నరసాపురం.. ప్రభం‘జనం’ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నరసాపురం.. ప్రభం‘జనం’

నరసాపురం.. ప్రభం‘జనం’

Written By ysrcongress on Thursday, April 5, 2012 | 4/05/2012

= విజయవంతమైన బహిరంగ సభ
= వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరిస్తూ.. చిన్నారులను ముద్దాడుతూ.. సాగిన మూడోరోజు జగన్ రోడ్‌షో
= తమ గ్రామాలకు రావాలంటూ పంతం పట్టిన అభిమాన జనం

వరద గోదారిలా పోటెత్తిన జనం..జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్వేగ భరిత ప్రసంగం...ఉప్పొంగిన ప్రజాభిమానం.. కార్యకర్తలు,నేతల్లో వెల్లివిరిసిన ఉత్సాహం.. నరసాపురం పట్టణంలో బుధవారం సాయంత్రం జరిగిన బ్రహ్మాండమైన బహిరంగసభ రూపంలో ఆవిష్కృతమైన అపూర్వ ఘట్టం ఇది. రాష్ట్రంలో ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే ప్రభంజనం అని ఈ బహిరంగసభ సుస్పష్టం చేసింది. 
నాయకుడనేవాడు బుర్రచెప్పినట్టు కాకుండా, గుండెచెప్పినట్టు నడుచుకోవాలని, ఆ సిద్ధాంతానికి కట్టుబడే తాను ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకొనేందుకు కాంగ్రె స్ పార్టీని వీడి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించానని వివరిస్తూ, సాగిన జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగానికి స్పందనగా కరతాళధ్వనులు, ‘జగన్ నాయకత్వం వర్ధిల్లాలి’ అనే నినాదాలు మిన్నంటాయి. రైతుల కోసం పదవిని తృణప్రాయంగా వదలుకున్న ముదునూరి ప్రసాదరాజును అఖండ మెజార్టీతో గెలిపించాలని జననేత చేసిన అభ్యర్థనకు ‘‘జగన్ జిందాబాద్’’ అంటూ జనం సానుకూలంగా స్పందించారు. అంతకు ముందు ఆయన సాగించిన రోడ్‌షోకు లభించిన అపూర్వ స్పందన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.

నరసాపురం/మొగల్తూరు, న్యూస్‌లైన్ : చిన్నారులను ముద్దాడుతూ.. వృద్ధులకు ఆత్మీయ స్పర్శను అందిస్తూ.. పేదల కష్టాలను కళ్లారా చూస్తూ.. మహిళల సమస్యలను ఓపిగ్గా వింటూ.. వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరిస్తూ.. అంబేద్కర్ ప్రతిమలకు నివాళులర్పిస్తూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడోరోజు బుధవారం పర్యటన ముందుకు సాగింది. మూడోరోజు రోడ్‌షోకు అనూహ్య స్పందన లభించడంతో పాటు జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన ముగింపు సందర్భంగా నరసాపురం స్టీమర్‌రోడ్డులో నిర్వహించిన బహిరంగ సభ విజయవంతం కావడంతో ఆ పార్టీశ్రేణుల్లోను, ప్రజల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. 

ముత్యాలపల్లిలో కొపనాతి పల్లయ్య నివాసం నుంచి బుధవారం జగన్‌మోహన్‌రెడ్డి రోడ్‌షోను ప్రారంభించారు. తొలుత వారతిప్ప గ్రామంలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అక్కడ పెద్ద ఎత్తున మహిళలు చంటిబిడ్డలను చంకన తీసుకొచ్చి జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులు కోరారు. చిన్నారులను ఎత్తుకుని ముద్దాడిన ఆయన అందరిలోనూ కలుపుగోలుగా ముందుకు సాగారు. అనంతరం ముత్యాలపల్లి మీదుగా కొత్తోట చింతరేవు వంతెన వద్దకు చేరుకున్న ఆయనకు మహిళలు హారతులతో స్వాగతం పలికారు. తమ గ్రామానికి తాగునీరు అందడంలేదని ఆయన వద్ద వాపోయారు. దీనిపై ఆయన స్పందిస్తూ తాగునీరు రాకపోవడానికి గల కారణాలను వారిని అడిగి తెలుసుకున్నారు. అదే గ్రామానికి చెందిన దేవరపు రాంబాబు, మల్లేశ్వరిల 4 నెలల పాపకు తన తల్లి విజయమ్మ పేరును నామకరణం చేశారు. అదే గ్రామంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్థానిక టీడీపీ నాయకుడు పడవల గంగరాజు నివాసంలో కొద్దిసేపు ఆగి తేనీరు స్వీకరించారు. ఈ సందర్భంగా గంగరాజు తన అనుచరులు సుమారు 300 మందితో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు. కాళీపట్నం తూర్పు గ్రామానికి చెందిన మద్దా ఆశీర్వాదం, ప్రసన్న కుమారిల కుమారుడు విజయకుమార్‌కు అన్నప్రాశన చేయించారు. గ్రామంలోని అంబేద్కర్, వంగవీటి మోహనరంగ విగ్రహాలకు పూలమాలలు వేశారు. కాళీపట్నం పడమర పంచాయతీలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ఏర్పాటు చేసిన సభలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారు. కొమానపల్లి జోసఫ్‌రాజుకు చెందిన హెర్మోన్ లివింగ్ వాటర్ మినిస్ట్రీస్ కార్యాలయంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఈ సందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి కొద్దిసేపు మాట్లాడారు. 

పాతపాడు ప్రజల పంతం..
నరసాపురం సభకు ఆలస్యమవుతున్నందున నియోజకవర్గ నాయకులు కాళీపట్నంతో జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనను నిలిపివేసినట్లు ప్రకటించారు. ఈ సమాచారం తెలుసుకున్న సమీపంలోని పాతపాడు వాసులతో కలిసి కొప్పాడ గన్నయ్య, రామాని మహేష్, కనుమూరి ఆంజనేయరాజు తదితరులు పెద్ద సంఖ్యలో కొమానపల్లి జోసఫ్‌రాజు కార్యాలయానికి చేరుకున్నారు. తమ గ్రామానికి రాకుంటే కార్లకు అడ్డంగా పడుకుంటామని అభిమానంతో జగన్‌మోహన్‌రెడ్డిపై ఒత్తిడి చేశారు. వారి ఆదరాభిమానాలు కాదనలేక ఇబ్బంది అయినప్పటికీ పాతపాడు గ్రామంలో కూడా జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించారు. అప్పటికి సమయం లేకపోవడంతో మరికొన్ని గ్రామాలు పర్యటన రద్దు చేయాల్సి వచ్చింది. 

సభ సక్సెస్..
రోడ్‌షో ద్వారా జనం వద్దకే వెళ్లి వారిని ఆత్మీయతానురాగంతో కట్టిపడేసిన జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్న నరసాపురం బహిరంగ సభ విజయవంతం కావడంతో పార్టీశ్రేణుల్లోను, ప్రజల్లోను కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తూ కదిలి వచ్చిన పార్టీశ్రేణులు, ప్రజలతో నరసాపురం వీధులు ఉక్కిరిబిక్కిరయ్యాయి. డప్పుల మోత, బాణసంచా కాల్పులతో విజయోత్సవాన్ని తలపిస్తూ జిల్లా నలుమూలల నుంచి ముఖ్య నాయకులు తమ శ్రేణులతో స్వచ్ఛందంగా తరలివచ్చారు. 

తాడేపల్లిగూడెం ఇన్‌చార్జిగా తోట గోపి
తాడేపల్లిగూడెం ఏఎంసీ మాజీ చైర్మన్ తోట గోపి వందలాది వాహనాలతో తన అనుయాయులతో తరలి వచ్చి ముత్యాలపల్లిలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు తాడేపల్లిగూడెం మునిసిపల్ మాజీ వైస్‌చైర్మన్లు బొడ్డు సాయిబాబా, యెగ్గిన నాగబాబు తదితరులు పెద్ద సంఖ్యలో ప్రజారాజ్యం, కాంగ్రెస్ పార్టీల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. భీమవరం పట్టణానికి చెందిన యార్లగడ్డ రాము (చేపల రాము)ను వేగేశ్న కనకరాజు సూరి, గాదిరాజు నాగరాజుల ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర్పించారు. 

రెడ్డి అండ్ రెడ్డి కార్ల షోరూమ్ అధినేత, పారిశ్రామికవేత్త గొలుగూరి శ్రీరామరెడ్డిని పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు ఆధ్వర్యంలో బహిరంగ సభలో జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర్పించారు. కృష్ణా జిల్లాకు చెందిన పార్టీ నాయకుడు చెంచు రామారావు, భీమవరానికి చెందిన కట్రెడ్డి కరుణాకర్‌లు జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా, నరసాపురం నియోజకవర్గానికి చెందిన టీడీపీ, కాంగ్రెస్‌పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తాజా మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

ఎమ్మెల్సీ శేషుబాబు ఇంటికి వెళ్లిన జగన్
నరసాపురంలో మూడురోజుల పర్యటన పూర్తిచేసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం రాత్రి పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పాలకొల్లు మండలం పూలపల్లి వద్ద ఎమ్మెల్సీ మేకా శేషుబాబు నివాసానికి వెళ్లిన జగన్‌మోహన్‌రెడ్డి అక్కడ కొద్దిసేపు గడిపారు. అక్కడ నుంచి పార్టీ నాయకుడు ముచ్చర్ల శ్రీరామ్ నిర్మించిన అతిథి గృహానికి వెళ్లి పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. ఫ్ల్లెక్సీని ఆవిష్కరించారు. అనంతరం పోడూరు మండలం జిన్నూరు, వేడంగి, కవిటం సెంటర్లలో పార్టీ పతాకాలను జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద సంఖ్యలో ఆయనకు స్వాగతం పలికారు. ఆచంట మండలం ఆచంట వేమవరంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి అక్కడ జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఆచంట సెంటర్‌లో జరిగిన సభలో ప్రసంగించిన జగన్‌మోహన్‌రెడ్డి ములపర్రు, సిద్ధాంతం మీదుగా తూర్పుగోదావరి జిల్లాకు వెళ్లారు.
Share this article :

0 comments: