కాపుపై కక్ష సాధిస్తున్నారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాపుపై కక్ష సాధిస్తున్నారు

కాపుపై కక్ష సాధిస్తున్నారు

Written By news on Saturday, March 22, 2014 | 3/22/2014

కాపుపై కక్ష సాధిస్తున్నారువీడియోకి క్లిక్ చేయండి
వాసిరెడ్డి పద్మ ఆగ్రహం
 
 సాక్షి, హైదరాబాద్: అనంతపురం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభంజనానికి తట్టుకోలేక కాంగ్రెస్, టీడీపీలు రెండూ పోలీసులను ఉపయోగించుకుని తమ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై కక్ష సాధింపులకు దిగుతున్నారని పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. ఆమె శుక్రవారం పార్టీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు.  ఇటీవల రాయదుర్గంలోని వందలాది మంది పార్టీ సర్పంచ్‌లపై బైండోవర్ కేసులు పెట్టి వారిని పోలీసు స్టేషన్‌కు పిలిపించి వేధిస్తుంటే అందుకు నిరసనగా రామచంద్రారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన  సంఘటనను దృష్టిలో ఉంచుకునే పోలీసులు ఆయనపై కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీ జేబులోనూ, జేసీ దివాకర్‌రెడ్డి జేబులోనూ ఉంటూ వారి చేతిలో పావులాగా మారిపోయారని విమర్శించారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకముందే ఆయన ఇంటిపై సోదాలు చేసి ఏవో వస్తువులు దొరికాయని కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. రామచంద్రారెడ్డి కుటుంబం రాజకీయాల్లోకి రాక ముందునుంచీ వందలాది మంది  నిరుపేద జంటలకు సామూహిక వివాహాలు జరిపించే దాతృత్వం ఉందని,  అందుకు సంబంధించిన వస్తువులు వారింట్లో ఉంటే దానిని సాకుగా చేసుకుని అరెస్టు చేశారని చెప్పారు. పోలీసులను అటు కాంగ్రెస్, ఇటు టీడీపీ నేతలు ఉపయోగించుకుంటున్న తీరును తాము ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని ఆమె చెప్పారు.
 
 డీజీపీకి ఫిర్యాదు: అనంతపురం జిల్లా రాయదుర్గం ఇన్‌స్పెక్టర్ భాస్కర్‌రెడ్డి అక్కడి ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిపై కక్షకట్టి తప్పుడు కేసు నమోదు చేశారని వైఎస్సార్ సీపీ నేతలు రాష్ట్ర డీజీపీ బి.ప్రసాదరావుకు ఫిర్యాదు చేశారు. పార్టీ జన రల్ సెక్రటరీ కె.శివకుమార్ నేతత్వంలోని ప్రతినిధి బృందం శుక్రవా రం డీజీపీని కలిసి వినతిపత్రం అందించింది. గతంలో ఆ ఇన్‌స్పెక్టర్ కొందరు అమాయకుల్ని పోలీసుస్టేషన్‌కు పిలిపించి దౌర్జన్యం చేశారని, ఆ సందర్భంలో రామచంద్రారెడ్డి పోలీసు దౌర్జన్యాన్ని ప్రశ్నించడంతోపాటు దానికి నిరసనగా పోలీసుస్టేషన్ వద్దే విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసిన విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. దీంతో కక్షకట్టిన ఇన్‌స్పెక్టర్ ఎన్నికల సందర్భంలో రామచంద్రారెడ్డి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయడం కోసం ఆయనపై తప్పుడు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆయన ఇప్పటికీ ఎలాంటి నామినేషన్ దాఖలు చేయని నేపథ్యంలో ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచిన సెక్షన్లు వర్తించవని తెలి పారు. వైఎస్సార్ సీపీ నేతల ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన డీజీపీ పూర్తి విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఆ మేరకు అనంతపురం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Share this article :

0 comments: