రైతుదీక్ష విరమించిన వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రైతుదీక్ష విరమించిన వైఎస్ జగన్

రైతుదీక్ష విరమించిన వైఎస్ జగన్

Written By ysrcongress on Thursday, January 12, 2012 | 1/12/2012

 నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలంలోని పెర్కిట్ వద్ద మూడు రోజులుగా చేస్తున్న రైతుదీక్షను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ గురువారం సాయంత్రం విరమించారు. ఆర్మూరు రైతులు ఆయనకు నిమ్మరసం తాగించి దీక్షను విరమింపజేశారు. మరోవైపు రైతుదీక్షకు రైతులు, మహిళలు, విద్యార్థులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీక్ష విరమించిన తర్వాత జగన్ ప్రసంగించారు
 
 రైతు, రైతుకూలీలను రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ విమర్శించారు. రైతు సమస్యల పరిష్కారం కోసం ఎన్ని ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని దుయ్యబట్టారు. అన్నదాతల కోసం నిరాహారదీక్షలు చేశామని, కలెక్టర్లేను ముట్టడించామన్నారు. ఎన్నిచేసినా ప్రభుత్వంలో స్పందన లేదన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలంలోని పెర్కిట్ వద్ద మూడు రోజులుగా చేస్తున్న రైతుదీక్షను గురువారం సాయంత్రం ఆయన విరమించారు. అనంతరం భారీ సంఖ్యలో తరలివచ్చిన రైతులను ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. 

రాష్ట్రంలో రైతులు దారుణమైన పరిస్థితిలో ఉన్నారన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక రైతులు కష్టాలు పడుతున్నారన్నారు. పెట్టుబడి మూడింతలు పెరిగితే రాబడి మాత్రం అందులో మూడోవంతు కూడా రావడం లేదన్నారు. వ్యవసాయం చేసుకోవడం కన్నా ఉరివేసుకోవడం మేలన్నట్టుగా పరిస్థితి ఉందన్నారు. రైతు కూలీలు కూడా రైతులపై సానుభూతి చూపించే పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్ర చరిత్రలో రైతులు మొట్టమొదటసారిగా క్రాప్‌హాలీడే ప్రకటించినా సర్కారు కళ్లు తెరవడం లేదన్నారు. 

దివంగత మహానేత వైఎస్సార్ రైతులకు ఎంతో మేలు చేశారన్నారు. రాజకీయాల్లో విశ్వసనీయత, విలువలకు అర్థంలా నిలిచారన్నారు. కర్షకుల కష్టాలపై ప్రతిపక్ష చంద్రబాబు నాయుడు ముసలికన్నీరు కారుస్తారని ఆరోపించారు. అవిశ్వాసం సందర్భంగా రైతుల పక్షాన నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన కొండా సురేఖను చూస్తే తనకు గర్వంగా ఉందని జగన్ అన్నారు. పదవులను సైతం లెక్కచేయకుండా 17 మంది ఎమ్మెల్యేలు అన్నదాత పక్షాన నిలిచారని ఆయనీ సందర్భంగా గుర్తుచేశారు. 

రైతుల కోసం స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలని, 9 గంటలు పాటు నాణ్యమైన ఉచిత కరెంట్ ఇవ్వాలని, ప్రతి సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేయాలని జగన్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరచి అన్నదాతల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలన్నారు. తనపై ప్రేమాభిమానాలు చూపించిన వారికి జగన్ ధన్యవాదాలు తెలిపారు.
Share this article :

0 comments: