రాష్ట్రంలో కనీవినీ ఎరగని కరెంట్ సంక్షోభం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్రంలో కనీవినీ ఎరగని కరెంట్ సంక్షోభం

రాష్ట్రంలో కనీవినీ ఎరగని కరెంట్ సంక్షోభం

Written By news on Thursday, August 23, 2012 | 8/23/2012

రాష్ట్రంలో కనీవినీ ఎరగని కరెంట్ సంక్షోభం

సాగుకు 2-3 గంటలే..
992 గ్రామాలలో 'న్యూస్ లైన్'సర్వే
అదికూడా విడతలవారీ సరఫరానే
దాంతో నిలువునా కాలిపోతున్న మోటార్లు
పలుచోట్ల ఒక్క గంట కరెంటుతోనే సరి
పూర్తిగా ఆశలు వదిలేసుకుంటున్న రైతన్న
బిందెలతో నీరు చల్లుకుంటున్న కొందరు
పశువుల మేతగా మారుతున్న వరి

జీవనాధారమైన సాగు సాగడం లేదు. ప్రగతికి ప్రాణాధారమైన పారిశ్రామిక రంగమూ పడకేసింది. వెరసి రాష్ట్రం పూర్తిగా కుదేలవుతోంది. సర్కారీ అలసత్వం పుణ్యమాని మున్నెన్నడూ కనీవినీ ఎరగని సంక్షోభంలో కూరుకుపోతోంది. వ్యవసాయానికి 7 గంటలూ టంచనుగా ఉచిత కరెంటు ఇచ్చేందుకంటూ పరిశ్రమలపై సీఎం కిరణ్ విధించిన భారీ కోతలు పూర్తిగా వాటి వెన్ను విరిచాయి. ఒకటి తర్వాత ఒకటిగా రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల పుట్టి మునుగుతోంది. చేతిలో ఉన్న ఆర్డర్లను పూర్తి చేయకుండా మధ్యలోనే ఆపలేని అనివార్యత ఒకవైపు. అలాగని డీజిల్‌పై ఆధారపడి, ఆ భారాన్ని భరించలేక నిండా మునగలేని నిస్సహాయత మరోవైపు. ఫలితంగా చిన్న పరిశ్రమలన్నీ ‘టు-లెట్’ బోర్డులు తగిలించుకున్నాయి! అద్దెకు తీసుకునే వారికోసం నిస్సహాయంగా ఎదురు చూస్తున్నాయి. దాంతో వేలాది మంది కార్మికులు ఉన్నపళాన వీధిన పడుతున్నారు. జీవనోపాధి కోల్పోయి అల్లాడుతున్నారు. కనీసం తమ ఆకలిని కూడా తీర్చలేని సర్కారు డౌన్ డౌన్ అంటూ నిరసిస్తున్నారు. మరోవైపు సాగు సాకుతో కార్మికుల పొట్ట కొడుతూ, పరిశ్రమల ఊపిరి తీస్తున్న కిరణ్ సర్కారు.. కనీసం వ్యవసాయానికైనా సజావుగా కరెంటిస్తోందా అంటే అదీ లేదు! 

వ్యవసాయానికి రాష్ట్రంలో ఎక్కడా 3 గంటలకు మించి ఉచిత కరెంటు అందడమే లేదు! అది కూడా విడతలవారీగా వస్తూ, పోతూ అన్నదాతలతో చెలగాటమాడుతోంది. ‘సాగుకు 7 గంటల కరెంటిస్తా’మన్న కిరణ్ ప్రకటన నేపథ్యంలో మండలానికి ఒక గ్రామం చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 992 గ్రామాల్లో బుధవారం ‘న్యూస్‌లైన్’ చేసిన సర్వేలో ఈ దారుణ వాస్తవాలు వెల్లడయ్యాయి. సర్కారీ కరెంటును నమ్ముకోలేక ఏకంగా సాగుకే తిలోదకాలు వదులుతున్న రైతులు కొందరైతే.. జనరేటర్లు, డీజిల్ ఇంజన్లతో పడరాని పాట్లు పడుతున్నవారు మరికొందరు! కరెంటు కొరతను అధిగమించేందుకు కనీసపాటి ప్రయత్నం కూడా చేయకుండా.. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల ఉసురు తీస్తున్న ప్రభుత్వం.. పరిస్థితి పూర్తిగా విషమిస్తున్న ఈ తరుణంలో కూడా తనదైన నీరో మార్కు నిరక్ష్యాన్నే ప్రదర్శిస్తోంది!

సాగు కుదేలు

న్యూస్‌లైన్ నెట్‌వర్క్: ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా వరి నాట్లు దాదాపుగా పూర్తయ్యే దశకు చేరాయి. పంటకు నీరు అధికంగా పెట్టాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో కూడా కరెంటు సరఫరాపై ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేస్తోంది. రాష్ట్రంలో ఎక్కడా సాగుకు రోజుకు మూడు గంటలు కూడా నిరంతరాయంగా కరెంటు ఇవ్వలేకపోతోంది. విడతలవారీగా ఇస్తూ పుట్టి ముంచుతోంది. రైతుల జీవితాలతో ప్రభుత్వం అక్షరాలా చెలగాటమాడుతోంది. పలుచోట్ల కేవలం అరగంట, ముప్పావు గంట కరెంటుతో సరిపెడుతోంది! ఇలా వస్తున్న కోతల కరెంటు కూడా పదేపదే ట్రిప్ అవుతుండటంతో వేలాదిగా మోటార్లు కాలిపోతున్నాయి. వాటిని బాగుచేయించుకోలేక రైతులు మరింతగా రుణాల ఊబిలో కూరుకుపోతున్నారు. పలుచోట్ల వారు జనరేటర్లను, ఆయిల్ ఇంజన్లను నమ్ముకుంటున్నారు. ఇంకొన్ని చోట్ల కూలీలను పెట్టి బిందెలతో నీళ్లు చల్లుకుంటూ పడరాని పాట్లు పడుతున్నారు. తద్వారా రైతులు బావుకుంటున్నదేమీ లేకపోగా, సాగు వ్యయం మాత్రం తడిసి మోపెడవుతోంది. 

ముఖ్యంగా బోర్ల కింద సాగు చేస్తున్న వారి పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఇన్ని పాట్లు పడలేక చాలాచోట్ల రైతులు సాగుపై పూర్తిగా ఆశలు వదిలేసుకుంటున్నారు. మరో దారి లేక తమ పొలాలను బీడుపెట్టుకుంటున్నారు. ఇప్పటికే పొట్ట దశకు చేరిన వరి పంటను పశువుల మేతకు వదిలేస్తున్నారు. ఇలా ప్రతి జిల్లాలోనూ కరెంటు కోతల దెబ్బకు వేలాది ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి. ఉచిత కరెంటు సరఫరా తీరుతెన్నులపై బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ‘న్యూస్‌లైన్’ జరిపిన పరిశీలనలో వెలుగులోకి వచ్చిన దారుణ వాస్తవాలివి! ఆ జిల్లా, ఈ జిల్లా అని తేడా లేకుండా రాష్ట్రమంతటా ఇదే దుస్థితి నెలకొంది. విచ్చలవిడి కోతలకు తాళలేక సాగు తమవల్ల కాదంటూ కొందరు నిస్సహాయంగా చేతులెత్తేస్తుంటే.. మరికొందరు కన్నెర్రజేస్తున్నారు. మంగళ, బుధవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల అన్నదాతలు రోడ్డెక్కి ఉద్యమించారు. సబ్‌స్టే షన్లను ముట్టడించారు. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి సబ్‌స్టేషన్‌లోఫర్నిచర్‌ను బయట పడేశారు. లింగంపేట మండలం పర్మళ్ల సబ్‌స్టేషన్‌లో ఫర్నిచర్‌కు నిప్పు పెట్టారు.

అనంతలో 1.35 లక్షల ఎకరాలు బీడు!

అనంతపురం జిల్లాలో కోతల దెబ్బకు ఇప్పటికే 75 వేల ఎకరాల్లో వేరుశనగ, వరి పంటలు ఎండిపోయాయి. మరో 40 వేల ఎకరాల్లో పండ్ల తోటలకూ అదే గతి పట్టింది! కోతలను నిరసిస్తూ డీ హీరేహాళ్ మండలం ఓబుళాపురం, గుమ్మఘట్ట, చిలమత్తూరు, కంబదూరు, కళ్యాణదుర్గం సబ్‌స్టేషన్లను బుధవారం రైతులు ముట్టడించారు. వరంగల్ జిల్లాలో పలు గ్రామాల్లో రోజుల తరబడి కరెంట్ సరఫరాయే ఉండటం లేదు! హసన్‌పర్తి మండలం మడిపల్లిలో మూడు రోజులుగా వ్యవసాయ మోటర్లకు సరఫరా పూర్తిగా ఆగిపోయింది. ప్రకాశం జిల్లా కురిచేడు మండలంలోనైతే బుధవారమంతా కలిపి సాగుకు కేవలం ఒక గంటే ఇచ్చారు. అది కూడా ఉదయం, సాయంత్రం రెండు విడతల్లో! దాంతో ఏ రైతూ మోటారును ఆన్ కూడా చేయలేదు! విజయనగరం జిల్లాలో సాగుకు సగటున కేవలం రెండు గంటలు మాత్రమే కరెంటు వస్తుండగా, ఏకంగా పదిసార్లు ట్రిప్ అవుతోంది. దాంతో రైతులు 24 గంటలూ తిండీతిప్పలు మానుకుని పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది.

సీఎం నియోజకవర్గంలోనూ..!

చిత్తూరు జిల్లాలో సీఎం కిరణ్ సొంత నియోజకవర్గం పీలేరులో కూడా ఉచిత కరెంటు 3 గంటలకు మించడం లేదు. దానికి కూడా వేళాపాళా ఉండటం లేదు. దాంతో ఆటోమేటిక్ స్టార్టర్లు ఏర్పాటు చేసుకున్నా ఫలితం లేకుండా పోతోంది. వరదయ్యుపాళెం వుండలం వూవిళ్లపాడులోనైతే 215 ఎకరాలను రైతులు బీడుగా వదిలేశారు. పొట్ట దశలో ఉన్న పైరును కూడా పశువుల మేతకు వదిలేస్తున్నారు. నల్లగొండ జిల్లాలో ఇప్పటికే చాలా మండలాల్లో బోరుబావుల కింద వరి ఎండిపోతోంది. దానికి తోడు రోజుకు కనీసం ఆరుసార్లయినా కరెంటు ట్రిప్ అవుతుండటంతో మోటార్లు కాలిపోతున్నాయి. కృష్ణా జిల్లాలోకెల్లా అత్యధికంగా వ్యవసాయ కరెంటు కనెక్షన్లున్న నూజివీడు నియోజకవర్గంలో రోజుకు కేవలం అరగంట మాత్రమే సరఫరా జరుగుతోంది. శ్రీకాకుళం జిల్లా సోంపేట, గార, ఇచ్ఛాపురం, నందిగాం, రణస్థలం, లావేరు మండలాల్లో నీరందక పంటలు ఎండిపోతున్నాయి. లోడ్ హెచ్చుతగ్గుల దెబ్బకు తరచూ మోటార్లు కాలిపోతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండలం హాజీపూర్‌లో మొత్తం 600 ఎకరాలకు గాను సగం భూములను బీడుగా వదిలేశారు! లక్సెట్టిపేట మండలం ఇటిక్యాలలో కేవలం 2 గంటలే కరెంటు ఇస్తుండగా, కనీసం రెండుసార్లు ట్రిప్ అవుతోంది. దాంతో నారుమళ్ల కోసం రైతులు రూ.600 ఖర్చుతో జనరేటర్లు అద్దెకు తెచ్చుకుంటున్నారు. ఖానాపూర్ మండలం బాదన్‌కుర్తిలో బుధవారం ఉదయమే ఏకంగా 12 సార్లు కరెంటు పోయింది! కర్నూలు జిల్లా ఆదోని మండలం హువ్వనూరులో 300 ఎకరాల్లో పత్తి, మిరప, ఉల్లి, వేరుశనగ సాగవుతున్నాయి. కానీ వారం రోజులుగా రెండు విడతలూ కలిపి కూడా కనాకష్టంగా కేవలం గంటా 45 నిమిషాలే కరెంటందుతోంది. దాంతో మొత్తం పంటలూ ఎండిపోయే పరిస్థితి నెలకొంది.

రోజంతా 45 నిమిషాలే: గుంటూరు జిల్లా నాదెండ్ల, చిలకలూరిపేట మండలాల్లో బోర్ల కింది పంటల్ని ఎలాగోలా దక్కించుకునేందుకు జనరేటర్లు, ఆయిల్ ఇంజన్లతో రైతులు పాట్లు పడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఎమర్జెన్సీ లోడ్ సాకుతో పలుచోట్ల కేవలం 2 గంటలే కరెంటిస్తున్నారు. కొన్ని గ్రామాలకు 5 గంటలు ఇస్తున్నా విడతలవారీగా సరఫరా చేస్తుండటంతో ప్రయోజనం లేకుండా పోతోంది. నెల్లూరు జిల్లాలో ఏకంగా సగం గ్రామాల్లో 2 గంటలు కూడా సరఫరా కావడం లేదు. వరికుంటపాడు మండలం కేంద్రంలో అయితే రోజంతా కలిపి కేవలం 45 నిమిషాలతో సరిపెట్టారు. ఖమ్మం జిల్లాలో పలుచోట్ల వరి, పత్తి రైతులు కూలీలను పెట్టి పొలాలకు బిందెలతో నీళ్లు చల్లిస్తున్నారు! ఇందుకు రోజుకు కనీసం రూ.600 ఖర్చవుతోంది. విశాఖ జిల్లాలో 26 వేల వ్యవసాయ బోర్లపై ఆధారపడి వివిధ పంటలు సాగు చేసిన 17,790 హెక్టార్ల పరిస్థితి దైవాధీనంగా మారింది. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి మండలం మాచాపూర్‌లోనైతే సాగుకు కేవలం 45 నిమిషాల కరెంటుతో సరిపెట్టారు! అప్రకటిత కోతలు తప్పడం లేదని ఏపీఎన్‌పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్‌ఈ ఎ.నగేశ్ అంగీకరించారు. ఏకంగా 1.9 లక్షల మంది రైతులు బోర్లనే నమ్ముకునే మహబూబ్‌నగర్ జిల్లాలో పరిస్థితి మరింత దుర్భరంగా ఉంది! ఎటు చూసినా ఎండిపోతున్న పంటలే దర్శనమిస్తున్నాయి. దాంతో జిల్లా అంతటా కరువు ఛాయలు అలముకుంటున్నాయి. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండలం లాల్‌గాడి మలక్‌పేటలో వరి పూర్తిగా ఎండిపోయింది. తాండూరు, పరిగి, వికారాబాద్ డివిజన్లలో లో ఓల్టేజీ సమస్యతో మోటార్లే గాక కొన్నిచోట్ల ఏకంగా ట్రాన్స్‌ఫార్మర్లే కాలిపోయి మూలన పడుతున్నాయి!
Share this article :

0 comments: