పవన్...కాస్తయినా నిజాలు మాట్లాడు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » పవన్...కాస్తయినా నిజాలు మాట్లాడు

పవన్...కాస్తయినా నిజాలు మాట్లాడు

Written By news on Wednesday, April 2, 2014 | 4/02/2014

అటు మొన్నటి దాకా హీరో..మొన్నటికి మొన్న రాజకీయ తెరపై తళక్కుమన్నాడు..నిన్నటికి నిన్న జీరో అయిపోయాడు..ఈ రోజు..పూర్తిగా తాను కొందరి చేతిలో కీలు బొమ్మగా మారిపోయానని నిరూపించుకున్నాడు..
దటీజ్ పవన్ కళ్యాణ్
ప్రపంచ రాజకీయాలు అన్నీ ఔపాసన పట్టీసినట్లు మాట్లాడేస్తాడు..అన్నీ తనకే తెలుసనుకుంటాడు. నిజానికి వాదనకు దిగడు..నిలవడు. ప్రపంచంలో ఏ రాజకీయ, సౌద్దాంతిక వేత్త అయినా మీడియా దగ్గర మాత్రం కాస్తయినా ధైర్యంగా వుంటాడు. మీడియాను ఫేస్ చేయడానికి ఇబ్బంది పడడు. కానీ మిడిమిడి జ్ఞానం వున్న పవన్ లాంటి వాళ్లు తప్పితే. జనసేన పెట్టడానికి ముందు..పెట్టిన తరువాత..ఎన్నికలకు వెళ్లకుండా కాళ్లు తేలేసిన తరువాత కూడా మీడియా ముందుకు రాలేకపోయిన పవన్ ఒక్కసారిగా చంద్రబాబు అనుకూల మీడియాకు ప్రత్యేక ఇంటర్వూ ఇచ్చాడు. బహుశా ఇలా ఇంటర్వూ ఇవ్వడం కూడా ఇదే తొలిసారేమో కూడా. ఇందులో ఏమన్నాడు..మంచి చెడ్డలేమిటి అన్నది చూసే ముందు.. మీడియా మొహం చూడడం అంటే ఇష్టపడని పవన్ ఇప్పుడు అర్జెంటుగా చంద్రబాబు అనుకూల మీడియాకే ఎందుకు ఇంటర్వూ ఇవ్వాల్సి వచ్చింది? 
దీనికి ఒక్క రోజు ముందు వెలువడిన నీల్సన్ తాజా సర్వే ఫలితాలు, తెలుగుదేశం పార్టీ అధినేతను దిగాలు పర్చబట్టి.  పవన్ రెండు సభల్లోనూ చంద్రబాబు అనుకూల, పవన్ వ్యతిరకే ధోరణి అంత స్పష్టంగా జనంలోకి వెళ్ల లేదు కాబట్టి. పవన్ అనే అస్త్రం ప్రయోగం పూర్తి కాకుండానే తుస్సుమన్నదని మీడియా కోడై కూసింది కాబట్టి. మరింక ఈ విషయాలు స్పష్టం చేయాలంటే రెండే మార్గాలు. ఒకటి మరో సమావేశం. అది ఇప్పట్లో ఏర్పాటు చెసే ఉద్దేశం పవన్ లో లేదు. రెండవది మీడియా సమావేశం. దాన్ని ఎదుర్కోనే ఉద్దేశం పవన్ కు ఏ మాత్రం వున్నట్లు లేదు. ఎందుకంటే, ప్రత్యేక ఇంటర్వూ, లేదా సభ అంటే తన మానాన తాను చెప్పుకుంటూపోవడమే. అదెందుకు? ఇదెలా అని అడిగే అవకాశం వుండదు. అంతా వన్ సైడ్ వ్యవహారం. కానీ మీడియా సమావేశం అంటే అలా కాదు. కాలికేస్తే, మెడకేస్తారు..మెడకేస్తే, కాలికేస్తారు. ఉదాహరణకు జగన్ కేసుల గురించి, గదినిండా ఫైళ్ల గురించి ప్రస్తావిస్తే, చంద్రబాబు కేసులు, వాటిని తప్పించుకునేందుకు వేసిన ఎత్తులు, న్యాయ విచారణను ఎదర్కొకుండా, తప్పించుకునేందుకు చట్టాన్ని అడ్డుపెట్టుకున్న వైనం నీకు తెలుసా అని ఎవరైనా అడిగితే ఏమని సమాధానం చెప్పాలి? మన గ్యాస్ గుజరాత్ కు ఎలా తరలిపోయింది? అందుకోసం ఏర్పడిన కంపెనీకి చంద్రబాబు మనిషి ఎలా అధినేత కాగలిగారు..అదే కంపెనీతో అనుబంధం వున్న సంస్థ ఈనాడు సంస్థను మార్గదర్శి కష్టాల నుంచి ఎలా గట్టెక్కించింది..ఇవన్నీ నీకు తెలుసా..నీకు..తెలుసా..అని ఎవరైనా అడిగితే...తెల్ల మొకం వేయాలి. అందుకే..  అందుకే పవన్ ప్రత్యేక ఇంటర్వూను ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. 
వైఎస్ కారణమా?
ఎన్నడైనా పవన్ షూటింగ్ ల్లో అతగాడి దగ్గరకు లోకల్ కుర్రాళ్లను అనుమతించేంత సీన్ వుందా? పవన్ అనే కాదు, మరే బడా హీరో అయినా, చుట్టూ ప్రయివేటు ఆర్మీ, బౌన్సర్లు. అలాంటిది పవన్ దగ్గరకు తెలంగాణ కుర్రాళ్లు వచ్చి, వైఎస్ మా బతుకుల్ని చిన్నా బిన్నం చేసేసారు అని చెబితే, అయ్యో అనుకున్నారా? మరి అదెలా అని వివరించరేం? భూమల ధరలు పెరిగితే, అమ్ముకున్న తెలంగాణ వాసులు బాగుపడ్డారా? కొనుక్కున్న వారు బాగు పడ్టారా? ఓ ప్రాంతం అభివృద్ది చెందితే కదా భూముల ధరలు పెరిగేది? ఇఫ్పుడు తెలంగాణలో ధరలు ఎందుకు దిగజారాయి? తెలంగాణ విషయంలో ఢిల్లీకి వైఎస్ఆర్ డెలిగేట్లను పంపించి వుండొచ్చు. కానీ సీమాంధ్ర వాసులను ఏ ఒక్కరినైనా పలకరించండి..వైఎస్ బతికి వుంటే, ఈ విభజన జరిగివుండేది కాదు అనే చెబుతారు. అది ఏ పార్టీవారైనా. ఈ సంగతి పవన్ కు తెలియదా? అసలు పవన్ కు పెద్ద మనుషుల ఒప్పందం నుంచి ఇప్పటి వరకు జరిగిన తెలంగాణ వ్యవహారాలపై ఏ మేరకు అవగాహన వుంది? తెలంగాణ ప్రజలు బాధ పడుతున్నది తమ అవకాశాలనే కాదు, తమ ప్రాంత రాజకీయ ప్రయోజనాలను కూడా స్వాహా చేసినందుకు,. అలా చేసింది ఎవరు? ఇవ్వాళ తెలుగుదేశం పార్టీ తెలంగాణ కోటాలో కూడా రాజ్యసభకు పంపిందెవరిని?  అలా చేసింనందుకేగా తెలంగాణ ప్రాంత నాయకులు అలిగింది? ఇవ్వాళ ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి ప్రాంతాల్లో సీమాంధ్రులు తెలంగాణ రాజకీయ పదవులను అనుభవించడం వల్లనే కదా తెలంగాణ ప్రాంత వాసులు బాధపడుతున్నది. ఇది కాదనగలమా? ఇందుకు ఒక్క వైఎస్ఆర్ మాత్రమే కారణమా? ఈ వైనాలేమన్నా పవన్ కు తెలుసా? 

పెద్ద తప్పిదం వైఎస్ చేసాడు. తాను పదవిలో వుండగానే చంద్రబాబు అందరినీ పక్కన పెట్టి లోకేష్ ను అమాంతం పైకి తెచ్చిన మాదిరిగా జగన్ ను తేకపోవడం తప్పిదమే. అలా తెచ్చివుంటే పవన్ ఈ మాట అనకపోదును. పార్టీలో అందరు సీనియర్లు వుండగా, హరికృష్ణలాంటి అసలైన వారసులు వుండగా లోకేష్ ను తెచ్చిన వైనం, ఎందుకంత తొందర అని పవన్ కు అనిపించకపోవడం ఆశ్చర్యకరమే. అవును..ఇంతకీ సినిమా హీరోల సంగతేమిటి పవనూ..తమ తమ పిల్లలకు మీసాలు ఇంకా రాకముందే హీరోలను చేసేయడంలా? మాతో చెప్పింతురేమయ్యా? నీ హీరొ అవకాశం ఎలా వచ్చింది? అన్న చిరంజీవి లేకుంటే, అక్కినేని వారసురాలు నీ పక్కన హీరోయిన్ వేసేంత సీన్ వుండేదా? హీరోల వారుసులు ఎలా వున్నా, ఎన్ని చెక్కుళ్లు చెక్కించుకున్నా, అవకాశాలు ఎలా వస్తున్నాయి..వారసత్వం కాదా? 
సరే,. జగన్ పై అభియోగాలు వున్నాయి..నిజమే. అవి ఎప్పుడు ప్రారంభమయ్యాయో, ఎలా ప్రారంభమయ్యాయో నీకు తెలియదా..నీ వెనుక వున్న సోకాల్డ్ బ్యూరో క్రాట్స్ ప్రముఖులకు తెలియదా? అంతవరకు లేని కేసులు, సోనియా, కాంగ్రెస్ ,తేదేపా కుమ్మక్కుతో ఒక్కసారి ఎలా ఉరికి వచ్చాయో తెలియదా? పోనీ జగన్, సరైన వాడు కాదు..ఓడించండి..అనడంలో తప్పు లేదు. కానీ అలా అని చంద్రబాబు పాలన గురించి ఏమి తెలుసని మద్దతు పలుకుతున్నావు. 
రైతుల మీద దృష్టి పెట్టి వుంటే బాగుండేది..బషీర్ బాగ్ సంఘటన జరగకుండా వుంటే బాగుండేది..ఈ రెండు సంఘటనల కారణంగానే ప్రజలు బాబును పదేళ్లు అధికారానికి దూరంగా వుంచారు? 
సినిమా బాగుంటే జనం వద్దన్నా నెత్తిన పెట్టుకుంటారు. లేకుంటే తీన్ మార్..పంజా, కొమరం పులి అవుతాయి. పాలన బాగుంటే బాబు అయినా వైఎస్ అయినా నీలాంటి వాళ్ల సిఫార్సులేఖలు అక్కరలేదు. బాబు మంచి చేసి వుంటే ఎందుకు జనం వదిలేస్తారు. ఇప్పుడు కూడా ఉద్యోగస్థులు బాబు అధికారంలోకి వస్తాడంటే ఎందుకు భయపడుతున్నారు? రాష్ట్రానికి రావడానికి బ్యూరోక్రాట్లు భయపడుతున్నారని చెప్పిన నీకు, ఇక్కడి ఉద్యోగులు బాబు పాలన అంటేనే భయపడుతున్నారని తెలుసా? 
ప్రజాసేవ చేయడానికి అధికారమే అక్కరలేదు అనుకున్నపుడు. పవన్ పార్టీ ఎందుకు పెట్టాలి? స్వచ్ఛంధ సంస్థ చాలుగా? మరి రాజకీయ కుటుంబం కానీ మీకే రాజకీయాల మీద, ఎన్నికలు పోటీ, బలాబలాల అంచనాలు, భవిష్యత్ ప్రణాళికలు అన్న వాటిపై అంతంత మాత్రం అయిడియా వుంటే, రాజకీయ కుటుంబంలో నుంచి వచ్చిన జగన్ కు వుండడంలో తప్పేమిటి? అది వారసత్వం అని మీరు అంటున్నారు. మరి లోకేష్ కోసం, చంద్రబాబు అతగాడి చుట్టూ వుంచిన యువ తెలుగుదేశం కుర్ర నాయకుల చరిత్ర ఒక్కసారి చూడు పవన్ ప్లీజ్..వారిలో ఒక్కరైనా వారసత్వం లేకుండా వున్నారా? కరణం వారసులు, కింజరాపు వారసుడు, పరిటాల వారసుడు, ఇలా లోకేష్ చుట్టూ వున్నది వారసులేగా? ఎందుకంటే ఈ వారసత్వం కావాలంటే, ఆ వారసత్వానికి ఊ అనాలి కాబట్టి. కానీ జగన్ వారసత్వం మాత్రం వద్దు. ఇదెక్కడి నీతి పవన్? 
ఓవర్ నైట్ డబ్బులెలా వస్తాయి? అవును అదీ నిజమే. రెండు ఎకరాల ఆసామీ, స్కాలర్ షిప్ లతో చదువుకున్న పెద్ద మనిషి చంద్రబాబు ఈ రోజు ఈ స్థాయికి వచ్చారు .అదీ కేవలం పది నుంచి ఇరవై ఏళ్లలో. ఎలా..హౌ...పోనీ ఆ సంగతి వదిలేయ్..ఏమీ లేని బాబు తల్లి, భారీగా మనవడికి బహుమతి ఎలా ఇవ్వగలిగారని గిట్టని నేతలు అడుగుతున్నారు..సమాధానం వుందా? సరే అదీ వదిలేయ్. గట్టిగా మీసాలు రాని వయసులోనే రామ్ చరణ్ మీ అన్నకు లండన్ నుంచి భారీ కారు తెప్పించి గిఫ్ట్ ఇచ్చాడు? ఎలా వస్తున్నాయి. ఇన్ని కోట్లు అని ఈ దేశపు సగటు యువతరం తలలు బద్దలు కొట్టుకుంటోంది పవన్. కాస్త వివరించు. పారదర్శకత గురించి మాట్లాడే మీరు..ఏ ఒక్క సినిమా హీరో అయినా తీసుకునే అసలు, నలుపు, తెలుపు, ఏరియా హక్కులు, కాల్ షీట్ మేనేజర్లు వగైరా లెక్కలను ఒక్కసారి అయినా వెల్లడించిన పాపాన పోయారా?
జగన్ కోసం కాదు
ఇందంతా మీరు జగన్ నో, వైఎస్ నో వేలెత్తి చూపారని కాదు. వాళ్లను మాత్రమే చూపారని, మీ చుట్టూ అంతా చెత్తే అయితే, మీరు కూడా చెత్తను ఆనుకునే కూర్చుని, మీ ఎదురుగా వున్నదే చెత్త, మిగిలినది మంచి అంటున్నారు చూడండి..అందుకని. ప్లీజ్ కాస్త నిజాలు మాట్లాడడం నేర్చుకోండి పవన్..అంతే కానీ ప్రాప్టింగ్ కు, డబ్బింగ్ చెప్పకండి..ఇకనైనా.
- See more at: http://telugu.greatandhra.com/politics/elections-2014/pawan-kastha-ayina-nijalu-matladu-51556.html#sthash.kpNOPMjJ.dpuf
Share this article :

0 comments: