ఇచ్ఛాపురంలో రోడ్‌షోకు ప్రజల బ్రహ్మరథం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇచ్ఛాపురంలో రోడ్‌షోకు ప్రజల బ్రహ్మరథం

ఇచ్ఛాపురంలో రోడ్‌షోకు ప్రజల బ్రహ్మరథం

Written By news on Saturday, April 5, 2014 | 4/05/2014

రెండు నెలలు ఓపిక పట్టండి
మీ కష్టాలన్నీ తీరుస్తా  
ప్రజలకు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి  భరోసా


ఇచ్ఛాపురంలో రోడ్‌షోకు ప్రజల బ్రహ్మరథం
ఉత్కళాంధ్ర సీమలో జన నేతకు నీరాజనం
జాతీయ రహదారిపై వెల్లువెత్తిన జనాభిమానం
 

 శ్రీకాకుళం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలోని ఉత్కళాంధ్ర సాంస్కృతిక సీమ ఇచ్ఛాపురంలో పర్యటించారు. మున్సిపాలిటీలోని ఇరుకు వీధుల్లో కూడా ఆయన పర్యటించి ప్రజలతో మమేకమయ్యారు. ఆయన్ను చూసేందుకు ప్రజలు పోటెత్తారు. జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ఇచ్ఛాపురం పట్టణంలో రోడ్ షో ప్రారంభించింది మొదలు సాయంత్రం వరకు పోటెత్తిన జనప్రవాహం మధ్య ఆయన పర్యటన సాగింది. జగన్‌ను చూసేందుకు.. పలకరించేందుకు మహిళలు, వృద్ధులు భారీగా తరలి వచ్చారు. మండుటెండను కూడా లెక్కచేయకుండా తన కోసం వచ్చిన వారందరితో జగన్ మనసారా మాట్లాడారు. ‘నాలుగున్నరేళ్లుగా మీరు పడుతున్న బాధలు తెలుసు. రాష్ట్రమంతా తిరిగి కళ్లారా చూశాను. రెండు నెలలు ఓపిక పట్టండి. మన ప్రభుత్వం వస్తుంది. పేదలందరి బాధలు తీరుస్తా’ అని భరోసా కల్పించారు.
 
జగన్‌ను చూడాలని..

 జగన్‌మోహన్‌రెడ్డి తమ వద్దకు వస్తున్నారని తెలిసి.. ఆయనను చూడాలని ఇచ్ఛాపురంలో  నాగుల గంగు(102) అనే వృద్ధురాలు అతి కష్టం మీద ఇంటి బయటకు వచ్చింది. కానీ అప్పటికే ఆయన కాన్వాయ్ వెళ్లిపోయింది. దాంతో నిరాశతో కూర్చుండిపోయిన నాగుల గంగును ఒక యువకుడు చేతులపై మోసుకుని జగన్ వాహనం వద్దకు తీసుకువెళ్లగా... ఆమెను చూసిన జగన్‌మోహన్‌రెడ్డి వాహనం దిగి దగ్గరకు వెళ్లారు. తనకు రూ.200 మాత్రమే పింఛను వస్తోందని, అది సరిపోవడం లేదని చెప్పిన ఆమెతో... ధైర్యంగా ఉండవ్వా.. నీకు రూ.700 పింఛన్ నేను ఇస్తానంటూ భరోసా ఇచ్చారు. ఇచ్ఛాపురం దాసన్నపేటలో సరోజ అనే మహిళ వచ్చి తన వికలాంగ కుమారుడు హిమతేజకు ఇస్తున్న పింఛన్ సరిపోక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ఆమెకు జగన్ ధైర్యం చెబుతూ తాను అధికారంలోకి రాగానే పింఛను రూ.1,000కు పెంచుతానని చెప్పారు. కండ్ర వీధిలో కండ్ర కులస్తులు కలిసి తమను ఎస్సీల్లో చేర్చాలని కోరగా..‘‘తప్పకుండా ఎస్సీల్లో చేర్చేందుకు చర్యలు తీసుకుంటాను. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతాను’’ అని హామీ ఇచ్చారు.

 వెల్లువెత్తిన జనసందోహం..

 జగన్‌మోహన్‌రెడ్డి రోడ్‌షో సందర్భంగా ఇచ్ఛాపురం మున్సిపాలిటీ జన జాతరను తలపించింది. మున్సిపాలిటీలోని 23 వార్డుల నుంచి కూడా భారీ సంఖ్యలో ప్రజలు ఆయన్ను చూసేందుకు తరలివచ్చారు. దాంతో కాన్వాయ్ ముందుకు సాగడమే గగనమైపోయింది. ఇచ్ఛాపురం దాసన్నపేట నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయ ప్రాంతానికి చేరుకోవడానికి గంటన్నర సమయం పట్టిందంటే ఏ స్థాయిలో ప్రజాభిమానం వెల్లువెత్తిందో తెలుస్తోంది. కండ్ర వీధి, కస్పా వీధి, బ్రాహ్మణ వీధి, పంజా వీధి, కాపు వీధి, హరిజన వీధుల మీదుగా రోడ్ షో సాగింది. అప్పటికే సమయం మించిపోవడంతో రోడ్‌షోను ముగించాలని భావించారు. కానీ ఉప్పాడ వీధి, బెల్లుపడలకు చెందిన ప్రజలు వచ్చి తమ ప్రాంతానికి రావల్సిందేనని పట్టుబట్టారు. అప్పటికే మధ్యాహ్న భోజన వేళ మించిపోయింది. అయినా వారి మాట కాదనకుండా జగన్ ఉప్పాడ వీధి, బెల్లుపడ వెళ్లారు. రోడ్‌షో ముగించిన అనంతరం శ్రీకాకుళం మీదుగా విశాఖపట్నానికి బయలుదేరారు. జాతీయరహదారిపై పలుచోట్ల ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి జగన్‌ను చూసేందుకు పోటీ పడ్డారు. దాంతో ఆయన తన వాహనాన్ని ఎక్కడికక్కడ ఆపి కిందకు దిగి అందరినీ ఆప్యాయంగా పలకరించారు. అలా లొద్దపుట్టి, శిలగాం, మఖరాం పురం జంక్షన్, అంపురం జంక్షన్, పలాసపురం, కొర్లాం తదితర చోట్ల వేలాదిగా ప్రజలు తరలివచ్చి జగన్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు.
 
 నీ వైద్యానికి నాదీ భరోసా
 
సుభాష్‌చంద్ర, ప్రమీల అనే పేద దంపతులు ఇచ్ఛాపురంలో జగన్‌ను కలిసి ‘‘అన్నా... మా పాప కాళ్లు చచ్చుబడి ఇంట్లో ఉంది. ఒకసారి వచ్చి చూడన్నా..’’ అని కోరడంతో జగన్ వెంటనే వాహనం దిగి వారి ఇంటికెళ్లారు. రెండు కాళ్లూ చచ్చుబడిపోయిన వారి కుమార్తె సుమిత్రా నందాను చూసి చలించిపోయారు. ఏమైందని అడిగారు. ఏదో వ్యాధి సోకి తమ అమ్మాయి నడుం నుంచి కాళ్ల వరకు చచ్చుబడిపోయాయని వారు చెప్పారు. రూ.లక్ష అప్పు చేసి విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం చేయించినప్పటికీ ఫలితం లేకపోయిందని వాపోయారు. ‘నాకూ అందరిలో నడవాలని ఉంది సార్’అని సుమిత్ర అనడంతో చలించిపోయిన జగన్.. లోక్‌సభ అభ్యర్థి రెడ్డి శాంతి, పార్టీ నేత నర్తు రామారావులకు ఆ అమ్మాయి బాధ్యత అప్పగించారు. ఆమెకు కావల్సిన వైద్యం చేయించాలని చెప్పారు. తాము పిలిచిన వెంటనే వచ్చి.. ఆదుకుంటామని మాటిచ్చారంటూ సుభాష్ నందా, ప్రమీల కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.
 
Share this article :

0 comments: