కిందటేడాది రైతుల మరణాలు 1,260 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కిందటేడాది రైతుల మరణాలు 1,260

కిందటేడాది రైతుల మరణాలు 1,260

Written By ysrcongress on Thursday, January 12, 2012 | 1/12/2012


106 ఆత్మహత్యలే అంటున్న సర్కారు
ఆత్మహత్యలు చేసుకున్నవారు 937
గుండె పగిలి మరణించినవారు 155
రాత్రి కరెంటుకు బలైనవారు 168
ఆత్మహత్యలు చేసుకుంది 106 మందే అంటున్న సర్కారు
రోడ్డునపడ్డ రైతు కుటుంబాలకు సాయం మృగ్యం
కాళ్లరిగేలా తిరిగినా అందని సాయం

సర్కారు అర్ధరాత్రి ఇస్తున్న కరెంటుతో పంటను బతికించుకుందామని పొలానికి పోయిన ఓ అన్నదాతను ఆ కరెంటే మింగేసింది..

చేతికొచ్చిన ఆరుగాలం కష్టాన్ని అమ్ముకున్న మరో రైతన్నకు.. చేసిన బాకీలు తీరకపోగా అప్పులకుప్ప మరింత పెరిగిపోయింది..

రక్తాన్ని స్వేదంగా చిందించినా రుణం తీర్చలేనన్న నిరాశతో తన పశువుల కొట్టంలోనే దూలానికి వేలాడాడు!!

ఈసారైనా పెద్ద బిడ్డకు పెళ్లి చేద్దామనుకున్న ఇంకో కర్షకుడికి.. ఎప్పట్లాగే వ్యవసాయంలో నష్టాలొచ్చాయి.. గుండె ఆగిపోయింది!!!

...ఇలా కారణాలు ఏవైతేనేం? 
ఒక్కరు కాదు ఇద్దరు కాదు... కిందటేడాది రాష్ట్రంలో ఏకంగా 1,260 మంది రైతన్నలు తనువు చాలించారు. బతికున్నప్పుడు ఎలాగూ ఆదుకోలేని సర్కారు.. కనీసం వారు కన్నుమూశాక అయినా కనికరించడం లేదు. పెద్ద దిక్కును కోల్పోయిన వారి కుటుంబాలకు పరిహారం ఇచ్చి ఆదుకునేందుకు మనసు రావడం లేదు. అందుకే రైతన్న చావులపైనా తప్పుడు లెక్కలు చూపుతోంది.

హైదరాబాద్, న్యూస్‌లైన్: దుక్కి దున్ని.. విత్తు చల్లి.. పైరు పెంచి.. స్వేదం చిందించి న లుగురికి పట్టెడన్నం పెట్టే రైతన్న బతుకు చితికి ఛిద్రమైపోతోంది. నష్టాల సాగు చేయలేక, సర్కారు ఆదుకోక అన్నదాత చివరికి ‘చితి’కిపోతున్నాడు. 2011లో 937 మంది బలవన్మరణాలకు పాల్పడితే కేవలం 106 మందే చనిపోయారంటూ సర్కారు బుకాయిస్తోంది. ఇప్పుడే కాదు.. క్షేత్రస్థాయిలో జరిగిన రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వం ప్రకటించిన బలవన్మరణాలకు అసలు పొంతనే ఉండటం లేదు. పెట్టిన పంటలు కోల్పోయి, ఆర్థికంగా చితికి ఆత్మహత్య చేసుకున్న, గుండెపోటుతో మరణించిన, విద్యుదాఘాతాల వల్ల చనిపోయిన రైతు కుటుంబాలు ఏటా వేల సంఖ్యలో ఉంటున్నాయి. విద్యుత్తు కోతల నేపథ్యంలో రాత్రి సమయంలో పంటలకు నీళ్లు పెట్టేందుకు వెళ్లి కరెంటు షాక్‌కు గురై మరణించివారే కిందటేడాది 168 మంది ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకున్నవారు 937 మంది, గుండె పోటుతో కన్నుమూసినవారు 155 మంది ఉన్నారు.

క్షేత్రస్థాయిలో ‘న్యూస్‌లైన్’ సేకరించిన సమాచారం ప్రకారం ఈ లెక్కలు తేలాయి. వాస్తవంగా ఇలాంటి మరణాల్లో చాలా వరకూ ప్రభుత్వ దృష్టికి, మీడియా దృష్టికి కూడా రావడం లేదు. తమది రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర సర్కారు... అన్నదాతల కుటుంబాలను ఆదుకునే విషయంలో ఏమాత్రం ఉదారంగా వ్యవహరించడం లేదు. గుండెపోటు, విద్యుదాఘాతాలు లాంటి కారణాలవల్ల చనిపోయిన కుటుంబాలకు ఆత్మహత్యల ప్యాకే జీని వర్తింపజేయడం లేదు. కనీసం ఈ డిమాండు సహేతుకమైనదా కాదా అన్న విషయాన్నీ పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఆత్మహత్యలను కూడా నానా సాకులతో తగ్గించి చూపుతోంది.

హవ్వ.. ఆత్మహత్యలు తగ్గాయట!

2010లో పలు జిల్లాల్లో సంభవించిన వరదలతో పంటలు ఊడ్చిపెట్టుకుపోయాయి. 2011 ఖరీఫ్ పంటలను కరవు మాడ్చేసింది. వరుసగా రెండేళ్లు పంటలు కోల్పోయి పెట్టుబడులను కూడా మట్టిపాలు చేసుకున్న అన్నదాతలు పెద్ద సంఖ్యలో ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో 2009, 2010 సంవత్సరాలకంటే 2011లో రైతుల ఆత్మహత్యలు, అసహజ మరణాలు పెరిగాయి. ప్రతిరోజూ ఏదో ఒకచోట రైతులు, కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. పెరిగిన ఎరువులు, విత్తనాల ధరలు, సాగు ఖర్చుల నేపథ్యంలో వ్యవసాయం గిట్టుబాటు కావడంలేదంటూ కోస్తాలోని తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 2011లో రైతులు సాగు సమ్మె ప్రకటించారు. 

సాగు ఖర్చులు పెరగడం, కరువు, దిగుబడులు పడిపోవడం, గిట్టుబాటు రాకపోవడం.. ఇలా అనేక కారణాలతో రైతులు ఎన్నడూ లేనంతగా నష్టపోయారు. ఫలితంగా రైతు మరణాలు పెరిగిపోయాయి. అయితే ప్రభుత్వం మాత్రం 2011లో 106 మంది రైతులు మాత్రమే ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతోంది. రైతుల బలవన్మరణాలు తగ్గాయని చెప్పుకునేందుకు, ఆత్మహత్యల ప్యాకే జీ కింద ఖర్చును తగ్గించుకునేందుకు ప్రభుత్వం ఇలా తప్పుడు లెక్కలు చూపుతోంది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల బాధితులు ప్రభుత్వ సాయం కోసం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా రకరకాల కారణాలు చూపుతూ సాయం అందించేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు.
Share this article :

0 comments: