లక్ష ఉద్యోగాలు ఇచ్చామంటూ జనం చెవిలో పువ్వులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » లక్ష ఉద్యోగాలు ఇచ్చామంటూ జనం చెవిలో పువ్వులు

లక్ష ఉద్యోగాలు ఇచ్చామంటూ జనం చెవిలో పువ్వులు

Written By ysrcongress on Sunday, January 8, 2012 | 1/08/2012

 రాజీవ్ యువకిరణాలతో లక్ష ఉద్యోగాలు ఇచ్చామంటూ జనం చెవిలో పువ్వులు
తనవి కాని ప్రైవేట్ ఉద్యోగాలను తన ఖాతాలో చూపుతూ రాష్ట్ర సర్కారు కాకిలెక్కలు
కొలువులన్నీ రికార్డుల్లోనే పేర్కొంటూ అవాస్తవాలతో ప్రచారహోరు
సర్కారు సొమ్మును మింగుతున్న బోగస్ శిక్షణా సంస్థలు
అనేక జిల్లాల్లో ఉద్యోగాల జాబితాలో అవకతవకలు
సాక్షాత్తూ అధికారుల పరిశీలనలోనే బయటపడుతున్న డొల్లతనంబోగస్ పథకంతో మభ్యపెడుతున్న ప్రభుత్వం

దివిస్ లేబొరేటరీలో హెల్పర్.. ఓ బట్టల షాపులో సేల్స్‌మెన్... మరో కంపెనీలో ఆఫీస్ బాయ్.. ఇంకో సంస్థలో సెక్యూరిటీ గార్డు.. ఐశ్వర్య టెక్నో సొల్యూషన్ సంస్థలో డాటా ఎంట్రీ ఆపరేటర్.. ఏమిటివన్నీ అనుకుంటున్నారా? అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రాజీవ్ యువకిరణాలు’ పథకం కింద రాష్ట్ర సర్కారు నిరుద్యోగులకు ఇస్తున్న ఉద్యోగాలివీ!! గాలికిపోయిన పేలపిండి కృష్ణార్పణం అన్నట్టు.. ప్రభుత్వంతో ఏమాత్రం సంబంధం లేకుండా ప్రైవేటు కంపెనీల్లో సాధారణంగా ఎప్పుడూ జరిగే నియామకాలన్నింటినీ సర్కారు తన ఖాతాలో వేసుకుంటోంది. 

లక్ష ఉద్యోగాలు కల్పించామహో... అంటూ జనం చెవిలో పువ్వులు పెడుతోంది. కొలువులన్నీ కాగితాలపైనే చూపుతూ ప్రచార ఆర్భాటానికి తెరదీసింది. బోగస్ పథకంతో ప్రజలను మభ్యపెట్టడమే కాకుండా.. పథకం కింద అభ్యర్థులకు శిక్షణ పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనం పక్కదోవ పట్టేందుకు కారణమవుతోంది. ఎక్కడ, ఎవరికి, ఎన్నెన్ని ఉద్యోగాలు ఇచ్చారు..? శిక్షణ పొందిన అభ్యర్థులు ఎందరు..? వారికి కోర్సుకు తగ్గ ఉపాధి చూపించారా..? ఉద్యోగాలు పొందినవారు కొలువుల్లోనే ఉన్నారా లేదా మధ్యలోనే మానేశారా..? వంటి క్షేత్రస్థాయి సమాచారాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం కాకిలెక్కలతో జిమ్మిక్కులు చేస్తోంది.

రాజీవ్ యువకిరణాల పథకం కింద నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు కల్పించామంటూ గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర సర్కారు.. ప్రైవేట్ కంపెనీల్లో నియామకాలనూ తన ఖాతాలో వేస్తోంది. కాకి లెక్కలతో మభ్యపెడుతూ కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమయ్యేందుకు కారణమవుతోంది. శిక్షణ తీసుకున్న వారి సంఖ్య, ఉద్యోగంలో చేరిన వారి వివరాలను పట్టించుకోకుండా ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడానికే పరిమితమవుతోంది. శిక్షణ ఇస్తున్న సంస్థలు బోగస్ అభ్యర్థులతో ఖజానాను గుల్ల చేస్తున్నాయి.

ఇవ్వని ఉద్యోగాలు.. ఇచ్చినట్లు..

కర్నూలు జిల్లా బురుజుల గ్రామానికి చెందిన మజీద్ ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. కనీసం ఉద్యోగానికి కూడా దరఖాస్తు చేయలేదు. కానీ ఆయనకు రాజీవ్ యువ కిరణాల పథకం కింద శిక్షణ ఇప్పించి, వేటపాలెంలోని ఓ పరిశ్రమలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగంలో చేర్పించినట్లు కాగితాల్లో చూపారు.

పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం పరిధిలో 173 మంది నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చి, కొలువుల్లో చేర్పించి నట్లు రికార్డుల్లో రాశారు. కానీ అందులో ఒక్కరంటే ఒక్కరు కూడా ఉద్యోగం చేయడం లేదని సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించిన దర్యాప్తులో తేలింది.

నిజామాబాద్ జిల్లాలో ‘రాజీవ్ యువకిరణాల’ కింద శిక్షణ ఇస్తున్నామంటూ ఓ బోగస్ సంస్థ 80 మంది కాలేజీ విద్యార్థులను అభ్యర్థులుగా చూపింది. శిక్షణ పేరుతో వారికి వచ్చిన నిధులన్నింటినీ స్వాహా చేసింది.

ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. దాదాపు అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అధికారుల తనిఖీల్లో ఈ వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్నవారికి కొత్తగా ఉద్యోగం ఇచ్చినట్లుగా కొన్నిచోట్ల.. అసలు ఇవ్వని ఉద్యోగాలను ఇచ్చినట్లుగా మరికొన్నిచోట్ల రికార్డుల్లో రాస్తున్నారు. ఇంతకుముందే ‘రాజీవ్ ఉద్యోగశ్రీ పథకం’ కింద శిక్షణ పొందినవారికి ఇప్పుడు మళ్లీ ‘రాజీవ్ యువ కిరణాలు’ పథకం కింద శిక్షణ ఇస్తున్నట్లు చూపుతున్నారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే ఇలా ఏకంగా 3915 మంది అభ్యర్థులను చూపారు. చివరికి ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో కాంట్రాక్ట్ లెక్చరర్లుగా పనిచేస్తున్నవారిని, పాఠశాలల్లో విద్యావాలంటీర్లుగా పనిచేస్తున్న వారిని కూడా శిక్షణ పొందుతున్న జాబితాలో చూపారంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు! ఎక్కడో ఓ చోట కొద్దిమందికి ఉద్యోగాలు ఇప్పించినా ఆపాయింట్‌మెంట్ ఆర్డర్‌లో పేర్కొన్న మేరకు వేత నాలు ఇవ్వడం లేదు. ముందుగా ఒకచోట చెప్పి మరోచోట ఉద్యోగాలు చూపుతున్నారు. దీంతో వారం.. పదిరోజులపాటు ఉద్యోగాలు చేసి అభ్యర్థులంతా తిరుగు టపా కడుతున్నారు.

15 రోజుల్లోనే వేల ఉద్యోగాలా?

రచ్చబండ పేరుతో జిల్లాల్లో పర్యటనలకు వెళ్లిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి.. రాజీవ్ యువకిరణాలు పథకం కింద డిసెంబర్ 31లోపు ప్రైవేటు కంపెనీల్లో లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ప్రధానితో నియామకపు పత్రాలు ఇప్పిస్తామన్నారు. డిసెంబర్ 31 గడిచి వారం రోజులవుతోంది. ఎవరెవరికి ఏ ఉద్యోగం ఇచ్చారో వెల్లడించకుండానే ఇటీవల హడావుడిగా ముఖ్యమంత్రి కార్యాలయం.. రాజీవ్ యువకిరణాలు పథకం కింద 1,01,082 ఉద్యోగాలు కల్పించామని ప్రకటించింది. డిసెంబర్ 31 నాటికి లక్ష ఉద్యోగాలు అని చెప్పిన ప్రభుత్వం.. డిసెంబరు 14 నాటి కలెక్టర్ల సదస్సులో ఇచ్చిన నివేదిక ప్రకారం 1,04,894 ఉద్యోగాలు లక్ష్యంగా 64,082 ఉద్యోగాలు కల్పించామని, 61 శాతం లక్ష్యం నెరవేరిందని గణాంకాలు చూపింది. డిసెంబరు 14 నాటికే 4,68,638 మంది అభ్యర్థులు రాజీవ్ యువకిరణాలు (ఆర్‌వైకే) వెబ్‌సైట్‌లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 716 కంపెనీలు తమకు మొత్తం 52,917 మంది ఉద్యోగులు కావాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నాయి. కలెక్టర్ల సదస్సు ముగిసిన 15 రోజుల్లోనే మిగతా 37 వేల ఉద్యోగాలు ఎలా కల్పించగలిగారు? కంపెనీలు అడిగిన 52,917 ఉద్యోగాలు పోను ఇంకా మిగిలిన 51 వేల ఉద్యోగాలు ఎక్కడ కల్పించారు? ఏ అర్హత కలిగిన వారికి ఏ ఉద్యోగం ఇచ్చారు? ఎంత ఖర్చు చేశారు? ప్లేస్‌మెంట్లు ఇచ్చే కంపెనీలను ఎలా ఎంపిక చేశారు? వీటిలో ఏ ప్రశ్నకు ప్రభుత్వం వద్ద సరైన సమాచారం లేదు.


పది వేళ్లు.. పది మందికి శిక్షణ!

రాజీవ్ యువకిరణాలు పథకం కింద అభ్యర్థులకు ఇస్తున్న శిక్షణలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. శిక్షణ ఇవ్వనివారికి కూడా ఇచ్చినట్లు చూపుతూ పలు సంస్థలు నిధులు కొల్లగొడుతున్నాయి. చివరికి బయోమెట్రిక్ యంత్రాలను సైతం బురిడీ కొట్టిస్తున్నారు. ఇలాంటి బాగోతం ఒకటి ‘సాక్షి’ నిఘా కెమెరాకు చిక్కింది. పశ్చిమగోదావరి జిల్లా నెస్ట్ అనే సంస్థలో ఈ తతంగం జరిగింది. ఇక్కడ వాస్తవంగా రాజీవ్ యువకిరణాల కింద కేవలం పది మంది అభ్యర్థులు శిక్షణ తీసుకుంటుండగా.. వారికి అదనంగా మరో 30 మంది బోగస్ అభ్యర్థులను చూపి నిధులు కొల్లగొడుతున్నారు. 

బయోమెట్రిక్‌లో అదనంగా చూపుతున్న ఈ 30 మంది వేలి ముద్రలను బయటవారితో తీసుకుంటున్నారు. నమ్మకమైన ముగ్గురు బయట వ్యక్తులను చూసుకుని వారితో ఒక్కొక్కరి నుంచి పది వేలిముద్రలను తీసుకుంటున్నారు. అంటే ఒక్క వ్యక్తి నుంచి సేకరించిన పది వేలిముద్రలను సేకరించి, పది మందికి శిక్షణ ఇస్తున్నట్లు చూపుతున్నారన్నమాట! ఇలా పది వేలిముద్రలను ఇచ్చిన వ్యక్తిని ‘సాక్షి’ గుర్తించింది. తాను 20 రోజులపాటు నెస్ట్‌లో పనిచేసి, రోజూ తన పది వేళ్లతో బయోమెట్రిక్ యంత్రంలో హాజరువేసినట్టు ఆయన తెలిపాడు. ఒక్కో వేలును ఒక్కో అభ్యర్థిగా చూపి డబ్బు డ్రా చేస్తారని వివరించాడు.

ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు..

పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలంలోని పలు గ్రామాల్లో రాజీవ్ ఉద్యోగ కిరణాలు కింద 173 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు అధికారులు కాకిలెక్కలు వేశారు. వీటినే ప్రభుత్వానికి నివేదించారు. అయితే జిల్లా కలెక్టరు ఇటీవల క్షేత్రస్థాయి సమాచారాన్ని తెప్పించుకుని చూసి విస్తుపోయారు. ఉద్యోగాలు ఇచ్చినట్లు అధికారులు చెప్పినవారిలో ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రస్తుతం ఉద్యోగం చేయడం లేదని విచారణలో తేలింది. పట్టిసీమ, కొత్తూరు, ప్రగడపల్లె, గూటాల, చేగొండపల్లి, తాళ్లవరం.. గ్రామాల్లోని యువకులకు శిక్షణ ఇచ్చి కొలువులు చూపినట్లు రికార్డుల్లో చెప్పినా అదంతా ఉత్తుత్తిదే అని తేలింది.
Share this article :

0 comments: