే మార్పించారు. అంటే గిరిజనుల అభివృద్ధికి మాత్రమే కృషి చేయాల్సిన చట్టబద్ధ సంస్థ వేలితోనే గిరిజనుల కళ్లు పొడిపించారు.

3)మైనింగ్ చట్టాలకు చంద్రబాబు తూట్లు పొడిచిన నేపథ్యంలో విశాఖ బాక్సైట్ మైనింగ్‌ను ప్రైవేటు వ్యక్తులకు నేరుగా కట్టబెట్టే అవకాశం ప్రభుత్వాలకు లభించింది. 

4)దుబాల్‌ను ముందు పెట్టుకుని...చంద్రబాబు తరఫున కోనేరు రాజేంద్రప్రసాద్ మంత్రాంగం నడుపుతున్నపుడు...కోనేరుకు అల్యూమినియం రంగం లో ఉన్న అనుభం ఏమిటని ‘ఈనాడు’ ఒక్క ముక్క అయినా రాస్తే ఒట్టు!
5)ఇదే కోనేరు ప్రసాద్ కు హైదరాబాద్‌లో అత్యంత విలువైన 535 ఎకరాల భూముల్ని కేటాయిస్తున్నప్పుడు...ఎమ్మార్ వాటా ఎంత? అసలు కోనేరు ప్రసాద్ నడిపే వ్యవహారం ఏమిటన్న ఆలోచన కూడా పాఠకుడికి రాకుండా రామోజీ వల్లమాలిన తెలివి ప్రదర్శించారు.

6)ఇక రస్ అల్ ఖైమా విషయానికి వస్తే... ఆ సంస్థకు పశ్చిమగోదావరి జిల్లా పెద్దాపురం పక్కనే ఏకంగా 200 ఎకరాల భూములను అప్పగిస్తూ ఎంవోయూ కుదుర్చుకున్నది సాక్షాత్తు చంద్రబాబు మాత్రమే.

7)అప్పట్లో దుబాయ్ ప్రసాద్‌గా పేరొందిన కోనేరు ప్రసాద్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టిన దుబాల్.. విశాఖ బాక్సైట్ గనుల లీజులను కూడా తమకు అప్పగించాలని పట్టుబట్టింది. 2004లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయి ఉంటే ఆ పని కూడా జరిగిపోయేదే.

8)వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటిని ఏ ప్రైవేటు వ్యక్తికీ అప్పగించలేదు. వాటి లీజులు మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పరిధిలోనే ఉన్నాయి. 

9)మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు, పెన్నా ప్రతాపరెడ్డి పెట్టుబడులు పెట్టిన సంస్థకు మధ్య ఉన్నది బాక్సైట్ కొనుగోలు ఒప్పందం మాత్రమే. ఈ బాక్సైట్‌ను ఇక్కడే అల్యూమినియంగా మార్చే కర్మాగారం నెలకొల్పితే, ఇక్కడివారికి ప్రత్యేకించి గిరిజనులకు ఉద్యోగావకాశాలు భారీగా ఉంటాయన్నది వైఎస్ సంకల్పం.

10)ఏపీఎండీసీకిగానీ, గిరిజనులకు గానీ అత్యధిక ప్రయోజనాలు కల్పించేలా వైఎస్ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంది. ఒడిశాలో వేదాంతతోగానీ దేశంలో మరే సంస్థతోగానీ అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం కంటే.. వైఎస్ ప్రభుత్వం మేలైన ఒప్పందం కుదుర్చుకుంది. ఇంతకంటే మెరుగైన ఒప్పందాన్ని చూపగల సత్తా ఎవరికైనా ఉందా? అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది.

11)కర్మాగారాలు నెలకొల్పటం అంటే పారిశ్రామికవేత్తలకు వందలూ వేల కోట్ల రూపాయలు ఖర్చయ్యే వ్యవహారం. ఇందులో ముడుపులు అందాయనుకుంటే మరి కృష్ణపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల ప్రైవేటీకరణలో ఆయా కంపెనీల నుంచి చంద్రబాబు కొట్టిన కమీషన్లు ఎంత? పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలందరి నుంచి చంద్రబాబు ఇలా కమీషన్లు అడగబట్టే పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్లలో లక్షన్నర కోట్ల పెట్టుబడులు ప్రకటించినా.. వంద కోట్లు కూడా రాలేదని భావించవచ్చా?

12)ప్రభుత్వ సంస్థలు మినరల్స్‌కు సంబంధించిన ఎగుమతులు, అమ్మకాలు చేస్తాయి. ఉదాహరణకు సింగరేణి.. బొగ్గును అనేక సంస్థలకు అమ్ముతుంది. కొనుగోలు చేసిన సంస్థలు సింగరేణికో, ముఖ్యమంత్రికో లంచాలు ఇస్తాయని చంద్రబాబు రామోజీకి ఏమైనా చెప్పారా?

ఎలాంటి తర్కంతోను, నీతి నియమాలతోనూ సంబంధం లేకుండా సాగుతున్న రామోజీ పాత్రికేయంలో ఎన్నెన్ని వికృత రూపాలు ఉన్నాయో ఈనాడు రాతల్లో బయటపడుతోంది. జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేని సన్నాసులందరితో జతకట్టి సీబీఐ దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన దర్యాప్తు నాటకం ఆడుతోంది. గిట్టని పత్రికలు, గిట్టని చానళ్ళు, గిట్టని రాజకీయపార్టీలు... ఇన్నింటితో కుమ్మక్కై ఒక్క మనిషిని వేధించటాన్ని తెలుగు ప్రజానీకం ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నమ్ముతోంది. ఇలాంటి కుట్రలూ కుహకాలతోనే దశాబ్దాలుగా బతుకుతున్న వ్యక్తులకు ప్రజలే బుద్ధి చె ప్పే రోజు వస్తుందని విశ్వసిస్తోంది.’’
Share this article :

0 comments: