ఎమ్మార్ కేసులో అసలు దోషి చంద్రబాబే! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎమ్మార్ కేసులో అసలు దోషి చంద్రబాబే!

ఎమ్మార్ కేసులో అసలు దోషి చంద్రబాబే!

Written By ysrcongress on Thursday, April 5, 2012 | 4/05/2012

ముందు ఆయన్ను ప్రాసిక్యూట్ చేయాలి
ఎమ్మార్ కేసుపై కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి డిమాండ్
చంద్రబాబే కారుచౌకగా ఎమ్మార్‌కు భూములు కట్టబెట్టారు
చేసిందంతా బాబు.. విచారణ వైఎస్‌పైనా?
కాంగ్రెస్ సర్కారే వైఎస్‌ను దోషిగా నిలబెట్టే యత్నాలు బాధాకరం
అధికారులు, మంత్రుల ప్రతిపాదనల మేరకే వైఎస్ నిర్ణయాలు తీసుకున్నారు కదా...
అలాంటప్పుడు క్విడ్ ప్రో కో ప్రసక్తి ఎందుకు వస్తుంది?
కాంగ్రెస్‌లోని వైఎస్ అభిమానుల్ని లక్ష్యంగా చేసుకొని కుట్రలు
జగన్‌ను దోషిగా చూపేందుకు వైఎస్‌పై నిందలు తగదు 
ముందుగా ఆయన్ను ప్రాసిక్యూట్ చేయాలి 
కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి డిమాండ్ 


హైదరాబాద్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో జరిగిన భూ కేటాయింపుల్లో అసలు దోషి అయిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడిని వదిలిపెట్టి.. కాంగ్రెస్ ప్రభుత్వం దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డిని దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు చేయడం పట్ల ఆ పార్టీ సీనియర్ నేత టి.జీవన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మార్ కేసులో అసలు దోషి చంద్రబాబేనని, ముందుగా ఆయన్ను ప్రాసిక్యూట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మార్‌కు ఎకరాకు రూ.29 లక్షల చొప్పున కారుచౌకగా 530 ఎకరాల భూమిని కేటాయించింది బాబు కాదా? అని ప్రశ్నించారు. 

బుధవారమిక్కడ సీఎల్పీ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబును వదిలి వైఎస్సార్‌ను దోషిగా నిలబె ట్టే ప్రయత్నాలు కాంగ్రెస్ ప్రభుత్వమే చేయడం బాధ కలిగిస్తోంది. రాష్ట్రంలో వైఎస్ చేసిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను రాహుల్ గాంధీ ఎంతగానో మెచ్చుకొని.. యూపీ ఎన్నికల్లో వాటిని ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే యూపీని ఏపీ మాదిరిగా మారుస్తామని ప్రకటించారు’ అని గుర్తుచేశారు. రాహుల్ మెచ్చుకున్న వైఎస్ నిర్ణయాలు, కార్యక్రమాలను రాష్ట్ర నేతలు తప్పుగా చూడటం ఆశ్చర్యకరమన్నారు. 

తెర వెనుక లబ్ధి చంద్రబాబుకే..
‘పారిశ్రామికాభివృద్ధి కోసం చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న విధానాల ప్రకారమే రాజశేఖరరెడ్డి ప్రోత్సాహకాలు కల్పించారు. సిమెంటు, ఫార్మాసూటికల్స్ వంటి సంస్థలకు రాయితీలు ఇచ్చారు తప్ప నిబంధనలకు భిన్నంగా ఏమైనా నిర్ణయాలు చేశారా?’ అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. రోశయ్య కమిటీ అన్నిటినీ అధ్యయనం చేసి ఇచ్చిన సిఫార్సుల మేరకే.. వైఎస్ సర్కారు ఆయా విధానాలను కొనసాగించిందన్నారు. వైఎస్సార్‌కు రాజకీయ వారసులం తామేనని చెబుతూ.. అదే నేతను ఆశ్రీత పక్షపాతిగా చిత్రీకరించడం ఎంతవరకు సబబన్నారు.

‘అధికారులు, మంత్రులు చేసిన ప్రతిపాదనల ప్రకారమే వైఎస్ నడిచారు కదా? అలాంటప్పుడు క్విడ్ ప్రో కో అనే ప్రసక్తి ఎందుకు వస్తుంది?’ అని సూటిగా ప్రశ్నించారు. తెరవెనుక లబ్ధి అనేది చంద్రబాబుకే వర్తిస్తుందని చెప్పారు. ‘బాబు సీఎంగా ఉన్న సమయంలోనే ఎమ్మార్‌కు 530 ఎకరాలు చౌకగా అప్పగించారు. అంతకు మూడేళ్ల ముందు ఆయన అక్కడే ఉన్న తన భూమిని ఎకరా రూ.3 కోట్లకు అమ్ముకున్నారు. 

అదే ప్రాంతంలో ఎమ్మార్‌కు ఎకరా రూ.29 లక్షల చొప్పున కట్టబెట్టారు. తద్వారా ఆ సంస్థకు రూ.370 కోట్ల లబ్ధి చేకూర్చారు. అందుకు ప్రతిగా చంద్రబాబు మేనకోడలు బ్రాహ్మణికి ఎమ్మార్ ప్రాపర్టీస్‌లో 5 వేల గజాల విల్లా స్థలం గజం రూ.5 వేలకే దక్కింది. ఇది తెరవెనుక లావాదేవీ కాదా? క్విడ్ ప్రో కో కాదా’ అని నిలదీశారు. ఎమ్మార్ ప్రాపర్టీస్‌లో గజం ధర రూ.25 వేలకు పైగా ఉండగా.. రూ.5 వేలకే చంద్రబాబు మేనకోడలు బ్రాహ్మణికి ఇచ్చారంటే దానర్థం క్విడ్ ప్రో కో కాదా అని ప్రశ్నించారు.

అంతా బాబు చేస్తే.. వైఎస్ నిర్ణయాలపై విచారణా?
ఎమ్మార్ కేసు విచారణ కోర్టు ఆదేశాలతో జరుగుతున్నా.. కేసు వేసిన శంకర్రావు కాంగ్రెస్ వ్యక్తేనని జీవన్‌రెడ్డి చెప్పారు. వైఎస్సార్‌ను అప్రతిష్టపాల్జేస్తే అది కాంగ్రెస్‌కే అంటుతుందన్నారు. ‘గతంలో ఇండియా సిమెంటుకు డిఫర్‌మెంటు కింద రూ.260 కోట్లకు మినహాయింపులు ఇవ్వడంతోపాటు ఇతర రాయితీలూ చంద్ర బాబు ఇచ్చారు.

వాటిని వదిలేసి వైఎస్ నిర్ణయాలపైనే విచారణలు సాగుతున్న వైనం దురదృష్టకరం. కాంగ్రెస్‌లోని వైఎస్ అభిమానులను పార్టీకి దూరం చేసేలా కుట్రపూరిత వ్యవహారాలూ నడుస్తున్నాయి’ అని చెప్పారు. వై.ఎస్.జగన్‌ను దోషిగా చూపించేందుకు దివంగత మహానేత రాజశేఖరరెడ్డి ప్రభుత్వ నిర్ణయాలను ఎలా తప్పుబడతారన్నారు. జగన్ తప్పుచేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని, వైఎస్‌పై నిందలు వేయడమే బాధాకరమని వ్యాఖ్యానించారు. ఆ నిర ్ణయాలు తప్పనో, తెరవెనుక లావాదేవీలనో వ్యాఖ్యానిస్తున్న మంత్రులు.. ఆరోజుల్లో ఫైళ్లు తమ దగ్గరకు వచ్చినప్పుడు వాటిపై ఎందుకు వ్యతిరేకంగా రాయలేదని ప్రశ్నించారు.
Share this article :

0 comments: