వైఎస్సార్ సీపీ... ‘పశ్చిమ’లో ప్రబల శక్తి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ సీపీ... ‘పశ్చిమ’లో ప్రబల శక్తి

వైఎస్సార్ సీపీ... ‘పశ్చిమ’లో ప్రబల శక్తి

Written By ysrcongress on Wednesday, April 4, 2012 | 4/04/2012

 రాజకీయ చైతన్యానికి మారుపేరైన పశ్చిమగోదావరి జిల్లాలో గత వారం రోజులుగా జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పవనాలు బలంగా వీస్తున్న ప్రస్తుత తరుణంలో పశ్చిమగోదావరిలో ఆ పార్టీ రోజురోజుకు ప్రబల శక్తిగా రూపాంతరం చెందుతోంది. ఈ క్రమంలోనే టీడీపీ, కాంగ్రెస్‌లలో ఉండి జిల్లా రాజకీయాలను శాసించిన ఉద్ధండులైన నాయకులు, తమ అనుచరగణంతో సహా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. జిల్లాలో ఉప ఎన్నికల పోరుకు సమరశంఖం పూరించేందుకు వచ్చిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో వీరు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరి ఇటు తమ అనుయూయుల్లోను, పార్టీ శ్రేణుల్లోను నూతనోత్తేజాన్ని నింపారు. వీరి ఆగమనంతో ఆయా నియోజకవర్గాలతో పాటు జిల్లా రాజకీయ ముఖచిత్రం కూడా పెనుమార్పును సంతరించుకుంటోంది. 

ఓటమి ఎరుగని ధీరుడిగా పేరొందిన చేగొండి వెంకట హరరామజోగయ్య సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. అదే పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే అల్లు వెంకట సత్యనారాయణ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన చిరంజీవికి స్వయానా బావమరిది కావడంతో పాటు ఆ నియోజకవర్గంలో అన్ని వర్గాల్లో ఆయనకు మంచి పట్టుండడం విశేషం. గోపాలపురం నియోజకవర్గానికి చెందిన పీసీసీ కార్యదర్శి ఇళ్ల భాస్కరరావు వైఎస్సార్ సీపీలో చేరారు. ఇప్పటికే గుంటూరులోను, మొగల్తూరులోను రెండు పర్యాయాలు జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన భాస్కరరావు ఈ నెల 13న పోలవరం పర్యటన విజయవంతం చేసేలా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ప్రకటించారు. 

మంత్రి ఇలాకాలో..
జిల్లాలో ఓదార్పు యూత్ర నిర్వహించినప్పుడు జగన్‌మోహన్ రెడ్డి వెంట నడిచిన మంత్రి పితాని సత్యనారాయణ మారిన పరిస్థితులను అవకాశంగా తీసుకుని రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డిలకు జైకొట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో పితాని వ్యవహార శైలితో నియోజకవర్గమైన ఆచంటలో వ్యతిరేకత పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయనకు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కూనపరెడ్డి వీరరాఘవేంద్రరావు (చినబాబు) మంగళవారం జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథ రాజు చొరవతో జిల్లాకు చెందిన పార్టీ నేతల ప్రోద్బలంతో చినబాబు వైఎస్సార్ కాంగ్రెస్‌లోచేరడం ఆచంట నియోజకవర్గంలో పార్టీకి అదనపు బలం వచ్చినట్లయింది. 

జీవీఆర్ రాకతో భీమవరంలో పట్టు
మూడు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ పార్టీలో కీలకపాత్ర పోషించిన భీమవరం మునిసిపల్ మాజీ చైర్మన్ గ్రంధి వెంకటేశ్వరరావు (జీవీఆర్) మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరా రు. ఇప్పటికే ఆ నియోజకవర్గంలో పార్టీ జిల్లా కన్వీనర్ కొయ్యే మోషేన్‌రాజు, వేగిరాజు రామకృష్ణంరాజు, మేడిది జాన్సన్ వంటి ఉద్దండులైన నేతలు పార్టీని పటిష్టంగా నడిపిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తండ్రి గ్రంధి వెంకటేశ్వర రావు వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి రావడంతో ఆ నియోజకవర్గంలో పార్టీ మరింత పట్టు సాధించినట్లయ్యింది. గత ఎన్నికల్లో కాంగ్రె స్ టిక్కెట్ ఇవ్వకపోవడంతో గ్రంధి శ్రీనివాస్ ప్రజారాజ్యం పార్టీలో చేరారు. నమ్ముకున్న వారిని నట్టేట వదిలేస్తూ చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో గ్రంధి శ్రీనివాస్ ఏ పార్టీ వైపు వెళ్లకుండా తటస్థంగా ఉండిపోయారు. ఈ నేపథ్యంలో ఆయనకు రాజకీయ దిక్సూచిగా ఉండే ఆయన తండ్రి గ్రంధి వెంకటేశ్వరరావు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరడంతో శ్రీనివాస్ అనుయూయులు కూడా ఆ పార్టీ వెంట సాగే అవకాశం ఉంది.

వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నరసాపురం ఎన్నికల పర్యటన సందర్భంగా అనేక నియోజకవర్గాలు, గ్రామాల్లో కీలక పాత్ర పోషిస్తున్న మాజీ ప్రజాప్రతినిధులు, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు, నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరుతున్నారు. తొలిరోజున మొదలైన వలసల ప్రవాహం రెండో రోజున ఉధృతమైంది. పేరుపాలెం నార్త్‌లోని అందే భుజంగరావు నివాసంలో ప్రజారాజ్యం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఓసూ రి విజ్జిబాబు, యడ్లపల్లి సూర్యనారాయణ, కొండా సూర్యనారాయణ, ఇంజేటి సుబ్బారావు, ఇంజేటి శ్రీరాములు 200 మందితో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. మొగల్తూరులో పెదపల్లవపాలెం గ్రామానికి చెందిన చిప్పల తాతారావు, మోకా నాగశంకరం తదితరులు 200 మందితో చేరారు. బుధవారం నరసాపురంలో జరిగే సభలో తాడేపల్లిగూడెం ఏఎంసీ మాజీ చైర్మన్ తోట గోపి తదితరులు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరనున్నారు. 

ఉండిలో దండిగా బలం
మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడిగా సొంత నియోజకవర్గాన్ని పటిష్టం చేసుకునేందుకు దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే తనతో పాటు బలమైన నాయకులను వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి తీసుకురావడంలో పట్టు సాధించారు. ఒకనాడు జిల్లా రాజకీయాలను శాసించిన మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావుకు ప్రధాన అనుచరునిగా తెలుగుదేశం పార్టీలో కొనసాగి అటు తర్వాత కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీల్లో అభ్యర్థుల విజయం కోసం విశేషంగా కృషి చేసిన ఉండి మండలం యండగండి కో-ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు, డీసీసీబీ డెరైక్టర్ పీవీఎల్ నరసింహరాజు మంగళవారం వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు పీవీ నరసింహరాజుకు పీవీఎల్ నరసింహరాజు సోదరుడు వరుస కావడం గమనార్హం. 

పారిశ్రామికవేత్తగా నియోజకవర్గంలో మంచి పట్టున్న నరసింహరాజు మాజీ ఎంపీపీ గడి జయలక్ష్మి, మంతెన భారతి, కరిమెరక శివనాగేశ్వరరావు తదితర 200 మంది అనుచరులతో జగన్‌మోహన్ రెడ్డిని కలిశారు. ఆయన వెంట వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు పాతపాటి సర్రాజు, వేగేశ్న కనకరాజుసూరి, ఏడిద వెంకటేశ్వరరావు, గుంటి ప్రభు, కోడె యుగంధర్‌తరలివచ్చారు.
Share this article :

0 comments: