సీబీఐ రాజకీయంగా కొంతమందిని అంతమొందించే విధంగా పనిచేస్తోంది.‘సీఎన్‌ఎన్-ఐబీఎన్’ ఇంటర్వ్యూలో వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » సీబీఐ రాజకీయంగా కొంతమందిని అంతమొందించే విధంగా పనిచేస్తోంది.‘సీఎన్‌ఎన్-ఐబీఎన్’ ఇంటర్వ్యూలో వైఎస్ జగన్

సీబీఐ రాజకీయంగా కొంతమందిని అంతమొందించే విధంగా పనిచేస్తోంది.‘సీఎన్‌ఎన్-ఐబీఎన్’ ఇంటర్వ్యూలో వైఎస్ జగన్

Written By ysrcongress on Friday, April 6, 2012 | 4/06/2012

దర్యాప్తులో వృత్తిపరమైన నిబద్ధత లేదు 
‘సీఎన్‌ఎన్-ఐబీఎన్’ ఇంటర్వ్యూలో వైఎస్ జగన్
కక్ష సాధింపు ధోరణితో విచారణ కొనసాగిస్తోంది
విచారణ వివరాలను కొన్ని పత్రికలకు, మీడియా సంస్థలకు లీక్ చేస్తోంది
ఈ కేసులో తొలి, తదుపరి ప్రతివాదుల జోలికే సీబీఐ వెళ్లలేదు
ఆ 26 జీవోలను చూస్తే అవి చట్ట విరుద్ధమైనవి కాదని చెప్పక తప్పదు
నన్నెందుకు అరెస్టు చేస్తారు?..ఇది కూడా సీబీఐ లీక్ చేసిందా?
కోర్టులపై నాకు పూర్తి విశ్వాసం ఉంది.. నన్ను నా తండ్రే రాజకీయాల్లోకి తెచ్చారు
నేనేంటో, ఆయన ఏమిటో ఈ రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు
వాస్తవాలు గ్రహించారు కాబట్టే.. జనం నా వెంట ఉన్నారు
మా పార్టీకి రాష్ట్రం, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘రాజకీయంగా కొంతమందిని అంతమొందించే విధంగా సీబీఐ దర్యాప్తు సాగిస్తోంది. అసలు ఆ సంస్థ చేస్తున్న విచారణలో వృత్తిపరమైన నిబద్ధత లేనే లేదు. ముందు వారి ఆలోచనా తీరు (మైండ్‌సెట్) మారాలి...’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ‘ఎవరో తమ దారికి రాలేదనో...ఎవరో కొందరు ఒక పార్టీని వదిలి వెళ్లారనో...వారిని సాధించే విధంగా విచారణ సాగుతోంది...ఏమిటిది? ఏ తరహా విధానం ఇది? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా! లేక ఎమర్జెన్సీ (అత్యయిక పరిస్థితి)లో ఉన్నామా?’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న జగన్ ‘సీఎన్‌ఎన్-ఐబీఎన్’ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. 

ఈ సందర్భంగా సీబీఐ తీరుపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘దర్యాప్తులో తాము ఎవరినైతే విచారిస్తున్నామో ఆ వివరాలన్నింటినీ సీబీఐ.. ఎంపిక చేసుకున్న కొన్ని పత్రికలకూ, కొన్ని మీడియా సంస్థలకూ లీకులు ఇస్తోంది. నాలుగు గోడల మధ్య జరిగే విచారణ వివరాలు మొత్తం కొన్ని పత్రికలకు ఇవ్వడం.. వారు ఆ సమాచారాన్ని ప్రముఖంగా ప్రచురించడం నిత్యం జరుగుతోంది. ఈ విధంగా విచారణను ఎదుర్కొంటున్న ఒక వ్యక్తి వ్యక్తిత్వ హననానికి పాల్పడే అధికారం, ఆ వ్యక్తి ప్రతిష్టను మంటగలిపే అధికారం సీబీఐకి ఎవరిచ్చారు? అందుకే వారి ఆలోచనా విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నాను’ అని జగన్ చెప్పారు. 

‘ఈ కేసు మొత్తంలో ప్రధానమైనవి ప్రభుత్వం జారీ చేసిన 26 జీవోలు. సాధారణంగా ప్రభుత్వం జారీ చేసిన ఏ ఒక్క జీవోను కోర్టులో సవాలు చేసినా అడ్వొకేట్ జనరల్ ప్రత్యక్షమై ప్రభుత్వ వాదనను వినిపిస్తారు. కానీ ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 26 జీవోలపై కేసు దాఖలైతే అడ్వొకేట్ జనరల్ అసలు పట్టించుకోలేదు. సీబీఐ కూడా ఈ 26 జీవోల వివరాల్లోకి వెళ్లాలి. అవి సక్రమమైనవో కావో చూడాలి. శంకర్రావు వేసిన కేసులో నేను 53వ ప్రతివాదిని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తొలి ప్రతివాది అయితే.. పలువురు ప్రిన్సిపల్ కార్యదర్శులు ఆ తర్వాత వస్తారు. అలాంటిది సీబీఐ వారి జోలికే వెళ్ల లేదు. శంకర్రావు తేదీ లేకుండా ఒక లేఖ రాస్తే, టీడీపీ వారు అందులో ప్రతివాదులుగా చేరిన ఫలితంగా కోర్టు నుంచి సీబీఐ విచారణకు ఆదేశాలు వచ్చాయి. దీన్నిబట్టే ఇదంతా రాజకీయ దురుద్దేశంతో చేసిందని స్పష్టమవుతోంది కదా..’ అని అన్నారు. ఈ జీవోలను పరిశీలిస్తే అందులో ఏ తప్పూ జరగలేదనీ, అవి ఏ మాత్రం చట్ట విరుద్ధం కాదని సీబీఐ చెప్పక తప్పదని చెప్పారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి చేసినదానిలో తప్పులేదని, ఆయనకు ముందున్న పాలకులు ఏ విధానాలైతే అనుసరించారో ఆయన కూడా వాటినే పాటించారని తెలిపారు. తన అరెస్టు సంబంధిత వార్తలపై స్పందిస్తూ.. ‘ఎవరైనా ఎందుకు అరెస్టు చేస్తారు. నేను ఏ ఐఏఎస్ అధికారికైనా, మంత్రికైనా ఫోన్ చేశానా, సచివాలయానికి ఎప్పుడైనా వెళ్లి వారిని ప్రభావితం చేశానా? అసలు అరెస్టు అనే విషయం ఎందుకు వస్తోంది. ఆ విషయం ఏమైనా సీబీఐ లీక్ చేసిందా?’ అని జగన్ ప్రశ్నించారు. ‘అసలు సీబీఐ చేసిందంతా తప్పే! నా కేసును వారు ఒకటి కాదు, రెండు కాదు, ఎనిమిది నెలల పాటు విచారించి చార్జిషీటును వేశారు. అది లోపభూయిష్టంగా ఉందని మీడియాలో కథనాలు వచ్చాక.. అందరూ ఎత్తిచూపాక, ఇప్పుడు అదనపు చార్జిషీటు వేస్తానని అంటోంది. ఎన్ని వేస్తారో.. ఒకటా, రెండా, మూడా... ఆ దేవునికే తెలియాలి’ అని వ్యాఖ్యానించారు. ఈ పోరాటం ఎంతకాలం సాగుతుందో తనకు తెలియదని, అయితే కోర్టులపై పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. 

నేను కాంగ్రెస్‌ను వీడగానే నా తండ్రి

అగౌరవనీయుడయ్యారా!: తన తండ్రి దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి కాంగ్రెస్‌లో చివరివరకూ గౌరవప్రదమైన వ్యక్తిగా ఉన్నారనీ, తాను ఆ పార్టీని వీడిన తర్వాతే ఆయన కొందరి దృష్టిలో అగౌరవనీయమైన వ్యక్తి అయ్యారనీ జగన్ అన్నారు.తాను కూడా కాంగ్రెస్‌లో ఉన్నంతవరకూ మంచివాడినేననీ, ఆ పార్టీని వదిలాక ఒక్కసారిగా కొందరి దృష్టిలో చెడ్డవాడినయ్యాననీ చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడిన నెల రోజులకు వేధింపులు ప్రారంభమయ్యాయని తెలిపారు. తాను ఎలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని వదిలానో రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలుసుననీ, వారు వాస్తవాలేమిటో గ్రహించారని చెప్పారు. ‘ప్రజలకు మా నాన్న అంటే ఏమిటో బాగా తెలుసు, అలాగే నాకున్న విశ్వసనీయత ఏమిటో, నా వ్యక్తిత్వం ఏమిటో కూడా బాగా తెలుసు, అందుకే వారు నావెంట ఉన్నారు. దేవుడు ఈ రాష్ట్ర ప్రజల హృదయాల నిండా నాపట్ల ఆదరాభిమానాలను నింపారు’ అని జగన్ ఒకింత ఉద్వేగంగా వ్యాఖ్యానించారు. వాస్తవానికి తాను రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదనీ, తన తండ్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనను రాజకీయాల్లోకి తీసుకువచ్చారని, ఆయన చెబితేనే పార్లమెంటుకు పోటీ చేశానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 

తాను కడప పార్లమెంటుకు పోటీ చేసినా ఇతర జిల్లాల్లో కూడా కాంగ్రెస్ కోసం ప్రచారం చేసిన విషయం గుర్తుచేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ రాజకీయ వైఖరిపై మాట్లాడుతూ.. ‘రాష్ర్టంలో మేం ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్‌తో పోరాడుతున్నాం...ఇక ఢిల్లీ రాజకీయాలంటారా? అక్కడ ఎప్పుడూ బంతులాట జరుగుతూ ఉంటుంది. కానీ మా వరకూ నేను చాలా స్పష్టంగా ఉన్నాను. దేవుడు దయతలచి, రాష్ట్ర ప్రజలు కరుణించి ఎక్కువ లోక్‌సభ స్థానాల్లో కనుక మా పార్టీని గెలిపిస్తే కేంద్రంలో వ్యవసాయ మంత్రిత్వ శాఖను కావాలని కోరతాం...ఇంకా ఎక్కువ సీట్లు వస్తే రైల్వే శాఖ కావాలని కోరతాం...మా పార్టీకి రాష్ట్రం, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. అయినా 2014లో జరగబోయే పరిణామాల గురించి ఇప్పుడు మాట్లాడ్డం తొందరపాటే అవుతుంది’ అని అన్నారు. జాతీయ స్థాయిలో బీజేపీతో తాము కలవబోమనీ, ఆ పార్టీతో తమకు సిద్ధాంతపరమైన అభిప్రాయ భేదాలున్నాయని జగన్ మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 

మెరుగైన పత్రిక కాబట్టే సాక్షిలో పెట్టుబడులు..

సీబీఐ గానీ, తమను విమర్శించే వారు గానీ సాక్షిలో పెట్టుబడులను ఎలా తప్పుపడతారని జగన్ ప్రశ్నించారు. ప్రారంభించిన అనతికాలంలోనే సాక్షి దేశంలో ఎనిమిదో స్థానంలో నిలబడిందనీ, 14.5 లక్షల సర్క్యులేషన్ కలిగి ఉందనీ తెలిపారు. సాక్షికి 1.46 కోట్ల మంది పాఠకులు ఉన్నారని చెప్పారు. ‘ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మేరియో గార్షియాతో డిజైన్ చేయించిన సాక్షి.. ఏ రకంగా చూసినా ఈనాడు పత్రిక కన్నా మెరుగైన నాణ్యత గల పత్రిక. అందుకే పెట్టుబడులు వచ్చాయి. రూ.1,800 కోట్ల భారీ నష్టాలతో ఉన్న ఈనాడులోకి రూ.2,600 కోట్ల పెట్టుబడులు వస్తే తప్పు కానిది సాక్షిలోకి పెట్టుబడులు వస్తే తప్పవుతుందా..?’ అని అన్నారు. ‘రూ.1,800 కోట్ల నష్టాల్లో ఉన్న ఈనాడు విలువ ఆ రోజుకు రూ.6,800 కోట్లు. కానీ సాక్షి విలువ అందులో సగం మాత్రమే..’ అని చెప్పారు.
Share this article :

0 comments: