టెక్కలి బహిరంగ సభకు తరలివచ్చిన జనసంద్రం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » టెక్కలి బహిరంగ సభకు తరలివచ్చిన జనసంద్రం

టెక్కలి బహిరంగ సభకు తరలివచ్చిన జనసంద్రం

Written By news on Friday, April 4, 2014 | 4/04/2014

ఆత్మబంధువుపై అభిమాన వెల్లువ
  జనజాతరగా వై.ఎస్.జగన్ జనభేరి 
  పలాస-కాశీబుగ్గలో రోడ్‌షో గ్రాండ్ సక్సెస్
  టెక్కలి బహిరంగ సభకు తరలివచ్చిన జనసంద్రం 
  జిల్లాపై వరాల జల్లు కురిపించిన జననేత
  థర్మల్ ప్లాంట్లు రద్దు హామీ 
   ఎస్టీ జాబితాలోకి మత్స్యకార, బోయ, వడ్డెర 
  కళింగ కోమట్లు బీసీ జాబితాలోకి 
 
 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఆత్మబంధువుపై జనాభిమానం వెల్లువెత్తింది...వేసవి భానుడు చిన్నబుచ్చుకునేలా ఆప్యాయత వర్షం కురిసింది. మండువేసవి పండువెన్నెలగా మారిందా అనిపించింది...జననేత కోసం తరలివచ్చిన ప్రజలతో రోడ్లు జన జాతరను తలపించాయి... వైఎస్సార్ కాంగ్రెస్ అధినత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటనలో ప్రజాభిమానం పరవళ్లుతొక్కింది. అందుకు ఆయన కూడా సముచితరీతిలోనే జిల్లాపై తన అభిమానాన్ని చాటుకున్నారు. తనకోసం తరలివచ్చిన అందరితోనూ ఓ కొడుకులా... అన్నలా... స్నేహితుడిలా మమేకమయ్యారు. ఇక టెక్కలి బహిరంగ సభలో జిల్లాపై పలు హామీల వర్షం కురిపించారు. జిల్లా ప్రజలకు, జన నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి మధ్య ఉన్న ఆత్మీయానుబంధానికి జనభేరి యాత్ర ప్రతీకగా నిలిచింది. 
 
 వెల్లువెత్తిన జనాభిమానం 
 పలాస-కాశీబుగ్గ  ప్రజలు ఆప్యాయత వర్షం కురిపించారు. టెక్కలి నియోజకవర్గ ప్రజలు జన నీరాజనం పలికారు. తమ కోసం తరలివచ్చిన జననేత కోసం మండువేసవిని కూడా లెక్కచేయలేదు. యువతీ, యువకులే కాదు...  చిన్నా పెద్దా, మహిళలు, వృద్ధులు... ఇలా అన్ని వర్గాల ప్రజలు పోటెత్తారు.
 
 జనజాతర
 పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో రోడ్‌షో జనజాతరగా మారి అభిమాన కోలాహలం వెల్లువెత్తింది. టెక్కలిలో బహిరంగ సభ జన సంద్రమై ప్రజాభిమానం ఘోష ప్రతిధ్వనించింది. జిల్లాలో  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి గురువారం నిర్వహించిన వైఎస్సార్ జనభేరి యాత్ర సందర్భంగా ఆవిష్కృతమైన అపూరూర దృశ్య మాలిక ఇదీ.  జిల్లా చరిత్రలో ఇంతవరకు కనీవినీ ఎరుగని రీతిలో ఈ రోడ్‌షో సాగింది. చిన్న చిన్న వీధులు, సందులను కూడా చూడకుండా ఓ ప్రముఖ పార్టీ అధ్యక్షుడు ప్రజల మధ్యకు తరలివచ్చిన అరుదైన రాజకీయ ఘట్టానికి పలాస-కాశీబుగ్గ సాక్షిభూతంగా నిలిచాయి. పలాసలో ఉదయం 10 గంటలక ు జగన్ రోడ్‌షో ప్రారంభించారు. జీడిపిక్క బొమ్మ  జంక్షన్ నుంచి కాపు వీధి, బత్తుల వీధి, బజార్‌వీధి, రెడ్డిక వీధి, ఇందిరా చౌక్, కేటీ రోడ్డు, హరిజన వీధి, జీజే కాలేజ్ రోడ్, సీతారాం నగర్, కౌషల్య నగర్, పురుషోత్తమపురం, తిలక్ నగర్, లేబర్‌కాలనీ, మారుతీనగర్‌లలో ఆయన రోడ్‌షో నిర్వహించారు. జననేత జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు వెల్లువెత్తిన ప్రజల రాకతో పలాస రోడ్లు కిక్కిరిసిపోయాయి.
 
 మహిళలు, వృద్ధులు రోడ్లపైకి వచ్చి వై.ఎస్.జగన్‌ను తమ బిడ్డలా చూసి మురిసిపోయారు. యువతీ, యువకులు ‘జగనన్నా’అని నినాదాలతో సంబోధిస్తూ కేరింతలు కొట్టారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఆయన్ను కలిసేందుకు... రెండు మాటలు మాట్లాడేందుకు పోటీలు పడ్డారు. హారతులు పట్టారు. ‘నీకే ఓటేస్తాం... సీఎంను చేస్తాం’అని తమ మనోభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు.. ఇలా వివిధ వర్గాల ప్రజలు వివిధ రీతుల్లో జగన్‌మోహన్‌రెడ్డితో తమ మనోభావాలు పంచుకున్నారు. ప్రతి చిన్న వీధిలోనూ వందలాదిగా తరలివచ్చిన అందర్నీ ఆయన అప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. దాంతో వై.ఎస్.జగన్ కాన్వాయ్ ముందుకు సాగడం గగనమైపోయింది. జీడిపిక్క బొమ్మ జంక్షన్ నుంచి కిలో మీటరు దూరంలోని రెడ్డిక వీధి చేరడానికి రెండు గంటల సమయం పట్టిందంటే జనాభిమానం ఎంతగా వెల్లువెత్తిందో స్పష్టమవుతోంది. అదే రీతిలో భోజన విరామ ప్రదేశం ఎంపీడీవో ఆఫీసు రోడ్డుకు చేరుకునే సరికి మధ్యాహ్నం ముడు గంటలు అయ్యింది. 
 
 నేనున్నాననీ...ప్రజలతో మమేకం
 పలాసలో రోడ్‌షో సందర్భంగా వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వివిధ వర్గాలవారీతో మమేకమయ్యారు. తమ బాధలు వెల్లబోసుకున్నవారికి నేనున్నానని భరోసా ఇచ్చారు. రెండు నెలలు ఓపిక పడితే అన్ని కష్టాలు తీరుస్తానని హామీ ఇచ్చారు. మందస మండలానికి చెందిన హైమావతీ అనే మహిళ కుమారుడికి ఆపరేషన్ చేయిస్తానని హామీ ఇచ్చారు. ప్రమాదం బారిన పడిన  నల్ల లక్ష్మీ అనే జీడికార్మికురాలి కుటుంబాన్ని ఆదుకుంటానని ధైర్యం చెప్పారు. పలాసలో ఉన్న జీడి కార్మికుల కష్టాన్ని కళ్లారా చూశారు. వారి కోరిక మేరకు 20 వేల మంది కార్మికులకు లబ్ధి చేకూరేలా పలాసలో ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మిస్తానని హామీ ఇచ్చారు. అదే విధంగా క్యాజూ అసోసియేషన్ ప్రతినిధులు ఆయన్ని కలిసి దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి జీడి పరిశ్రమపై 2.0 శాతం పన్నును 2 శాతానికి తగ్గించిన విషయాన్ని గుర్తు చేసి కృతజ్ఞతలు తెలిపారు. వారి కోరికపై పలాసలో కొత్తగా పారిశ్రామికవాడను నెలకొల్పుతానని జగన్ హామీ ఇచ్చారు.
 
 వరాల జల్లు 
 పలాసలో రోడ్‌షో అనంతరం జగన్‌మోహన్‌రెడ్డి టెక్కలిలో వైఎస్సార్ జనభేరి బహిరంగ సభలో పాల్గొన్నారు. గురువారం రాత్రి 7 గంటలకు ఆయన టెక్కలి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని సభా ప్రాంగణానికి చేరుకునేసరికే ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి ప్రజలు తమ అభిమాన నేత జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు టెక్కలికి పోటెత్తారు. ఇక తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ జగన్ జిల్లాపై పలు హామీల వర్షం కురిపించారు. గతంలోనే చెప్పిన విధంగా అధికారంలోకి వచ్చిన రెండోరోజే టెక్కలి నియోజకవర్గంలోని కాకరాపల్లి థర్మల్ విద్యుత్తు కేంద్రం, ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని సోంపేట థర్మల్ విద్యుత్తు కేంద్రాల అనుమతులు రద్దు చేస్తానని దువ్వాడ శ్రీనివాస్ విజ్ఞప్తి మేరకు పునరుద్ఘాటించారు. 
 
 ఇక జిల్లాలో అత్యధికంగా ఉన్న మత్స్యకార, కళింగ కోమట్ల సామాజికవర్గాల అభ్యున్నతి కోసం ఆయన కీలక హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మత్స్యకారులను ఎస్టీలలో చేరుస్తామని  ప్రజల హర్షధ్వానాల మధ్య ఆయన ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల జిల్లాలో 3 లక్షలమందికిపైగా ఉన్న మత్స్యకారులు లబ్ధి పొందుతారు. అదే విధంగా బోయ, వడ్డెర సామాజిక వర్గాలను కూడా ఎస్టీల జాబితాలో చేరుస్తామన్నారు. ఇక జిల్లాతోపాటు ఉత్తరాంధ్రలో అత్యధికంగా ఉన్న కళింగ కోమటి సామాజికవర్గం చిరకాల డిమాండ్‌పై జగన్ సానుకూలంగా స్పందించారు. 
 
 తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కళింగ కోమట్లను బీసీలలో చేరుస్తామన్నారు. అందుకోసం మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని ఆయన హామీ ఇచ్చారు. దువ్వాడ శ్రీనివాస్ విజ్ఞప్తి మేరకు ఆఫ్‌షోర్ రిజర్వాయర్ పనులను పూర్తిచేస్తామని ప్రకటించారు. ఈ విధంగా వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై జిల్లాలో జనాభిమానం వెల్లువెత్తగా... ఆయన జిల్లాపై హామీల వర్షం కురిపించారు. 
 
 అభ్యర్థుల ప్రకటన 
 జిల్లా నుంచి పోటీ చేయనున్న అభ్యర్థుల ప్రకటనను వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి టెక్కలి నుంచి ప్రారంభించారు. టెక్కలి అసెంబ్లీ అభ్యర్థిగా దువ్వాడ శ్రీనివాస్, శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా రెడ్డి శాంతి పేర్లను ఆయన ప్రజల సమక్షంలో ప్రకటించారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్ సీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, జిల్లా మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు కొయ్య ప్రసాదరెడ్డి, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు, కేంద్రపాలకమండలి సభ్యులు పాలవలస రాజశేఖరం, ఎం.వి.కృష్ణారావు, నియోజకవర్గాల సమన్వయకర్తలు వజ్జ బాబూరావు, విశ్వాసరాయి కళావతి, కలమట వెంకటరమణ, గొర్లె కిరణ్, కంభాల జోగులు, దువ్వాడ శ్రీనివాస్, పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త రెడ్డి శాంతి, పార్టీ నేతలు పేరాడ తిలక్, హనుమంతు కిరణ్, అందవరపు సూరిబాబు, దువ్వాడ శ్రీకాంత్, దువ్వాడ శ్రీధర్, ద్వార భగవతి, శ్రీనివాస్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. 
 
 పింఛన్ అగిపోయింది 
 పలాస ప్రభుత్వాస్పత్రి జంక్షన్ వద్ద 
 జగన్: తాతా... బాగున్నావా?
 వజ్జ లోహిదాస్: నేను మాట్లాడేందుకు మాటలు రావు. నోటి సైగలతో మేము బాగున్నాం బాబూ..
 జగన్: రెండు నెలలు ఆగితే పింఛన్ వచ్చేలా చూస్తా..
 లోహిదాసు: నీవు బాగుండలా... మాలాంటి వాళ్లకు చల్లగా చూడాలని మూగ సైగలతో చెప్పి జగన్ ముఖంలో ఆనందం చూసి వెనుదిరిగారు. 
 
 వికలాంగులను ఆదుకుంటా...
 పలాస ప్రభుత్వాస్పత్రి జంక్షన్ వద్ద 
 జగన్: తమ్ముడూ.. బాగున్నావా?
 సైని కాంతారావు: ఏమి బాగున్నా.. మాది మాకన్నపల్లి. పుట్టుక నుంచి వికలాంగుడుగా జీవిస్తున్నాను. జీవితానికి భద్రతలేదు.
 జగన్: అధైర్యం వద్దు నెల రోజులు ఆగితే మంచి రోజులు వస్తా యి. మన రాజ్యం రావాలంటే మీరు అవకాశం కల్పించాలి.
 సైని కాంతారావు: అన్నా నీవు గెలవాలన్నా.. గెలుస్తావు.. మీ వెంటే మేమందరం.
Share this article :

0 comments: