విజయసాయిరెడ్డి కస్టడీ పొడిగింపు ఉత్తర్వులు రద్దు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విజయసాయిరెడ్డి కస్టడీ పొడిగింపు ఉత్తర్వులు రద్దు

విజయసాయిరెడ్డి కస్టడీ పొడిగింపు ఉత్తర్వులు రద్దు

Written By ysrcongress on Friday, January 13, 2012 | 1/13/2012

సాయిరెడ్డి కేసులో హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
అలాంటి అధికార పరిధి ఇన్‌చార్జి కోర్టుకు లేదు
జగన్, సాయిరెడ్డి కుట్రపన్నారనే సీబీఐ ఆరోపణలను నిర్ధారించడం సహించరాని విషయం
జడ్జి ఒత్తిడికి లోనై ఉత్తర్వులు జారీ చేసినట్లు అనిపిస్తోంది
కస్టడీ కావాలంటే సీబీఐ కోర్టునే ఆశ్రయించండి
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఆడిటర్ విజయసాయిరెడ్డి కస్టడీని వారం రోజుల పాటు పొడిగిస్తూ ఈ నెల 10న ఇన్‌చార్జి కోర్టు హోదాలో ఆర్థిక నేరాల ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు గురువారం రద్దు చేసింది. అలాంటి అధికార పరిధి ఇన్‌చార్జి కోర్టుకు లేదని స్పష్టం చేసింది. కస్టడీ పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసిన జడ్జి సుధాకర్‌నాయుడు తీరును న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి తప్పుపట్టారు. ఈ కేసులో జగన్‌మోహన్‌రెడ్డి (ఏ1), విజయసాయిరెడ్డి (ఏ2)లు కలిసి కుట్ర పన్నారని జడ్జి తన ఉత్తర్వుల్లో నిర్ధారించడాన్ని న్యాయమూర్తి ఎత్తిచూపారు. అది కేవలం సీబీఐ ఆరోపణ మాత్రమేనని, ఆరోపణను ఆరోపణగా ప్రస్తావించాల్సింది పోయి, చార్జిషీట్ కూడా దాఖలు చేయని కేసులో ఆరోపణలు నిర్ధారిం చడం ఎంత మాత్రం సహించరాని విషయమని ఘాటుగా వ్యాఖ్యానించారు. అన్ని కేసుల్లోనూ జడ్జి ఇలాగే వ్యవహరిస్తున్నారా..! అనే సందేహాన్ని న్యాయమూర్తి వ్యక్తం చేశారు. జడ్జి సుధాకర్ నాయుడు ఒత్తిడికి లోనై ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. 

ఇది ఫోరం పర్చేజ్ కిందకు వస్తుంది

సాయిరెడ్డి కస్టడీ విషయంలో ఒకరోజు ఆగితే వచ్చిన నష్టమేమిటని సీబీఐని నిలదీశారు. ఒక్కరోజు కూడా ఆగకుండా.. ఇన్‌చార్జి కోర్టులో కస్టడీ పొడిగింపు కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరమేమొచ్చిందని సీబీఐని ప్రశ్నించారు. ఇలా చేయడం ఫోరం పర్చేజ్ (ఏ న్యాయమూర్తి ముందు కావాలంటే అక్కడ కేసు దాఖలు చేసుకోవడం) కిందకు వస్తుందని మండిపడ్డారు. ‘సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి సెలవులో ఉన్నారు. సెలవు పూర్తి చేసుకుని ఆయన వచ్చేంత వరకు వేచి ఉండటం వల్ల మీకొచ్చిన నష్టమేమిటి..? ఒక రోజులో మునిగిపోయేదేముంది..? అంత అత్యవసరంగా ఇన్‌చార్జి కోర్టును ఆశ్రయించాల్సిన అవసరం ఏముంది..?’ అని న్యాయమూర్తి ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి కస్టడీ పొడిగింపు కావాలనుకుంటే.. కేసును విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు దరఖాస్తు దాఖలు చేసుకోవాలని సీబీఐ అధికారులకు సూచించారు. ఈ మేరకు జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. తన కస్టడీని వారం రోజుల పాటు పొడిగిస్తూ ఇన్‌చార్జి కోర్టు హోదాలో ఆర్థిక నేరాల ప్రత్యేక న్యాయస్థానం ఈ నెల 10న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ విజయసాయిరెడ్డి హైకోర్టులో గురువారం మధ్యాహ్నం అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ నర్సింహారెడ్డి విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. సీబీఐ అధికారులు విజయసాయిరెడ్డిని ఇప్పటికే 30 రోజులకు పైగా విచారించారని, ఇంత సుదీర్ఘ విచారణ చేపట్టిన అధికారులు, తిరిగి కస్టడీ కోరడం ఆశ్చర్యంగా ఉందని ఆయన కోర్టుకు నివేదించారు.

సాయిరెడ్డి సీబీఐ విచారణకు ప్రతి దశలోనూ సహకరించారని, అరెస్టు చేసే రోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు సాయిరెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అరెస్టుకు తగిన కారణాలను వెల్లడించకుండానే అరెస్టు చేశారని తెలిపారు. సాయిరెడ్డిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచిన సీబీఐ అధికారులు.. రిమాండ్ రిపోర్ట్ లేకుండానే కస్టడీ కోరారని, ఇందుకు ప్రత్యేక న్యాయస్థానం సైతం అంగీకారం తెలుపుతూ ఐదు రోజుల కస్టడీకి ఇచ్చిందని ఆయన వివరించారు. కస్టడీ ముగిసిన వెంటనే సీబీఐ అధికారులు సాయిరెడ్డిని ప్రత్యేక న్యాయస్థానం జడ్జి సెలవులో ఉన్నందున.. ఇన్‌చార్జి కోర్టయిన ఆర్థిక నేరాల ప్రత్యేక న్యాయస్థానం జడ్జి ముందు హాజరుపరిచి, కస్టడీ పొడిగింపునకు దరఖాస్తు చేశారని తెలిపారు. సీబీఐ అభ్యర్థన మేరకు జడ్జి వెంటనే స్పందించి సాయిరెడ్డి కస్టడీని వారం రోజుల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని వివరించారు. దీనిపై సీబీఐ తరఫు న్యాయవాది కేశవరావు స్పందిస్తూ.. తగిన సమయం లేకపోవడం వల్లే ఇన్‌చార్జి కోర్టును ఆశ్రయించామని తెలిపారు. సీఆర్‌పీసీ సెక్షన్ 167 క్లాజ్ 1, సబ్ క్లాజ్ 2 ప్రకారం ఏ మేజిస్ట్రేట్ అయి నా కస్టడీని పొడిగించవచ్చునని వివరించారు. అయితే న్యాయమూర్తి జస్టిస్ నర్సింహారెడ్డి ఈ వాదనలను తోసిపుచ్చారు. కస్టడీ కోసం సీబీఐ అనుసరించిన పద్ధతి మంచి పద్ధతి కాదని.. ఇన్‌చార్జి కోర్టు కస్టడీ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పరిధి దాటి వ్యవహరించడమే అవుతుందని తేల్చి చెప్పారు. సెక్షన్ 167 క్లాజ్ 1, సబ్ క్లాజ్ 2లను వేర్వేరుగా చూడాలని, రెండింటినీ అన్వయించడం సరికాదని పేర్కొన్నారు. ఐదు రోజుల కస్టడీ పూర్తయిన తరువాత.. కస్టడీ పొడిగింపు కోసం అదే కోర్టుకు (సీబీఐ కోర్టు) వెళ్లాలే తప్ప.. ఇన్‌చార్జి కోర్టుకు వెళ్లి ఉత్తర్వులు పొందడం సరికాదని స్పష్టం చేస్తూ.. సాయిరెడ్డి కస్టడీని పొడిగిస్తూ జడ్జి సుధాకర్‌నాయుడు ఇచ్చిన ఉత్తర్వులను న్యాయమూర్తి రద్దు చేశారు.
Share this article :

0 comments: